ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన - ప్రధానమంత్రి

"భారత దేశ అంకుర సంస్థల స్ఫూర్తికి బెంగళూరు ప్రాతినిధ్యం వహిస్తోంది; ఈ స్ఫూర్తి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది"

"భారతదేశం ఇప్పుడు స్తబ్దతను విడిచిపెట్టిందనడానికి - వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ఒక చిహ్నం"

"విమానాశ్రయాలు వ్యాపారాల విస్తరణకు కొత్త క్షేత్రాలతో పాటు, దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి"

"డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రపంచం మెచ్చుకుంటోంది"

"దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక అగ్రగామిగా ఉంది"

"పరిపాలన లేదా భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల పెరుగుదల వీటిలో ఏదైనా, భారతదేశం పూర్తిగా భిన్నమైన స్థాయిలో పని చేస్తోంది"

"గతంలో, వేగం విలాసవంతమైనదిగా పరిగణించబడింది; పెరుగుదల ప్రమాదంగా పరిగణించబడింది"

"మన వారసత్వం సాంస్కృతిక పరమైనది మరియు ఆధ్యాత్మికపరమైనది కూడా"

"నాదప్రభు కెంపెగౌడ ఊహించిన విధంగా బెంగళూరు అభివృద్ధి జరగాలి"

Posted On: 11 NOV 2022 2:39PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో జ‌రిగిన ఒక బ‌హిరంగ సభలో ప్ర‌సంగించారు.  అంతకుముందు విధాన సౌధ లోని గొప్ప భక్తుడు, కవి శ్రీ కనకదాసు విగ్రహానికి, మహర్షి వాల్మీకి విగ్రహానికీ ప్రధానమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె.ఎస్.ఆర్. రైల్వే స్టేషన్‌ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు.  బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం లోని రెండవ టెర్మినల్ ను ప్రారంభించిన అనంతరం, 108 మీటర్ల ఎత్తైన శ్రీ నాదప్రభు కెంపెగౌడ కాంస్య విగ్రహాన్ని, ప్రధానమంత్రి ఆవిష్కరించారు.

స‌భ‌నుద్దేశించి ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ, క‌ర్ణాట‌క‌కు చెందిన ఇద్ద‌రు గొప్ప వ్య‌క్తుల జ‌యంతి సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లో పర్యటించడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.  సంత్ కనకదాస్, ఒనకే ఓబవ్వలకు ఆయన నివాళులర్పించారు.  చెన్నైతో పాటు, అంకుర సంస్థల రాజధాని బెంగళూరు, వారసత్వ నగరం మైసూర్‌ లను కలుపుతూ కర్నాటకకు ఈ రోజు మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ వందే భారత్ రైలు లభించిందని ప్రధానమంత్రి చెప్పారు.  "కర్ణాటక ప్రజలకు అయోధ్య, కాశీ, ప్రయాగ్‌రాజ్‌ దర్శనం కల్పించే భారత్‌ గౌరవ్‌ కాశీ దర్శన్‌ రైలును ఈ రోజు ప్రారంభించడం జరిగింది" అని ఆయన తెలియజేశారు. 

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం  రెండవ టెర్మినల్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, నిన్న పంచుకున్న చిత్రాల కంటే మౌలిక సదుపాయాలు చాలా అందంగా, అద్భుతంగా ఉన్నాయని, వ్యాఖ్యానించారు.  నాదప్రభు కెంపెగౌడ స్మారక విగ్రహం గురించి కూడా ప్రధానమంత్రి వివరిస్తూ, భవిష్యత్తు బెంగళూరు, భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించేందుకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, చెప్పారు.   అంకుర సంస్థల ప్రపంచంలో భారతదేశ గుర్తింపు గురించి ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, ఈ గుర్తింపును నిర్వచించడంలో బెంగళూరు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.  "భారతదేశ అంకుర సంస్థల స్ఫూర్తికి బెంగళూరు ప్రాతినిధ్యం వహిస్తోంది, ఈ స్ఫూర్తి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది" అని శ్రీ మోదీ ప్రశంసించారు.  ఈ కార్య‌క్ర‌మం బెంగ‌ళూరులోని యువ‌త స్ఫూర్తికి అద్దం ప‌డుతోందని, ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. 

వందే భారత్ కేవలం రైలు మాత్రమే కాదు, ఇది నవీన భారతదేశానికి కొత్త గుర్తింపు.  "భారతదేశం ఇప్పుడు స్తబ్దతను విడిచిపెట్టిందనడానికి - వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ఒక చిహ్నం. భారత దేశ రైల్వేల పూర్తి పరివర్తన కోసం మేము ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 400 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు, విస్టా డోమ్ కోచ్‌ లు భారతీయ రైల్వేలకు కొత్త గుర్తింపుగా మారుతున్నాయి.  ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు సరుకు రవాణా వేగాన్ని పెంచుతాయి, సమయాన్ని ఆదా చేస్తాయి.   ర్యాపిడ్ బ్రాడ్ గేజ్ మార్పిడి రైల్వే మ్యాప్‌ లోకి కొత్త ప్రాంతాలను తీసుకువస్తోంది.  రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ, బెంగళూరు రైల్వే స్టేష‌న్ లోని, స‌ర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్, ప్ర‌యాణికుల‌కు ఎంతో మెరుగైన అనుభూతిని అందిస్తోందనీ, కర్ణాటక రాష్ట్రంలోని స్టేషన్లతో సహా ఇతర స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. 

అభివృద్ధి చెందిన భారత దేశ దృక్ఫథం గురించి వివరిస్తూ, నగరాల మధ్య అనుసంధానత కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ప్రస్తుత పరిస్థితులకు ఆవశ్యకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  కొత్తగా నిర్మించిన కెంపెగౌడ  విమానాశ్రయం రెండవ టెర్మినల్, అనుసంధానతను పెంపొందించడానికి అవసరమైన కొత్త సౌకర్యాలు, సేవలను జోడిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.   విమాన ప్రయాణం విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటని, విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని ఆయన తెలియజేశారు.   2014 సంవత్సరానికి ముందు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, నేడు ఆ సంఖ్య రెట్టింపై 140 కి చేరుకుందని ప్రధానమంత్రి చెప్పారు.  "విమానాశ్రయాలు వ్యాపారాల విస్తరణకు కొత్త క్షేత్రాన్ని సృష్టిస్తున్నాయి, అదే విధంగా దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి." అని శ్రీ మోదీ పేర్కొన్నారు. 

యావత్ ప్రపంచం భారతదేశం పట్ల చూపిన నమ్మకం, ఆకాంక్షల ప్రయోజనాలను కర్ణాటక పొందుతోందని ప్రధానమంత్రి చెప్పారు.  కోవిడ్ మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్న సమయంలో కర్ణాటక లో 4 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.  "గత సంవత్సరం, దేశం లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో కర్ణాటక అందరికంటే ముందుంది" అని ఆయన ప్రశంసించారు.  ఈ పెట్టుబడి కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదని, బయోటెక్నాలజీ నుంచి రక్షణ శ్రేణి వరకు ఉంటుందని ఆయన వివరించారు.  భారతదేశంలోని ఎయిర్‌క్రాఫ్ట్ మరియు స్పేస్ క్రాఫ్ట్ పరిశ్రమలో కర్ణాటకకు 25 శాతం వాటా ఉందని ఆయన తెలియజేశారు.  భారతదేశ రక్షణ కోసం తయారు చేయబడిన విమానాలు మరియు హెలికాప్టర్లలో దాదాపు 70 శాతం కర్ణాటకలో తయారవుతున్నాయని కూడా ఆయన చెప్పారు.   ఫార్చ్యూన్-500 జాబితాలోని 400కు పైగా కంపెనీలు కర్ణాటకలో పనిచేస్తున్నాయని శ్రీ మోదీ తెలిపారు.  కర్నాటక రాష్ట్రంలో ఇంతటి విపరీతమైన అభివృద్ధిని సాధించిపెట్టిన ఘనత రాష్ట్రంలోని డబల్-ఇంజన్ ప్రభుత్వానిదేనని, ఆయన పేర్కొన్నారు. 

"పరిపాలన లేదా భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాల పెరుగుదల వీటిలో ఏదైనా, భారతదేశం పూర్తిగా భిన్నమైన స్థాయిలో పని చేస్తోంది." అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.  భిమ్ యు.పి.ఐ. మరియు మేడ్ ఇన్ ఇండియా 5-జి సాంకేతికతలను ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, ఈ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది బెంగళూరులోని నిపుణులే అని,  ప్రధానమంత్రి గుర్తుచేశారు.  గత ప్రభుత్వ ఆలోచనా విధానం పాత బడిపోయిందని, 2014 సంవత్సరానికి ముందు ఇలాంటి సానుకూల మార్పులు ఊహకందని స్థాయిలో ఉండేవని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  "గత ప్రభుత్వాలు వేగాన్ని విలాస వంతమైనవిగా, పెరుగుదలను ప్రమాదభరితంగా  భావించగా, మా ప్రభుత్వం ఆ ధోరణిని మార్చివేసింది.  మేము వేగాన్ని ఆకాంక్షగా, పెరుగుదలను భారతదేశ శక్తిగా పరిగణిస్తున్నాము." అని ప్రధానమంత్రి చెప్పారు.  ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్‌ గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, అన్ని శాఖలు, ఏజెన్సీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, ఫలితంగా వివిధ ఏజెన్సీలకు పదిహేను వందల కంటే ఎక్కువ లేయర్ల సమాచారం అందుబాటులోకి వస్తోందని, తెలియజేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంత్రిత్వ శాఖలతో పాటు డజన్ల కొద్దీ ఇతర శాఖలు ఈ వేదిక సహాయంతో కలిసి వస్తున్నాయని ఆయన అన్నారు.  "నేడు, భారతదేశం మౌలిక సదుపాయాల పెట్టుబడి దిశగా 110 లక్షల కోట్ల రూపాయల లక్ష్యంతో పని చేస్తోంది.   "మల్టీమోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కు ప్రాధాన్యత ఇవ్వబడింది, తద్వారా ప్రతి రవాణా మాధ్యమం మరొకదానికి మద్దతు ఇస్తుంది.", అని ఆయన తెలియజేశారు.  జాతీయ లాజిస్టిక్స్ విధానం గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ, దేశంలో ర‌వాణా వ్య‌యాన్ని త‌గ్గించ‌డంతో పాటు, ఆవిష్క‌ర‌ణ‌లకు తోడ్ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. 

సామాజిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం

*     దేశంలో పేదలకు 3.4 కోట్ల పక్కా ఇళ్లు, కర్ణాటకలో 8 లక్షలు 

*     దేశంలో 7 కోట్ల ఇళ్లకు పైప్‌ వాటర్‌ కనెక్షన్‌ లభించింది; కర్ణాటకలో 30 లక్షలు

*     ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో 4 కోట్ల మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు; కర్ణాటకలో 30 లక్షల మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు  

*     దేశంలోని 10 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి 2.5 లక్షల కోట్ల రూపాయలు  బదిలీ కాగా,  కర్ణాటకలోని 55 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 11 వేల కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.   

*     దేశంలో 40 లక్షల మంది వీధి వ్యాపారులు స్వనిధి కింద సహాయం పొందగా, కర్ణాటకలో 2 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారు. 

దేశ వారసత్వం పట్ల గర్వించదగ్గ ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, మన వారసత్వం సాంస్కృతిక పరమైనది మరియు ఆధ్యాత్మికపరమైనది కూడా, అని పేర్కొన్నారు.  భారత్ గౌరవ్ రైల్‌ తో విశ్వాసం మరియు ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుపుతున్నామని, అదే సమయంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలియజేశారు.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ రైలు 9 ప్రయాణాలు పూర్తి చేసిందని, ఆయన చెప్పారు.   "షిర్డీ దేవాలయం కావచ్చు, శ్రీ రామాయణ యాత్ర కావచ్చు, దివ్య కాశీ యాత్ర కావచ్చు, ఇలాంటి రైళ్లన్నీ ప్రయాణీకులకు చాలా ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చాయి."   కర్నాటక నుండి కాశీ, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్‌లకు ఈ రోజు ప్రారంభమైన ప్రయాణం కర్ణాటక ప్రజలు కాశీ, అయోధ్యలను సందర్శించడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. 

కనక దాస్ గారు తెలియజేసిన ముతక ధాన్యాల ప్రాముఖ్యత గురించి కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా అందరికీ వివరించారు.   తన కూర్పు - రామ్ ధన్య చరితే హైలైట్ చేస్తూ, కర్నాటకలో అత్యధికంగా ఇష్టపడే తృణధాన్యం  'రాగి' ని ఉదాహరణగా చూపుతూ సామాజిక సమానత్వ సందేశాన్ని ఇది తెలియజేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

నాదప్రభు కెంపెగౌడ గారు ఊహించిన విధంగా బెంగళూరు అభివృద్ధి జరగాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  "ఈ నగరం స్థిరంగా అభివృద్ధి చెందడం, ఇక్కడి ప్రజలకు కెంపెగౌడ గారు చేసిన గొప్ప సహకారం" అని ఆయన చెప్పారు.  బెంగళూరు ప్రజల సౌకర్యార్థం శతాబ్దాల క్రితమే ప్రణాళిక చేయబడిన వాణిజ్యం, సంస్కృతికి సంబంధించిన అసమానమైన వివరాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రముఖంగా పేర్కొన్నారు.   "బెంగళూరు ప్రజలు ఇప్పటికీ ఆయన దార్శనికత యొక్క ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నారు." అని శ్రీ మోదీ అన్నారు.  నేడు వ్యాపారాలు బహుముఖంగా రూపాంతరం చెందినప్పటికీ, 'పేట' (బెంగళూరులోని ఒక ప్రాంతం) ఇప్పటికీ బెంగళూరుకు వాణిజ్య జీవనాధారంగా ఉందని ఆయన వివరించారు.  బెంగళూరు సంస్కృతిని సుసంపన్నం చేయడంలో నాదప్రభు కెంపెగౌడ గారు చేసిన కృషి గురించి ప్ర‌ధానమంత్రి వివరిస్తూ, ప్ర‌సిద్ధ‌మైన గ‌వి గంగాధ‌రేశ్వ‌ర దేవాలయంతో పాటు, బ‌స‌వ‌న‌గుడి ప్రాంతంలోని ఆలయాలను ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.   "వీటి ద్వారా, కెంపెగౌడ గారు బెంగళూరు యొక్క సాంస్కృతిక చైతన్యాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచారు" అని ప్రధానమంత్రి ప్రశంసించారు. 

బెంగళూరు అంతర్జాతీయ నగరమనీ, మన వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక మౌలిక సదుపాయాలతో దానిని సుసంపన్నం చేసుకోవాలనీ పేర్కొంటూ, “ఇదంతా సబ్‌-కా-ప్రయాస్‌ తోనే సాధ్యం” అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై; కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్;  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు శ్రీ బి. ఎస్. యడియూరప్ప;  కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ అశ్విని వైష్ణవ్;  కేంద్ర సహాయ మంత్రులు శ్రీమతి శోభా కరంద్లాజే, శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, శ్రీ ఎ నారాయణ స్వామి, శ్రీ భగవంత్ ఖూబా;  పార్లమెంటు సభ్యుడు శ్రీ బి.ఎన్. బచ్చెగౌడ; ఆదిచుంచనగిరి మఠానికి చెందిన డాక్టర్ నిర్మలానందనాథ స్వామిజీతో పాటు,  కర్ణాటక రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



(Release ID: 1875756) Visitor Counter : 109