ప్రధాన మంత్రి కార్యాలయం
'ఇన్-సితు మురికివాడల పునరావాస ప్రాజెక్టు' కింద ఢిల్లీ లోని కల్కాజీ లో కొత్తగా నిర్మించిన 3,024 ఫ్లాట్ల ను ప్రారంభించిన - ప్రధానమంత్రి
భూమి హీన్ శిబిరంలో అర్హులైన జుగ్గీ జోప్రీ నివాసితులకు ఫ్లాట్ల తాళాలు అందజేయడం
"ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం "సబ్-కా-సాత్, సబ్-కా-వికాస్, సబ్-కా-విశ్వాస్, సబ్-కా-ప్రయాస్" మార్గంలో పయనిస్తున్న - దేశం'మా ప్రభుత్వం పేద ప్రజలది, విధాన రూపకల్పన, నిర్ణయాత్మక వ్యవస్థలకు వారు కేంద్రంగా ఉంటారు”
"జీవితానికి భద్రత ఉంటే, పేదలు తమను తాము పేదరికం నుండి బయట పడేయటానికి కష్టపడతారు"
"మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము"
"పి.ఎం-యు.డి.ఏ.వై. పథకం ద్వారా ఢిల్లీ లో అనధికార కాలనీల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించే పని జరుగుతోంది"
"దేశ రాజధాని హోదాకు అనుగుణంగా ఉండే అన్ని సౌకర్యాలతో ఢిల్లీని పూర్తిస్థాయి గ్రాండ్ సిటీ గా మార్చడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం"
"ఢిల్లీ లోని పేద, మధ్య తరగతి ప్రజలు ఇద్దరూ కోరికలతో కూడిన ప్రతిభావంతులు"
Posted On:
02 NOV 2022 6:13PM by PIB Hyderabad
'ఇన్-సితు మురికివాడల పునరావాస ప్రాజెక్టు' కింద మురికివాడల నివాసితుల పునరావాసం కోసం ఢిల్లీ లోని కల్కాజీ లో నూతనంగా నిర్మించిన 3,024 ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించి, న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో భూమి హీన్ క్యాంపులో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులను అందజేశారు.
ఈ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు ఢిల్లీలోని వందలాది కుటుంబాలకు ఇది ఒక పెద్ద మంచి రోజనీ, ఇది అనేక జుగ్గీ నివాస పేద కుటుంబాలకు నూతన నాంది అని, పేర్కొన్నారు. కేవలం ఒక్క కల్కాజీ ఎక్స్టెన్షన్ మొదటి దశలోనే మూడు వేలకు పైగా గృహాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. అతి త్వరలో, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర కుటుంబాలవారు కూడా తమ తమ కొత్త ఇళ్లలోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతారు. "ఢిల్లీ ని ఆదర్శ నగరం గా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు పెద్ద పాత్ర పోషిస్తాయని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి, సాకారమయ్యే కలల గురించి ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, అటువంటి అభివృద్ధి మరియు కలలకు పునాది పేదల కృషి మరియు పట్టుదల మాత్రమేనని అన్నారు. "అయితే, ఇందుకు విరుద్ధంగా, ఈ పేద ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో జీవించేలా చేశారు. ఒక్క నగరంలోనే ఇంత అసమతుల్యత వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, సమగ్ర అభివృద్ధి గురించి మనం ఎలా ఆలోచించగలం? ఆజాదీ-కా-అమృత్-కాల్ లో, ఈ భారీ లోటును మనం పూరించాలి. అందుకే, దేశం అందరి అభ్యున్నతి కోసం, సబ్-కా-సాథ్, సబ్-కా-వికాస్, సబ్-కా-విశ్వాస్, సబ్-కా-ప్రయాస్ అనే బాటలో పయనిస్తోంది." అని పేర్కొన్నారు.
పేదరికం అనేది పేద ప్రజల సమస్య అనే మనస్తత్వంతో దశాబ్దాలుగా దేశం లోని పాలనా వ్యవస్థ కొట్టుమిట్టాడుతోందనీ, అయితే ప్రస్తుత ప్రభుత్వం పేదలకు చెందినదనీ, అందువల్ల వారిని వదిలిపెట్టే స్వభావం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. విధాన రూపకల్పన, నిర్ణాయక వ్యవస్థలలో పేదలే కేంద్రంగా ఉంటారనీ, పట్టణ పేదల సమస్యలను ప్రభుత్వం సమాన ప్రాముఖ్యతతో పరిగణిస్తోందనీ, శ్రీ మోదీ తెలియజేశారు.
ఢిల్లీలో 50 లక్షల మంది ఉన్నారని, వారికి బ్యాంకు ఖాతా కూడా లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. "వారు ఢిల్లీ లోనే ఉన్నా, ఢిల్లీ వారికి చాలా దూరంగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ని ప్రస్తుత ప్రభుత్వం మార్చింది, బ్యాంకు ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక చేరిక కోసం ప్రచారాన్ని చేపట్టింది. ఫలితంగా వీధి వ్యాపారుల తో సహా ఢిల్లీ లోని పేద ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు లభించాయి. యు.పి.ఐ. యొక్క సర్వ వ్యాప్తి పై కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ, 50 వేలకు పైగా వీధి వ్యాపారులు స్వనిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందారని, తెలియజేశారు.
'ఒక దేశం, ఒక రేషన్ కార్డు' ద్వారా ఢిల్లీ లోని పేదలకు 'జీవన సౌలభ్యాన్ని' కల్పిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. మహమ్మారి సమయంలో పేద వర్గాలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులైన పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ పొందుతున్నారు. ఇందుకోసం, కేవలం ఢిల్లీలోనే రెండున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఢిల్లీలో 40 లక్షల మందికి పైగా పేద ప్రజలు బీమా భద్రతను పొందారని ప్రధానమంత్రి తెలియజేశారు. జన ఔషధి పథకాల ద్వారా వైద్య ఖర్చులు తగ్గాయి. “జీవితంలో ఈ భద్రత ఉన్నప్పుడు, పేద ప్రజలు అవిశ్రాంతంగా, శక్తివంచన లేకుండా కష్టపడతారు. ప్రతి వ్యక్తి తనకు తానుగా పేదరికం నుంచి బయటపడటానికి పని చేస్తాడు.”, అని ఆయన అన్నారు. పెద్దగా ఆర్భాటాలు లేకుండా, విస్తృతమైన ప్రకటనలు లేకుండానే ఇదంతా జరుగుతోందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఎందుకంటే "మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము జీవిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో అనధికార కాలనీ ల అంశంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమ ఇళ్ల స్థితిగతులపై ప్రజలు నిరంతరం ఆందోళన చెందుతున్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. “ఢిల్లీ ప్రజల ఆందోళనను తగ్గించే పనిని కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. ఢిల్లీ లోని అనధికార కాలనీల్లో నిర్మించిన ఇళ్లను పి.ఎం-యు.డి.ఏ.వై. పథకం ద్వారా క్రమబద్ధీకరించే పని జరుగుతోంది. ఇప్పటి వరకు వేలాది మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు." అని ఆయన చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు వడ్డీ రాయితీ కింద 700 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.
“ఢిల్లీ లోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం అవకాశమున్న అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ రాజధాని హోదాకు అనుగుణంగా ఢిల్లీ ని అన్ని సౌకర్యాలతో కూడిన గ్రాండ్ సిటీగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం." ఎర్రకోట ప్రాకారాల నుండి ‘ఆపేక్షాత్మక సమాజం’ గురించి తమ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీ లోని పేద, మధ్యతరగతి ప్రజలు కోరికలతో కూడిన ప్రతిభావంతులని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్.సీ.ఆర్. ప్రాంతంలో అభివృద్ధి గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొంటూ, 2014 తర్వాత మెట్రో మార్గాలను 190 కి.మీ నుండి 400 కి.మీ. లకు విస్తరించినట్లు తెలియజేశారు. గత 8 సంవత్సరాలలో, 135 కొత్త మెట్రో స్టేషన్లు నెట్వర్క్కు జోడించడంతో, ఇవి ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేశాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ లో ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం పొందేందుకు భారత ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయల తో రహదారులను విస్తరిస్తోందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్, అక్షరధామ్ నుండి బాగ్పట్ 6-లైన్ల యాక్సెస్ కంట్రోల్ హైవే, గురుగ్రామ్-సోహ్నా రోడ్ రూపంలో ఎలివేటెడ్ కారిడార్ లను ప్రధానమంత్రి ఉదహరించారు.
ఢిల్లీ ఎన్.సి.ఆర్. కోసం ర్యాపిడ్ రైలు వంటి సేవలు సమీప భవిష్యత్తులో ప్రారంభం కాబోతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ను గొప్పగా నిర్మించనున్నామని, ఆయన చెప్పారు. ద్వారకలో 80 హెక్టార్ల స్థలంలో భారత్ వందన పార్క్ ను నిర్మించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇది రాబోయే కొద్ది నెలల్లో పూర్తయ్యే దిశగా సాగుతోందని తెలియజేశారు. “ఢిల్లీ లో ఏడు వందలకు పైగా పెద్ద పార్కులు డి.డి.ఏ. చే నిర్వహించబడుతున్నాయని నాకు చెప్పారు. వజీరాబాద్ బ్యారేజీ నుంచి ఓఖ్లా బ్యారేజీ మధ్య 22 కిలోమీటర్ల మేర వివిధ పార్కులను డీ.డీ.ఏ. అభివృద్ధి చేస్తోంది’’ అని కూడా ఆయన చెప్పారు.
కొత్త ఇళ్ల లబ్దిదారులు కరెంటును ఆదా చేయాలనీ, నీరు వృథా కాకుండా చూడాలనీ, విద్యుత్తు ఆదా చేయడం కోసం ఎల్.ఈ.డీ. బల్బులను మాత్రమే వినియోగించాలని, ముఖ్యంగా కాలనీ అంతా శుభ్రంగా, అందంగా ఉండేలా చూడాలనీ, ప్రధానమంత్రి కోరారు. ఈ రోజు భారత ప్రభుత్వం కోట్లాది మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తోందనీ, కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తోందనీ, విద్యుత్తు కనెక్షన్లు, ఉజ్వల సిలిండర్లు అందజేస్తోందనీ, మురికివాడలు ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటాయనే అపోహను పారద్రోలాలని, ఆయన కోరారు. “ఢిల్లీ తో పాటు, సమగ్ర దేశాభివృద్ధి లో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రతి పౌరుడి సహకారంతో, ఢిల్లీతో పాటు, భారత దేశాభివృద్ధి నూతన శిఖరాలకు చేరుకుంటుంది”, అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా; కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి; కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్; కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి తో పాటు పలువురు పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం :
అందరికీ ఇళ్లు అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డి.డి.ఎ) 376 జుగ్గీ జోప్రీ క్లస్టర్లలో ఇన్-సితు మురికివాడల పునరావాసం చేపడుతోంది. జుగ్గీ జోప్రి క్లస్టర్ల నివాసులకు సరైన సదుపాయాలు, సౌకర్యాలతో మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం, ఈ పునరావాస ప్రాజెక్టు లక్ష్యం.
డి.డి.ఏ. అటువంటి మూడు ప్రాజెక్టులను కల్కాజీ ఎక్స్టెన్షన్, జైలర్ వాలా బాగ్, కత్-పుత్లీ కాలనీలలో చేపట్టింది. కల్కాజీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కింద, కల్కాజీలో ఉన్న భూమి హీన్ క్యాంపు, నవజీవన్ క్యాంపు, జవహర్ క్యాంపు అనే మూడు స్లమ్ క్లస్టర్ ల ఇన్-సితు మురికివాడల పునరావాస కార్యక్రమాన్ని దశలవారీగా చేపడుతోంది. మొదటి దశ కింద, సమీపంలోని ఖాళీ వాణిజ్య కేంద్రం స్థలంలో 3,024 ఈ.డబ్ల్యూ. ఎస్. ఫ్లాట్లు నిర్మించడం జరిగింది. కొత్తగా నిర్మించిన ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లకు భూమి హీన్ క్యాంపు లోని అర్హులైన కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా, భూమి హీన్ క్యాంప్ లోని జుగ్గీ జోప్రి స్థలాన్ని, ఖాళీ చేయించడం జరుగుతుంది. భూమి హీన్ క్యాంపు స్థలాన్ని ఖాళీ చేయించిన అనంతరం, ఈ ఖాళీ స్థలం రెండవ దశలో నవ్ జీవన్ క్యాంపు మరియు జవహర్ క్యాంపు ల పునరావాసం కోసం ఉపయోగించడం జరుగుతుంది.
ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది, 3,024 ఫ్లాట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫ్లాట్లలో దాదాపు 345 కోట్ల రూపాయలతో విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్స్; సెరామిక్స్ టైల్స్ తో పాటు, వంట గదిలో ఉదయపూర్ గ్రీన్ మార్బుల్ కౌంటర్ మొదలైన వాటిని చేయడంతో సహా అన్ని పౌర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పార్కులు, విద్యుత్ సబ్-స్టేషన్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, డ్యూయల్ వాటర్ పైప్లైన్లు, లిఫ్టులు, పరిశుభ్రమైన నీటి సరఫరా కోసం భూగర్భ జలాశయాల వంటి పలు ప్రజా సౌకర్యాలను కూడా అందించడం జరిగింది. ఫ్లాట్ల కేటాయింపు నివాసితులకు యాజమాన్య హక్కు, భద్రతా భావాన్ని కలిగిస్తాయి.
*****
DS/TS
(Release ID: 1873318)
Visitor Counter : 236
Read this release in:
Kannada
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam