ప్రధాన మంత్రి కార్యాలయం

దేవ్‌గఢ్‌లో రూ.16,800 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాలకు ప్రారంభోత్సవం.. శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధానమంత్రి


“ప్రాజెక్టులు మౌలిక వసతుల అభివృద్ధికి గణనీయ ఉత్తేజమిస్తాయి… సంధానాన్ని మెరుగుపరుస్తాయి… ఈ ప్రాంతంలో జీవన సౌలభ్యానికి ప్రేరణనిస్తాయి”;

దేవగఢ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని;

బాబా బైద్యనాథ్ ధామ్‌కు నేరుగా విమానయాన సంధానం;

దేవగఢ్‌ ‘ఎయిమ్స్‌’లో ఇన్-పేషెంట్ విభాగం.. ఆపరేషన్
థియేటర్ సేవలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;

“రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అన్నది మా కర్తవ్య నిర్వహణ సూత్రం”;

“ఒక సమగ్ర విధానంతో ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేసినప్పుడే
సమాజంలోని వివిధ వర్గాలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి”;

“లేమిని అవకాశాలుగా మార్చుకునే దిశగా మేము
అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నాం”;

“సామాన్య పౌరుల జీవన సౌలభ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటే జాతీయ
ఆస్తులు సృష్టించబడి జాతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు అందివస్తాయి”;

Posted On: 12 JUL 2022 2:56PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేవగఢ్‌లో దేవ్‌గఢ్‌లో రూ.16,800 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. జార్ఖండ్‌ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ రమేష్‌ బైస్‌, ముఖ్యమంత్రి శ్రీ హేమంత్‌ సోరెన్‌, కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బాబా బైద్యనాథ్‌ ఆశీస్సులతో నేడు రూ.16,800 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆధునిక అనుసంధానం, విద్యుత్‌, ఆరోగ్యం, ధర్మం, పర్యాటకం తదతర రంగాలకు ఎనలేని ఊపునిస్తాయని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నదనే సూత్రం ఆధారంగా ఎనిమిదేళ్ల నుంచీ దేశం శ్రమిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కర్తవ్య నిర్వహణ సూత్రం ఆధారంగానే గత 8 సంవత్సరాలుగా జార్ఖండ్‌ను జాతీయ రహదారులు, రైలు-విమాన-జల మార్గాలతో అనుసంధానించేందుకు అన్నివిధాలా కృషి సాగుతున్నదని ఆయన గుర్తుచేశారు. ఈ మౌలిక వసతులన్నీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతాయని చెప్పారు.

   జార్ఖండ్‌లో నేడు రెండో విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని ప్రధాని అన్నారు. ఇది బాబా బైద్యనాథ్ భక్తులకు ఎనలేని సౌలభ్యాన్నిస్తుందని తెలిపారు. ఉడాన్ ప‌థ‌కం ద్వారా సామాన్యుల‌కు విమాన ప్ర‌యాణాన్ని అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ప్ర‌భుత్వ కృషి ఫలితాలు ఇవాళ దేశ‌మంతటా ప్రస్ఫుటం అవుతున్నాయని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు. ఉడాన్‌ పథకం కింద గత 5-6 ఏళ్లలో విమానాశ్రయాలు, హెలిపోర్టులు, జల విమానాశ్రయాల ద్వారా దాదాపు 70 కొత్త ప్రదేశాలు సంధానించబడినట్లు తెలిపారు. నేడు సాధారణ పౌరులకు 400కుపైగా కొత్త మార్గాల్లో విమానయాన సౌకర్యం లభిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా కోటి మందికిపైగా సామాన్యులు చాలా సరసమైన ధరతో విమానయాన అనుభవం పొందారని, వీరిలో చాలామంది తొలిసారి ప్రయాణికులేనని వెల్లడించారు. దేవగఢ్‌ నుంచి కోల్‌కతాకు ఇవాళ్టినుంచి ప్రారంభమైన విమానయాన సేవలు త్వరలోనే రాంచీ, ఢిల్లీ, పాట్నాలకు విస్తరించనున్నాయని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. బొకారో, డుమ్కా నగరాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

   దేశంలో అనుసంధానంతోపాటు ధర్మం-ఆధ్యాత్మికత సంబంధిత కీలక ప్రదేశాలలో సౌకర్యాల కల్పనపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ‘ప్రసాద్’ పథకం కింద బాబా బైద్యనాథ్ ధామ్‌లో ఆధునిక సౌకర్యాలు విస్తరించబడ్డాయని వివరించారు. ఒక సమగ్ర విధానంతో ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేసినప్పుడు సమాజంలోని వివిధ వర్గాలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటమేగాక కొత్త సౌకర్యాల వల్ల కొత్త అవకాశాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు దేశం చేస్తున్న కృషితో జార్ఖండ్‌ రాష్ట్రానికి ఒనగూడే ఫలితాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి ఊర్జ గంగా యోజన’ పాత స్వరూపాన్ని మారుస్తున్నామని చెప్పారు. “లేమిని అవకాశాలుగా మార్చుకునే దిశగా మేము అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నాం” అని ఆయన చెప్పారు. గెయిల్ పరిధిలోని జగదీష్‌పూర్-హల్దియా-బొకారో-ధమ్రా పైప్‌లైన్‌లో భాగమైన బొకారో-అంగుల్ విభాగం జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని 11 జిల్లాల్లో నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్కును విస్తరింపజేస్తుందని వెల్లడించారు.

   బ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్” అన్నదే తమ తారకమంత్రమని ప్రధానమంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి దిశగా కొత్త మార్గాలు ఏర్పాడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా జార్ఖండ్‌ రాష్ట్రానికి లభిస్తున్న ప్రయోజనాలు నొక్కిచెబుతూ- ‘మేము అభివృద్ధి ఆకాంక్షకు ప్రాధాన్యం  ఇచ్చాం.. ప్రగతికాంక్షిత జిల్లాలపై దృష్టి కేంద్రీకరించాం’ అని వివరించారు. స్వాతంత్య్రం సిద్ధించిన చాలాకాలం తర్వాత విద్యుదీకరించిన 18 వేల గ్రామాల్లో అధికశాతం దారీతెన్నూలేని మారుమూల ప్రాంతాల్లో ఉన్నవేనని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కొళాయి నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లను చేరువ చేసేందుకు గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉద్యమ తరహాలో కృషి చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆధునిక సదుపాయాలు నేడు పెద్ద నగరాలను దాటి విస్తరించడాన్ని ప్రస్తావిస్తూ- సామాన్య పౌరుల జీవన సౌలభ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటే జాతీయ ఆస్తులు సృష్టించబడి జాతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు అందివస్తాయని చెప్పడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. “ఇది సరైన అభివృద్ధి.. ఈ ప్రగతి దిశగా మనం సమష్టి కృషిని మరింత వేగిరపరచాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

దేవగఢ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు

  • దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు బాబా బైద్యనాథ్ ధామ్‌ మతపరమైన గమ్యస్థానం. ఈ నేపథ్యంలో ఈ పవిత్ర ప్రదేశానికి ప్రత్యక్ష అనుసంధానంలో కీలక చర్యల కింద దేవగఢ్‌ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. దాదాపు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించారు. విమానాశ్రయ ప్రధాన భవనం ఏటా 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల నిర్వహణకు వీలుగా నిర్మితమైంది.
  • దేవగఢ్‌ ‘ఎయిమ్స్’ ఈ ప్రాంతమంతటా ఆరోగ్య సంరక్షణ రంగానికి ఒక వరం. ఈ నేపథ్యంలో దేవగఢ్‌ ‘ఎయిమ్స్’లోని ఇన్-పేషెంట్ విభాగం (ఐపీడీ), ఆపరేషన్ థియేటర్ సేవలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతో దేవగఢ్‌ ‘ఎయిమ్స్’ సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి దూరదృష్టికి అనుగుణంగా ఈ ఆస్పత్రి రూపొందింది. ప్రధానమంత్రి 2018 మార్చి 25న దేవగఢ్‌ ‘ఎయిమ్స్’కు శంకుస్థాపన చేశారు.
  • దేశవ్యాప్తంగా మతపరమైన ప్రాముఖ్యంగల ప్రదేశాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, అలాంటి అన్ని ఇతర ప్రదేశాల్లోనూ పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుకు ప్రధాని నిబద్ధతతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ప్రసాద్’ పథకం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన “దేవగఢ్‌ బైద్యనాథ్ ధామ్ అభివృద్ధి” ప్రాజెక్ట్ ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని ప్రారంభించిన పథకాల్లో- ఒక్కొక్కటి 2000 మంది యాత్రికుల సామర్థ్యంగల  రెండు పెద్ద తీర్థయాత్ర సమావేశ మందిరాల అభివృద్ధి; జల్సార్ సరస్సు తీరప్రాంతం అభివృద్ధి; శివగంగ చెరువు అభివృద్ధి వగైరాలున్నాయి. ఈ కొత్త సౌకర్యాలతో బాబా బైద్యనాథ్ ధామ్‌ను సందర్శించే లక్షలాది భక్తుల పర్యాటకానుభవం ఇనుమడిస్తుంది.
  • ప్రధానమంత్రి ప్రారంభోత్సవం/శంకుస్థాపన చేసిన ముఖ్యమైన పథకాల్లో రూ.10,000 కోట్లకుపైగా విలువైన బహుళ రహదారి ప్రాజెక్టులున్నాయి. ఈ మేరకు ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులలో గోర్హర్-బర్వాడ ఆరు వరుసల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-2); రాజ్‌గంజ్‌-ఛాస్‌ మార్గం (ఎన్‌హెచ్‌-32) పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతందాకా విస్తరణ పథకం ఉన్నాయి. ఇక శంకుస్థాపన చేసిన ప్రధాన ప్రాజెక్టులలో ‘ఎన్‌హెచ్‌-80’లోని మిర్జాచౌకి-ఫరక్కా సెక్షన్‌లో నాలుగు వరుసల రహదారి; ‘ఎన్‌హెచ్‌-98’లోని హరిహరగంజ్-పర్వా మోర్ మధ్య నాలుగు వరుసల రహదారి; ‘ఎన్‌హెచ్‌-23’లోని పాల్మా-గుమ్లా మార్గంలో నాలుగు వరుసల రహదారి; ‘ఎన్‌హెచ్‌-75’లోని కుచ్చెరి చౌక్- పిస్కా మోర్ సెక్షన్ దాకా ఎలివేటెడ్ కారిడార్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో అనుసంధానానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా సామాన్య పౌరులకు  రాకపోకల సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.
  • ఈ ప్రాంతం ప్రగతికి ఉద్దేశించిన దాదాపు రూ.3000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వీటిలో గెయిల్ పరిధిలోని జగదీష్‌పూర్-హల్దియా-బొకారో-ధమ్రా పైప్‌లైనుకు సంబంధించిన ‘బొకారో-అంగుల్’ విభాగం; బర్హి, హజారీబాగ్ వద్ద హెచ్‌పీసీఎల్‌ కొత్త ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్; బీపీసీఎల్‌ బొకారో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్; ఝరియా బ్లాక్‌లో పర్బత్‌పూర్ గ్యాస్ సేకరణ కేంద్రం, ఓఎన్‌జీసీకి చెందిన కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) సదుపాయాలకు శంకుస్థాపన చేశారు.
  • ప్రధానమంత్రి రెండు రైల్వే ప్రాజెక్టులు… గొడ్డ-హన్స్‌దిహా సెక్షన్‌ విద్యుదీకరణ; గర్వా-మహురియా డబ్లింగ్ పథకాలను జాతికి అంకితం చేశారు. వీటితో పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేంద్రాలకు వస్తు సరఫరా దిశగా నిరంతర రవాణా సదుపాయం కలుగుతుంది. దుమ్కా-అసన్సోల్ మధ్య రైళ్ల రాకపోకల సౌలభ్యం కూడా కలుగుతుంది. మరోవైపు మూడు రైల్వే ప్రాజెక్టులకూ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వీటిలో రాంచీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి; జాసిదిహ్ బైపాస్ లైన్, గొడ్డాలో ఎల్‌హెచ్‌బి కోచ్ నిర్వహణ డిపో ఉన్నాయి.   ప్రతిపాదిత రాంచీ స్టేషన్‌ పునరాభివృద్ధి పథకంలో ఫుడ్ కోర్ట్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, కెఫెటేరియా, ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాళ్లు తదితరాలుసహా ప్రపంచస్థాయి ప్రయాణిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

 

***(Release ID: 1841123) Visitor Counter : 152