ప్రధాన మంత్రి కార్యాలయం

కేవడియాలో జాతీయ సమైక్యతా దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి


‘‘కర్తవ్యం.. బాధ్యతల మార్గం నన్నిక్కడికి నడిపించింది.. కానీ-
మనసులో మెదలుతున్నది మాత్రం మోర్బీ దుర్ఘటన బాధితులే’’;

‘‘సర్దార్ పటేల్ దృఢ దీక్షనుంచి యావద్దేశం స్ఫూర్తి పొందుతోంది’’;

‘‘సర్దార్ పటేల్ జయంతి.. సమైక్యతా దినోత్సవం కేలండర్ తేదీలు కావు..
అవి భారతదేశ సాంస్కృతిక శక్తికి సంబంధించిన గొప్ప వేడుకలు’’;

‘‘బానిస మనస్తత్వం.. స్వార్థం.. బుజ్జగింపు.. బంధుప్రీతి..
దురాశ.. అవినీతి దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనం చేస్తాయి’’;

‘‘విచ్ఛిన్నత విషాన్ని మనం సమైక్యత అమృతంతో ఎదుర్కొనాలి’’;

‘‘ప్రభుత్వ పథకాలు వివక్ష లేకుండా చివరి వ్యక్తిదాకా
అందుతూ దేశంలో నలుమూలలకూ చేరుతున్నాయి’;

‘‘మౌలిక సదుపాయాల అంతరం ఎంత తగ్గితే
సమైక్యత అంతగా బలోపేతం అవుతుంది’’;

‘‘దేశ సమైక్యత కోసం తమ హక్కులు వదులుకున్న రాచకుటుంబాల
త్యాగాలకు అంకితమిస్తూ ఏక్తానగర్‌లో మ్యూజియం నిర్మించబడుతుంది’’

Posted On: 31 OCT 2022 10:54AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా సర్దార్ పటేల్ ఐక్యతా ప్రతిమవద్ద ఆయనకు నివాళి అర్పించి, సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- నిన్న మోర్బీ దుర్ఘటన బాధితుల పట్ల ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కేవడియాలో ఉన్నప్పటికీ, తన హృదయంలో మోర్బీ ఉదంతం వేదన మిగిల్చిందని ఆయన అన్నారు. ‘‘ఒకవైపు నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది.. మరోవైపు కర్తవ్యం, బాధ్యతలతో కూడిన మార్గం నన్ను ఇక్కడికి నడిపించింది. అందుకే జాతీయ సమైక్యతా దినోత్సవానికి నేను హాజరు కావాల్సి వచ్చింది’’ అని ఆయన  చెప్పారు.

   నిన్నటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, అన్నివిధాలా వారిని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నం కాగా, కేంద్ర ప్రభుత్వం అవసరమైన చేయూతనిస్తున్నదని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స చేస్తున్న ఆసుపత్రులకూ సహాయం అందిస్తున్నామని, సైన్యంతోపాటు వాయుసేన బృందాలు ఇతరత్రా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని వివరించారు. మరోవైపు సహాయ చర్యలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం గుజరాత్ ముఖ్యమంత్రి కూడా మోర్బీకి చేరుకున్నారని చెప్పారు. అంతేకాకుండా ఈ దుర్ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. రక్షణ-సహాయ కార్యకలాపాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండబోవని దేశ ప్రజలకు ప్రధాని హామీ ఇచ్చారు. కాగా, ఈ విషాద ఉదంతం నేపథ్యంలో ప్రస్తుత సమైక్యతా దినోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలు రద్దయ్యాయి.

   ఏడాది సమైక్యతా దినోత్సవం ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ‘‘ఇది మన స్వాతంత్ర్యానికి 75 వసంతాలు పూర్తయిన సంవత్సరం మాత్రమేగాక మనం సరికొత్త సంకల్పాలతో వాటిని నెరవేర్చే దిశగా పయనిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు. కుటుంబమైనా, సమాజమైనా, దేశమైనా ప్రతి దశలోనూ సమైక్యత ఎంతో అవసరమని ప్రధాని అన్నారు. ఈ భావన దేశవ్యాప్తంగా 75,000 చోట్ల సమైక్యతా పరుగు రూపంలో అంతటా ప్రతిఫలిస్తుందని ఆయన అన్నారు. ‘‘సర్దార్ పటేల్ యొక్క దృఢ దీక్షనుంచి యావద్దేశం స్ఫూర్తి పొందుతోంది. దేశ సమైక్యత కోసం, ‘పంచప్రాణ్’ సూత్రాన్ని ఆచరణలో చూపడానికి ప్రతి పౌరుడు ప్రతినబూనారు’’ అని ఆయన అన్నారు.

   ప్రధాన మంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘మన స్వాతంత్ర్య పోరాటానికి సర్దార్ పటేల్ వంటి మహనీయులు నాయకత్వం వహించి ఉండకపోతే పరిస్థితిని ఊహించడం కూడా కష్టమే. దేశవ్యాప్తంగా 550కి పైగా రాజ సంస్థానాలను ఆయన విలీనం చేయకపోయి ఉంటే- ఏం జరిగేది?’’ అన్నారు. అలాగే భరతమాత పట్ల మన రాజ సంస్థానాలు లోతైన త్యాగభావన, విశ్వాసం ప్రదర్శించి ఉండకపోతే ఏం జరిగి ఉండేది’’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘‘ఈ దుస్సాధ్యమైన పనిని సర్దార్ పటేల్ పూర్తిచేశారు’’ అన్నారు. ‘‘సర్దార్ పటేల్ జయంతి, సమైక్యతా దినోత్సవం మనకు కేవలం క్యాలెండర్‌లోని తేదీలు కాదు. అవి భారతదేశ సాంస్కృతిక శక్తికి గొప్ప ప్రతీకలుగా నిలిచే వేడుకలు. భారత ఐక్యత ఎన్నడూ బలవంతంగా రుద్దబడినది కాదు.. ఇది సదా మన దేశ సహజ స్వభావం. ఐక్యతే మా ప్రత్యేకత” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   మోర్బీలో నిన్న సంభవించిన విపత్తు వంటిది వాటిల్లితే బాధితులకు చేయూత కోసం దేశమంతా ఒక్కటై నిలుస్తుందని ప్రధాని అన్నారు. ఆ మేరకు దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ప్రజలు సహాయం అందించడమే కాకుండా బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నారని ఆయన అన్నారు. మహమ్మారి సమయంలో ‘చప్పట్లు-తప్పెట్ల’ నుంచి ఔషధం, రేషన్, టీకాలదాకా భావోద్వేగ ఐక్యతలో ఈ సమైక్యత పూర్తిగా నిరూపితమైందని ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా క్రీడా విజయాలు, పండుగలతోపాటు మన సరిహద్దులకు ముప్పు వాటిల్లితే మన సైనికులు పోరాడేటప్పుడు కూడా అదే భావోద్వేగాలు కనిపిస్తాయని, ఇదంతా భారతదేశ ఐక్యతకు ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు. మనలోని ఈ ఐక్యత శతాబ్దాలుగా ఆక్రమణదారులకు ముల్లులా మారింది. అందుకే విభజన విత్తనం నాటి దాన్ని పలుచన చేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ మన చైతన్య స్రవంతిలో నిరంతర భాగమైన సమైక్యతా మకరందం వారి కుయుక్తులను చిత్తుచేసిందని చెప్పారు. భారత ప్రగతి, పురోగమనంపై నేటికీ కొన్ని శక్తులు అసూయపడుతున్నాయని, దీన్ని వమ్ము చేయడానికి అవి కాచుకు కూర్చచ్చన్నాయని హెచ్చరించారు. అదేవిధంగా కులం, ప్రాంతం, భాష, చరిత్ర ప్రాతిపదికగా విచ్ఛిన్నకర ధోరణిని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, నిర్వీర్యం చేసే బానిస మనస్తత్వం, స్వార్థం, బుజ్జగింపులు, బంధుప్రీతి, దురాశ, అవినీతి విషయంలోనూ జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ‘‘విచ్ఛిన్నత విషాన్ని మనం సమైక్యత అమృతంతో ఎదుర్కోవాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

   సందర్భంగా- ‘‘సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో సర్దార్ సాహెబ్ మనకు అప్పగించిన బాధ్యతను పునరుద్ఘాటించాలని నేను భావిస్తున్నాను’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా దేశ సమైక్యతను బలోపేతం చేయడం పౌరుల బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు బాధ్యతాయుత చైతన్యంతో ప్రతి పౌరుడూ తన కర్తవ్యం నెరవేర్చడానికి సిద్ధమైనపుడే దేశం శక్తిమంతం కావడం సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ కర్తవ్య స్ఫూర్తి ప్రాతిపదికగా ‘అందరి ప్రగతి కోసం, అందరి తోడ్పాటు, అందరి విశ్వాసం, అందరి కృషితో అది సాకారమై భారతదేశం ప్రగతి పథంలో పరుగు తీయగలదు’’ అని ప్రధానమంత్రి ఉద్బోధించారు. ప్రభుత్వ విధానాలు ఎలాంటి వివక్షకూ తావులేకుండా ప్రతి వ్యక్తికీ దేశం నలుమూలలకూ చేరుతున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు గుజరాత్ లోని సూరత్ ప్రజలతో సమానంగా అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ లోని ప్రజలకూ కరోనా ఉచిత టీకాలు అందటాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ‘ఎయిమ్స్’ వంటి వైద్య సంస్థలు నేడు గోరఖ్‌పూర్‌లోనే కాకుండా బిలాస్‌పూర్, దర్భంగా, గౌహతి, రాజ్‌కోట్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. తమిళనాడులోనే గాక ఉత్తరప్రదేశ్‌లో కూడా రక్షణ  కారిడార్ల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో, విభిన్న భాషలు మాట్లాడే ప్రజలున్నారని ప్రధాని గుర్తుచేశారు. అయితే, వరుసలో నిలుచున్న ఆఖరి వ్యక్తికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమాన స్థాయిలో ఇంటింటికీ చేరుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

   నీస అవసరాలు తీరడం కోసం కూడా దేశంలోని లక్షలాది ప్రజలు దశాబ్దాలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘మౌలిక సదుపాయాల అంతరం ఎంత తగ్గితే సమైక్యత అంతగా బలోపేతం అవుతుంది’’ అని ఆయన అన్నారు. ప్రతి పథకం ప్రయోజనం ప్రతి లబ్ధిదారుకూ చేరాలన్న లక్ష్యంతో సంతృప్త సూత్రం ప్రాతిపదికగా భారత్ కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ‘అందరికీ ఇళ్లు, అందరికీ డిజిటల్‌ సంధానం, అందరికీ పరిశుభ్ర వంట ఇంధనం, అందరికీ విద్యుత్‌’ వంటి పథకాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.  అయితే, ఈ విధంగా 100 శాతం పౌరులను చేరుకోవాలనే లక్ష్యం సారూప్య సౌకర్యాలకే పరిమితం కాదన్నారు. సమైక్య లక్ష్యాలతోపాటు సమైక్య అభివృద్ధి, సమైక్య కృషి అనే ఉమ్మడి లక్ష్యాన్ని ఈ సూత్రం నొక్కి చెబుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంపైన, రాజ్యాంగం మీద సామాన్యులకు విశ్వాస కల్పనలో ప్రాథమిక జీవితావసరాలు ఒక మాధ్యమంగా మారాయన్నారు. సామాన్యులలో ప్రభుత్వంపై విశ్వాసం ఇనుమడించడానికి అవి ఒక మాధ్యమమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స‌ర్దార్ ప‌టేల్ కలలుగన్న భార‌త‌దేశం గురించి చెబుతూ ‘‘ప్ర‌తి భార‌తీయుడికీ స‌మాన అవ‌కాశం రావాలి... వారిలో స‌మాన‌త్వ భావన కలగాలనే ఆయన దార్శనికత రూపుదాల్చడాన్ని దేశం నేడు ప్రత్యక్షంగా చూస్తోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   దేశంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గానికీ గత 8 ఏళ్లలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రధాని గుర్తుచేశారు. గిరిజనుల ప్రతిష్టకు గుర్తుగా ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహణ సంప్రదాయాన్ని దేశం ప్రారంభించిందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు నిర్మిస్తున్నట్లు ప్ర‌ధాని తెలిపారు. మాన్గఢ్ ధామ్, జంబుఘోడా చరిత్రను దేశప్రజలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. విదేశీ ఆక్రమణదారులు సాగించిన అనేక మారణకాండలను ఎదుర్కొని వారు స్వేచ్ఛను సాధించారని గుర్తుచేశారు. ‘‘ఈ వాస్తవాలను తెలుసుకున్నపుడే మనం స్వేచ్ఛ విలువ, సంఘీభావం విలువను అర్థం చేసుకోగలం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏక్తా నగర్ భారతదేశంలోనేగాక ప్రపంచంలోనే అపూర్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలలో ఐక్యత వల్లనే ప్రజా భాగస్వామ్య శక్తితో నగరం అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఘనత మాత్రమే కాదని, దీనికొక పవిత్ర దృక్పథం కూడా తోడైందని తెలిపారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఆవిష్కరణకు స్ఫూర్తి ఎలాంటిదో ఐక్యతా ప్రతిమ రూపంలో మన కళ్లముందే కనిపిస్తోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.

   ఏక్తా న‌గ‌ర్ అభివృద్ధి నమూనాపై ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ- ప‌ర్యావ‌ర‌ణ హిత, అనుకూల నమూనా, దేశాన్ని ప్ర‌కాశింపజేసే ఎల్‌ఈడీల‌తో క‌రెంటు పొదుపు నమూనా, సౌరశక్తితో ప‌నిచేస్తున్న పరిశుభ్ర రవాణా వ్యవస్థ, వివిధ రకాల పశుపక్ష్యాదుల గురించి ప్ర‌జ‌లు మాట్లాకునేటపుడు ఈ నగరం వాటన్నిటికీ ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఇక్కడ నిన్న మియావాకీ ఫారెస్ట్, మేజ్ గార్డెన్‌ ప్రారంభించే అవకాశం తనకు లభించడాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఏక్తా మాల్, ఏక్తా నర్సరీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపే అటవీ ప్రపంచం, ఏక్తా ఫెర్రీ, ఏక్తా రైల్వే స్టేషన్ తదితర కార్యక్రమాలన్నీ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ప్రేరణనిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. చివరగా- స్వాతంత్య్రం తర్వాత దేశాన్నీ ఏకీకృతం చేయడంలో సర్దార్ సాహెబ్ పోషించిన పాత్రను ప్రధాని నొక్కిచెప్పారు. శతాబ్దాలపాటు రాజ్యాలేలిన కుటుంబాలు సర్దార్ పటేల్ కృషితో దేశ సమైక్యత కోసం.. కొత్త వ్యవస్థ కోసం తమ హక్కులను కర్తవ్య నిబద్ధతతో త్యాగం చేశాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. వారందించిన సహకారం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ‘‘ఈ నేపథ్యంలో నాటి రాజకుటుంబాల త్యాగానికి అంకితం చేస్తూ నేడు ఏక్తా నగర్‌లో ప్రదర్శనశాల నిర్మించబడుతుంది. దేశ ఐక్యత కోసం త్యాగం చేసే సంప్రదాయాన్ని ఇది కొత్త తరాలకు అందిస్తుంది’’ అని ప్రధానమంత్రి ముగించారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి దార్శనికత మేరకు ఏటా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించాలని 2014లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దేశ సమైక్యత, సమగ్రత, భద్రతల పరిరక్షణ, బలోపేతంపై పునరంకితం కావడం లక్ష్యంగా ఏటా అక్టోబర్ 31ని జాతీయ సమైక్యతా దినోత్సవం రూపంలో నిర్వహించాలని నిశ్చయించారు. తదనుగుణంగా కేవడియాలోని ఐక్యతా ప్రతిమ వద్ద ఇవాళ నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ బలగాలతోపాటు 5 రాష్ట్రాల పోలీసు సిబ్బంది సమైక్యతా దినోత్సవ కవాతు చేశారు. ఈ మేరకు దేశంలోని ఉత్తర, (హర్యానా), పశ్చిమ (మధ్యప్రదేశ్), దక్షిణ (తెలంగాణ), తూర్పు (ఒడిశా), ఈశాన్య మండలాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం ఇందులో పాలుపంచుకున్నాయి. అలాగే కామన్వెల్త్ గేమ్స్- 2022లో పతక విజేతలైన ఆరుగురు పోలీస్ క్రీడాకారులు కూడా కవాతులో పాల్గొన్నారు.

Rashtriya Ekta Diwas is a tribute to the invaluable role of Sardar Patel in unifying our nation. https://t.co/mk4k21xpme

— Narendra Modi (@narendramodi) October 31, 2022

.

 

*****

DS/TS



(Release ID: 1872268) Visitor Counter : 244