సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"బిపర్‌జోయ్" తుపాను వార్తల కవరేజీ కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న మీడియా సిబ్బంది భద్రతపై ఐ&బీ మంత్రిత్వ శాఖ ఆందోళన; మార్గదర్శకాలు జారీ


సిబ్బంది భద్రత విషయంలో రాజీ పడవద్దని, సంపూర్ణ జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా సంస్థలకు మంత్రిత్వ శాఖ సూచన

Posted On: 15 JUN 2023 12:02PM by PIB Hyderabad

"బిపర్‌జోయ్" తుపాను వార్తల కవరేజీ కోసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వివిధ మీడియా సంస్థలు, ముఖ్యంగా ప్రైవేట్‌ టీవీ ఛానెళ్లకు చెందిన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర సిబ్బంది భద్రతపై కేంద్ర సమాచార & ప్రసారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని మీడియా సంస్థలకు ఈ రోజు మార్గదర్శకాలు జారీ చేసింది.

క్షేత్ర స్థాయిలో ఉండి, తుపాను వార్తలు పంపేందుకు ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు మోహరించిన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర సిబ్బందికి భద్రత పరమైన సవాళ్లు ఎదురవుతాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అలాంటి పరిస్థితుల్లో నిర్వహించే క్షేత్ర స్థాయి పనితీరు సిబ్బంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించే విషయంలో పూర్తిస్థాయి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ మీడియా సంస్థలకు గట్టిగా సూచించింది. మీడియా సిబ్బంది భద్రతకు విఘాతం కలిగించే విధంగా, స్థానిక అధికారులు జారీ చేసే జాగ్రత్తలను ఉల్లంఘించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకోవద్దని కూడా గట్టిగా సిఫార్సు చేసింది.

"బిపర్‌జోయ్" తుపాను మరికాసేపట్లో దేశ పశ్చిమ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు. ఇది వివిధ కోణాల్లో ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ ప్రజలకు భరోసా ఇచ్చింది.

 

***


(Release ID: 1932734) Visitor Counter : 164