ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబై రాజ్ భవన్ వద్ద జల్ భూషణ్ భవనం. తిరుగుబాటుదారుల గ్యాలరీ ప్రారంభించిన ప్రధానమంత్రి
“జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్ వరకు ఎందరో సంఘసంస్కర్తలకు స్థానం అయిన సమున్నత చరిత్ర మహారాష్ట్రకి ఉంది”
“భారత స్వాతంత్ర్య సమరాన్ని కొన్ని చెదురుమదురు సంఘటనలకే పరిమితం చేయాలన్న ధోరణికి భిన్నంగా లెక్కలేనంత మంది ప్రజల “తపస్య”గా అది రూపాంతరం చెందింది”
“స్థానికం నుంచి ప్రపంచ స్థాయి”కి అన్న స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి మా ఆత్మ నిర్భర్ అభియాన్ బలం”
“మహారాష్ట్రలోని పలు నగరాలు 21వ శతాబ్ది వృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి”
Posted On:
14 JUN 2022 6:21PM by PIB Hyderabad
ముంబైలోని రాజ్ భవన్ లో జల్ భూషణ్ భవనాన్ని, తిరుగుబాటుదారుల గ్యాలరీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వట పూర్ణిమ, కబీర్ జయంతిలను పురస్కరించుకుని ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పలు రంగాల్లో మహారాష్ట్రం యావద్దేశానికి స్ఫూర్తిదాయకం అయిందన్నారు. జగద్గురు శ్రీ సంత్ తుకారాం మహరాజ్ నుంచి బాబా సాహెబ్ అంబేద్కర్ వరకు ఎందరో సంఘసంస్కర్తలకు స్థానం అయిన సమున్నత చరిత్ర రాష్ర్టానికి ఉన్నదని ఆయన చెప్పారు. సంత్ ధ్యానేశ్వర్ మహరాజ్, సంత్ నామ్ దేవ్, సంత్ రామ్ దాస్, సంత్ చొఖమేళ వంటి మహారాష్ట్రకు చెందిన ఎందరో దేశంలో కొత్త శక్తిని నింపారని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటం గురించి ప్రస్తావిస్తే ఛత్రపతి శివాజీ మహరాజ్, ఛత్రపతి శంభాజీ మహరాజ్ ప్రతీ ఒక్క భారతీయునిలో దేశభక్తి భావాన్ని శక్తివంతం చేశారని చెప్పారు. రాజ్ భవన్ లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి విలువలు, జ్ఞాపకాలను భద్రపరచడం, రాజ్ భవన్ ను లోక్ భవన్ గా తీర్చి దిద్దడంలోని స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
మనకి తెలిసో, తెలియకో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కొన్ని సంఘటనలకే పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. కాని అది ఎందరో ప్రజల తపస్యగా మారి స్థానికంగా జరిగిన సంఘటనలు జాతీయ స్థాయికి చేర్చడం ద్వారా ఒక సంఘటిత ప్రభావశక్తిగా రూపాంతరం చెందింది. మార్గాలు ఏవైనా కావచ్చు, సంకల్పం మాత్రం ఒక్కటే అని ప్రధానమంత్రి అన్నారు. సామాజికం, కుటుంబం, ఆదర్శం, ఉద్యమం జరిగిన ప్రదేశం అనే పరిధులు లేకుండా దేశవిదేశాల్లో ఎక్కడ జరిగినా పోరాట లక్ష్యం ఒక్కటే, అదే సంపూర్ణ స్వరాజ్య సాధన అయిందని చెప్పారు. బాల గంగాధర్ తిలక్, ఛపేకర్ సోదరులు, వాసుదేవ బల్వంత్ ఫడక్, మేడం బికాజీ కామా వంటి ఎందరో నాయకులు చేసిన అద్భుతమైన కృషిని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమం స్థానికంగానే కాకుండా ప్రపంచం అంతటా కూడా వ్యాపించిందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ స్థాయికి విస్తరించిందనేందుకు గదర్ పార్టీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు చెందిన అజాద్ హింద్ ఫౌజ్, శ్యామ్ జీ కృష్ణ వర్మ ప్రారంభించిన ఇండియా హౌస్ వంటివి మంచి ఉదాహరణలని ఆయన సూచించారు. “స్థానికం నుంచి ప్రపంచానికి వ్యాప్తి అనే ఆ స్ఫూర్తే నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కు పునాది” అని ఆయన చెప్పారు.
అంత ప్రాచుర్యానికి నోచుకోని యోధుల పట్ల నిర్లిప్త వైఖరి దేశంలో చాలా కాలం పాటు కొనసాగింది. శ్యాంమ్ జీ కృష్ణ వర్మ వంటి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిని దేశానికి తిరిగి తీసుకువచ్చే క్షణం కోసం తాను అధికారంలోకి వచ్చే వరకు ఎలా వేచి చూడాల్సివచ్చిందనేది ప్రధానమంత్రి వివరించారు.
ముంబై కలల నగరం అన్న విషయం ప్రస్తావిస్తూ మహారాష్ట్రలో 21వ శతాబ్ది వృద్ధి కేంద్రాలుగా నిలిచే అలాంటి నగరాలెన్నో ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒకపక్క ముంబైలో మౌలిక వసతులు పటిష్ఠం చేస్తూ మరో పక్క రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా ఆధునిక సదుపాయాలు పెంచుతున్నట్టు తెలిపారు.
దేశంలోని ప్రతీ ఒక్కరూ తాము ఏ పాత్ర పోషిస్తున్నామనే దానితో సంబంధం లేకుండా జాతీయ ప్రతినలు పటిష్ఠం చేయడం పైనే దృష్టి కేంద్రీకరించాలి అని చెబుతూ జాతీయాభివృద్ధికి తాను ప్రతిపాదించిన సబ్ కా ప్రయాస్ మంత్రాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
జల్ భూషణ్ 1885 నుంచి మహారాష్ట్ర గవర్నర్ అధికార నివాసంగా ఉంది. కాలం చెల్లిపోయి భవనం శిథిలం కావడంతో దాన్ని పడగొట్టి కొత్త భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. 2019లో గౌరవ రాష్ట్రపతి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్త భవన నిర్మాణంలో కూడా గతంలోని పాత భవనానికి గల విశిష్టతలన్నీ చెక్కు చెదరకుండా కాపాడారు. 2016లో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు రాజ్ భవన్ లో ఒక బంకర్ ను గుర్తించారు. గతంలో బ్రిటిష్ పాలకులు ఆయుధాలు, ఆయుధ సామగ్రి భద్రపరిచే రహస్య స్థావరంగా దాన్ని ఉపయోగించారు. 2019లో ఆ బంకర్ ను పునర్నిర్మించారు. బంకర్ లోని గ్యాలరీని మహారాష్ట్రకు చెందిన తిరుగుబాటు యోధుల స్మారక చిహ్నంగా, ప్రత్యేకత సంతరించుకున్న మ్యూజియంగా అభివృద్ధి చేశారు. 1946లో జరిగిన నౌకాదళ తిరుగుబాటులో పాల్గొన్న వాసుదేవ బలవంత్ ఫడ్కే, చపేకర్ సోదరులు, సావర్కర్ సోదరులు, మేడం బికాజీ కామా, వి.బి.గగోటే వంటి యోధులకు ఇది చక్కని నివాళిగా నిలిచింది.
(Release ID: 1834506)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam