సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

నా భూమి నా దేశం మొదటి దశ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన దేశ ప్రజలు


రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో స్వాతంత్ర సమరయోధులు భద్రతా దళాల త్యాగాలకు గుర్తుగా నిర్మించిన 2.33 లక్షలకు పైగా శిలాఫలకాలు జాతికి అంకితం

మొదటి దశలో 4 కోట్ల పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞలు, 2 లక్షలకు పైగా సమరయోధులకు, సన్మాన కార్యక్రమాలు; 2.63 లక్షల అమృత వాటికల నిర్మాణం

దేశంలో ప్రతి ఇంటికి చేరే విధంగా 2వ దశ నా భూమి నా దేశం కార్యక్రమం సిద్ధం

Posted On: 15 SEP 2023 11:32AM by PIB Hyderabad

దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమర యోధులకు  నివాళులు అర్పించేందుకు నా భూమి నా దేశం కార్యక్రమం 2023 ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. 2021 మార్చి 12న ప్రారంభమైన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ముగింపు కార్యక్రమంగా నా భూమి నా దేశం కార్యక్రమం జరిగింది.  దేశం అన్ని ప్రాంతాల్లో నిర్వహించిన నా భూమి నా దేశం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో రెండు లక్షలకు పైగా కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కార్యక్రంలో పాల్గొన్న ప్రజలు నా భూమి నా దేశం కార్యక్రమం మొదటి దశను విజయవంతం చేశారు. 

నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు,  భద్రతా దళాల త్యాగాలకు గుర్తుగా   శిలాఫలకాలను ఏర్పాటు చేయడం, అలాగే మన ధైర్యవంతుల త్యాగాలు గౌరవించే పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ, వసుధ వందనం , వీరులకు వందనం  వంటి కార్యక్రమాలు నిర్వహించారు. 

ప్రజలు పెద్ద సంఖ్యలో, స్వచ్చందంగా పాల్గొనడం తో నా భూమి నా దేశం మొదటి దశ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో  2.33 లక్షలకు పైగా శిలాఫలకాల నిర్మాణం జరిగింది.   ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల పంచప్రాణ్ ప్రతిజ్ఞ సెల్ఫీలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయి.  దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా సమరయోధులను సన్మానించారు. వసుధ వందనం కార్యక్రమంలో  2.36 కోట్లకు పైగా  మొక్కలు నాటడం తో పాటు 2.63 లక్షల అమృత వాటికలను రూపొందించారు.

 దేశవ్యాప్తంగా అమృత కలశ యాత్రలతో నా భూమి నా దేశం  రెండవ దశ నిర్వహణకు రంగం సిద్ధం అయ్యింది. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో దేశంలోని ప్రతి ఇల్లు పాల్గొనేలా చేసేలా కార్యక్రమం రూపొందింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 6 లక్షల గ్రాగ్రామాలు,పట్టణ ప్రాంతాల్లోని వార్డుల నుంచి మట్టి, వరి ధాన్యాలు సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమాన్ని బ్లాకు స్థాయిలో నిర్వహించి కలశాన్ని సిద్ధం చేస్తారు. రాష్ట్ర రాజధాని నుంచి బయలుదేరే  కలశం జాతీయ స్థాయిలో నిర్వహించే  కార్యక్రమం కోసం ఢిల్లీ చేరుకుంటుంది.  పట్టణ ప్రాంతాల్లో వార్డుల నుంచి మట్టిని సేకరిస్తారు. వార్డులో సేకరించిన మట్టిని స్థానిక పట్టణ సంస్థ స్థాయిలో కలిపి రాష్ట్ర రాజధాని మీదుగా ఢిల్లీకి తరలిస్తారు. అక్టోబర్ లో నిర్వహించే తుది ఘట్టంలో పాల్గొనే విధంగా దేశం వివిధ ప్రాంతాల నుంచి  8500 కలశాలు   ఢిల్లీకి చేరుతాయని అంచనా. భారతదేశం నలుమూలల నుండి సేకరించిన మట్టిని అమృత్ వాటిక , అమృత్ మెమోరియల్‌లో ఉంచి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా ఒక ఫలకాన్ని నిర్మిస్తారు. .

నా భూమి నా దేశం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్నాయి:

 

https://drive.google.com/drive/folders/1ZbRRp1YP893V6LBfibaQJeoK3vBOLoc9?usp=drive_link

 

***



(Release ID: 1957643) Visitor Counter : 204