ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘డిఫెక్స్ పో-22 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం అనువాద పాఠం

Posted On: 19 OCT 2022 2:59PM by PIB Hyderabad

   గుజరాత్‌ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ ఆచార్య దేవవ్రత్‌, దేశ రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రజాదరణగల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్‌, రాష్ట్ర మంత్రి జగదీష్‌ భాయ్‌, మంత్రి మండలిలో ఇతర సీనియర్ సభ్యులు, సీడీఎస్‌ జనరల్ అనిల్ చౌహాన్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్‌.చౌదరి, నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్‌.హరికుమార్, సైనిక బలగాల అధిపతి జనరల్ మనోజ్ పాండే, ఇతర దేశవిదేశీ ప్రముఖులు, సోదర సోదరీమణులారా!

   మర్థ, సశక్త, స్వయం సమృద్ధ భారతదేశపు వేడుకను గుజరాత్‌ గడ్డపై నిర్వహిస్తున్న నేపథ్యంలో మీకందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న నేను, ఈ గడ్డపై జన్మించిన బిడ్డగా గర్విస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాను. ప్ర‌స్తుత ‘అమృత‌కాలం’లో మేము సంక‌ల్పించిన ‘న‌వ భార‌తం’ ఉజ్వ‌ల చిత్రాన్ని ఈ డిఫెక్స్‌ పో-2022 మీ ముందుంచుతుంది. ఇది దేశ ప్ర‌గ‌తిని మాత్ర‌మేగాక రాష్ట్రాల భాగస్వామ్యాన్ని కూడా ప్ర‌స్ఫుటం చేస్తుంది. ఇది యువతరం శక్తి.. న‌వ‌యవ్వన స్వ‌ప్నం.. సంకల్పం.. సాహ‌సం.. సామ‌ర్థ్యం త‌దిత‌రాల‌ను కూడా చాటే ఉత్స‌వం. అలాగే ప్రపంచంలో కొత్త ఆశ‌ల‌కు ఊపిరిపోస్తూ మిత్ర దేశాలతో సహకారానికి అనేక అవకాశాల‌ను కల్పిస్తుంది.

మిత్రులారా!

   మా దేశంలో ఇంతకుముందు కూడా రక్షణరంగ ప్రదర్శన నిర్వహించబడేది… అయితే, ఈసారి ప్రదర్శన ఎన్నడూ కనీవినీ ఎరుగనంత వినూత్నమైనది! ఇది ఓ కొత్త శకారంభానికి నాంది. ఎందుకంటే- దేశంలో మొట్టమొదటి… కేవలం ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ రక్షణ పరికరాలతో.. భారతీయ కంపెనీలు మాత్రమే పాలు పంచుకుంటున్న రక్షణరంగ ప్రదర్శన ఇది. ఈ ప్రదర్శనలో తొలిసారిగా భారత ప్రజానీకం, భారతీయ కంపెనీలు, దేశీయ శాస్త్రవేత్తలు, ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఉద్భవించిన ఈ దేశపు నేలపై జన్మించిన నేటి యువతరం.. అందరూ స్వీయశక్తితో చెమటోడ్చి ఈ గడ్డపై రూపొందించిన వివిధ రకాల ఉత్పత్తులను మేం ఇవాళ ప్రపంచానికి ప్రదర్శిస్తున్నాం. ఇందులో భారతీయ పరిశ్రమలు, వాటికి సంబంధించిన కొన్ని సంయుక్త సంస్థలు, 100కుపైగా అంకుర సంస్థలు, ‘ఎంఎస్‌ఎంఈ’లు సహా 1300కుపైగా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఒక్కమాటలో చెబితే- మా సామర్థ్యం, మేం కల్పించే అవకాశాలు.. రెండింటిపైనా ఏకకాలంలో ఇక్కడున్న మీ అందరితోపాటు దేశపౌరులు, ప్రపంచ ప్రజానీకం మొత్తం సంక్షిప్తంగా అర్థం చేసుకోగలరు. ఈ అవకాశాలు కార్యరూపం దాల్చడంలో భాగంగా తొలిసారి 450కిపైగా అవగాహన ఒప్పందాలు, ఒడంబడికలపై సంతకాలు పూర్తికానున్నాయి.

మిత్రులారా!

   కార్యక్రమాన్ని చాలాకాలం కిందటే నిర్వహించాలని భావించాం. గుజరాత్ ప్రజలకు ఈ సంగతి బాగా తెలుసు. కానీ, కొన్ని అనివార్య పరిస్థితుల వల్లగా మేము సమయాలను మార్చాల్సి వచ్చింది కాబట్టే కాస్త ఆలస్యమైంది. ఈ కారణంగా విదేశీ అతిథులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. అయినప్పటికీ దేశంలోనే అతిపెద్దదైన ఈ రక్షణ రంగ ప్రదర్శన బలమైన కొత్త భవిష్యత్తుకు నాంది పలికింది. ఇది కొన్ని దేశాలకు అసంతృప్తి కలిగించిందని నాకు తెలుసు. ఏదేమైనా అనేక దేశాలు సానుకూల దృక్పథంతో మాకు మద్దతిచ్చాయి.

మిత్రులారా!

   భారతదేశం భవిష్యత్‌ అవకాశాలను సృష్టిస్తున్న నేపథ్యంలో 53 ఆఫ్రికా మిత్రదేశాలు మాతో భుజం కలిపి నిలవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా భారత-ఆఫ్రికా రెండోదశ రక్షణ చర్చలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. భారత-ఆఫ్రికా దేశాల మధ్య ఈ స్నేహం లేదా సంబంధం మునుపటి పరస్పర విశ్వాసంపైనే ఆధారపడి ఉంది. ఇది కాలంతోపాటు బలపడుతూ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇవాళ మీరు అడుగుపెట్టిన గుజరాత్ గడ్డకు ఆఫ్రికాతో ఎంతో ప్రాచీన, సన్నిహిత సంబంధం ఉందనే వాస్తవాన్ని ఆఫ్రికా నుంచి వచ్చిన నా మిత్రులకు గుర్తుచేస్తున్నాను. ఆఫ్రికాలో తొలి రైలు మార్గం వేసే సమయంలో గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం నుంచి కార్మికులు అక్కడికి వెళ్లారు. సవాళ్లతో కూడిన అక్కడి పరిస్థితుల నడుమ వారంతా మొక్కవోని దీక్షతో, శ్రద్ధాసక్తులతో పనిచేశారు. ఆ విధంగా ఆఫ్రికాలో ఆధునిక రైలు మార్గాలకు పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇదొక్కటే కాదు… ఇవాళ మీరు ఆఫ్రికా వెళ్తే అక్కడ ‘దుకాణ్‌’ అనే గుజరాతీ పదం అంతటా వినిపించడం గమనించవచ్చు. ఇప్పుడు మరో రెండు గుజరాతీ పదాలు ‘రోటీ, భాజీ’ కూడా అక్కడి జన జీవనంలో భాగమయ్యాయి. అంతెందుకు.. మహాత్మా గాంధీవంటి అంతర్జాతీయ నాయకుడికి గుజరాత్ జన్మస్థలమైతే ఆఫ్రికా ఆయన తొలి కార్యస్థానం. ఆఫ్రికాపై ఈ ఆదరాభిమానాలు భారత విదేశాంగ విధానంలో ఇప్పటికీ అంతర్భాగమే. కరోనా కాలంలో టీకాల కోసం ప్రపంచం మొత్తం అంగలారుస్తున్నపుడు స్నేహపూర్వక ఆఫ్రికా దేశాలకు భారత్‌ ప్రాధాన్యమిచ్చి, వాటికి టీకాలు సరఫరా చేసింది. ఔషధాల నుంచి శాంతి కార్యక్రమాల దాకా ప్రతి అవసరంలోనూ మేం ఆఫ్రికాతో భుజం కలిపి నిలవటానికి కృషి చేశాం. ఇప్పుడిక రక్షణ రంగంలో మన మధ్యగల సహకారం-సమన్వయం ఈ స్నేహబంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.

మిత్రులారా!

   ‘హిందూ మహాసముద్ర ప్రాంతసహిత (ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ప్లస్‌ - ఐఓఆర్‌+) దేశాల రక్షణ మంత్రుల సదస్సు ఈ కార్యక్రమానికి మరో ముఖ్యమైన కోణం. మా మిత్రదేశాల్లో 46 ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇవాళ అంతర్జాతీయ భద్రత నుంచి ప్రపంచ వాణిజ్యందాకా సముద్ర భద్రత అంతర్జాతీయ ప్రాథమ్యంగా ఆవిర్భవించింది. ‘ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకూ భద్రత-వృద్ధి.. ‘సాగర్‌’ సూత్రాన్ని 2015లో నేను మారిషస్‌లో మీ ముందుకు తెచ్చాను. ఆ తర్వాత సింగపూర్‌లోని షాంగ్రీ లా చర్చలలో నేను ప్రకటించిన మేరకు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆఫ్రికన్ తీరాల నుంచి అమెరికా వరకూ భారత్‌ సంబంధాలు సార్వజనీనం.

   నేటి ప్రపపంచీకరణ యుగంలో వాణిజ్య నావికాదళం పాత్ర కూడా విస్తృతమవుతోంది. భారతదేశంపై ప్రపంచం అంచనాలు అనేక రెట్లు పెరిగిన నేపథ్యంలో వాటిని అందుకోవడానికి మేం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మాకు అలుపన్నది ఉండదని కూడా స్పష్టం చేస్తున్నాను. భారతదేశంపై ప్రపంచానికిగల నమ్మకానికి ప్రస్తుత రక్షణరంగ ప్రదర్శన కూడా ఒక రుజువు. అనేక దేశాలు ఇందులో పాల్గొనడం ద్వారా అపార ప్రపంచ సామర్థ్యం గుజరాత్‌ గడ్డమీద ఆవిష్కృతమైంది. తదనుగుణంగా భారత మిత్రదేశాలకు, వారి ప్రతినిధులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై గుజరాత్‌ ప్రజలకు.. ప్రత్యేకించి ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ పటేల్‌, ఆయన బృందానికి అభినందనలు తెలుపుతున్నాను. ఇవాళ్టి ఈ రక్షణరంగ ప్రదర్శన గుజరాత్ ప్రగతి, పారిశ్రామిక సామర్థ్యాలకు దేశంలోనేగాక ప్రపంచంలోగల గుర్తింపును ఇనుమడింపజేసింది. రాబోయే రోజుల్లో రక్షణరంగ పరిశ్రమలకు గుజరాత్‌ ప్రధాన కేంద్రం  కాగలదని నా నమ్మకం. అంతేగాక దేశభద్రత, వ్యూహాత్మక సామర్థ్యానికీ ఎంతగానో దోహదం చేస్తుందని నూటికి నూరుపాళ్లు విశ్వసిస్తున్నాను.

మిత్రులారా!

   నేను ఇక్కడి భారీ తెరవైపు చూస్తుంటే- దీసాలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుండగా వారిలో ఉద్వేగం, ఉత్తేజం పెల్లుబుకడం నాకు స్పష్టంగా తెలుస్తోంది. దీసాలో వాయుసేన స్థావర నిర్మాణం దేశభద్రతకే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు. అంతర్జాతీయ సరిహద్దుకు దీసా కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.  మన బలగాలు.. ముఖ్యంగా వైమానిక దళం దీసాలో ఉన్నట్లయితే, పశ్చిమ సరిహద్దులో ఎలాంటి దుస్సాహస యత్నం జరిగినా తక్షణం తిప్పికొట్టగలం. దీసాలోని సోదర సోదరీమణులారా… గాంధీనగర్ నుంచి మీకందరికీ నా శుభాకాంక్షలు! దీసా, బనస్కాంత, పటాన్ జిల్లాల భవిష్యత్తు నేడు ఉజ్వలంగా ప్రకాశిస్తోంది! వాయుసేన స్థావరం కోసం 2000 సంవత్సరంలోనే గుజరాత్ తరపున ఈ భూమి దీసాకు ఇవ్వబడింది.

   నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఈ స్థావర నిర్మాణం ప్రారంభించేందుకు ఎంతో ప్రయత్నించాను. దీని ప్రాముఖ్యాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విశదీకరించాను. ఇందుకోసం సువిశాల భూమిని కూడా గుజరాత్‌ తరఫున స్వాధీనం చేసినా 14 ఏళ్లపాటు అంగుళం మాత్రమైనా ముందడుగు పడలేదు. ఆ తర్వాత నేను (ప్రధానిగా కేంద్రానికి) అక్కడికి వెళ్లినా సంబంధిత ఫైళ్లపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఫలితంగా పరిస్థితిని చక్కదిద్దడానికి సమయం పట్టింది. చివరగా మా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దీసాలో వాయుసేన స్థావరం పని ప్రారంభించి తీరాలని మేం నిర్ణయించాం. ఎట్టకేలకు మన వాయుసేన అంచనాలు ఇవాళ వాస్తవరూపం దాల్చాయి. అప్పట్లో రక్షణశాఖలోని నా మిత్రులు, త్రివిధ దళాల ముఖ్యాధిపతిసహా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నాకు పదేపదే గుర్తుచేసేవారు. చివరకు చౌదరిగారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు సాకారమైంది. ఈ నేపథ్యంలో దీసాతోపాటు వైమానిక దళానికి నా హృదయపూర్వక అభినందనలు! ఈ ప్రాంతం ఇక దేశానికి మరింత రక్షణ, భద్రత కల్పించడంలో శక్తిమంతమైన కేంద్రంగా మారుతుంది. గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్‌లు సౌరశక్తి కేంద్రంగా ఆవిర్భవించిన తరహాలోనే అదే బనస్కాంత-పటాన్ ఇక దేశానికి ‘వాయుశక్తి’ కేంద్రంగానూ మారనున్నాయి.

మిత్రులారా!

   లమైన ఏ దేశానికైనా భవిష్యత్‌ భద్రతపై భరోసాకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం తిరుగులేని ఉదాహరణ. ఈ రంగంపై సమీక్షించిన త్రివిధ బలగాలు అనేక సవాళ్లను గుర్తించి నా దృష్టికి తెచ్చాయి. వాటన్నిటి పరిష్కారానికి వేగంగా కృషి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘మిషన్ డిఫెన్స్ స్పేస్’ కింద దేశంలోని ప్రైవేట్ రంగం కూడా తన సామర్థ్యం ప్రదర్శించుకునే అవకాశం లభిస్తుంది. అంతరిక్ష రంగంలో భవిష్యత్‌ అవకాశాల దృష్ట్యా భారత్‌ తన సన్నద్ధతను మరింత పెంచుకోవాలి. మన రక్షణ దళాలు సరికొత్త, ఆవిష్కరణాత్మక పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతరిక్ష రంగంలో భారత్‌ శక్తిసామర్థ్యాలు పరిమిత స్థాయిలో ఉండిపోరాదు… అదే సమయంలో దాని ప్రయోజనాలు మన దేశ ప్రజలకు మాత్రమే పరిమితం కాకూడదన్నదీ మా లక్ష్యం… దృక్పథం కూడా. అంతరిక్ష సాంకేతికత భారతదేశ ఉదారవాద భావాలతో కూడిన అంతరిక్ష దౌత్యానికి రూపుదిద్దుతోంది. ఇది కొత్త అవకాశాల సృష్టికి దోహదం చేస్తుంది… అనేక ఆఫ్రికా దేశాలతోపాటు చిన్న దేశాలు కూడా మా విధానంతో లబ్ధి పొందుతున్నాయి. మరోవైపు 60కిపైగా వర్ధమాన దేశాలతో భారత్‌ తన అంతరిక్ష విజ్ఞానాన్ని పంచుకుంటోంది.

   దక్షిణాసియా ఉపగ్రహమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. దీనిద్వారా వచ్చే ఏడాదికల్లా 10 ఆసియాన్‌ దేశాలు కూడా భారత ఉపగ్రహ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పొందగలవు. అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశాలు కూడా మా ఉపగ్రహ సమాచారాన్ని వాడుకుంటున్నాయి. అంతేగాక సముద్ర వాణిజ్యం దిశగానూ ఈ రంగానికి అపార సామర్థ్యం ఉంది. మత్స్యకారులకు మెరుగైన ఆదాయం, భద్రత కోసం దీనిద్వారా మేము ప్రత్యక్ష సమాచార ప్రదానం చేస్తున్నాం. అనంతమైన కలలు కంటున్న నా దేశ యువతరం సమయ పరిమితి, నాణ్యతలను దృష్టిలో ఉంచుకుంటూనే ఈ అంతరిక్ష రంగ అవకాశాలను సాకారం చేయగలదన్న నమ్మకం మాకుంది. భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న యువతరం అంతరిక్ష సాంకేతికతలో కొత్త శిఖరాలను అందుకోగలదు. కాబట్టి, ఈ రక్షణ రంగ ప్రదర్శనలో సంబంధిత అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. గుజరాత్‌ నేలతో ముడిపడిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వంటి శాస్త్రవేత్త స్ఫూర్తి, కీర్తి కూడా మా సంకల్పాలకు నవ్యోత్తేజం ఇస్తుంది.

అంతేకాదు మిత్రులారా!

   రక్షణ రంగం, భవిష్యత్‌ యుద్ధ స్వరూపం విషయానికొస్తే- ఒక విధంగా దాని పగ్గాలు యువతరం చేతుల్లోనే ఉన్నాయి. ఇందులో భారత యువత ఆవిష్కరణలు-పరిశోధనలది విశేష పాత్ర కాబట్టి ఈ రక్షణ రంగ ప్రదర్శన దేశ యువత భవిష్యత్ గవాక్షమనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

   క్షణ రంగంలో సంకల్పం… ఆవిష్కరణ.. అమలు తారకమంత్రంగా భారత్‌ ముందడుగు వేస్తోంది. ఎనిమిదేళ్ల కిందటిదాకా భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పరిగణనలో ఉంది. ఆ మేరకు వివిధ దేశాల నుంచి రక్షణ పరికరాలు కొంటూ పెద్త మొత్తంలో డబ్బు చెల్లిస్తూండేది. కానీ, నేడు భారత్‌ తన సంకల్పాన్ని, దీక్షను రుజువు చేసుకుంది. ఇప్పుడు మా రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ తనదైన విజయగాథను లిఖిస్తోంది. గత ఐదేళ్లలో రక్షణరంగ ఎగుమతులు 8 రెట్లు పెరిగాయి. ఇవాళ మేం ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణ పరికరాలు ఎగుమతి చేస్తున్నాం. ఆ మేరకు 2021-22లో భారత రక్షణ ఎగుమతులు 1.59 బిలియన్‌ డాలర్లు.. అంటే- దాదాపు రూ.13 వేల కోట్లకు చేరాయి. భవిష్యత్తులో దీన్ని 5 బిలియన్ డాలర్లు… అంటే- రూ.40 వేల కోట్లకు పెంచాలన్నది మా లక్ష్యం. కొన్ని దేశాలకు.. కొన్ని పరికరాలకు మాత్రమే ఈ ఎగుమతులు పరిమితం కాదు. భారత రక్షణ సంస్థలు ఇవాళ అంతర్జాతీయ సరఫరా ప్రక్రియలో కీలక భాగం అవుతున్నాయి. మేమిప్పుడు ప్రపంచ ప్రమాణాలతో ‘అత్యాధునిక’ పరికరాలను సరఫరా చేస్తున్నాం. ఒకవైపు ‘తేజస్‌’ వంటి భారత తయారీ ఆధునిక యుద్ధ విమానాలపై అనేక దేశాలు ఆసక్తి చూపుతుండగా- మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌, ఇటలీ వంటి దేశాలకూ మన కంపెనీలు రక్షణ పరికరాల విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి.

మిత్రులారా!

   ‘భారత్‌ తయారీ’ బ్రహ్మోస్ క్షిపణి అత్యంత విధ్వంసక శక్తిగలదిగా, ఆ విభాగం క్షిపణులలో అత్యంత అధునాతనమైనదిగా పరిగణించబడుతోంది. ఈ విషయం విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. చాలా దేశాలకు ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి ప్రథమ ప్రాధాన్యంగా మారింది.

మిత్రులారా!

   భారత సాయుధ దళాలు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న నేపథ్యంలో ప్రపంచం నేడు మా దేశ సాంకేతికతపై ఆధారపడుతోంది. భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌-విక్రాంత్ వంటి అత్యాధునిక విమాన వాహక నౌకలను సమకూర్చుకుంది. ఐరావతం వంటి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని, ఈ భారీ కళాఖండాన్ని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దింది. మరోవైపు ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తయారుచేసిన శక్తిమంతమైన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను భారత వైమానిక దళం సమకూర్చుకుంది. అలాగే మా సైన్యం కూడా ఇవాళ భారతీయ కంపెనీల నుంచి స్వదేశీ ఆయుధాలు, యుద్ధ శతఘ్నులను కొనుగోలు చేస్తోంది. గుజరాత్‌లోని హజీరాలో నిర్మిస్తున్న ఆధునిక ఆయుధాగారం నేడు దేశ సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తోంది.

మిత్రులారా!

   మా విధానాలు, సంస్కరణలు, వాణిజ్య సౌలభ్యం దేశాన్ని నేటి ఉన్నతస్థాయికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించాయి. భారతదేశం తన రక్షణ కొనుగోళ్ల బడ్జెట్‌లో 68 శాతాన్ని భారతీయ కంపెనీల కోసమే కేటాయించింది. అంటే- 68 శాతం నిధులను దేశీయ పరికరాల కొనుగోలు కోసమే వినియోగిస్తాం. ఇది ఎంతో కీలక నిర్ణయం కాగా, ప్రగతిశీల నాయకత్వం, భారత సాయుధ దళాల ధైర్యం వల్లనే ఇది సాధ్యమైంది తప్ప ఏదో రాజకీయ ఉద్దేశాలతో తీసుకున్నది కాదు. ఇది కేవలం సైనిక బలగాల సమ్మతితో తీసుకున్న నిర్ణయం. ఇంత ముఖ్యమైన నిర్ణయాలను ముందుకు తీసుకెళ్తున్న ఇలాంటి సైనికులు, అధికారులు నా బలగంలో భాగంగా ఉండటం ఇవాళ నాకెంతో గర్వకారణం. ఇదేకాకుండా క్షణ రంగంలో పరిశోధన-ఆవిష్కరణల కోసం అంకుర సంస్థలతోపాటు పరిశ్రమలకు, విద్యాసంస్థలకూ తలుపులు తెరిచాం. ప్రైవేట్ విద్యా రంగంలో కొత్త తరానికి పరిశోధన బడ్జెట్‌లో 25 శాతం అప్పగించాలని మేం సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు నా దేశ యువతరంపై నాకెంతో నమ్మకముంది. భారత ప్రభుత్వం వారికి రూ.100 ఇస్తే, వారు దాన్ని రూ.10,000గా దేశానికి తిరిగి ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇదే నా దేశంలోని యువతరం బలం.

   ప్రభుత్వ కృషితోపాటు మన బలగాలు కూడా ముందుకొచ్చి తమ రక్షణ కోసం దేశంలోనే మరిన్ని పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. దీనికి అనుగుణంగా సాయుధ దళాలు సంయుక్తంగా వివిధ పరికరాలకు సంబంధించి రెండు జాబితాలు రూపొందించాయి. ఒకదానిలో ఉన్నవి భారతీయ కంపెనీల నుంచి కొనుగోలు చేసే పరికరాలు మాత్రమే కాగా, అవసరమైతే విదేశాల నుంచి కొనుగోలు చేయగల కొన్ని పరికరాలు మరో జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో 101 పరికరాలు తొలి లేదా ‘భారత తయారీ’ వస్తువుల జాబితాలో చేర్చబడ్డాయని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ నిర్ణయాలు స్వావలంబన భారత సామర్థ్యాన్ని కూడా ప్రస్ఫుటం చేస్తాయి. అంతేగాక స్వదేశీ సైనిక పరికరాలపై మా సైనికులలో పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగానూ ఉన్నాయి. మొత్తంమీద ఇప్పుడు ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశీయంగా తయారైన 411 రక్షణరంగ పరికరాలు, ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. భారతీయ కంపెనీల పునాదులను పటిష్టం చేసి, మా పరిశోధన-ఆవిష్కరణలను పెంచి, మా రక్షణ తయారీ రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఈ విధానాన్ని ఒక్కసారి ఊహించుకోండి! ఇది నా దేశంలోని యువతరానికి భారీ ప్రయోజనం చేకూర్చనుంది.

మిత్రులారా!

   చర్చ మధ్యలో నేను మరో అంశం ప్రస్తావించదలిచాను. మనకెంతో జీవితానుభవం ఉంది. ఇప్పడొక ఉదాహరణ చూద్దాం.. రైలు సీటులో నలుగురు వ్యక్తులు కూర్చున్నట్లయితే, ఐదో వ్యక్తి తమతో కూర్చోవడానకి వారు అంగీకరించరు. ప్రపంచంలోని రక్షణ తయారీ కంపెనీల పరిస్థితి కూడా ఇదే. రక్షణ సరఫరా రంగంలో గుత్తాధిపత్యం చలాయించిన కొన్ని కంపెనీలు మరో కొత్త కంపెనీ ఏర్పడటానికి ఎన్నడూ అనుమతించలేదు. అయినప్పటికీ, భారత్ సాహసోపేతంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మిత్రులారా… ఆ మేరకు ఇవాళ భారత యువత నైపుణ్యం ప్రపంచానికి ఒక ఎంపికగా ఆవిర్భవించింది. రక్షణ రంగంలో భారత యువత సామర్థ్యం ముందంజ వేసింది. అయితే, ఇది ప్రపంచ సంక్షేమం కోసం కాబట్టి, కొత్త అవకాశాలు, ఎంపికలను ప్రపంచం ముందుంచుతోంది. యువత కృషి వల్ల రానున్న రోజుల్లో దేశ రక్షణ రంగం మరింత పటిష్టం కాగలదని నేను విశ్వసిస్తున్నాను. అదే సమయంలో దేశ బలం, యువత సామర్థ్యాలు కూడా అనేక రెట్లు పెరుగుతాయి. ఇవాళ్టి రక్షణ ప్రదర్శనలో మేం ప్రదర్శిస్తున్న అంశాల్లో ప్రపంచ శ్రేయస్సు నాకు దృగ్గోచరం అవుతోంది. సాధారణంగా వనరుల కొరతవల్ల రక్షణ, భద్రతలలో వెనుకబడిన ప్రపంచంలోని చిన్న దేశాలకు దీనితో ఎంతో మేలు కలుగుతుంది.

మిత్రులారా!

   భారతదేశం రక్షణ రంగాన్ని ఆకాశమే హద్దుగాగల సానుకూల అవకాశాల నిధిగా చూస్తోంది. నేడు మనకు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులలోగల రెండు రక్షణ కారిడార్లు ప్రగతి  పథంలో వేగంగా ముందడగు వేస్తున్నాయి. ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. ఈ పెట్టుబడి వెనుక సరఫరా గొలుసుల పెద్ద నెట్‌వర్క్ అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ పెద్ద కంపెనీలు, మన ‘ఎంఎస్‌ఎంఈ’లు, చిన్న పరిశ్రమలు మరింత పుంజుకుంటున్నాయి. మన ‘ఎంఎస్‌ఎంఈ’లు సహకరిస్తాయి.. దీనివల్ల చిన్న పరిశ్రమలకూ మూలధనం లభ్యమవుతుందని నేను భావిస్తున్నాను. ఈ మేరకు రక్షణ రంగానికి వచ్చే లక్షల కోట్ల పెట్టుబడులలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి. అందువల్ల వృద్ధిని ఉన్నత శిఖరాలకు చేర్చడం సాధ్యమేనని స్పష్టమవుతోంది. భవిష్యత్ భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశాలకు రూపమివ్వాలని గుజరాత్ రక్షణరంగ ప్రదర్శనలో పాలుపంచుకుంటున్న అన్ని కంపెనీలకూ పిలుపునివ్వాలని నేను భావిస్తున్నాను. మీ అవకాశాన్ని కోల్పోకండి! ఆవిష్కరణలు చేయండి.. ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటామని శపథం చేయండి.. అదేవిధంగా బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశం కలలకు రూపాన్నివ్వండి. నేను మీతోనే ఉన్నానని యువతకు, పరిశోధకులకు, ఆవిష్కర్తలకు హామీ ఇస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం నేను ఇవాళ ఎంతయినా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాను.

మిత్రులారా!

   దేశం వేగంగా పరివర్తన చెందడం మీ అనుభవంలోకి కూడా వస్తున్నదని నేను విశ్వసిస్తున్నాను. ఈ దేశం లోగడ పావురాలను ఆకాశంలోకి వదిలేది… ఇవాళ మేం  చిరుతలను అడవుల్లోకి విడుదల చేస్తున్నాం. ఇవి ఇప్పటికి చిన్న సంఘటనలుగానే అనిపించవచ్చు… కానీ, సందేశం బలమైనదే! పదాలు సరళంగా ఉండవచ్చు.. కానీ, శక్తి తిరుగులేనిది! నేటి భారతదేశ యువశక్తి, భారతదేశ సామర్థ్యం ప్రపంచానికి ఆశాకిరణాలుగా మారుతున్నాయి. అదే ఇప్పుడు రక్షణరంగ ప్రదర్శన రూపేణా మీ ముందు సాక్షాత్కరించింది. మా రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ కృషికి, కఠోర పరిశ్రమకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మాటల మనిషి కాదు… చేతల మనిషి! ఈ మేరకు ఆయనను, మొత్తం బృందాన్ని అభినందిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు.. ఈ దీపావళి నాడు మీ ఇంట ఆనందం వెలుగులు పూయించాలి! రాష్ట్ర ప్రజలకు గుజరాతీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

ధన్యవాదాలు.

 

బాధ్యత నిరాకరణ ప్రకటన: ప్రధానమంత్రి ప్రసంగంలోని కొన్ని భాగాలు గుజరాతీ భాషలో కూడా ఉన్నందున ఈ అనువాదంలో ఏవైనా స్వల్ప వ్యత్యాసాలు కనిపించవచ్చు.

***



(Release ID: 1869940) Visitor Counter : 97