ప్రధాన మంత్రి కార్యాలయం

హైదరాబాద్ లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవం వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగపాఠం

Posted On: 05 FEB 2022 6:26PM by PIB Hyderabad

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు,

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ నరేంద్ర తోమర్ గారు, శ్రీ జి. కిషన్ రెడ్డి గారు,

ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్, ఆన్ లైన్ వేదిక ద్వారా దేశ, విదేశాల నుంచి మరీ ముఖ్యంగా ఆఫ్రికానుంచి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ, ప్రత్యక్షంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ,

ఇవాళ వసంత పంచమి పండగ. ఇవాళ మనం చదువుల తల్లి, జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవిని పూజిస్తాము. మీరివాళ పనిచేస్తున్న ఈ రంగం జ్ఞానం-విజ్ఞానం, ఇనోవేషన్-ఇన్వన్షన్ ఆధారితమైనదే. అందుకే వసంత పంచమి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటుచేసుకోవడం ప్రత్యేకమైనదని భావిస్తున్నాను. ఇక్రిశాట్ స్వర్ణోత్సవం సందర్భంగా మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు.

మిత్రులారా,

50 ఏళ్లు పూర్తిచేసుకోవడమనేది ఓ సంస్థకు సంబంధించి చాలా ప్రత్యేకమైన, గర్వించే సమయం. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో సమయానుగుణంగా తమ భాగస్వామ్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తూ.. ఇక్రిశాట్ ను ఈ స్థాయికి చేర్చిన ప్రతి ఒక్కరూ అభినందనలకు అర్హులు. అలాంటి వారందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. ఇవాళ భారతదేశం స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ సంస్థ 50 ఏళ్లు పూర్తిచేసుకుంటుండటం యాదృశ్చికం. భారతదేశం స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకునే సమయానికి మీ సంస్థ 75 ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. భారతదేశం వచ్చే 25 ఏళ్లలో చేయాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని తదనుగుణంగా కార్యక్రమాలను ముందుకెళ్తున్న సమయంలో.. మీ సంస్థకు కూడా వచ్చే 25 ఏళ్లు అత్యంత కీలకమే.

మిత్రులారా,

మీవద్ద 5 దశాబ్దాల అనుభవం ఉంది. మీ ఈ ఐదు దశాబ్దాల అనుభవం.. భారత్ తోపాటు వివిధ దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు కూడా ఎంతో మేలు చేసింది. మీ పరిశోధన, మీ సాంకేతికత.. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని సులభం, సుస్థిరం చేసింది. కార్యక్రమానికి ప్రారంభంలో నేను ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రదర్శనను చూశాను. అక్కడ ఇక్రిశాట్ ఇన్నాళ్లుగా సాధించిన ప్రగతి కనిపించింది. నేలను, నీటిని సద్వినియోగ పరుచుకోవడం, పంటల వైవిధ్యత, వివిధ ఉత్పత్తి పద్ధతుల్లో వచ్చిన సానుకూల మార్పులు, ఆన్ ఫార్మ్ డైవర్సిటీలో పురోగతి, లైవ్ స్టాక్ ఇంటిగ్రేషన్ (వివిధ పశుజాతుల ఏకీకరణ), రైతులను మార్కెట్ తో అనుసంధానించడం వంటి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ వ్యవసాయాన్ని సుస్థిరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో పప్పుదినుసులు మరీ ముఖ్యంగా సెనగపప్పు (chick-pea) విషయంలో జరిగిన పురోగతిలో మీ పాత్ర చిరస్మరణీయం. రైతులతో కలిసి ఇక్రిశాట్ చేస్తున్న ఈ సమన్వయపూరిత పురోగతి వ్యవసాయాన్ని సశక్తం, సమృద్ధం చేస్తుంది.

ఇవాళ క్లైమేట్ చేంజ్ రీసర్చ్ ఫెసిలిటీ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీ రూపంలో రెండు కొత్త సౌకర్యాల కేంద్రాలను ప్రారంభించుకోవడం ఈ దిశగా మరింత ఉపయుక్తం అవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ పద్ధతుల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే విషయం మీకు చాలాబాగా తెలిసే ఉంటుంది. ఈ దిశగా భారతదేశం ఓ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. వాతావరణంలో మార్పులు, ప్రకృతివిపత్తులు కారణంగా ఎదురవుతున్న సమస్యల సందర్భంగా ప్రాణనష్టం గురించిన చర్చే జరుగుతుంది. కానీ మౌలికవసతులకు కలిగే నష్టం అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం.. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే మౌలికవసతుల కల్పన కోసం, తదనుగుణమైన పథకాలను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓ సంస్థను ప్రారంభించనుంది. ఇదేవిధంగా వ్యవసాయ రంగం కోసం మరో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం.

మిత్రులారా,

వాతావరణ మార్పులు ప్రపం చంలోని అన్ని దేశాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కానీ ఇందులో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది, సమాజంలోని అట్టడుగు వర్గాల వారే . వారివద్ద వనరులు తక్కువగా ఉంటాయి. సమాజంలో కనీస స్థితికి రావడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఇందులో మన సమాజంలోని చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారు. భారతదేశంలో 80-85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు వారిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే భారతదేశం వాతావరణ మార్పులపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని ప్రపంచానికి గుర్తుచేసింది. భారతదేశం 2070 నాటికి నెట్ జీరో లక్ష్యంగా పనిచేయాలని నిశ్చయించుకుంది. ఇందుకుగానూ లైఫ్- లైఫ్ మిషన్ – లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ను ఈ లైఫ్ మిషన్ అవసరాన్ని హైలైట్ చేస్తున్నాం. దీన్నే పర్యావరణ పరిరక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని బాధ్యులను చేస్తూ ‘ప్రొ ప్లానెట్ పీపుల్’ అనే ఉద్యమంగా ముందుకు తీసుకుపోనున్నాం. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. కేంద్ర ప్రభుత్వ కార్యాచరణలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. గత కొన్నేళ్లుగా చేస్తున్నట్లుగానే ఈసారి బడ్జెట్ లోనూ పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రతి వేదికపై, ప్రతి రంగంలో గ్రీన్ ఫ్యూచర్ భారత్ లక్ష్యాలకు మద్దతిచ్చేలా ఉంటుంది.

మిత్రులారా,

వాతావరణంతోపాటు ఇతర కారణాలతో భారతదేశ వ్యవసాయ రంగం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి మీలాంటి నిపుణులు, శాస్త్రవేత్తలు, సాంకేతికవేత్తలకు సుపరిచితమే. భారతదేశంలో 15 ఆగ్రో-క్లైమాటిక్ జోన్లు ఉన్నాయనే విషయం మీకు తెలిసిందే. మన దగ్గర వసంతం, గ్రీష్మం, వర్ష, శరత్, హేమంత, శిశిరం అనే ఆరు రుతువులన్నాయి. అంటే మన వద్ద వ్యవసాయానికి, వాతావరణంలో వచ్చే మార్పులకు సంబంధించిన ప్రాచీనమైన అనుభవం ఉంది. ఈ అనుభవం వలన కలిగిన లాభం ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా అందాలి. ఇందుకోసం ఇక్రిశాట్ వంటి సంస్థలు మరింతగా కృషిచేయాల్సి ఉంటుంది. ఇవాళ మేం దేశంలోని 170 జిల్లాల్లో డ్రాట్-ప్రూఫింగ్ (కరువు పరిస్థితులు)కు పరిష్కారం అందిస్తున్నాం. వాతావరణ సవాళ్లను ఎదుర్కొనడంలో మన ప్రయత్నాలు బ్యాక్ టు బేసిక్స్ (తిరిగి మూలాలకు వెళ్లడం), మార్చ్ టు ఫ్యూచర్ (భవిష్యత్తులోకి దూసుకెళ్లడం) అనే రెండు అంశాల సమ్మిళితంగా ఉంది. మా దృష్టంతా దేశంలోని 80 శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులపైనే ఉంది. వారికి మన అవసరం చాలా ఉంది. ఈ బడ్జెట్ లోనూ ప్రకృతిసేద్యం, డిజిటల్ వ్యవసాయం అంశాలపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఒకవైపు తృణధాన్యాలకు ప్రోత్సాహం, రసాయన రహిత వ్యవసాయానికి మద్దతిస్తూనే.. సోలార్ పంపులు మొదలుకుని, రైతు డ్రోన్ల వరకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. స్వాతంత్ర్య అమృత సమయం అంటే వచ్చే 25 ఏళ్లలో వ్యవసాయాభివృద్ధికి నేడు మనం తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకంగా మారుతాయి.

మిత్రులారా,

మారుతున్న భారత్ లో డిజిటల్ అగ్రికల్చర్ ఓ మహత్వపూర్ణమైన అంశం. ఇదే మన భవిష్యత్తు. ఈ రంగంలో మన యువకులు చాలా చక్కగా పనిచేయగలరు. డిజిటల్ సాంకేతికత ద్వారా మన రైతుకు ఏవిధంగా సాధికారత కల్పించగలమనేదానిపైనే నిరంతరం భారత్ ప్రయత్నిస్తోంది. పంట అంచాలైనా, భూముల రికార్డుల డిజిటలైజేషన్ అయినా, డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాలు, ఇతర న్యూట్రిషన్లను పంటలపై స్ప్రే చేయడమైనా, ఇలాంటి వాటన్నింటిలో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ప్రోత్సాహం అందిస్తున్నాం. రైతులకు తక్కువ ధరకే హైటెక్ సేవలందించేందుకు వ్యవసాయ పరిశోధన వ్యవస్థలతోపాటు ఈ రంగంలోని ప్రయివేటు అగ్రిటెక్ సంస్థలో కలిసి పనిచేస్తున్నాం. సరైన నీటిపారుదల అవకాశాల్లేని ప్రాంతాల్లోనూ రైతులకు ఎక్కువ ఉత్పత్తినిచ్చే సరైన విత్తనాలు అందించడం, నీటి నిర్వహణ విషయంలో ఐసీఏఆర్, ఇక్రిశాట్ ల భాగస్వామ్యం సత్ఫలితాలను అందిస్తోంది. దీన్ని డిజిటల్ అగ్రికల్చర్ ద్వారానే మరింతగా విస్తరించవచ్చు.

మిత్రులారా,

స్వాతంత్ర్య అమృతోత్సవ సమయంలో మనం ఎక్కువ వ్యవసాయాభివృద్ధితోపాటు సమగ్రాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిసారిస్తున్నాం. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమనే విషయం మీకందరికీ తెలిసిందే. వారికి అన్ని రకాలుగా సహాయం అందించేందుకు స్వయం సహాయక బృందాల ద్వారా కూడా కృషిచేస్తున్నం. భారతదేశంలోని పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి, వారికి సరైన జీవనవిధానాని అందించే శక్తిసామర్థ్యాలు వ్యవసాయానికే ఉన్నాయి. ఈ అమృతోత్సవ సమయంలో రైతుల ఇబ్బందులను దూరం చేస్తూ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చి రైతుల జీవితాలను ఉజ్వలంగా మార్చడంలో మరో కొత్త విధానం అవసరం. నీటిపారుదల సమస్యల కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాలు హరిత విప్లవంలో భాగం కాలేకపోవడాన్ని మనం గమనించాం. ఇందుకోసం మేం ద్విముఖ వ్యూహం తో పనిచేస్తున్నాం. ఒకవైపు జల సంరక్షణ చేస్తూ, మరోవైపు నదుల అనుసంధానం ద్వారా దేశంలోని నలుమూలలకు నీటిపారుదల అవకాశాలను విస్తృతం చేసే దిశగా పనిచేస్తున్నాం. కార్యక్రమం ప్రారంభంలో తిలకించిన ప్రదర్శనలో.. బుందేల్ ఖండ్ లో చేపట్టిన జలసంరక్షణ గురించి, ఆ ప్రాంతంలో నీటిని సద్వినియోగం చేసుకుంటూ ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ ద్వారా సాధిస్తున్న విజయాలను అక్కడున్న శాస్త్రవేత్త ఒకరు చాలా చక్కగా వివరించారు. మరోవైపు, జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ సేద్యం)పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాం. తక్కువ నీరు అవసరమున్న పంటలను ప్రోత్సహిస్తూ అందులోనూ సరికొత్త రకాలకు ఊతమందిస్తున్నాం. వంటనూనెల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతను పెంచుకునేందుకు మేం ప్రారంభించిన జాతీయ మిషన్.. మా సరికొత్త వ్యూహాన్ని మీకు వివరిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఆరున్నర లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగును పెంచడం మా లక్ష్యం. ఇందుకోసం భారత ప్రభుత్వం రైతులకు ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ఈ మిషన్ ఎంతో ఉపయుక్తం అవుతుంది. తెలంగాణలోని రైతులు పామాయిల్ ఉత్పత్తి విషయంలో ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్నారని తెలిసి హర్షిస్తున్నాను. వారికి కేంద్రం అన్ని రకాలుగా మద్దతుగా ఉంటుంది.

మిత్రులారా,

గత కొన్నేళ్లుగా భారతదేశంలో పంట అనంతర మౌలికవసతుల కల్పనను బలోపేతం చేశాం. గత కొన్నేళ్లుగా 35 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న శీతల గిడ్డంగుల వ్యవస్థను సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన వ్యవసాయ మౌలికవసతుల నిధి ద్వారానే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఇవాళ దేశంలో ఎఫ్ పీవోలు, అగ్రికల్చర్ వాల్యూ చైన్ లను నిర్మించే విషయంపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం జరుగుతోంది. దేశంలోని వేలమంది చిన్న రైతులను ఎఫ్ పీవోల ద్వారా సంఘటితం చేసి వారిని ఓ బలమైన మార్కెట్ శక్తిగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం,

మిత్రులారా,

భారతదేశంలోని వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో పనిచేసే విషయంలో ఇక్రిశాట్ వద్ద విస్తృతమైన అనుభవం ఉంది. అందుకే ఇలాంటి వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయాన్ని సుస్థిరం చేసే విషయంలో, భిన్నమైన పంటలను ఉత్పత్తి చేసే వ్యవస్థల నిర్మాణంలో మనం కలిసి పనిచేద్దాం. మీ అనుభవాన్ని తూర్పు, దక్షిణాఫ్రిగా దేశాలతో పంచుకునేందుకు ‘ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్స్’ను కూడా ప్రారంభించుకోవచ్చు. ధాన్యం ఉత్పత్తిని పెంచడం మాత్రమే మా లక్ష్యం కాదు. ఇవాళ భారతదేశంలో తగినంత ఆహార నిల్వలున్నాయి. అందుకే ప్రపంచంలోని అతిపెద్ద ఆహార భద్రత కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. మనం ఆహార భద్రతతోపాటు పౌష్టికాహార భద్రతపైనా ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన తరుణమిది. ఈ లక్ష్యంతోనే గత ఏడేళ్లుగా వివిధ బయో-ఫార్టిఫైడ్ వెరైటీలను వృద్ధి జరిగింది. దీంతో ఇకపై తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల వైవిధ్యతకోసం, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఎక్కువ ఉత్పత్తి సాధించడం, వివిధరకాలైన చీడపురుగులు, వివిధ వ్యాధులనుంచి పంటను కాపాడుకునే బలవర్ధక, వ్యాధినిరోధక వంగడాలను రూపొందించుకోవడంపై మరింత పనిచేయాల్సిన అవసరం ఉంది.

మిత్రులారా,

ఇక్రిశాట్, ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ సమిష్టిగా మరొక ముఖ్యమైన అంశంపై పనిచేసే అవకాశం ఉంది. అది బయోఫ్యూయల్ రంగం. మీరు స్వీట్ సార్ఘమ్ (Sweet Sorghum) పంట ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. అయితే నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని రైతులకోసం అధిక ఉత్పత్తిని ఇచ్చే, ఎక్కువ బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే వంగడాలను, విత్తనాలను వృద్ధి చేయండి. విత్తనాల ఉత్పత్తి ఎలా ఉండాలి, వాటిపట్ల రైతుల్లో విశ్వాసం పెంచే విషయంలో మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది.

మిత్రులారా,

మీలాంటి సృజనాత్మకమైన వారి సహాయంతో, ప్రజల భాగస్వామ్యంతో, సామాజిక బాధ్యతతో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలు పొందగలమనే విశ్వాసం నాకుంది. భారతదేశంతోపాటు ప్రపంచ రైతుల జీవితాలను ఉజ్వలంగా మార్చే విషయంలో మీకు చాలా అనుభవం, సమర్థత ఉంది. ఉన్నతమైన ఫలితాలనిచ్చే సాంకేతిక పరిష్కారాలను అందించండి.

ఈ ఆకాంక్షతో మరోసారి ఇక్రిశాట్ కు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వారి గతాన్ని అభినందిస్తూ.. ఉజ్వలమైన భవిష్యత్తును కాంక్షిస్తూ.. భారతదేశ రైతులకు గౌరవాన్ని కల్పించడంలో మీ కృషి ఇలాగే ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదములు!

***



(Release ID: 1795840) Visitor Counter : 155