రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారు 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

Posted On: 25 JAN 2022 7:45PM by PIB Hyderabad

ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం. దేశ, విదేశాల్లోని మీ అందరికీ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

1. మన అందరికీ భారతీయత అనేది సాధారణం. 1950 వ సంవత్సరంలో ఇదే రోజున మన అందరికోసం అత్యంత పవిత్రమైన రాజ్యాంగం లాంఛనంగా రూపుదిద్దుకుంది. ఆరోజు భారతదేశం పెద్ద ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రజలమైన మనం స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని ప్రారంభించుకున్నాం.  విభిన్నమైన, పటిష్టమైన మన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. ఈ సమైక్య స్ఫూర్తి తో సంఘటిత దేశ భావనతో ప్రతి సంవత్సరం ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకుంటున్నా స్ఫూర్తి మాత్రం ఎప్పుడూ లేనంత పటిష్టంగా ఉంది.

2. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సాధన స్వప్నంతో, ఎనలేని సాహసంతో ముందుకు సాగుతూ ప్రజల్లో పోరాట జ్వాలను రగిలించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుందాం. రెండు రోజుల కిందట అంటే జనవరి 23న మనమందరం జై హింద్ నినాదంతో ప్రసిద్ధులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి ఉత్సవాన్ని పాటించాం. స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చూపిన తెగువ, భారత్ ను అందరూ గర్వించేలా చేయాలన్న ఆయన కల మనల్ని అందరికీ స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది.

3. రాజ్యాంగ పత్రాన్ని తయారు చేసేందుకు ఏర్పాటైన రాజ్యాంగ సభలో ఆ తరానికి చెందిన అద్భుతమైన మేధా సంపన్నులు ఉండటం మన అదృష్టం. వారు మన మహోన్నత స్వాతంత్ర్య సమరంలో దీపధారులై నడిచారు. చాలా ఏళ్ళ తర్వాత భారతీయ ఆత్మ పునర్ జాగృతమవుతున్నది. అసాధారణమైన నాటి స్త్రీలు, పురుషులు కొత్త ఉదయం కోసం ముందు నిలిచారు. వారంతా ప్రతి అధికరణం, ప్రతి వాక్యం, ప్రతి పదం  ప్రజల శ్రేయస్సుకు దోహదకారిగా ఉండాలన్న దృష్టితో  ప్రజల తరఫున ఆలోచించి పొందుపరచారు.
మూడేళ్ల పాటు వారి చర్చ సాగింది. సంతోషకరమైన విషయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా నిర్మాణ సంఘానికి అధ్యక్షులుగా ఉండి రాజ్యాంగ పత్రానికి తుది రూపం ఇచ్చారు. అదే మనకు స్థాపన పత్రంగా చేతికందింది.

4. ప్రభుత్వ నిర్వహణ వివరాలను రాజ్యాంగ పాఠంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి ఆదేశిక సూత్రాల్లో సంగ్రహంగా పేర్కొన్నారు. మన గణతంత్రానికి ఆ సూత్రాలు పునాదిగా నిలుస్తున్నాయి.ఈ విలువలు మనకు వారసత్వంగా నిలుస్తున్నాయి.

5.  ప్రాథమిక హక్కులకు, పౌరుల ప్రాథమిక విధులకు మన రాజ్యాంగంలో ముఖ్యమైన స్థానం వుంది. హక్కులు, బాధ్యతలు అనేవి ఒకే నాణానికి రెండు వైపులు అని భావించాలి. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు ప్రజలు ప్రాథమిక హక్కులు అనుభవించడానికి తగిన వాతావరణం కల్పిస్తాయి. దేశ సేవ  చేయటం ద్వారా ప్రాథమిక విధులు నిర్వహించవచ్చు. అలా చేయడం వల్ల కోట్లాదిమంది స్వచ్ఛ భారత్ అభియాన్ ను, covid 19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమాలుగా మలిచాయి. ఇటువంటి  కార్యక్రమాలు గొప్ప ప్రతిష్టను చేకూర్చడమే కాకుండా మన పౌరులను బాధ్యతాయుతమైన వారుగా చేశాయి. మన ప్రజలు ఇదేవిధంగా జాతీయ ప్రయోజనదాయకమైన కార్యక్రమాలను పటిష్టంగా కొనసాగిస్తూ అందులో క్రియాశీలక భాగస్వాములుగా ఉంటూ తమ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారని నేను భావిస్తున్నాను.

6. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం చట్టం చేసి తీర్మానం ఆమోదించింది. ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే రాజ్యాంగం రెండు నెలల తర్వాత అమల్లోకి వచ్చింది. 1930లో ఇదే రోజున మనం సంపూర్ణ స్వరాజ్యం సాధిస్తామన్న తీర్మానం చేసుకున్నాం. 1930 నుంచి 1947 వరకు ప్రతి సంవత్సరం జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందుకే రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఆరోజును ఎన్నుకున్నాం.

7. 1930లో మహాత్మా గాంధీ పూర్ణ స్వరాజ్ దినాన్ని ఏ విధంగా జరుపుకోవాలో పౌరులకు ఈ విధంగా సలహా ఇచ్చాడు. ఆయన మాటల్ని నేను యథాతథంగా పేర్కొంటాను. మనం పూర్ణ స్వరాజ్ ను అహింసా, సత్యమార్గంలోనే సాధించాలి. ఆత్మశుద్ధి ద్వారానే మనం పని చేయగలం కాబట్టి మనలో వున్న శక్తితో ఇటువంటి నిర్మాణాత్మక పనికి ఈ రోజును నిర్ణయిద్దాం.

8. గాంధీజీ సలహా కాలంతో నిమిత్తం లేనిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే స్ఫూర్తితో మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చూసి ఉంటే ఆయన ఎంతో సంతోషించేవారు.  మనం ఆత్మావలోకనం చేసుకుని ఉత్తమ మానవులుగా కావటానికి, వెలుపలికి చూసి  మన దేశాన్ని ఉత్తమ దేశంగా, ఉత్తమ ప్రపంచంగా చేసేందుకు ఇతరులతో చేతులు కలిపి పనిచేయాలని గాంధీజీ భావించారు.

9. ప్రియమైన దేశ వాసులారా! ఇప్పుడు అవసరమైనంత సహాయం ప్రపంచానికి ఇంతకుముందెప్పుడూ ఉండి ఉండదు. గత రెండేళ్లుగా మానవాళి కరోనా వైరస్ తో పోరాడుతూనే ఉంది. వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాని ప్రభావానికి లోనయింది. ప్రపంచం అసాధారణమైన కష్టాలను అనుభవిస్తోంది. కొత్త వేరియంట్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ కేసులు పెరుగుతూ కొత్త సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఇది మానవజాతికి అసాధారణమైన సవాలుగా పరిణమించింది.

10. మనదేశంలో మహమ్మారి నిర్వహణ అందరికీ చాలా కష్టతరంగా ఉండింది. మనకు జన సాంద్రత ఎక్కువ. వర్ధమాన దేశంగా ఈ కనిపించని శత్రువుతో పోరాడటానికి అవసరమైన సదుపాయాలు, వనరుల స్థాయి మనకు లేదు. కానీ ఇలాంటి కష్ట కాలంలోనే దేశం గట్టి సంకల్పంతో ముందుకు సాగడంతో విజయం సాధ్యమైంది. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మన కృషి సాటిలేని విధంగా సాగిందని నేను గర్వంగా చెప్పగలను. మొదటి సంవత్సరంలోనే ఆరోగ్య మౌలిక సౌకర్యాలను పెంచి ఇతరులకు కూడా సహాయం చేసే స్థాయిని అందుకున్నాం. రెండవ సంవత్సరం వచ్చేసరికల్లా మనం  దేశీయంగా వాక్సిన్లు అభివృద్ధి పరచి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాము. ఈ కార్యక్రమం త్వరితగతిన ముందుకు సాగుతున్నది. అనేక దేశాలకు వాక్సిన్లతో పాటు ఆరోగ్యపరమైన ఇతర సహాయం  కూడా చేయగలిగాం. మన దేశం అందించిన సహకారాన్ని అంతర్జాతీయ సంస్థలు ఎంతగానో అభినందించాయి.

11. కొన్ని కష్టాలు కూడా వస్తున్నాయి. దురదృష్టవశాత్తు వైరస్ కొత్త రూపాలతో వెనక్కి మళ్లీ వచ్చింది. అసంఖ్యాక కుటుంబాలు ఈ బాధను అనుభవిస్తున్నాయి. మనందరి ఆపద మాటలకు అందని విధంగా ఉంది. ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగే పరిస్థితి ఉంది. అదొక్కటే సంతోషించదగిన విషయం. మహమ్మారి ఇంకా విస్తరిస్తున్నది. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా చాలా అవసరం. మన శాస్త్రవేత్తలు, నిపుణులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించడం ప్రతి పౌరుని పవిత్ర జాతీయ కర్తవ్యంగా పరిణమించింది. ఈ కర్తవ్యాన్ని వ్యాధి మనల్ని వీడిపోయే వరకు కొనసాగించాలి.

12.  భారతీయులమంతా ఒక కుటుంబంగా ఎలా కలిసి ఉండగలిగామని ఈ సంక్షోభకాలం మనల్ని ప్రశంసించేలా చేసింది. ఒకరిపైన ఒకరు ఎంతగా ఆధారపడి ఉంటామనేది మనం తెలుసుకోగలిగాం. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కాలానుగుణంగా వ్యవహరించారు. అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో గంటల పర్యంతం నిర్విరామంగా పని చేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందించారు.ఇతరులు దేశం ముందుకు సాగేలా  వస్తు సేవల పరఫరా వ్యవస్థను ముందుకు నడిపారు. అవసరమైన సందర్భాల్లో  కేంద్ర, రాష్ట స్థాయి నాయకత్వం, విధాన నిర్ణేతలు, పరిపాలకులు, ఇతరులు సందర్భానుసారం సేవలందించారు.

13. అలా అందరి ప్రమేయం వల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి ముందుకు సాగుతోంది. గత సంవత్సరం అననుకూల పరిస్థితుల్లో తట్టుకొని నిలబడి ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ ఆశావహమైన వృద్ధిరేటు నమోదు చేసే పరిస్థితికి చేరడం భారతదేశ స్ఫూర్తికి ఒక నిదర్శనం. ఇది గత సంవత్సరం ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ విజయాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం అన్ని ఆర్థిక విభాగాల పై ప్రత్యేక దృష్టి నిలిపి అవసరమైన నిరంతర సహాయమందించింది. వ్యవసాయం, తయారీ రంగాల్లో మెరుగైన పరిస్థితి కారణంగా ఆశాజనకమైన ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. మన రైతులు ముఖ్యంగా చిన్న కమతాలు కలిగిన యువ రైతులు ఉత్సాహంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది.

14. ప్రజలకు ఉపాధి కల్పించడంలో, ఆర్ధిక వ్యవస్థ ప్రగతిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. వినూత్న ఆలోచనలు కలిగిన మన యువఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అంకుర పరిశ్రమల సానుకూల వాతావరణాన్ని సమర్థంగా వినియోగించుకొని విజయాలు సాధిస్తూ కొత్త బెంచ్ మార్కును నెలకొల్పుతున్నారు. ప్రతి నెలా మిలియన్ల కొద్దీ డిజిటల్ లావాదేవీలు జరగడం ద్వారా మన డిజిటల్ చెల్లింపుల వేదిక విశేషమైన ప్రగతికి నిదర్శనంగా వుంది.

15. జనాభా వల్ల ప్రయోజనాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా అద్భుతమైన వాతావరణాన్ని కల్పించింది. దీనితో సంప్రదాయ మూల్యాలు, ఆధునిక నైపుణ్యాన్ని కలగలిపి మంచి వాతావరణాన్ని సృష్టిస్తోంది. ప్రపంచంలోని 50 వినూత్న ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం అగ్ర దేశాల్లో స్థానం సంపాదించడం సంతోషాన్ని కలిగిస్తోంది. సమగ్రాంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే ప్రతిభను పెంపొందించే సామర్థ్యం మనకు ఉందని చెప్పడం సంతృప్తి కలిగించే విషయం.

16. మహిళలూ సజ్జనులారా!

గత సంవత్సరం మన క్రీడాకారులు కూడా ఒలింపిక్స్ లో తమ ఆట తీరుతో మనకు ఖ్యాతి తీసుకొచ్చారు. ఈ ఛాంపియన్స్ ఆత్మవిశ్వాసం నేటి మిలియన్ల యువతకు స్ఫూర్తి కలిగిస్తుంది.

17. ఇటీవలి నెలల్లో వివిధ రంగాల్లో మనవారు తమ నిబద్ధత, కృషి ద్వారా మన దేశాన్ని, సమాజాన్నిపటిష్ట పరుస్తున్న చెప్పుకోదగిన ఘటనల్ని చూస్తున్నాను. అంకిత భావం కలిగిన భారత నౌకాదళానికి చెందిన బృందాలు, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ తో కలిసి దేశీయంగా అత్యాధునికమైన విమాన వాహక ఐఏసి విక్రాంత్ ను నిర్మించారు. దాన్ని నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి ఆధునిక సైనిక సామర్థ్యాల వల్ల ప్రపంచంలోనే నౌకాదళ అగ్రదేశాల సరసన మన దేశాన్ని పరిగణించడం జరుగుతుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా మనం ముందుకు సాగుతున్నామని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అంతేకాకుండా  ఒక ప్రత్యేకమైన అనుభవం నన్ను చాల ఆకర్షించింది. హర్యానాలో భివాని జిల్లా సూయి అనే ఒక గ్రామంలో కొంతమంది  అక్కడి పౌరులు గ్రామాన్ని స్వ ప్రేరిత్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద చైతన్యవంతమైన, శ్రద్ధతో కూడిన మంచి పనులు చేయడం సంతోషకరం. తన జన్మస్థలమైన గ్రామ రుణం తీర్చుకునే దృష్టితో ఈ పనులు చేసిన తీరు ప్రశంసనీయం. జన్మ భూమి పట్ల జీవితాంతం గౌరవ ప్రపత్తులతో మంచి పనులు చేసి అక్కడి ప్రజల అభిమానం చూరగొన్న తీరు ఒక ఉదాహరణ. నూతన భారతం ఆవిర్భవిస్తోంది అనే నా విశ్వాసాన్ని ఇది సుస్థిరం చేస్తుంది. పటిష్టమైన భారతం, ఒక చైతన్యవంతమైన భారతం, శక్తియుత భారతం, సంవేదన శీలభారతం.. ఇవి సాకారం అవుతున్నాయి. ఈ ఉదాహరణలతో స్ఫూర్తి పొంది ఇతర విజ్ఞులయిన ప్రజలు తమ తమ గ్రామాల, నగరాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారు.

18. ఈ సందర్భంగా నా వ్యక్తిగత అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. గత సంవత్సరం జూన్ లో కాన్పూర్ దేహత్ జిల్లాలోని నా స్వగ్రామమైన పరాంఖ్ సందర్శించే అవకాశం కలిగింది. సహజంగా పవిత్రమైన  జన్మస్థలం పట్ల  గౌరవం ప్రకటించాలని భావించాను. నా ఊరి చలవ వల్లనే కదా రాష్ట్రపతి భవన్ దాకా చేరగలిగానని నా నమ్మకం. ఆ పూజ్యభావంతో  నేలకు నా నుదురు  తాకించాను. నేను ప్రపంచంలో ఎక్కడున్నా నా ఊరు, దేశం నా హృదయం లో మెదులుతాయి. భారత దేశ ప్రజలకు నా మనవి. జీవితంలో ప్రతిభతో, కృషితో పైకి వచ్చినవారు మీ మూలాలు మీ ఊరిని, మీ పట్టణాన్ని, మీ నగరాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అంతేకాదు ఏ రూపంలోనైనా మీ జన్మస్థలానికి, మీదేశానికి సేవ చెయ్యండి. విజయాలు సాధించిన వారంతా తమ జన్మస్థలాల అభివృద్ధికి చిత్తశుద్ధిథో పాటుపడండి. ఆ రకంగా ప్రాంతీయ అభివృద్ధి ద్వారా దేశం యావత్తూ ప్రయోజనం పొందుతుంది.

19. ప్రియమైన తోటి పౌరులారా! ఈరోజు మన సైనికులు, రక్షణ సిబ్బంది గర్వకారణమైన దేశ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. హిమాలయాల్లో భరించలేని చలిలో, కాల్చి వేసే ఎడారిలో  తమ కుటుంబాలకు దూరంగా మాతృభూమిని కాపాడుతున్నారు. రక్షణ దళాలు మన సరిహద్దులను నిరంతరం కాపలాకాస్తున్నాయి. పోలీసు సిబ్బంది దేశంలో అంతర్గత భద్రతను కొనసాగిస్తున్నారు. దీనివల్ల తమ తోటి ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి. సాహసవంతుడైన సైనికుడు విధినిర్వహణలో మరణిస్తే దేశమంతా కలత చెందుతుంది. గత నెల ఒక దురదృష్టకరమైన ప్రమాదం జరిగి దేశంలో గొప్ప వీరుడైన కమాండర్ బిపిన్ రావత్ ను, ఆయన భార్యను, మరి కొందరు సైనికులను పోగొట్టుకున్నాం. దేశమంతా ఈ విషాదకరమైన సంఘటనకు తీవ్రంగా బాధపడింది.

మహిళలు, సజ్జనులారా!

దేశ భక్తి అనేది పౌరుల్లో విధి నిర్వహణ పట్ల అనురక్తిని పెంపొందిస్తుంది. వైద్యులయినా, న్యాయవాదులైనా,  కార్యాలయ ఉద్యోగులైనా, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కార్మికులైనా తమ విధిని చక్కగా, సమర్థవంతంగా నిర్వర్తిస్తే అది దేశానికి చేసే అత్యుత్తమ సేవ అవుతుంది.

21. సైనిక దళాల్లో ఇది మహిళల సాధికారతకు ప్రత్యేకమైన సంవత్సరం. సైనిక దళాల సర్వోన్నత అధికారిగా నేను చాలా సంతోషిస్తున్నాను. మన  ఆడపడుచులను కొత్త కొత్త విభాగాల్లో నియమించేందుకు పర్మినెంట్ కమిషన్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాదు. సైనిక దళాల్లో ప్రతిభకు ద్వారాలు తెరిచి సైనిక్ స్కూల్స్ ద్వారా, ప్రతిష్ఠాకరమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా సైన్యంలోకి మహిళలను చేర్చుకోవడం జరుగుతుంది.  స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఏర్పడుతుంది. సైనిక దళాలు ప్రయోజనం పొందుతాయి.

22. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి మనదేశం ఈనాడు ఉత్తమ స్థానంలో ఉందని నేను విశ్వసిస్తాను. 21వ శతాబ్దం వాతావరణ మార్పు యుగంలో చేరింది. మన దేశం ప్రపంచ వేదిక మీద నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రత్యేకించి పునరుత్పాదక ఇంధనం మొదలైన రంగాల్లో ప్రతిష్ఠాత్మక స్థానాన్ని చేపడుతోంది. మనమందరం గాంధీజీ సలహా గుర్తుంచుకొని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు సహాయం చేద్దాం. ప్రపంచమే ఒక కుటుంబం అని మన దేశం ఎల్లప్పుడూ భావిస్తున్నది. విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన నుంచి స్ఫూర్తి పొంది మన దేశం, యావత్ ప్రపంచ సమాజం మరింత సమానత్వం, సౌభాగ్యంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతాయి.

23. ప్రియమైన తోటి పౌరులారా! ఈ సంవత్సరం మన దేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తయిన మైలురాయిని దాటబోతోంది. ఈ సందర్భాన్ని ఆజాదీ కా అమృత మహోత్సవంగా నిర్వహించుకుంటున్నది. ప్రజలు ప్రత్యేకించి యువతీ యువకులు ముఖ్యమైన సంవత్సరంలో జరుగుతున్న విభిన్న కార్యక్రమాలు, ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఆనందించవలసిన విషయం. తరువాతి తరం మాత్రమే కాకుండా మనమందరమూ గతంతో మళ్లీ అనుసంధానమయ్యే అద్భుతమైన అవకాశమిది. మన స్వాతంత్ర్య సమరం ఎంతో స్ఫూర్తిదాయకమైన సంఘటన. స్వాతంత్ర్యం సాధించిన ఈ 75 వ సంవత్సరంలో అలనాటి జాతీయోద్యమ విలువలను మరొకసారి తెలుసుకుందాం. చాలామంది పురుషులు , స్త్రీలు మనకు స్వాతంత్ర్యం  సంపాదించడం కోసం తమ ప్రాణాలను అర్పించారు. మనం ఈనాడు ఆనందంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారకులు వారే. మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు ఊహింపరాని చిత్రహింసలు అనుభవించారు. లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమరుల త్యాగాలను ఘనంగా స్మరించుకుందాం.

24. ప్రియమైన మహిళలు, సజ్జనులారా! భారత్ ప్రాచీనమైన నాగరికత కలిగిన దేశం. కానీ గణతంత్ర దేశంగా చిన్నదే. మనకు దేశ నిర్మాణం ఒక నిరంతర కృషితో కూడింది. ఒక కుటుంబంలో  ఉన్నట్లే దేశంలోనూ తరువాతి తరం యొక్క మేలైన భవిష్యత్తు కోసం ఈతరం పని చేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు సామ్రాజ్యవాద దోపిడి మనల్ని తీవ్రమైన పేదరికంలో వదిలివెళ్లింది. కానీ 75 ఏళ్ల లో మనం చెప్పుకోదగిన ప్రగతిని సాధించాం. ఇప్పుడు వచ్చే తరం కోసం నూతన అవకాశాలు నిరీక్షిస్తున్నాయి. మనయువత ఈ అవకాశాలను స్వీకరించి విజయాల దిశలో కొత్త మైలురాళ్లను లిఖించాలి. ఈ శక్తితో, విశ్వాసంతో, ఔత్సాహికతతో మన దేశం ప్రగతి మార్గంలో ముందుకు సాగి తప్పనిసరిగా ప్రపంచ సమాజంలో తనదైన స్థానాన్ని, సముచితమైన అవకాశాల్ని అందుకుంటుందని  ఆశిస్తున్నాను.
25. మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

జై హింద్.



(Release ID: 1792631) Visitor Counter : 394