ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లోని అసర్వాలో రూ.2900 కోట్లకుపైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి


‘‘సమైక్యతా దినోత్సవం నాడు ఈ ప్రాజెక్టులు అంకితం చేయడం మరింత విశేషం;

‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వం వల్ల ప్రగతి ‘వేగం’తోపాటు ‘శక్తి’ పెరుగుతోంది’’;

‘‘దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల పరిస్థితిలో మెరుగుదల నేడు స్పష్టంగా కనిపిస్తోంది’’;

‘‘ఒకనాడు సంపన్నులకే పరిమితమైన పర్యావరణం నేడు పేదలకూ లభ్యం’’;

‘‘అసమతుల అభివృద్ధే దేశంలో పెనుసవాలు..
దీని పరిష్కారానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది’’

Posted On: 31 OCT 2022 8:06PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్ లోని అసర్వాలో రూ.2,900 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- గుజరాత్ అభివృద్ధి, అనుసంధానంలో ఇదొక విశిష్ట దినమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు బ్రాడ్ గేజ్ రైలు మార్గం అందుబాటులో లేదని ప్రధాని అన్నారు. దీనివల్ల ఇబ్బంది పడుతున్న లక్షలాది ప్రజలకు నేటినుంచి ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేసే అవకాశం ఇవాళ తనకు లభించిందంటూ ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. అసర్వా నుంచి  హిమ్మత్‌నగర్ మీదుగా ఉదయపూర్ వరకూగల మీటర్ గేజ్ మార్గం మొత్తాన్నీ బ్రాడ్ గేజ్‌గా మార్చామని ప్రధాని గుర్తుచేశారు. దీంతో గుజరాత్‌లోని ఈ ప్రాంతం ఇక పొరుగు రాష్ట్రం  రాజస్థాన్‌తోపాటు దేశం మొత్తంతో నేరుగా అనుసంధానం కాగలదని ఆయన తెలిపారు. లునిధార్-జెటల్‌సర్ మధ్య ఈ గేజ్ మార్పితో ఈ ప్రాంతంలో రైల్వే అనుసంధానాన్ని సులభం చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి బయల్దేరే రైళ్లు దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లగలవని వివరించారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘మీటర్ గేజ్ రైలుమార్గాన్ని బ్రాడ్ గేజికి మార్చినపుడు అది కొత్త అవకాశాలను కూడా తెస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసర్వా నుంచి ఉదయ్ పూర్ దాకా 300 కిలోమీటర్ల మార్గం గేజ్ మార్పిడితో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలు ఇకపై ఢిల్లీ సహా ఉత్తర భారతంతో సంధానం కాగలవని ఆయన తెలిపారు. అలాగే అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా కచ్, ఉదయపూర్ పర్యాటక ప్రదేశాలు నేరుగా రైలు మార్గంతో అనుసంధానం సాధ్యమైందని పేర్కొన్నారు. దీనివల్ల ఈ రెండు ప్రాంతాలతోపాటు చితోడ్ గఢ్, నాథ్ ద్వారా పర్యాటక ప్రదేశాలకూ సందర్శకుల రాక పెరుగుతుందన్నారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి పెద్ద పారిశ్రామిక నగరాలతో అనుసంధానంతో ఈ ప్రాంతంలోని వ్యాపారులు కూడా లబ్ధి పొందుతారని ప్రధాని తెలిపారు. ‘‘ముఖ్యంగా హిమ్మత్ నగర్ టైల్స్ పరిశ్రమకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అన్నారు. అలాగే లునిధర్-జెటల్సర్ మధ్య బ్రాడ్ గేజికి మార్పిడి వల్ల ధసా-జెటల్‌సర్ సెక్షన్ పూర్తిగా బ్రాడ్ గేజ్‌ మార్గంగా మారిందని పేర్కొన్నారు. ఈ మార్గం బోటాడ్, అమ్రేలి, రాజ్‌కోట్ జిల్లాల గుండా వెళుతుందని, ఇప్పటిదాకా ఈ ప్రాంతాలకు రైలు అనుసంధానం పరిమితంగానే ఉందని తెలిపారు. మరోవైపు ఈ మార్గంలో పనులు పూర్తయినందున భావ‌న‌గ‌ర్, అమ్రేలి ప్రాంత ప్ర‌జ‌లు సోమ‌నాథ్, పోర్‌బందర్‌లతో నేరుగా అనుసంధానం కాగలరని ప్రధానమంత్రి వెల్లడించారు.

   మార్గం వల్ల భావ్‌నగర్-వెరావల్ మధ్య దూరం 470 కిలోమీటర్ల నుంచి దాదాపు 290 కిలోమీటర్ల కన్నా తక్కువ అవుతుందని ఆయన తెలిపారు. తద్వారా ప్రయాణ సమయం 12 గంటల నుంచి కేవలం 6.5 గంటలకు తగ్గుతుందని ప్రధాని పేర్కొన్నారు. అంతేగాక భావ్‌నగర్-పోర్‌బందర్ మధ్య దాదాపు 200 కిలోమీటర్ల మేర, భావ్‌నగర్-రాజ్‌కోట్ మధ్య దాదాపు 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గిపోయిందన్నారు. బ్రాడ్ గేజ్ మార్గంలో నడిచే రైళ్లు గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని అన్నారు. అలాగే పర్యాటకాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడమేగాక తెగిపోయిన ప్రాంతాలను కలుపుతాయని ఆయన చెప్పారు. ‘‘సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం మరింత విశేషం’’ అని ఈ సందర్భంగా ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వం కృషి ప్రభావం రెట్టింపుతో పరిమితం కాదు... అది అనేక రెట్లుగా ఉంటుంది. ఆ మేరకు 1+1 అంటే 2 కాదు... 11’’ అని అర్థం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వంతో  గుజరాత్‌లో పని వేగం పెరగడమేగాక దాన్ని మరింత విస్తరించగల శక్తి సమకూరింది’’ అన్నారు. రాష్ట్రంలో 2009-2014 మధ్య రెండు వరుసల రైలు మార్గాల అభివృద్ధి 125 కిలోమీటర్లకన్నా తక్కువకు పరిమితమైందని ప్రధాని  గుర్తుచేశారు. అయితే, 2014-2022 మధ్య 550 కిలోమీటర్లకు పైగా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. అలాగే 2009-2014 మధ్య గుజరాత్‌లో రైలు మార్గం విద్యుదీకరణ కేవలం 60 కిలోమీటర్లకు పరిమితం కాగా,  2014-2022 మధ్య 1700 కిలోమీటర్లకుపైగా పూర్తయినట్లు వివరించారు.

   రైలు మార్గాల పరిమాణం, పనుల వేగం పెంపుతోపాటు నాణ్యత, సౌలభ్యం, భద్రత, పరిశుభ్రత కూడా మెరుగవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పరిస్థితి మెరుగుపడటాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితమైన సౌకర్యాలు, పర్యావరణం ఇప్పుడు పేద-మధ్య తరగతి వర్గాలకూ అందుబాటులోకి వచ్చింది’’ అని ప్రధాని తెలిపారు. ‘‘గాంధీనగర్‌ స్టేషన్ తరహాలోనే అహ్మదాబాద్‌, సూరత్‌, ఉద్నా, సబర్మతి, సోమనాథ్‌, న్యూ భుజ్‌ రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేయబడుతున్నాయి’’ అని పేర్కొన్నారు. రెండు ఇంజన్ల ప్రభుత్వం వల్లనే ఈ విజయాలన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. గాంధీనగర్- ముంబై మార్గంలో  ప్రారంభించిన కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ సందర్భంగా ప్రధాని ఉదాహరించారు. పశ్చిమ రైల్వే అభివృద్ధికి కొత్త కోణం జోడించడానికి 12 గతిశక్తి సరకు రవాణా కూడళ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని ప్రధానమంత్రి తెలిపారు. ‘‘తొలి గతిశక్తి బహుళ-రవాణా సరకుల కూడలి వడోదర సర్కిల్‌లో ప్రారంభించబడింది. త్వరలోనే మిగిలినవి కూడా సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

   ‘‘స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాలు గడిచినా పేద-ధనిక వ్యత్యాసం, నగర-గ్రామీణ ప్రాంతాల మధ్య అగాధంతోపాటు అసమతుల అభివృద్ధి దేశానికి పెనుసవాలుగా మారాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు మధ్య తరగతి ప్రజలకు మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన ప్రాధాన్యాన్ని  ‘అందరికీ అభివృద్ధి‘ విధానం స్పష్టం చేస్తోంది’’ అని ప్రధాని చెప్పారు. మరోవైపు పేదరికంపై పోరులో పేదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. తదనుగుణంగా ‘‘పేదలకు పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, ఉచిత చికిత్స, బీమా రక్షణ వగైరాల రూపంలో కల్పించబడుతున్న సదుపాయాలు సుపరిపాలనకు తార్కాణాలు’’ అని ప్రధాని చెప్పారు. దేశంలో అనుసంధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి సంబంధిత విధానంలో పెను మార్పు గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఒకప్పటి ప్రణాళికరహిత నిర్మాణాలకు బదులు  రైలు, మెట్రో, బస్సు వగైరా సౌకర్యాల అనుసంధానానికి నేడు ఒక సమన్వయ విధానం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రయాణ మార్గాలు, ఉపకరణాల సమ్మేళనం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. గుజరాత్ పారిశ్రామిక స్వభావాన్ని నొక్కిచెబుతూ- రాష్ట్రంలోని ఓడరేవులకు సాధికారత లభిస్తే అది మొత్తం దేశ ఆర్థికవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపగలదని ప్రధాని అన్నారు. ‘‘గత 8 ఏళ్లలో గుజరాత్‌ ఓడరేవుల సామర్థ్యం దాదాపు రెట్టింపైంది’’ అని ఆయన చెప్పారు. అభివృద్ధి ప్రక్రియ నిరంతరతను గుర్తుచేస్తూ- ‘‘ప్రగతిశీల భారతదేశం కోసం అభివృద్ధి చెందిన గుజరాత్‌ నిర్మాణమే మా నినాదం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.

   చివరగా- సర్దార్ పటేల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి ఆయనను కొనియాడారు.  భారతదేశ తొలి హోం మంత్రి సాధించిన విజయాలపై ప్రతి భారతీయుడూ గర్విస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, కొన్ని గుజరాతీ పత్రికలకు రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలలో సర్దార్ పటేల్ పేరు, చిత్రం లేకపోవడాన్ని ప్రధాని ఈ సందర్భంగా తప్పుబట్టారు. ‘‘సర్దార్ పటేల్‌కు.. అందునా ఆయన పుట్టిన గడ్డమీద ఇటువంటి అవమానాన్ని గుజరాత్‌లో ఎన్నటికీ సహించలేం’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘‘సర్దార్ పటేల్ తరహాలోనే మన రైల్వేలు భారతదేశాన్ని ఏకీకృతం చేస్తాయి. అంతేగాక ఈ ప్రక్రియ సరైన దిశలో.. వేగంగా ముందుకు సాగుతుంది’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ సహా ఎంపీలు, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్‌లోని అసర్వాలో రూ.2900 కోట్లకుపైగా విలువైన రెండు రైల్వే ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేశారు. వీటిలో అహ్మదాబాద్ (అసర్వా)-హిమ్మత్‌నగర్-ఉదయ్‌పూర్ గేజ్ మార్పిడి మార్గంతోపాటు లునిధర్-జెటల్‌సర్ గేజ్ మార్పిడి మార్గం ఉన్నాయి. మరోవైపు భావ్‌నగర్-జెటల్సర్; అసర్వా-ఉదయ్‌పూర్ మార్గంలో కొత్త రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకే గేజ్ రైలు మార్గాల వ్యవస్థ లక్ష్యంగా ఇతర గేజ్ మార్గాలను రైల్వేశాఖ బ్రాడ్ గేజికి మార్పు చేస్తోంది. ఇందులో భాగంగా గేజ్ మార్పిడి ప్రాజెక్టులు పూర్తికాగానే ప్రధానమంత్రి వాటిని జాతికి అంకితం చేస్తున్నారు. వీటిలో 300 కిలోమీటర్ల పొడవైన అహ్మదాబాద్ (అసర్వా)-హిమ్మత్‌నగర్-ఉదయ్‌పూర్ గేజ్ మార్పిడి మార్గం కూడా ఒకటి కాగా, ఇది అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే ఈ ప్రాంతంలోని పర్యాటకులు, వ్యాపారులు, తయారీ కేంద్రాలు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలను పెంచటమేగాక ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

   ఇక 58 కిలోమీటర్ల పొడవైన లూనిధార్-జెటల్‌సర్ గేజ్ మార్పడి మార్గంతో వెరావల్- పోర్‌బందర్ నుంచి పిపావావ్ రేవు, భావ్‌నగర్‌లకు దూరం తగ్గుతుంది. అలాగే ఈ సెక్షన్లో సరకు రవాణా సామర్థ్యం పెరిగినందువల్ల కనాలస్-రాజ్‌కోట్- విరాంగం మార్గంలో రద్దీ తగ్గుతుంది. మరోవైపు గిర్ అభయారణ్యం, సోమనాథ ఆలయం, డయ్యూ, గిర్నార్ హిల్స్ ప్రాంతాలకు అనుసంధానాన్ని సాఫీగా మారుస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి నూతనోత్తేజం లభిస్తుంది.


(Release ID: 1872580) Visitor Counter : 195