ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లో పి.ఎం.ఏ.వై-జి. కి చెందిన 4.5 లక్షల మంది లబ్ధిదారుల ‘గృహప్రవేశం’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం : తెలుగు అనువాదం
Posted On:
22 OCT 2022 7:36PM by PIB Hyderabad
నమస్కారములు !
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు, పంచాయతీ సభ్యులు, ఇతర ప్రముఖులు, మధ్యప్రదేశ్ లోని నా సోదర సోదరీమణులారా !
ముందుగా, మీ అందరికీ ధంతేరాస్ మరియు దీపావళి శుభాకాంక్షలు! ధంతేరాస్ మరియు దీపావళి సమయంలో, మనం నూతన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు, ఇంటికి కొత్త రంగులు వేయడం, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు జత చేయడంతో పాటు, కొత్త తీర్మానాల వంటివి కూడా చేస్తాము. కొత్త ప్రారంభంతో, మన జీవితాలను తాజాదనంతో నింపుకుంటూ, ఆనందం, శ్రేయస్సు కోసం కొత్త తలుపులు తెరుద్దాం. ఈ రోజు మధ్యప్రదేశ్ లోని 4.5 లక్షల మంది పేద సోదర సోదరీమణులు కొత్త ప్రారంభాన్ని చవిచూస్తున్నారు. ఈరోజు ఈ స్నేహితులందరికీ వారి కొత్త పక్కా గృహాల కోసం 'గృహ ప్రవేశం' వేడుక ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో, వనరులు, డబ్బు ఉన్నవారు మాత్రమే ధంతేరాస్ రోజు కార్లు, ఇళ్ళు వంటి పెద్ద, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయగలిగేవారు. కానీ, ఇప్పుడు, దేశం లోని పేద ప్రజలు కూడా ధంతేరాస్ రోజు 'గృహప్రవేశం' చేయగలుగుతున్నారు. ఈ రోజు తమ ఇళ్లకు యజమానులుగా మారిన మధ్యప్రదేశ్ లోని లక్షలాది మంది సోదరీమణులకు నా హృదయపూర్వక అభినందనలు! లక్షల రూపాయల విలువ చేసే ఇళ్లకు యజమానులుగా, ఇప్పుడు మీరు 'లక్షాధికారులు' అయ్యారు.
సోదర సోదరీమణులారా !
అనంతమైన ఆకాంక్షలతో నా ముందు నిలిచిన అసంఖ్యాకమైన పేద ప్రజలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నేను చూడగలుగుతున్నాను. ఇంతకుముందు ఈ ఆకాంక్షలు, కలలు తెరపైకి రాలేదు. ఎందుకంటే స్వంత ఇల్లు లేనందువల్ల ఈ భావాలు అణచివేతకు గురౌతాయి, మరుగున పడతాయి, ఆ తర్వాత ఆవిరైపోతాయి. ఇప్పుడు ఈ స్నేహితులు ఈ కొత్త గృహాలను పొందారు, వారి కలలను సాకారం చేసుకునేందుకు వారికి కొత్త బలం కూడా వచ్చిందని, నేను నమ్ముతున్నాను. అందువల్ల, ఈ రోజు జరిగింది కేవలం 'గృహ ప్రవేశం' మాత్రమే కాదు, కొత్త సంతోషం, కొత్త తీర్మానాలు, కొత్త కలలు, కొత్త శక్తి, కొత్త అదృష్టం తో కూడిన పండుగ. అదృష్టవశాత్తూ ఈ ప్రభుత్వం, గత 8 ఏళ్లలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.5 కోట్ల పేద కుటుంబాల జీవితకాల గొప్ప స్వప్నాన్ని తీర్చగలిగింది. అలాగని, కేవలం మా వాగ్దానాన్ని నెరవేర్చడానికి నాలుగు గోడలు కట్టి వారికి అప్పగించడం కాదు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అంకితమైన ప్రభుత్వం. కాబట్టి, అది పేదల ఆకాంక్షలు, అవసరాలను బాగా అర్థం చేసుకుంది. ప్రభుత్వం అందించే ఈ ఇళ్లలో మరుగుదొడ్లు, విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందువల్ల, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ కోట్ల గృహాలను ఈ సౌకర్యాలు, ప్రభుత్వ వివిధ పథకాలు పూర్తి చేస్తున్నాయి.
మిత్రులారా !
మీతో మాట్లాడుతున్నప్పుడు, నాకు మునుపటి పరిస్థితి కూడా గుర్తుకు వచ్చింది. ఇంతకు ముందు పేదలకు ఇల్లు ప్రకటించినా, విడిగా మరుగుదొడ్లు సొంతంగా నిర్మించుకోవాల్సి వచ్చేది. అదేవిధంగా, విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ల కోసం పలుమార్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. గత ప్రభుత్వాల హయాంలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు పేద ప్రజలు లంచాలు కూడా ఇవ్వాల్సి వచ్చేది. అంతేకాదు, పేదలకు ఇళ్లు ప్రకటించిన తర్వాత ఎలాంటి ఇళ్లు నిర్మించాలో ప్రభుత్వం నిర్దేశించేది. వారు డిజైన్ అందించి, నిర్మాణ సామాగ్రి ఎక్కడ తీసుకోవాలో కూడా వారికి చెప్పేవారు. ఇప్పుడు, ఇంట్లో నివసించే వ్యక్తి కి భిన్నమైన అభిరుచులు, ఇష్టాలు, అయిష్టాలు, సామాజిక సంప్రదాయాలు ఉంటాయి. కానీ, పేదలను ఈ విషయాల గురించి అడగలేదు. అందుకే, ఇంతకు ముందు కట్టిన కొన్ని ఇళ్లకు ఇంకా గృహ ప్రవేశం సాధ్యం కాలేదు. అయితే, ఇంటి యజమానులకు మనం, ఈ స్వేచ్ఛను ఇచ్చాం. అందుకే, నేడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారీ సామాజిక-ఆర్థిక మార్పు కు మాధ్యమంగా మారుతోంది.
సోదర సోదరీమణులారా !
ఒక తరం తాను ఆర్జించిన సంపదను తరువాతి తరాలకు అందించడం మనం తరచుగా చూస్తాము. మన గత ప్రభుత్వాల తప్పుడు విధానాల కారణంగా, ప్రజలు తమ తరువాతి తరానికి నిరాశ్రయతను అప్పగించ వలసి వచ్చింది. అనేక తరాల నుంచి వస్తున్న ఈ విష వలయాన్ని విచ్ఛిన్నం చేయగలిగిన వ్యక్తి చాలా ప్రశంసించబడ్డాడు, కీర్తించబడ్డాడు. దేశ సేవకునిగా, కోట్లాది మంది దేశ మాతల కుమారునిగా, నా కోట్లాది పేద కుటుంబాలను ఈ దుర్ఘటన నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి పేదవానికి పక్కా గృహాలు అందించేందుకు మన ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. అందుకే, నేడు ఇంత పెద్ద సంఖ్యలో గృహాలు నిర్మించడం జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు 30 లక్షల ఇళ్లు నిర్మించడం జరిగింది. కాగా, ప్రస్తుతం మరో 9 నుంచి 10 లక్షల ఇళ్ల పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా !
ఈ లక్షల ఇళ్లు దేశం నలుమూలల ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నేను జాబ్ మేళాకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నప్పుడు, సాయంత్రం గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్నానని వారికి చెప్పాను. దీంతో ఉపాధి ఎలా ముడిపడి ఉందనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను వివరంగా చెబుతాను.
మిత్రులారా !
ఇళ్లు కట్టేటప్పుడు ఇటుకలు, సిమెంట్, ఇసుక, కంకర, స్టీల్, పెయింట్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ సీట్లు, కుళాయిలు, పైపులు వంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని మీకు తెలుసు. ఈ డిమాండ్ పెరిగినప్పుడు, ఈ వస్తువులను తయారు చేసే కర్మాగారాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి. సరుకుల రవాణాకు ఎక్కువ మంది అవసరమవుతారు. ఈ వస్తువులను విక్రయించే దుకాణాల్లో కూడా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. సాత్నా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. సాత్నా సున్నపురాయి, సిమెంట్ కు ప్రసిద్ధి చెందింది. ఇళ్లు కట్టేటప్పుడు సాత్నా లోని సిమెంట్ కు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇళ్ల నిర్మాణంలో నిమగ్నమైన కార్మికులు, మేస్త్రీలు, వడ్రంగులు, ప్లంబర్లు, పెయింటర్లు, ఫర్నిచర్ తయారీదారులకు కూడా చాలా పని దొరుకుతుంది. మధ్యప్రదేశ్ లోనే 50 వేల మందికి పైగా మేస్త్రీలు శిక్షణ పొందినట్లు నాకు చెప్పారు. వీరిలో 9,000 నుంచి 10,000 వరకు మన మాతృమూర్తులు, సోదరీమణులు ఉన్నారు. వారు 'రాజ్ మిస్త్రీ' లేదా మాస్టర్ మేస్త్రీలు కాగా కొంతమంది వారిని 'రాణి మిస్త్రీ' లేదా క్వీన్ మేస్త్రీ లు అని కూడా పిలుస్తారు. అంటే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త నైపుణ్యం, కొత్త ఉపాధి అవకాశాలతో మన సోదరీమణులను అనుసంధానించే ప్రశంసనీయమైన పనిని చేస్తోంది. లేకుంటే, నిర్మాణ రంగంలో అక్కాచెల్లెళ్లను నైపుణ్యం లేని కూలీలుగానే భావించేవారు. ఇప్పటివరకు, కేవలం, మధ్యప్రదేశ్ లోనే ఈ ఇళ్ల నిర్మాణానికి 22 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఈ 22 వేల కోట్ల రూపాయలు ఎక్కడికెళ్లాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఈ డబ్బులో కొంత భాగం ఇళ్ళు నిర్మించడానికి, దానిలో కొంత భాగాన్ని దుకాణాల నుంచి వస్తువులను కొనుగోలు చేయడం వంటి వివిధ సంబంధిత పనులకు ఉపయోగించడం జరిగింది. మరి కొంత భాగం ఫ్యాక్టరీలలో కూడా ఉపయోగించడం జరిగింది. అందుకే, ఈ గృహాలు అందరికీ ప్రగతిని తీసుకువస్తున్నాయి. ఇళ్లు పొందిన లబ్ధిదారుల తో పాటు, ఆ ఇళ్లు ఏ గ్రామంలో నిర్మించారో, ఆ గ్రామం మొత్తం అభివృద్ధి చెందుతోంది.
సోదర సోదరీమణులారా !
గత ప్రభుత్వాలకు, మన ప్రభుత్వానికీ మధ్య చాలా తేడా ఉంది. గత ప్రభుత్వాలు పేదలను వేధించేవి. వారు తమ కార్యాలయాలను పదే పదే సందర్శించేలా చేశారు. కాగా, మన ప్రభుత్వం పేదల వద్దకే వెళ్ళి, ప్రతి పథకం యొక్క ప్రయోజనం పేదలకు అందేలా ప్రచారం చేస్తోంది. ఈ రోజు మనం తృప్తి చెందడం గురించి మాట్లాడుకుంటున్నాము, అంటే, ప్రతి ప్రజా సంక్షేమ పథకం యొక్క ప్రయోజనాలను వందశాతం లబ్దిదారులకు ఎలా అందించాలి? అని. ఇందులో ఎటువంటి బంధుప్రీతి, పక్షపాతం లేదు. వీటిని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పక్కా ఇంటితోపాటు, గ్యాస్-వాటర్-విద్యుత్ కనెక్షన్లు, అదేవిధంగా, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందేలా చేసేందుకు రేయింబవళ్ళు పని చేస్తున్నాం. అదే విధంగా, తక్కువ సమయంలో మంచి రహదారులు, మంచి పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులతో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. మనకెందుకు ఈ తొందర? ఈ పనులు చేయడానికి మనం ఎందుకు ఆత్రుత పడుతున్నామంటే, దీని వెనుక గతం నేర్పిన ఒక కీలకమైన గుణపాఠం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి ప్రాథమిక సౌకర్యాలన్నీ అస్థిరంగా ఉండేవి. దేశంలో ఎక్కువ శాతం మంది జనాభా ఈ ప్రాథమిక సౌకర్యాల కోసం ఎక్కువగా శ్రమించేవారు. ఇవి కాక, ఇతర విషయాల గురించి కనీసం ఆలోచించే సమయం కూడా వారికి దొరికేది కాదు. అందువల్ల, పేదరిక నిర్మూలనకు సంబంధించిన ప్రతి వాగ్దానం, ప్రతి వాదన కేవలం రాజకీయం కోసమే అన్నట్లు ఉండేవి. వారు ఎవరి కోసం పని చేయలేదు. సేనాధిపతి ఎంత ఉద్వేగ పరుడైనప్పటికీ, సైనికులకు పోరాడటానికి ప్రాథమిక సాధనాలు లేకపోతే, యుద్ధంలో విజయం సాధించడం అసాధ్యం. అందుకే పేదరికం నుంచి బయటపడటానికి, అదేవిధంగా, పేదరికాన్ని ఓడించడానికి, దేశం లోని ప్రతి పౌరుడిని ఆ ప్రాథమిక సౌకర్యాలతో వేగంగా అనుసంధానం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇప్పుడు పేదలు, సౌకర్యాలతో సన్నద్ధమవుతున్నందున, పేదరికం నుంచి వేగంగా బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్వీకరించిన ఈ ఇల్లు కేవలం నివసించడానికి, తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి మాత్రమే స్థలం కాదు. మీ ఇల్లు పేదరికాన్ని రానివ్వని కోట లాంటిదని నేను అంటాను. మిగిలిన పేదరికాన్ని కూడా క్రమంగా నిర్మూలించడం జరుగుతుంది.
సోదర సోదరీమణులారా !
మహమ్మారి సమయంలో ఆకలితో బాధపడకుండా ఉండటానికి, గత కొన్ని నెలలుగా, కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి పైగా దేశవాసులకు ఉచిత రేషన్ ఇస్తోంది. ఇందుకోసం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, కేంద్ర ప్రభుత్వం, ఇప్పటివరకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. నేను, ఈ సందర్భంగా, మీకు మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. పన్ను చెల్లింపుదారులు తమ డబ్బు సరైన చోట, సరైన పద్ధతిలో ఖర్చవుతుందని భావించినప్పుడు, పన్ను చెల్లింపుదారులు కూడా సంతోషంగా, సంతృప్తిగా భావించి, ఎక్కువ పన్ను చెల్లిస్తూ ఉంటారు. పన్నులు చెల్లించడం ద్వారా, కరోనా కాలంలో కోట్లాది మందికి ఆహారం అందించడంలో సహాయపడుతున్నామనే వాస్తవంతో, ఈ రోజు, దేశం లోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు సంతృప్తి చెందారు. ఈ రోజు నేను నాలుగు లక్షల ఇళ్లను అప్పగిస్తున్నందున, నాతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన నా పేద సోదరుడు కూడా దీపావళిని బాగా జరుపుకుంటున్నాడని ప్రతి పన్ను చెల్లింపుదారుడు అనుకుంటాడు. ఇప్పుడు అతని కూతురి జీవితం కూడా ఆనందంతో నిండిపోతుంది.
అయితే, మిత్రులారా !
అదే పన్ను చెల్లింపుదారుడు, తన వద్ద వసూలు చేసిన డబ్బుతో ఉచితంగా పంపిణీ చేయడాన్ని చూస్తే, పన్ను చెల్లింపుదారుడు నిరుత్సాహానికి గురవుతాడు. నేడు అలాంటి పన్ను చెల్లింపుదారులు చాలా మంది నాకు బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ రోజు దేశం లోని అధిక శాతం ప్రజలు ఈ 'రేవారి' సంస్కృతి లేదా ఉచితాల పంపిణీ సంస్కృతి నుండి దేశాన్ని విముక్తి చేయడానికి సిద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా !
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు, పేద, మధ్య తరగతి ప్రజలకు డబ్బు ఆదా చేయడం కూడా మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు 4 కోట్ల మంది పేద రోగులు ఉచిత చికిత్స పొందారు. ఈ ఖర్చు ప్రభుత్వమే భరించడం తో, ఈ కుటుంబాలు, వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగాయి. ఈ ఆకస్మిక సంక్షోభం ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలు తమ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదా రుణాలు తీసుకోవలసిన అవసరం లేకుండా ఉండటానికి కరోనా కాలంలో ప్రభుత్వం ఉచిత టీకాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మొదట కరోనా, ఆ తర్వాత పొరుగున జరిగిన యుద్ధం మనల్ని అతలాకుతలం చేశాయి. ఫలితంగా, మనం ఈరోజు ప్రపంచ దేశాల నుంచి ఖరీదైన ఎరువులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ రోజు రెండు వేల రూపాయలకు పైగా ధర పలికే యూరియా బస్తాను, రైతులకు కేవలం 266 రూపాయలకే ఇస్తున్నాం. రెండు వేల రూపాయల విలువ చేసే బ్యాగులు కేవలం మూడు వందల రూపాయల లోపు ఇస్తున్నాం ! రైతులపై భారం పడకుండా ఉండేందుకు ఈ ఏడాది ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా రైతులకు వరంగా మారింది. కొద్దిరోజుల క్రితం బదిలీ అయిన 16 వేల కోట్ల రూపాయలు ప్రతి లబ్ధిదారుడైన రైతుకు వెంటనే చేరడం మీరు చూసే ఉంటారు. ప్రస్తుతం మన ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా జమ చేసింది. రైతులకు ఎరువులు, పురుగు మందుల తో పాటు అవసరమైనప్పుడు విత్తనాలు విత్తే సమయానికి ముందే ఈ సహాయం రైతులకు చేరింది. రైతులు పండించిన పంటను విక్రయించిన వెంటనే ఆ డబ్బులు ఇప్పుడు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వస్తాయి. ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ. డబ్బు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. గర్భిణులైన మాతృమూర్తులకు పౌష్టికాహారం అవసరమైనప్పుడు కూడా మాతృ వందన యోజన కింద వేలాది రూపాయలు నేరుగా వారికి చేరతాయి.
సోదర సోదరీమణులారా !
సేవాభావం, అంకితభావం కారణంగానే ప్రభుత్వం ఈ రోజు మీ అందరి కోసం, ఈ పనులను పూర్తి చేయగలిగింది! ఎవరు ఎన్ని ఎన్ని విమర్శలు చేసినా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో, మీ ఆశీస్సుల తో, రాజకీయ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. అందుకే నేడు టెక్నాలజీని ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించడం జరుగుతోంది. మన శాస్త్రవేత్తలు, యువకులు ఏ కొత్త సాంకేతికతలను తీసుకువచ్చినా, వాటిని సామాన్యుల జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగించడం జరుగుతోంది. నేడు గ్రామాల వారీగా ఇంటింటి సర్వే డ్రోన్ల సహాయంతో చేస్తున్నారు. ఇంతకు ముందు పట్వారీ, రెవెన్యూ శాఖ చేసే పని, ఇప్పుడు డ్రోన్లు లేదా సాంకేతికత సహాయం తో జరుగుతోంది. దేశంలోనే తొలిసారిగా స్వామిత్వ పథకం కింద గ్రామాలలోని గృహాల మ్యాప్ లు తయారు చేసి, ఎలాంటి వివాదాలు, అక్రమ ఆక్రమణలకు తావులేకుండా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు గ్రామస్థులకు అందజేయడం జరుగుతోంది. అవసరమైతే, ఈ ధ్రువీకరణ పత్రాల సహాయంతో బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందవచ్చు. అదేవిధంగా, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి పెద్దపీట వేయడంతో, రైతులు డ్రోన్ల వల్ల ప్రయోజనం పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం మేము రైతుల కోసం మరొక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాము. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎరువుల దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఈ కిసాన్ కేంద్రాల్లో రైతులకు కావాల్సినవన్నీ ఒకే చోట లభ్యమౌతాయి. భవిష్యత్తులో ఈ కేంద్రాల్లో అనేక వ్యవసాయ పరికరాల తో పాటు డ్రోన్లు కూడా అద్దెకు అందుబాటులో ఉంటాయి. యూరియా విషయంలో కూడా ఒక ప్రధానమైన చర్య తీసుకోవడం జరిగింది. ఏ కంపెనీ యూరియాను కొనుగోలు చేయాలనే సందిగ్ధం నుంచి, ఇప్పుడు, రైతులు విముక్తి పొందారు. ఇప్పుడు 'భారత్' అనే బ్రాండ్ పేరుతో ఎరువులు అందుబాటులోకి రానున్నాయి. దానిపై ధర కూడా స్పష్టంగా ముద్రించి ఉంటుంది. దాని పై ముద్రించిన ఈ ధర కంటే రైతులు ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటువంటి ప్రయత్నాలతో రైతులు, పేదల జీవనం మరింత సులభతరం అవుతుందని నేను నమ్ముతున్నాను. అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేద్దాం. పక్కా గృహాల లబ్ధిదారులందరినీ మరోసారి అభినందిస్తున్నాను, ఈ రోజు, మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నేను ఊహించగలను! ఇది మీ ఇల్లు. బహుశా, మీ కుటుంబంలో, గత 3 - 4 తరాలు దీపావళి పండుగ తమ స్వంత ఇంట్లో జరుపుకోలేదని భావిస్తున్నాను. ఈ రోజు, మీరు మీ పిల్లలతో కలిసి మీ ఇళ్లలో ధంతేరాస్ మరియు దీపావళిని జరుపుకుంటున్న సమయంలో, ఈ దీపం యొక్క వెలుగు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను!
భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, ఈ కొత్త ఇల్లు మీ నూతన పురోగతికి కారణం కావాలని ఆశిస్తున్నాను!
అనేకానేక ధన్యవాదములు.
గమనిక:
ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి స్వేచ్చానువాదం.
*****
(Release ID: 1870651)
Visitor Counter : 222
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam