ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

పత్తికి మద్దతు ధర అందించే ప్రక్రియకు సి.సి.ఇ.ఎ. ఆమోదం.


2014-15నుంచి 2020-21వరకూ వర్తింపు ధర మద్దతుకోసం సి.సి.ఐ.కి రూ.17,408.85 కోట్లు

Posted On: 10 NOV 2021 3:44PM by PIB Hyderabad

  పత్తి ధరవిషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్.కు (సి.సి.ఐ.కి) రూ. 17,408.85 కోట్లు అందించే ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్తతలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.) ఆమోదముద్ర వేసింది. 2014-15నుంచి 2020-21వ సంవత్సరం వరకూ (అంటే,..2021వ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరు వరకూ) గడిచిన కాలానికి ఈ మద్దతు అందించారు.

   పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వారికి ధర విషయంలో మద్దతు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-15 పత్తిసాగు సంవత్సరంనుంచి 2020-21 పత్తిసాగు సంవత్సరంవరకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో పత్తి రైతుల భాగస్వామ్యం పెంచేందుకు, వారిని మరింతగా సమ్మిళితం చేసేందకు ఈ చర్య దోహదపడుతుంది. ధరకు మద్దతు ఇచ్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం,.. పత్తి ధరలను స్థిరీకరించడంతోపాటుగా, రైతుల ఇబ్బందులను తొలగిస్తుంది.

   దేశంలో సాగుచేసే ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తిపంట ముఖ్యమైనది. పత్తిపంట సాగుతో దాదాపు 58లక్షల మంది పత్తి రైతులకు జీవనోపాధి లభిస్తోంది. అంతేకాక, 4-5 కోట్లమంది ప్రజలు పత్తి సంబంధిత ప్రాసెసింగ్ కార్యకలాపాల్లోను, పత్తి వాణిజ్యంలోనూ ఉపాధిని పొందుతున్నారు.

  2020-21వ సంవత్సరపు పత్తి సీజన్.లో కోటీ 33లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. దాదాపు 3.60కోట్ల బేళ్ల మేర పత్తి ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే మొత్తం పత్తి ఉత్పత్తిలో దాదాపు 25శాతం భారతదేశంలోనే ఉత్పాదన అవుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ (సి.ఎ.సి.పి.) సమర్పించిన సిఫార్సుల మేరకు విత్తన పత్తికి కనీస మద్దతు ధరను (ఎం.ఎస్.పి.ని) భారత ప్రభుత్వం ఖరారు చేసింది.

   పత్తి రైతుల ప్రయోజనాల రక్షణకోసం భారత ప్రభుత్వం సి.సి.ఐ.ని నియమించింది. పత్తిపంట ధరలు కనీస మద్దతు ధరకంటే దిగువ స్థాయికి పడిపోయినప్పుడల్లా, రైతులనుంచి కనీస మద్దతు ధరతో సగటు నాణ్యత గల (ఎఫ్.ఎ.క్యు.) గ్రేడ్ పత్తిని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసే బాధ్యతను సి.సి.ఐ.కి ప్రభుత్వం అప్పగించింది. సేకరించే పంట పరిమాణంపై ఎలాంటి సీలింగ్ పరిమితులు లేకుండా కొనుగోలు చేయాలని నిర్దేశించింది. మార్కెట్లో ధరల పరిస్థితి ప్రతికూలంగా ఉన్నపుడు రైతులు తమ పంటను తెగనమ్ముకోవాల్సిన అగత్యం లేకుండా వారిని కాపాడేందుకు కనీస మద్దతు ధరపై పత్తి సేకరణ ప్రక్రియ కోసం ఈ చర్య ఉపయోగపడుతుంది.

  పత్తి రైతుల ప్రయోజనాలకు తగిన రక్షణ లభించేలా చూసేందుకు కనీస మద్దతు ధరపై జరిపే పంట సేకరణ ఉపయోగపడుతుంది. తద్వారా నాణ్యతగల పత్తి సేకరణకోసం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్ నినాదం సాకారం అవుతుంది. నూలు మిల్లులకు సకాలంలో అందే ముడిపదార్థంగా ఇది ఉపయోగపడుతుంది. దేశంలో పత్తి పంటను సాగుచేసే 11 ప్రధాన రాష్ట్రాల్లో పత్తి కొనుగోలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సి.సి.ఐ. సిద్ధం చేస్తుంది. ఇందుకోసం మొత్తం 143 జిల్లాల్లో 474 పత్తి సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తుంది.  

  ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కుదిపివేసిన వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత రెండేళ్ల పత్తిసాగు సీజన్లలో ( అంటే 2019-20, 2020-21సంవత్సరాల్లో జరిగిన పత్తి ఉత్పత్తిలో మూడవ వంతు పంటను సి.సి.ఐ. సేకరించింది. అంటే, దాదాపు 20కోట్ల బేళ్ల పత్తిని సేకరించి, రూ. 55,000కోట్లకు పైగా సొమ్మును నేరుగా 40లక్షలమంది రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది.

   ప్రస్తుత పత్తి సాగు సీజన్లో అంటే, 2021-22లో పత్తి పంట ప్రధానంగా సాగుచేసే 11 రాష్ట్రాల్లో

 సి.సి.ఐ. ఇప్పటికే కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. 450కి పైగా పత్తి సేకరణ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే తరలించింది. కనీస మద్దతు ధరపై పత్తి సేకరణకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా సి.సి.ఐ. ఈ ఏర్పాట్లన్నీ చేసింది.

   

****


(Release ID: 1770686) Visitor Counter : 211