ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర బడ్జెటు2023-24 లోని ముఖ్యాంశాలు

Posted On: 01 FEB 2023 1:35PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెటు 2023-24 ను కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న, అంటే 2023 ఫిబ్రవరి 01వ తేదీ నాడు, పార్లమెంటు కు ప్రవేశపెట్టారు. డ్జెటు లోని ముఖ్యాంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

పార్ట్ - ఎ

  • ప్రతి వ్యక్తి యొక్క ఆదాయం దాదాపు గా తొమ్మిది సంవత్సరాల లో రెండింతల కన్నా అధికం గా 1.97 లక్షల రూపాయలు అయిపోయింది.
  • గత తొమ్మిది సంవత్సరాల లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరం గా వృద్ధి చెంది, ప్రపంచం లో పదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయి నుండి ప్రపంచం లో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారిపోయింది.
  • ఉద్యోగి భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) లో సభ్యత్వం రెండింతల కన్నా ఎక్కువ గా 27 కోట్ల కు చేరుకొన్నది.
  • యుపిఐ మాధ్యం ద్వారా 2022 వ సంవత్సరం లో 126 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగిన 7,400 కోట్ల డిజిటల్ చెల్లింపులు నమోదు అయ్యాయి.
  • స్వచ్ఛ్ భారత్ మిశన్ లో భాగం గా 11.7 కోట్ల ఇళ్ల లో శౌచాలయాల ను నిర్మించడం జరిగింది.
  • ఉజ్జ్వల యోజన లో భాగం గా 9.6 కోట్ల ఎల్ పిజి కనెక్షన్ లను ఇవ్వడమైంది.
  • నూట రెండు కోట్ల మంది కి రెండు వందల ఇరవై కోట్ల కోవిడ్ టీకా మందు డోజుల ను ఇప్పించడమైంది.
  • ప్రధాన్ మంత్రి జన్ ధన్ బ్యాంకు ఖాతా ల సంఖ్య 47.8 కోట్ల కు చేరింది.
  • పిఎమ్ సురక్ష బీమా, ఇంకా పిఎమ్ జీవన్ జ్యోతి యోజన లలో భాగం గా 44.6 కోట్ల మంది కి బీమా రక్షణ ను కల్పించడమైంది.
  • పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో భాగం గా 11.4 కోట్ల మంది కి పైగా రైతుల కు 2.2 లక్షల కోట్ల రూపాయల నగదు ను బదలాయించడం జరిగింది.
  • బడ్జెటు లో ఏడు ప్రాథమ్యాల ను సప్తరుషిగా చెప్పవచ్చు. అవి ఏమేమిటి అంటే వాటి లో అభివృద్ధి ఫలాల ను అందరికీ అందేటట్లు గా చూడడం, వరుస లోని ఆఖరి వ్యక్తి వరకు ప్రయోజనాల ను చేరవేయడం, మౌలిక సదుపాయాల కల్పన మరియు పెట్టుబడి , సామర్థ్య విస్తరణ, కాలుష్యానికి తావు ఇవ్వనటువంటి వృద్ధి, యువశక్తి మరియు ఆర్థిక రంగం అనేవే.
  • తోట పంట ల ద్వారా అధిక మూల్యాన్ని రాబట్టుకొనే విధం గా తెగుళ్ళ కు చోటు ఉండనటువంటి నాణ్యమైన సస్యరక్షణ సామగ్రి లభ్యత ను పెంపొందింప చేయడం కోసం 2,200 కోట్ల రూపాయల వ్యయం తో ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాము ను ప్రతిపాదించడమైంది.
  • 2014 వ సంవత్సరం మొదలుకొని ఇంతవరకు స్థాపించిన 157 వైద్య కళాశాల లతో పాటే 157 నర్సింగ్ కాలేజీల ను కొత్త గా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • కేంద్రం రాబోయే మూడు సంవత్సరాల లో మూడున్నర లక్షల మంది కి పైగా ఆదివాసీ విద్యార్థినీ విద్యార్థుల కోసం 740 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల ల కోసం కేంద్రం 38,800 ఉపాధ్యాయుల ను మరియు సహాయక సిబ్బంది ని భర్తీ చేయనుంది.
  • పిఎమ్ ఆవాస్ యోజన నిమిత్తం చేసే ఖర్చు ను 66 శాతం మేర కు పెంచి, 79,000 కోట్ల రూపాయల పై చిలుకు స్ధాయి కి తీసుకు పోవడమైంది.
  • రైల్ వే ల కోసం 2.40 లక్షల కోట్ల రూపాయల విలువైన మూలధన వ్యయాన్ని ప్రతిపాదించడమైంది, ఇది 2013-14 లో అందుబాటులోకి తీసుకువచ్చినటువంటి ధనరాశి కంటే దాదాపు గా తొమ్మిది రెట్లు అధికం. అంతేకాదు ఇంతవరకు కేటాయించిన అత్యంత అధిక వ్యయం కూడా.
  • నేశనల్ హౌసింగ్ బ్యాంకు నిర్వహణ లో అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ (యుఐడిఎఫ్) ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నిధి ని రెండో అంచె నగరాల లోను, మూడో అంచె నగరాల లోను పట్టణ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన కై సార్వజనిక సంస్థ లు ఉపయోగిస్తాయి.
  • సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లు, పెద్ద వ్యాపార సంస్థ లు మరియు దానశీల ధర్మ నిధులు (చారిటబుల్ ట్రస్టు లు) అవసరమైనటువంటి దస్తావేజుల ను ఆన్ లైన్ మాధ్యం లో పదిలపరచుకోవడానికి, అలాగే వాటిని శేర్ చేయడానికి ఉపయోగించుకొనేందుకు వీలు గా ఒక ఎన్ టిటీ డిజీ లాకర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • 5జి సర్వీసుల పైన ఆధారపడివుండేటటువంటి అప్లికేశన్ లను అభివృద్ధి పరచడం కోసం 100 లేబరేటరీల ను స్థాపించడం జరుగుతుంది. వీటి ద్వారా నూతన అవకాశాలు, వ్యాపార నమూనాలు మరియు ఉపాధి సంభావ్యతల అన్వేషణ లో తోడ్పాటు లభించగలదు.
  • గోబర్ ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్) స్కీమ్ లో భాగం గా చక్రీయ ఆర్థిక వ్యవస్థ ను ప్రోత్సహించడం కోసమని 10,000 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడి తో 500 నూతన వ్యర్థాల నుండి సంపదను సృష్టించే ప్లాంటుల ను నెలకొల్పడం జరుగుతుంది. సహజ వాయువు ను, బయోగ్యాస్ ను మార్కెటింగ్ చేసే అన్ని సంస్థల కోసం 5 శాతం కంప్రెస్ డ్ బయోగ్యాస్ వ్యవస్థ ను సైతం తీసుకు రావడం జరుగుతుంది.
  • రాబోయే మూడు సంవత్సరాల కాలం లో కేంద్రం ఒక కోటి మంది రైతులు ప్రాకృతిక వ్యవసాయం లోకి మళ్ళేటట్లు గా ప్రోత్సహించనుంది. దీనికి గాను 10,000 బయో-ఇన్ పుట్ రిసోర్స్ సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటి ద్వారా సూక్ష్మ ఎరువులు మరియు క్రిమినాశక ఎరువుల తయారీ సంబంధి నెట్ వర్క్ ఒక జాతీయ స్థాయి లో నెలకొంటుంది.
  • వచ్చే మూడు సంవత్సరాల లో లక్షల కొద్దీ యువజనుల కు నైపుణ్యాల ను కల్పించడం కోసం ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగం గా ఇండస్ట్రీ 4.0 కు సంబంధించిన కోడింగ్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), 3డి ప్రింటింగ్, డ్రోన్ లు, ఇంకా సాఫ్ట్ స్కిల్స్ వంటి నవ తరం పాఠ్య క్రమాల ను అందించడం జరుగుతుంది.
  • యువత అంతర్జాతీయ అవకాశాల ను అందిపుచ్చుకోవడాని కి వీలుగా 30 స్కిల్ ఇండియా ఇంటర్ నేశనల్ సెంటర్స్ ను వివిధ రాష్ట్రాల లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • ఎమ్ఎస్ఎమ్ఇ ల కోసం పునర్ వ్యవస్థీకరించినటువంటి పరపతి హామీ పథకాన్ని 2023 ఏప్రిల్ 1వ తేదీ నాటి నుండి అమలు పరచడం జరుగుతుంది. దీనికి గాను, 9,000 కోట్ల రూపాయల నిధుల ను కార్పస్ కు అందించడం జరుగుతుంది. ఈ పథకం అదనం గా 2 లక్షల కోట్ల రూపాయల పూచీకత్తు అక్కరలేనటువంటి మరియు పూర్వ హామీ తో కూడినటువంటి రుణాల మంజూరు కు బాట ను పరుస్తుంది, అంతేకాకుండా, రుణాల తాలూకు ఖర్చు ను దాదాపు గా ఒక శాతం మేరకు తగ్గిస్తుంది కూడా.
  • కంపెనీల చట్టం లో భాగం గా క్షేత్ర కార్యాలయాల లో దాఖలు చేసిన వివిధ పత్రాల ను కేంద్రీకృత పద్ధతి లో పరిష్కరించడం ద్వారా కంపెనీల కు వేగవంతమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడానికని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ ను నెలకొల్పడం జరుగుతుంది.
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో గరిష్ట డిపాజిట్ పరిమితి ని 15 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల కు పెంచడం జరుగుతుంది.
  • లక్షిత విత్త లోటు 2025-26 కల్లా 4.5 శాతం కంటే తక్కువ కు పరిమితం అవుతుందని అంచనా వేయడమైంది.
  • గ్రామీణ ప్రాంతాల లో యువ నవ పారిశ్రామికులు ఏర్పాటు చేసే ఎగ్రీ స్టార్ట్-అప్స్ ను ప్రోత్సహించడం కోసం ఎగ్రీకల్చర్ యాక్సిలరేటర్ ఫండు ను నెలకొల్పడం జరుగుతుంది.
  • భారతదేశాన్ని శ్రీ అన్నతాలూకు గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మిల్లిట్ రిసర్చ్, హైదరాబాద్ ను ఉత్కృష్టత కేంద్రం గా మలచడం జరుగుతుంది. దీని ద్వారా అత్యుత్తమ అభ్యాసాల ను, పరిశోధన ను మరియు సాంకేతికతల ను అంతర్జాతీయ స్థాయి లో శేర్ చేసుకొనేందుకు వీలు ఉంటుంది.
  • వ్యావసాయిక రుణాల లక్ష్యాన్ని పశు పోషణ, పాడి, ఇంకా చేపల పెంపకం లను దృష్టి లో పెట్టుకొని 20 లక్షల కోట్ల రూపాయల వరకు పెంచడమైంది.
  • మత్స్యకారులు, చేపల విక్రేతలు, సూక్ష్మ వ్యాపార సంస్థలు, చిన్న వాణిజ్య సంస్థలు.. వాటి కార్యకలాపాల ను వృద్ధి చెందింప చేయడం కోసం, వేల్యూ చైన్ సామర్థ్యాల ను మెరుగు పరచడం కోసం, బజారు ను విస్తరించడం కోసం 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి తో పిఎమ్ మత్స్య సంపద యోజన లో భాగం గా ఒక కొత్త సబ్- స్కీము ను ప్రారంభించడం జరుగుతుంది.
  • డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫార్ ఎగ్రీకల్చర్ ను ఒక ఓపెన్ సోర్స్, ఓపెన్ స్టాండర్డ్ వలె నిర్మించడం జరుగుతుంది; దీని ద్వారా స్టార్ట్-అప్స్ మరియు అగ్రి-టెక్ ఇండస్ట్రీల వృద్ధి కై రైతు ప్రధాన కేంద్రం లో ఉండేటటువంటి ఇన్ క్లూజివ్ సాల్యూశన్స్ కు ఆస్కారం ఏర్పడుతుంది.
  • ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) ను కంప్యూటరీకరించేందుకు గాను తొలుత 2,516 కోట్ల రూపాయల పెట్టుబడి ని ఉద్దేశించడమైంది.
  • రైతులు వారి ఉత్పత్తుల ను నిలవ చేసుకొని, సముచితమైన కాలాల లో విక్రయాలు జరపడం ద్వారా గిట్టుబాటు ధరల ను పొందడం లో వారికి సాయపడడం కోసం పెద్ద ఎత్తున వికేంద్రీకరించిన నిలవ సామర్థ్యాన్ని వారి కోసం నెలకొల్పడం జరుగుతుంది.
  • సికల్ సెల్ ఎనీమియా నిర్మూలన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది.
  • సహకార పూర్వకమైన పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించడం కోసం ఎంపిక చేసే ఐసిఎమ్ఆర్ ప్రయోగశాల ల మాధ్యం ద్వారా సంయుక్త సార్వజనిక మరియు ప్రైవేటు వైద్య పరిశోధనల కు ఊతం ఇవ్వడం జరుగుతుంది.
  • ఔషధ నిర్మాణ రంగం లో పరిశోధన ను ప్రోత్సహించే ఉద్దేశ్యం తో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
  • వృద్ధి సంభావ్యత ను అధికం చేయడం కోసం, ఉద్యోగాల ను సృష్టించడం కోసం, ప్రైవేటు పెట్టుబడులు ముమ్మరం కావడం కోసం మరియు ప్రపంచ స్థాయి ప్రతికూల పరిస్థితుల లో రక్షణ కవచాన్ని అందించడం కోసం 10 లక్షల కోట్ల రూపాయల మేరకు కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ను ప్రతిపాదించడమైంది. ఇది వరుస గా మూడో సంవత్సరం లో 33 శాతం పెంపుదల ను చాటుతున్నది.
  • ఆరోగ్యం, పోషణ, విద్య, వ్యవసాయం, జల వనరులు, సమాజం లో అన్ని వర్గాల వారికి ఆర్థిక సేవ ల అందజేత, నైపుణ్యాభివృద్ధి మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక రంగాల లో ప్రధానమైన ప్రభుత్వ సర్వీసుల ను అందరికీ అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశ్యం తో యాస్పైరేశన్ బ్లాక్స్ ప్రోగ్రాము ను 500 బ్లాకుల లో మొదలు పెట్టడమైంది.
  • డెవలప్ మెంట్ యాక్షన్ ప్లాన్ ఫార్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో భాగం గా ప్రధాన మంత్రి పివిటిజి డెవలప్ మెంట్ మిశన్ యొక్క అమలు కు గాను 15,000 కోట్ల రూపాయల ను ఇవ్వాలని ప్రతిపాదించడమైంది.
  • ఓడ రేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఇంకా ఆహారధాన్యాల రంగాల లో లాస్ట్ మైల్ మరియు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కై ఉద్దేశించిన ఒక వంద కీలకమైన రవాణా సంబంధి మౌలిక సదుపాయాల పథకాల కు గాను 75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రతిపాదించడమైంది. ఈ రాశి లో 15,000 కోట్ల రూపాయల ను ప్రైవేటు వనరుల నుండి సేకరించడం జరుగుతుంది.
  • మౌలిక సదుపాయాల కల్పన రంగం లో ప్రైవేటు పెట్టుబడి అవకాశాల ను అధికం చేయడం కోసం న్యూ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ను స్థాపించడమైంది.
  • ఉపాధ్యాయుల శిక్షణ నిమిత్తం డిస్ట్రిక్ట్ ఇన్స్ టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేశన్ ఎండ్ ట్రైనింగ్ ను ఉత్కృష్ట సంస్థలు గా అభివృద్ధి పరచడం జరుగుతుంది.
  • వివిధ ప్రాంతాల లో, వివిధ భాషల లో, జానర్ ల లో నాణ్యత కలిగిన పుస్తకాలు అందేటట్లుగా చూడటం కోసం ఒక జాతీయ డిజిటల్ పుస్తకాలయాన్ని బాలల కోసమూ మరియు కిశోర వయస్కుల కోసమూ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • సూక్ష్మ సేద్యాని కి మరియు త్రాగునీటి సరఫరా కు ఉద్దేశించిన ట్యాంకు లను భర్తీ చేయడాని కి సంబంధించి అపర్ భద్ర ప్రాజెక్టు కు కేంద్రీయ సహాయం రూపం లో 5,300 కోట్ల రూపాయల ను ఇవ్వడం జరుగుతుంది.
  • ప్రాచీన లిపి లతో కూడి ఉండే ఒక డిజిటల్ సంగ్రహాలయం లో భాగం గా భారత్ శేర్ డ్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ స్క్రిప్శన్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని లో తొలి దశ లో ఒక లక్ష ప్రాచీన శిలా శాసనాల ను డిజిటల్ మాధ్యం లో భద్రపరచాలని ప్రతిపాదించడమైంది.
  • కేంద్రం యొక్క ప్రభావశాలి మూలధన వ్యయంఅనేది 13.7 లక్షల కోట్ల రూపాయలు గా ఉండాలని లక్ష్యం గా పెట్టుకోవడం జరిగింది.
  • మౌలిక సదుపాయాల రంగం లో పెట్టుబడి ని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల కు 50 సంవత్సరాల కాలాని కి గాను వడ్డీ చెల్లించనవసరం లేనటువంటి రుణ సదుపాయాన్ని మరొక సంవత్సర కాలం పాటు కొనసాగించడం జరుగుతుంది.
  • మన నగరాల ను సస్ టేనబుల్ సిటీస్ ఆఫ్ టుమారోగా రూపాంతరం చెందింప చేయడం కోసం తగిన పట్టణ ప్రణాళిక సంబంధి కార్యాలు మరియు సంస్కరణల ను చేపట్టేటట్లుగా నగరాల కు మరియు రాష్ట్రాల కు ప్రోత్సాహకాలను ఇవ్వడం జరుగుతుంది.
  • సెప్టిక్ ట్యాంకు లు మరియు మురుగు కాల్వల లో పూడిక తీయడానికి లేదా పారిశుద్ధ్య కార్యాన్ని పూర్తి గా యంత్ర సాయం తో చేపట్టేటట్టు గా అన్ని నగరాల ను, పట్టణాల ను యంత్రాల వాడకం పద్ధతి కి మళ్ళించడం జరుగుతుంది.
  • లక్షల సంఖ్య లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి నైపుణ్యాల కు మరిన్ని మెరుగులు పెట్టుకోవడానికి; అంతేకాకుండా ప్రజల కు పెద్ద పీట వేసి వారికి సేవల ను అందించేటట్లుగా ఉద్యోగుల కు మార్గాన్ని సుగమం చేయడానికి గాను నిరంతరం నేర్చుకొనే అవకాశాల ను కల్పించడానికని ఐజిఒటి కర్మయోగి అనే పేరు తో ఒక సమగ్రమైన ఆన్ లైన్ ట్రైనింగ్ ప్లాట్ ఫార్మ్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
  • వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని వృద్ధి చేయడం కోసం 3,400 కు పైగా న్యాయ సంబంధి నిబంధనల ను అపరాధాల పరిధి నుంచి తప్పించడం జరిగింది. దీనితో పాటు గా తప్పనిసరిగా పాటించవలసిన నిబంధనల లో 39,000 కు పైబడిన నిబంధనల ను తొలగించడమైంది.
  • ప్రభుత్వం యొక్క విశ్వసనీయత ను ఇనుమడింప చేయడం కోసం 42 కేంద్రీయ చట్టాల ను సవరించే ఉద్దేశ్యం తో జన్ విశ్వాస్ బిల్లు ను తీసుకురావడమైంది.
  • ‘‘మేక్ ఎఐ ఇన్ ఇండియా ఎండ్ మేక్ ఎఐ వర్క్ ఫార్ ఇండియా’’ అనే దృష్టి కోణాన్ని ఆచరణ రూపం లోకి తీసుకు రావడానికి గాను మూడు ఆర్టిఫిశియల్ ఇంటెలిజన్స్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ను అగ్రగామి విద్యా సంస్థల లో నెలకొల్పడం జరుగుతుంది.
  • విద్య రంగ ప్రముఖులు మరియు స్టార్ట్ - అప్స్ ద్వారా నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ను ప్రోత్సహించడం కోసం నేశనల్ డేటా గవర్నెన్స్ పాలిసీ ని తీసుకు రావడమైంది.
  • వ్యక్తుల యొక్క గుర్తింపు మరియు చిరానామా తో సంధానం ఇంకా అప్ డేశన్ ల కోసం ఒక వన్ స్టాప్ సాల్యూశన్ వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని లో డిజిలాకర్ సేవ ను మరియు ఆధార ను మౌలిక గుర్తింపు గా ను ప్రయోగించడం జరుగుతుంది.
  • వ్యాపారం చేసుకోవడం లో సౌలభ్యాన్ని పెంపొందింప చేయడాని కి నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల కు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల లో ఉమ్మడి గుర్తింపు గా పిఎఎన్ (పాన్) ను ప్రయోగించడం జరుగుతుంది.
  • కోవిడ్ కాలం లో ఒప్పందాల ను అమలు పరచడం లో ఎమ్ఎస్ఎమ్ఇ లు విఫలం అయిన సందర్భాల లో, బిడ్ లేదా పెర్ ఫార్మెన్స్ సెక్యూరిటీ కి సంబంధించి జప్తున కు గురైన సొమ్ము లో 95 శాతం సొమ్ము ను ప్రభుత్వం మరియు ప్రభుత్వ సంస్థ ల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది.
  • అభివృద్ధి పరం గా అవసరాల ను తీర్చడానికి గాను ఉన్న కొద్దిపాటి వనరుల ను మెరుగైన రీతిన కేటాయించడానికి ఫలితాల పై ఆధారపడే ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.
  • సమర్థమైన న్యాయ పాలన నిమిత్తం 7,000 కోట్ల రూపాయల వ్యయం తో ఇ-కోర్ట్ స్ ప్రాజెక్టు తాలూకు మూడో దశ ను ప్రారంభించడం జరుగుతుంది.
  • దిగుమతుల పై ఆధారపడటాన్ని తగ్గించడం కోసమని లాబ్ గ్రోన్ డైమండ్స్ (ఎల్ జిడి) రంగాని కి సంబంధించి ఆర్ ఎండ్ డి గ్రాంటు ను ప్రతిపాదించడమైంది. ఎల్ జిడి సీడ్స్ ను మరియు యంత్రాల ను స్వదేశం లోనే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాలి అనేది ఈ చర్య యొక్క పరమార్థం గా ఉంది.
  • 2030వ సంవత్సరాని కల్లా గ్రీన్ హైడ్రోజన్ మిశన్ లో భాగం గా 5 ఎమ్ఎమ్ టి ల వార్షిక ఉత్పత్తి ని సాధించాలని ప్రతిపాదించడమైంది. ఇది ఆర్థిక వ్యవస్థ ను తక్కువ కర్బన తీవ్రత ను కలిగి ఉండేది గా మలచడానికి మరియు శిలాజ ప్రధానమైన ఇంధన దిగుమతుల పైన ఆధారపడడాన్ని తగ్గించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
  • శక్తి భద్రత, శక్తి పరివర్తన మరియు నెట్ జీరో లక్ష్యాల సాధన పై 35,000 కోట్ల రూపాయల ను ఖర్చు చేయాలని ప్రతిపాదించడమైంది.
  • ఆర్థిక వ్యవస్థ ను నిరంతర అభివృద్ధి పథం లోకి తీసుకుపోవడం కోసం బ్యాటరీ ప్రధానమైన శక్తి నిలవ వ్యవస్థల కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది.
  • లద్దాఖ్ నుండి రీన్యూవబుల్ ఎనర్జీ గ్రిడ్ ఇంటిగ్రేశన్ ఎండ్ ఇవాక్యుయేశన్ ల నిమిత్తం 20,700 కోట్ల రూపాయల ను పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించడమైంది.
  • ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడాని కి మరియు రసాయనిక ఎరువుల సంతులిత ఉపయోగాన్ని ప్రోత్సహించడాని కి రాష్ట్రాల కు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు అండదండల ను అందించడం కోసం ‘‘పిఎమ్ ప్రోగ్రామ్ ఫార్ రిస్టోరేశన్, అవేర్ నెస్, రిశ్ మెంట్ ఎండ్ అమీలియరేశన్ ఆఫ్ మదర్ అర్థ్’’ (పిఎమ్-పిఆర్ఎఎన్ఎఎమ్) ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
  • కోస్తా తీర ప్రాంతాల వెంబడి మడ అడవుల పెంపకాన్ని చేపట్టడానికి, మ్యాన్ గ్రోవ్ ఇనిశియేటివ్ ఫార్ శోర్ లైన్ హేబిటేట్స్ ఎండ్ టాన్ జిబిల్ ఇన్ కమ్స్ఎమ్ఐఎస్ హెచ్ టిఐ ని అమలు పరచడం జరుగుతుంది. దీనికి గాను ఎమ్ జిఎన్ఆర్ఇజిఎస్, సిఎఎమ్ పిఎ ఫండ్, ఇంకా ఇతర వనరుల ను కలుపుకోవడం జరుగుతుంది.
  • పర్యావరణం పరం గా చూసినప్పుడు నిలకడతనం తో కూడినటువంటి మరియు ప్రతిస్పందన పూర్వకమైన కార్యాల నిమిత్తం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ను పర్యావరణ (పరిరక్షణ) చట్టం పరిధి లో నోటిఫై చేయడం జరుగుతుంది.
  • మాగాణి నేలల ను చక్కగా ఉపయోగించువడాన్ని ప్రోత్సహించడానికి, జీవ వైవిధ్యాన్ని వృద్ధి చెందింప చేయడానికి, పర్యావరణ ప్రధానమైన పర్యటనల కు అవకాశాల ను పెంచడానికి, స్థానిక సముదాయాల కు ఆదాయాన్ని సృష్టించడానికి వచ్చే మూడు సంవత్సరాల లో అమృత్ ధరోహర్ స్కీము ను అమలు పరచడం జరుగుతుంది.
  • ఒక ఏకీకృత స్కిల్ ఇండియా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ను ప్రారంభించాలని ప్రతిపాదించడమైంది. ఇది డిమాండు ఆధారితమైన నైపుణ్యాల వృద్ధి కి, ఎమ్ఎస్ఎమ్ఇ లతో సహా లింక్ చేయడానికి తోడ్పడుతుంది.
  • అఖిల భారత స్థాయి లో జాతీయ అప్రెంటిస్ శిప్ ప్రమోశన్ పథకం లో భాగం గా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ని ప్రారంభించడం జరుగుతుంది. దీనివల్ల మూడు సంవత్సరాల కాలం లో 47 లక్షల మంది యువజనులు స్టయిఫండ్ రూపేణా సాయాన్ని అందుకొంటారు.
  • సవాలు పద్ధతి న ఎంపిక చేయబోయే కనీసం 50 పర్యటక ప్రదేశాల ను దేశ విదేశీ యాత్రికుల కోసం ఒక సంపూర్ణ పేకేజి రూపం లో అభి వృద్ధి చేయడం జరుగుతుంది.
  • దేఖో అప్నా దేశ్ కార్యక్రమం లక్ష్యాలను నెరవేర్చేందుకు రంగాల వారీ నైపుణ్యాల కల్పన మరియు నవ పారిశ్రామికత్వం అభివృద్ధి .. వీటి లో సమన్వయాన్ని సాధించడం జరుగుతుంది.
  • వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాము ద్వారా సరిహద్దు ప్రాంత పల్లెల్లో పర్యటన ల సంబంధి మౌలిక సదుపాయాల ను మరియు సౌకర్యాల ను సమకూర్చడం జరుగుతుంది.
  • రాష్ట్రాలు వాటి యొక్క ఒడిఒపి స్ (వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రోడక్ట్), జిఐ ఉత్పాదనలు మరియు హస్త కళలు.. వీటి విక్రయాన్ని ప్రోత్సహించుకోవడం కోసం ఒక యూనిటీ మాల్ ను ఏర్పాటు చేసేటట్టు రాష్ట్రాల కు సూచన చేయడం జరుగుతుంది.
  • రుణ మంజూరు ప్రక్రియ లు సజావు గా ముందుకు సాగకపోవడం కోసం, ఆర్థిక సేవల ను అందరి అందుబాటు లోకి తీసుకుపోవడాన్ని ప్రోత్సహించడం కోసం, మరియు ఆర్థిక స్థిరత్వాన్ని వృద్ధి చెందింప చేయడం కోసం, ఆర్థిక సంబంధమైన మరియు తత్సహాయక సమాచారం ఒక చోట లభించే విధం గా నేశనల్ ఫైనాన్శియల్ ఇన్ ఫర్మేశన్ రిజిస్ట్రీ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. రిజర్వు బ్యాంకు ను సంప్రదించిన మీదట ఒక కొత్త శాసన పూర్వకమైన యంత్రాంగాన్ని రూపొందించడం జరుగుతుంది.
  • ఆర్థిక రంగ నియంత్రణ సంస్థ లు ప్రస్తుతం అమలవుతున్న నియమ నిబంధనల ను సమగ్రం గా సమీక్షించాలని ప్రతిపాదించడమైంది. వివిధ నిబంధనల ప్రకారం దరఖాస్తుల ను ఖరారు చేయడానికి కాల పరిమితుల ను కూడా నిర్దేశించడం జరుగుతుంది.
  • జిఐఎప్ టి ఐఎఫ్ఎస్ సి లో వ్యాపార కార్యకలాపాల ను పెంచడం కోసమని దిగువన పేర్కొన్న చర్యల ను చేపట్టడం జరుగుతుంది..:
  • రెండు సార్లు క్రమబద్దీకరణ ను నివారించడం కోసమని ఎస్ఇజడ్ చట్టం లో ఉన్న అధికారాల ను ఐఎఫ్ఎస్ సిఎ కు అప్పగించడం జరుగుతుంది.
  • ఐఎఫ్ఎస్ సిఎ, ఎస్ఇజడ్ అధికారులు, జిఎస్ టిఎన్, రిజర్వు బ్యాంకు, ఎస్ఇబిఐ, మరియు ఐఆర్ డిఎఐ లలో నమోదు మరియు అనుమతుల కు ఉద్దేశించి ఒక ఏక గవాక్ష ఐటి వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  • విదేశీ బ్యాంకు కు చెందిన ఐఎఫ్ఎస్ సి బ్యాంకింగ్ యూనిట్ ల ద్వారా ఏక్విజిశన్ ఫైనాన్సింగ్ కు ఆమోదాన్ని ఇవ్వడం జరుగుతుంది.
  • ట్రేడ్ రీ-ఫైనాన్సింగ్ కై ఎగ్జిమ్ బ్యాంక్ తాలూకు ఒక సహాయక సంస్థ ను స్థాపించడమైంది.
  • మధ్యవర్తిత్వ నిబంధన లు, ఏన్సిలరీ సర్వీసు ల కోసం ఎస్ఇజడ్ చట్టం ల పరిధి లో రెండు విధాలైన క్రమబద్ధీకరణ ను నివారించడం కోసం ఐఎఫ్ఎస్ సిఎ నిబంధనల లో సవరణల ను తీసుకు రావడం జరుగుతుంది.
  • ఆఫ్ శోర్ డెరివేటివ్ ఇన్ స్ట్రుమెంట్స్ ను చెల్లుబాటయ్యే ఒప్పందాలు గా గుర్తించాలని ప్రతిపాదించడమైంది.
  • 2023-24 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

    ·        బాంకింగ్ నియంత్రణ చట్టానికి, బాంకింగ్ కంపెనీల చట్టానికి, రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి సవరణలు ప్రతిపాదించటం ద్వారా బాంకుల నిర్వహణ మెరుగుపరచి మదుపుదారులకు రక్షణ కల్పించటం 

    ·        డిజిటల్ కొనసాగింపు విధానాల వైపు చూస్తున్న దేశాలు  జిఐఎఫ్ టి  ఐఎఫ్ఎస్ సి లో వాటి డేటా ఎంబసీలు నెలకొల్పేందుకు వెసులుబాటు కల్పించబడుతుంది

    ·        జాతీయ సెక్యూరిటీల మార్కెట్లలో విద్యకోసం కోర్సుల రూపకల్పన, నిర్వహణ, ప్రమాణాలు నెలకొల్పడానికి సెబీకి అధికారం కల్పిస్తూ డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత కూడా ఇచ్చారు

    ·        ఇన్వెస్టర్లు  ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ నుంచి క్లెయిమ్ చేసుకోని షేర్లు, చెల్లించని డివిడెండ్లు సులభంగా పొందటానికి వీలుగా సమీకృత ఐటీ పోర్టల్ ఏర్పాటు

    ·        ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  పాటిస్తున్న సందర్భంగా ఏక కాలపు చిన్న పొదుపు పథకం ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ ప్రారంభిస్తున్నారు. మహిళ  లేదా బాలిక పేరుమీద మార్చి 2025 వరకు 2 లక్షల మేరకు డిపాయిట్ చేయవచ్చు. దీనిమీద 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. పాక్షిక ఉపసంహరణ అవకాశం  ఉంటుంది.

    ·        నెలసరి ఆదాయ ఖాతా పథకం కింద గరిష్ఠ డిపాజిట్ మొత్తం  4.5 లక్షలనుంచి రూ. 9 లక్షలకు పెంచబడింది. ఇది ఏక వ్యక్తి ఖాతా అయితే 9 లక్షలుగాను, ఉమ్మడి ఖాతా అయితే రూ. 15 లక్షల వరకు పరిమితి ఉంటుంది. 

    ·        2023-24 సంవత్సరానికి రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు పూర్తి వడ్డీలేని రుణాలు ఇస్తారు. ఇందులో పాక్షిక ఋణానికి పెట్టే షరతు ఏంటంటే, ఆ రాష్ట్రాలు నిర్దిష్టమైన అంశాలకోసం తీసుకునే రుణాలతో మూలధన వ్యయం ఆ మేరకు పెంచాల్సి ఉంటుంది.

    ·        రాష్ట్రాల ద్రవ్య లోటు జి ఎస్ డీపీ లో 3.5% మేరకు అనుమతిస్తారు. అందులో 0.5% విద్యుత్ రంగ సంస్కరణలకు ముడిపెడతారు.

     సవరించిన అంచనాలు 2022-23   

    o    అప్పులు మినహా మొత్తం రాబడి రూ. 24.3 లక్షల కోట్లు. అందులో నికర పన్ను వసూళ్ళు రూ. 20.9 లక్షల కోట్లు

    o    మొత్తం వ్యయం రూ. 41.9 లక్షల కోట్లు, అందులో మూలధన వ్యయం రూ. 7.3 లక్షల కోట్లు 

    o    ద్రవ్య లోటు జీడీపీలో 6.4 శాతం, ఇది బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. 

    బడ్జెట్ అంచనాలు 2023-24

    o    అప్పులు మినహా మొత్తం రాబడి రూ. 27.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మొత్తం వ్యయం 45 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 

    o    నికర పన్ను వసూళ్ళు రూ. 23.3 లక్షల కోట్లుగా అంచనావేశారు

    o   ద్రవ్య లోటు జీడీపీలో 5.9 శాతంగా  అంచనా వేశారు

    o    2023-24 ద్రవ్య లోటు భర్తీకోశం సెక్యూరిటీల ద్వారా మార్కెట్ నుంచి ఋణ సేకరణను రూ.11.8 లక్షలకోట్లుగా అంచనావేశారు. 

    o    స్థూలంగా మార్కెట్ నుంచి సేకరించే రుణాలు రూ. 15.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 

     

    పార్ట్  – బి

    ప్రత్యక్ష పన్నులు

    ·         ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనలు పన్నుల్లో స్థిరత్వాన్ని, కొనసాగింపును  లక్ష్యంగా చేసుకున్నాయి.  అదే సమయంలో మరింత సరళీకృతం చేయటం, వివిధ నిబంధనలను హేతుబద్ధం చేయటం ద్వారా వాటిని పాటించటంలో అనవసర ఇబ్బందులు రాకుండా చూడటం, తద్వారా  ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించటం, పౌరులకు పన్ను ఊరట కల్పించటం కూడా దీని లక్ష్యం

    ·         పాటించాల్సిన నియమనిబంధనలను సులభతరం చేయటం కోసం పన్ను చెల్లింపుదారుల సేవలు పెంచటానికి ఆదాయ పన్ను శాఖ నిరంతరం  కృషి చేస్తూ ఉంది.

    ·        పన్ను చెల్లింపుదారుల సేవలు మరింత పెంచటానికి వారికి అనువుగా ఉండేలా కొత్త తరం ఉమ్మడి ఆదాయం పన్ను రిటర్న్ రూపకల్పన జరుగుతోంది. 

    ·         వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేట్ పరిమితిని కొత్త ఆదాయ పన్ను విధానంలో ఇప్పుడున్న రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీనివల్ల ఈ కొత్త విధానంలో రూ. 7 లక్షల వార్షిక ఆదాయం  దాకా ఉన్నవారు ఆదాయం పన్ను చెల్లించనక్కర్లేదు.  

    ·        2020 లో ప్రారంభించిన కొత్త ఆదాయ పన్ను విధానంలో ఆరు స్లాబ్స్ ఉండేవి.  ఈ సంఖ్యను ఐదుకు తగ్గించటంతో బాటు పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షలకు పరిమితం చేశారు. ఇప్పుడు అందరూ పన్ను చెల్లింపుదారులకూ ఊరట కలిగేలా మార్పు చేశారు. 

    కొత్త పన్ను రేట్లు 

    మొత్తం (రూ)

    రేట్  (శాతం )

    రూ.3,00,000 వరకు

    సున్నా

    3,00,001 నుంచి 6,00,000 వరకు

    5

    6,00,001 నుంచి  9,00,000 వరకు

    10

    9,00,001 నుంచి  12,00,000 వరకు

    15

    12,00,001 నుంచి  15,00,000 వరకు

    20

    15,00,000 పైన

    30

     

    ·         జీతాల ఆదాయం పొందేవారు అందుకుంటున్న రూ. 50,000 ప్రామాణిక తగ్గింపు లబ్ధిని కుటుంబ పెన్షన్ నుంచి ఇచ్చే రూ.15,000  మినహాయింపుకు కూడా వర్తింపజేయటం

    ·        అత్యధిక సర్ చార్జ్ గా ఉన్న 37 శాతాన్ని ఇప్పుడు కొత్త ఆదాయ పన్ను హయాంలో 25 శాతానికి తగ్గించటం. దీనివలన  వ్యక్తిగత ఆదాయ పన్ను గరిష్ఠంగా 39 శాతానికే పరిమితమవుతుంది.

    ·         ప్రభుత్వేతర ఉద్యోగులు రిటైర్మెంట్ సందర్భంగా సెలవులను నగదుగా మార్చుకున్నప్పుడు వచ్చే ఆదాయం మీద పన్ను విధించే పరిమితిని 25 లక్షలకు పెంచారు

    ·         కొత్త ఆదాయపు పన్ను హయాం దానంతట అదే వర్తిస్తుంది. అయితే, పౌరులు పాత పన్ను విధానాన్ని వాడుకునే సౌకర్యం కూడా ఉంటుంది.  

    ·        సూక్ష్మ సంస్థలకు, కొంతమంది వృత్తి నిపుణులకు అంచనాతో కూడిన పన్ను ప్రతిపాదనల పరిమితి పెరుగుతుంది.  అయితే ఆ ఏడాదిలో నగదు రూపంలో అందుకున్న మొత్తం స్థూల రాబడి లేదా టర్నోవర్ లో 5 శాతం మించనప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.   

    ·         ఎంఎస్ఎంఇ లకు చేసిన చెల్లింపులకు గాను అయ్యే ఖర్చుకు ఇచ్చే మినహాయింపు నిజంగా ఎంఎస్ఎంఇ లకు మద్దతుగా సకాలంలో జరిగిన వసూళ్ళకు గాను చెల్లింపులు జరిపినప్పుడు మాత్రమే వర్తిస్తుంది.  

    ·        అన్నీ కొత్త తయారీ కంపెనీలకూ తక్కువ పన్నుశాతం లభిస్తుండగా,  2024 మార్చి 31 వరకు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త సహకార సంఘాలకు తక్కువ పన్ను శాతమైన 15 శాతం వర్తింప జేస్తారు .  

    ·         2016-17 మదింపు సంవత్సరానికి ముందు చెరకు రైతులకు చెల్లింపులు జరిపిన సహకార చక్కెర కర్మాగారాలు దాన్ని వ్యయంగా చూపించవచ్చు. దీనివలన వాటికి దాదాపు 10, 000 కోట్ల రూపాయల మేరకు ఊరట లభిస్తుంది.

    ·        ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సభ్యులు రూ.2 లక్షల వరకు నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం, రుణం తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు,  గ్రామీణ అభివృద్ధి బాంకులకు వర్తిస్తుంది.    

    ·         సహకార సంఘాలు గరిష్టంగా  రూ. 3 కోట్ల వరకు మూలం నుంచి పన్ను తగ్గించుకునే వెసులుబాటు కల్పించారు.

    ·         అంకుర సంస్థలు ఆదాయ పన్ను లబ్ధి పొందటానికి వ్యవస్థాపక తేదీని 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31 వరకు పొడిగించారు.

    ·         అంకుర సంస్థల వాటా మార్పిడి వలన వచ్చే నష్టాలను ముందుకు తీసుకువెళ్ళే వెసులుబాటు అవి ప్రారంభించిన ఏడు సంవత్సరాల వరకు ఉండగా ఇప్పుడు ఆ పరిమితిని పది సంవత్సరాలకు పొడిగించారు  

    ·         సెక్షన్ 54, 54 ఎఫ్ కింద నివాస గృహాల మీద మూలధన లాభాల నుంచి మినహాయింపును రూ.10 కోట్లకు పరిమితం చేస్తారు. దీనివలన పన్ను మినహాయింపు, రాయితీ  మెరుగ్గా ఉంటుంది. 

    ·         అత్యధిక విలువ ఉన్న బీమా పాలసీల నుంచి వచ్చే మొత్తాలమీద ఆదాయం పన్ను పరిమితి పెట్టాలని ప్రతిపాదించారు.  2023 ఏప్రిల్ తరువాత జారీ చేసిన జీవిత బీమా పాలసీల ప్రీమియం రూ. 5 లక్షలకంటే ఎక్కువ ఉంటే అలాంటి పాలసీల ఆదాయ నుంచి మాత్రమే రూ. 5 లక్షల మినహాయింపు ఉంటుంది.  

    ·        కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహనిర్మాణం, నగరాభివృద్ధి, నియంత్రణ కోసం ఏర్పాటు చేసే ప్రాధికార సంస్థలు, బోర్డులు తదితర సంస్థల ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించాలని ప్రతిపాదించారు.

    ·       మూలం నుంచి పన్ను మినహాయింపుకు ఉన్న రూ.10 వేల నిబంధనను తొలగించారు. ఆన్ లైన్ గేమింగ్ మీద పన్ను  విధింపులో స్పష్టత ఇచ్చారు.  నికరంగా గెలుచుకున్న మొత్తాన్ని తీసుకునేటప్పుడు లేదా ఆర్థిక సంవత్సరం చివర్లో  టీడీఎస్, పన్ను విధింపు ఉండాలని ప్రతిపాదించారు.  

    ·         బంగారాన్ని ఎలక్ట్రానిక్ బంగారపు రసీదుగా మార్చుకోవటం లేదా ఎలక్ట్రానిక్ బంగారపు రసీదును బంగారంగా మార్చుకోవటాన్ని మూలధన లాభాలుగా పరిగణించరు. 

    ·        పాన్ లేని వారి విషయంలో పన్ను విధించదగిన ఈపీఎఫ్ లో మూలం లో పన్ను తగ్గింపు రేటును 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.   

    ·         మార్కెట్ అనుసంధానిత డిబెంచర్ల మీద వచ్చే ఆదాయం పన్ను విధింపుకు అర్హమవుతుంది. 

     ·   కమిషనర్ స్థాయిలో చిన్న చిన్న పెండింగ్ అప్పీళ్ళను పరిష్కరించటానికి 100 మంది జాయింట్ కమిషనర్లను నియమిస్తారు 

    ·         ఆదాయ పన్ను చట్టం లో సెక్షన్ 276 ఎ కింద లిక్విడేటర్ల తప్పిదాలను 2023 ఏప్రిల్ 1 నుంచి నేరాల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు  

    ·        ఐడీబీఐ బాంకుతో సహా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ నష్టాలను తరువాత సంవత్సరాలకు తీసుకుపోవటానికి అనుమతిస్తారు. 

    ·         అగ్నివీర్  నిధికి ఈఈఈ  ప్రతిపత్తి కల్పిస్తారు.  2022 అగ్నిపథ్ పథకంలో చేరిన అగ్నివీర్  ల నుంచి వచ్చిన మొత్తాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.    

    పరోక్ష పన్నులు 

    ·         జౌళి, వ్యవసాయం మినహా వస్తువుల మీద విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రేట్లు 21 నుంచి 13 కు తగ్గించారు.

    ·         బేసిక్ కస్టమ్స్ డ్యూటీలు, సెస్ లలోనూ ..  ఆట బొమ్మలు, సైకిళ్ళు, ఆటోమొబైల్స్, నాఫ్తా మీద సర్ ఛార్జీలలోనూ  నామమాత్రపు మార్పులు ఉన్నాయి.   

    ·         జీఎస్టీ చెల్లించిన కంప్రెస్డ్ బయో గ్యాస్ మీద ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు 

    ·         ఎలక్ట్రిక్ వాహనాల బాటరీల తయారీలో వాడే  లిథియం అయాన్ సెల్ తయారీకి వినియోగించే నిర్దిష్టమైన మూలధన వస్తువులు, యంత్రాల మీద కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు గడువును 2024 మార్చి 31 వరకు పొడిగించారు. 

    ·         వాహనాలు, నిర్దిష్టమైన ఆటోమొబైల్ విడిభాగాలు, పరికరాలు, ఉప వ్యవస్థలు, టైర్లను..   నోటిఫైడ్ సంస్థలు టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం  దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని  షరతులకు లోబడి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది.  

    ·        సెల్ ఫోన్ల కెమెరా మాడ్యూల్స్ కోసం వాడే కెమెరా లెన్స్ , దాని భాగాల మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గించి సున్నా చేశారు. బాటరీల  లిథియం అయాన్ సెల్స్ కి ఇచ్చే సుంకం మినహాయింపును మరో ఏడాది పొడిగించారు.

    ·        టీవీ పానెల్స్ ఓపెన్ సెల్స్ మీద బేసిక్ కస్టమ్స్  డ్యూటీని 2.5 శాతానికి తగ్గించారు. 

    ·        ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంపు

    ·         ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీల తయారీకి వాడే హీట్ కాయిల్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15 శాతానికి తగ్గింపు   

    ·         రసాయన పరిశ్రమలో వాడే డీనేచర్డ్ ఈథైల్ ఆల్కహాల్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు  

    ·         97 శాతం మించి కాల్షియం ఉన్న ఆసిడ్ తరహా ఫ్లోర్ స్పార్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించారు. 

    ·         ఎపిక్లోరోహైడ్రీన్ తయారీలో వాడే ముడి గ్లిజరిన్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించారు   

    ·         రొయ్యల ఫీడ్ తయారీకి ఉపయోగించే ముఖ్యమైన ముడిసరకు మీద సుంకం తగ్గింపు

    ·         ప్రయోగశాలలో తయారుచేసే వజ్రాలకోసం ఉపయోగించే ముడిసరకు మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు 

    ·         బంగారం, ప్లాటినం కడ్డీలతో తయారయ్యే వస్తువుల మీద సుంకాలు పెంపు 

    ·         వెండి కడ్డీలు, వస్తువుల మీద దిగుమతి సుంకం పెంపు 

    ·         ఉక్కు, తుక్కు ఇనుము నికెల్ కాథోడ్ మీద ఉన్న బేసిక్ సుంకం మినహాయింపు కొనసాగింపు  .

    ·         రాగి తుక్కు  మీద రాయితీతో కూడిన  2.5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ  కొనసాగింపు

    ·         రబ్బర్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 25 శాతానికి పెంచటం లేదా కిలోకు రూ.30 లలో ఏది తక్కువైతే అది విధిస్తారు.

    ·         కొన్నిరకాల సిగరెట్ల మీద విధించే  జాతీయ విపత్తు సహాయక సుంకం 16 శాతానికి పెరుగుదల 

    కస్టమ్స్ చట్టాల్లో శాసనపరమైన మార్పులు 

    ·         1962 నాటి కస్టమ్స్ చట్టాన్ని సవరించటం ద్వారా  దరఖాస్తు చేసిన తేదీ నుంచి 9 నెలలలోగా పరిష్కారాల కమిటీ ఆదేశాలు ఇచ్చేలా చూడటం 

    ·         కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ ను సవరించటం ద్వారా యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఉద్దేశాన్ని, పరిధిని స్పష్టీకరించి రక్షక చర్యల మీద వివరణ ఇవ్వటం 

    ·        సీజీఎస్టీ చట్ట సవరణ  

    o    జీఎస్టీ కింద ప్రాసిక్యూషన్ జరపటానికి కనీస మొత్తాన్ని రూ. కోటి నుంచి రెండు కోట్లకు పెంచటం 

    o    జరిమానా విధింపు ను 50 నుంచి 150 శాతం బదులుగా 25 నుంచి 100 శాతం వరకు తగ్గింపు 

    o    కొన్ని తప్పిదాలను  నేరాల జాబితా నుంచి తొలగించటం

    o   సంబంధిత రిటర్న్ లు, స్టేట్ మెంట్లు దాఖలు చేయటానికి ఇచ్చే గరిష్ఠ సమయాన్ని మూడు సంవత్సరాలకు పరిమితం చేయటం

    o    రిజిస్టర్ కానీ సరఫరాదారులు, కాంపోజిషన్ పన్ను చెల్లింపుదారులు రాష్ట్రాలమధ్య సరకు సరఫరాను ఈ-కామర్స్ ఆపరేటర్ల ద్వారా జరిపే వెసులుబాటు కల్పించటం  

                              ******



(Release ID: 1895493) Visitor Counter : 4121