“నేడు అయోధ్య భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవంలో సువర్ణాధ్యాయానికి ప్రతీక”
“ఈ దీపాలు చిందిస్తున్న వెలుగులు, వాటి విన్యాసాలు భారతదేశ మౌలిక మంత్రం సత్యమేవ జయతేకి ప్రతిబింబం”
“దీపావళి జ్యోతులు భారతదేశ ఆదర్శాలు, విలువలు, తత్వానికి సజీవ నిదర్శనం”
“అంధకారాన్ని తొలగించేందుకు వెలిగిస్తున్న దీపాలు అంకిత భావాన్ని సృష్టిస్తాయి”
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో అద్భుతమైన దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు. సరయూ నది తీరంలో ఏర్పాటు చేసిన రామ్ కీ పైడి 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను, అద్భుతమైన మ్యూజికల్ లేజర్ షోను కూడా ప్రధానమంత్రి వీక్షించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాముని కొనియాడారు. నేడు ఈ దీప జ్యోతులతో అయోధ్య దివ్యత్వం సంతరించుకోవడమే కాకుండా చక్కని భావోద్వేగాలతో నిండిపోయిందన్నారు. “నేడు అయోధ్య భారత సాంస్కృతిక పునరుజ్జీవంలో సువర్ణాధ్యాయాన్ని ప్రతిబింబిస్తోంది” అన్నారు. గతంలో రాజ్యాభిషేకానికి తాను వచ్చినప్పుడు తనలో భావోద్వేగాలు చెలరేగాయని ప్రధానమంత్రి చెప్పారు. 14 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో గడిపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు నగరం ఎంతగా అలంకరించి ఉంటుందో ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. “నేడు ఈ అమృతకాలంలో శ్రీరాముని ఆశీస్సులతో అయోధ్య దివ్యత్వం, అమరత్వం మనం వీక్షించగలుగుతున్నాం” అన్నారు.
పండుగలు, వేడుకలు ప్రజల సహజసిద్ధమైన జీవనంలో భాగం అయిన సంస్కృతి, సాంప్రదాయ వారసులం మనం అని ఆయన చెప్పారు. “వాస్తవానికి విజయం, అబద్ధానికి అపజయం తప్పదన్న మానవాళి సందేశాన్ని సజీవంగా నిలపడంలో భారతదేశానికి ఎవరూ సాటి రారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “భారతదేశ ఆదర్శాలు, విలువలు, తత్వానికి సజీవ శక్తి ఈ దీపావళి జ్యోతులు” అని చెబుతూ భారతదేశం అనుసరించే మూలమంత్రం “సత్యమేవ జయతే”కు సజీవ ప్రకటన ఈ దీపకాంతులు, అవి ప్రసరింపచేసే వెలుగులు అన్నారు.
“సత్యమేవ జయతే ననృతం సత్యేన పంథా విటతో దేవయనః” అన్న ఉపనిషత్ వాక్కులను ఉటంకిస్తూ ఎప్పుడైనా సత్యానిదే విజయం, అసత్యానిది కాదు అని దాని అర్ధం అన్నారు. అలాగే “రామో రాజమణి సదా విజయతే” అన్న ఋషి వాక్కును కూడా ఉటంకించారు. ఎల్లప్పుడూ రాముని సత్ప్రవర్తనకే విజయం తప్పితే రావణుని దుష్ర్పవర్తనది కాదు అని దాని అర్ధం. భౌతికంగా మనం వెలిగించే ఈ దీపాలు అందించే శక్తి గురించి ప్రస్తావిస్తూ “దీపో జ్యోతి పరబ్రహ్మ దీపో జ్యోతి జనార్దన” అనే ఋషి వాక్కులను కూడా ఉటంకించారు. ఈ అధ్యాత్మిక దీపాలే భారతదేశ పురోగతికి, అభ్యున్నతికి మార్గం చూపిస్తాయన్న తన విశ్వాసాన్ని ఆయన పునరుద్ఘాటంచారు.
“జగత్ ప్రకాశ్ ప్రకాశక్ రాం” అన్న గోస్వామి తులసీదాస్ వాక్కులను కూడా ప్రధానమంత్రి ప్రతీ ఒక్కరికీ గుర్తు చేస్తూ శ్రీరాముడే ఈ ప్రపంచానికి దీపం, యావత్ ప్రపంచానికి దీపజ్యోతి అని దాని అర్ధమని చెప్పారు. “జాలి, దయాగుణం; మానవత్వం, ఆత్మ గౌరవం; సమానత్వం, దయాశీలత” అనే ఈ దీపాలే సబ్ కా సాత్ సందేశానికి కరదీపికలు అన్నారు.
చాలా సంవత్సరాల క్రితం తాను దీపాలపై గుజరాతీలో రాసిన “దియా” కవితలోని కొన్ని వాక్యాలను ప్రధానమంత్రి చదివి వినిపించారు. దీపం ఆశ-వేడి; జ్వాల-విశ్రాంతి ఇస్తుంది అని ఆ కవిత అర్ధమని ఆయన వివరించారు. ప్రతీ ఒక్కరూ సూర్యుని ఆరాధించినప్పటికీ రాత్రివేళ చీకట్లలో మనకి తోడుగా ఉండేది దీపమే అన్నారు. దీపం తన కాంతులతో అంధకారాన్ని నిర్మూలించడమే కాకుండా ప్రజల మనసుల్లోకి అంకిత భావం తెస్తుందని ఆయన చెప్పారు.
మనం స్వార్థానికి అతీతంగా ఎదిగినప్పుడు సర్వసమ్మిళిత భావం అందులో సహజంగానే ఇమిడి ఉంటుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు“మన ఆలోచనలు సాకారం అయినప్పుడు ఈ విజయం నా కోసం కాదు, మానవాళి సంక్షేమం కోసం అనుకుంటాం. దీపం నుంచి దీపావళి అన్నదే భారతదేశం సిద్ధాంతం, ఆలోచనా ధోరణి, ఆధ్యాత్మిక సంస్కృతి” అన్నారు. భారతదేశం మధ్య యుగం, ఆధునిక యుగాల్లోని అంధకార పరిస్థితుల దుష్ప్రభావానికి లోనైనప్పటికీ దేశవాసులు ఎన్నడూ దీపాలు వెలిగించడం మానలేదు, విశ్వాసాన్ని వీడలేదు అన్నారు. అదే స్ఫూర్తితో కరోనా కష్టకాలంలో కూడా భారతీయుల్లో ప్రతీ ఒక్కరూ ఒక దీపం పట్టుకుని నిలబడ్డారని, మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం సాగించిన పోరాటాన్ని ప్రపంచం వీక్షించిందని ఆయన గుర్తు చేశారు. “భారతదేశం గతంలో అంధకారం ఏర్పడిన ప్రతీ సందర్భంలోనూ ఆ చీకట్ల నుంచి బయటపడింది, పురోగమించడంలో తన శక్తి అనే దీపాన్ని ప్రసరింపచేసింది” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
పూర్వాపరాలు
ఇది ఆరవ దీపోత్సవం. ప్రధానమంత్రి ఈ వేడుకలో ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ కార్యక్రమంలో భాగంగా 15 లక్షల దీపాలు వెలిగించడంతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన విభిన్న నృత్యరీతులతో ఐదు యానిమేటెడ్ రథాలు, 11 రామ్ లీలా రథాలు కూడా ప్రదర్శించారు.