యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

భారత ఒలింపిక్‌ పతక విజేతలకు హార్దిక స్వాగతం; క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఘన సత్కారం


టోక్యో-2020 ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌కు అనేక తొలి ఘనతలు: అనురాగ్‌ ఠాకూర్‌;
ప్రపంచాన్ని ఏలాలన్న నవభారత ఆకాంక్షకు భారత జట్టు విజయమే ప్రతీక: అనురాగ్‌ ఠాకూర్‌

Posted On: 09 AUG 2021 8:24PM by PIB Hyderabad

   టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన మన క్రీడాకారులు స్వదేశం చేరిన నేపథ్యంలో జాతీయ రాజధానిలో ఈ సాయంత్రం ఎన్నడూలేని రీతిలో పండుగ వాతావరణం నెలకొంది.
   ఈ సందర్భంగా అశోకా హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఏడు క్రీడల్లో పతక విజేతలైన క్రీడాకారులు నీరజ్ చోప్రా, రవి కుమార్ దహియా, మీరాబాయి చాను, పి.వి.సింధు, బజరంగ్ పునియా, లవ్లీనా బోర్గ్‌హైన్ సహా పురుషుల జాతీయ హాకీ జట్టు సభ్యులను కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఘనంగా సన్మానించారు. కేంద్ర చట్ట-న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజుతోపాటు యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్‌లతోపాటు క్రీడాశాఖ కార్యదర్శి శ్రీ రవి మిట్టల్, భారత క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ సందీప్ ప్రధాన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Gold medalist Neeraj, silver medalist Ravi, bronze medalists Bajrang, Lovlina and Manpreet returned to India after a long flight today after gracing the closing ceremony of Tokyo 2020 last night. They were joined by the other medalists Mirabai and Sindhu during the grand felicitation.

టోక్యో ఒలింపిక్స్‌-2020 ముగింపు వేడుకలు నిన్నరాత్రి పూర్తయిన అనంతరం స్వర్ణపతక విజేత నీరజ్‌ చోప్రా, రజత పతక విజేత రవి, కాంస్యం విజేతలు బజ్‌రంగ్‌, లవ్లీనా, మన్‌ప్రీత్‌లు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ మాతృభూమిని చేరుకున్నారు. అటుపైన ఢిల్లీలో ఇతర పతక విజేతలు మీరాబాయి, సింధు వారితో కలిశారు.

   ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ- “టోక్యో-2020 ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌కు అనేక తొలి ఘనతలు దక్కాయి. ప్రపంచాన్ని క్రీడలపరంగానూ ఏలాలన్న నవభారత ఆకాంక్షకు భారత జట్టు విజయమే ప్రతీక. స్వీయ క్రమశిక్షణ, అంకితభావంతో మనం విజేతలం కాగలమని ఈ ఒలింపిక్‌ క్రీడలు రుజువు చేశాయి. భారతీయులంతా హర్షధ్వానాలు చేస్తూండగా, భారత క్రీడాకారుల బృందం అద్భుత ప్రతిభచూపి, అందరిలోనూ స్ఫూర్తి నింపింది. మన క్రీడాకారులు గ్రామాలు, పట్టణాలు, ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమరలకు చెందినవారు కావడంవల్ల క్రీడలు కీలక ఏకీకృత ఉపకరణాలనడంలో సందేహం లేదు. వారి ఈ పయనం అద్భుత క్రీడానైపుణ్యాన్ని, పట్టుదలను ప్రస్ఫుటం చేసింది” అని పేర్కొన్నారు.

 

 

   ఈ క్రీడల్లో అనేక తొలి ఘనతలను క్రీడాశాఖ మంత్రి వివరించారు... ఇందులో భాగంగా 128 మంది సభ్యులతో ఈసారి భారత జట్టు ఒలింపిక్స్‌కు వెళ్లిందని గుర్తుచేశారు. అదేవిధంగా 7 ఒలింపిక్‌ పతకాలు సాధించడం, అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణపతకం కైవసం చేసుకోవడం, వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో మన పి.వి.సింధు రెండు పతకాలు చేజిక్కించుకోవడం, 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించడమే కాకుండా మహిళల హాకీ జట్టు సెమీఫైనల్స్‌ చేరడం వగైరా ఘనతలు ఈ క్రీడల విశేషమని ఆయన ఏకరవు పెట్టారు. అంతేకాకుండా ఈ ఒలింపింక్స్‌ సెయిలింగ్‌ క్రీడలో పోటీ పడేందుకు మన మహిళా సెయిలర్‌ నేత్రా కుమరన్‌ తొలిసారి అర్హత సాధించిందని పేర్కొన్నారు. అలాగే కత్తిసాములో భారత మహిళా ఫెన్సర్‌ భవానీదేవి తొలిసారి పాల్గొనడం, ఈక్వెస్ట్రియన్‌ క్రీడలో ఫవాద్‌ మీర్జా అత్యుత్తమ స్థానం సాధించడం, రోయింగ్‌ క్రీడలో భారత రోయర్లు అత్యుత్తమ సమయం నమోదు చేయడం, గోల్ఫ్‌ క్రీడలో భారత మహిళా గోల్ఫర్‌ అదితి అత్యుత్తమ స్థానంలో నిలవడం, స్టీపుల్‌ ఛేజ్‌ క్రీడలో అవినాష్‌ సబ్లే తన జాతీయ రికార్డును అధిగమించడం వంటి తొలి ఘనతలు మనకెంతో గర్వకారణమన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో భారత్‌లో క్రీడల పునాదులు మరింత బలోపేతమయ్యాయి. ఈ మేరకు ‘టాప్స్‌ (TOPs), ఖేలో ఇండియా’ వంటి పథకాలు విజేత వేదికను అధిరోహించడంలో సత్ఫలితాలిచ్చాయి. మన క్రీడాకారులందరికీ మద్దతును కొనసాగించడంతోపాటు భారత్‌ను మహా క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో మా కృషిని కొనసాగిస్తామని మంత్రి
పునరుద్ఘాటించారు.

   భారత క్రీడాకారులందరి ప్రతిభా ప్రదర్శనను శ్రీ కిరణ్‌ రిజిజు ప్రశంసించారు. భారతదేశం 2028 ఒలింపిక్స్‌ నాటికి పరిగణనలోకి తీసుకోదగిన క్రీడాశక్తిగా ఎదుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. “విజేతలైన మన క్రీడాకారులతో ఇవాళ ఈ వేదికను పంచుకోవడంలోని ఆనందం వర్ణించనలవి కానిది. ఒలింపిక్స్‌లో భారత్‌ ఎన్నడూలేని రీతిలో విజయాలను నమోదు చేయడం చరిత్రాత్మకం. ఇది మనకెంతో గర్వకారణం... మన పురుషుల హాకీ జట్టు 41 సంవత్సరాల తర్వాత కాంస్య పతకం సాధించడం, అథ్లెటిక్స్‌లో తొలిసారి స్వర్ణం సాధించడం అపూర్వం. మన పతక విజేతలు మాత్రమే కాకుండా ఇతర క్రీడాకారులందరూ టోక్యోలో తమ అత్యున్నత క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. వారందరికీ నా అభినందనలు. ఇది ఆరంభం మాత్రమే... క్రీడల్లో భారత పునరుజ్జీవనం నేడు ప్రస్ఫుటమైంది. ఆ మేరకు 2028 ఒలింపిక్స్‌ నాటికి భారత్‌ గణనీయ క్రీడాశక్తిగా పరిగణనలోకి వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

 

 

   టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల నైపుణ్య ప్రదర్శనను శ్రీ నిసిత్‌ ప్రామాణిక్‌ కొనియాడుతూ- వారు భారతదేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. పతక విజేతలందరికీ అభినందనలు తెలుపుతూ ఒలింపిక్‌ క్రీడా చరిత్రలో భారత క్రీడాకారులు 7 పతకాలు గెలుచుకోవడం ఇదే తొలిసారని శ్రీ ప్రామాణిక్‌ గుర్తుచేశారు. ఇదొక చరిత్రాత్మక, చిరస్మరణీయ ఘట్టమని, రాబోయే తరాలు క్రీడా స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికి, భారత్‌ను మరింత గర్వించేలా చేయడానికి ముందుకొస్తారని పేర్కొన్నారు.

   టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు అనేక తొలి ఘనతలు దక్కడంతోపాటు మరిన్ని ప్రాధాన్యాలున్నాయి. ఈ మేరకు నీరజ్‌ చోప్రా తొలి జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించడం ద్వారా భారత అథ్లెటిక్స్‌ రంగం గర్వించేలా చేశారు. ఈ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇది తొలి వ్యక్తిగత స్వర్ణం మాత్రమే కాదు... భారత అథ్లెటిక్స్‌ రంగానికే తొలి పతకం కావడం గమనార్హం.

   వరుసగా రెండు ఒలింపిక్‌ క్రీడా పతకాలు సాధించిన ఏకైక భారత మహిళగా పి.వి.సింధు ఘనకీర్తిని తెచ్చిపెట్టారు. ఈ మేరకు ఆమె 2016 రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించగా, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. మరోవైపు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో తొలి రజత పతకం సాధించిన దిగ్గజ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి చాను దేశానికి రెండో పతకం సాధించి పెట్టారు.

   ఇక భారత పురుషుల హాకీ జట్టు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు ఎన్నడూలేని విధంగా తొలిసారి సెమీఫైనల్స్‌ దశకు చేరింది. మరోవైపు తొలిసారిగా టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 128 మంది క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. అంతేగాక ఏ ఒలింపిక్స్‌లోనూ లేనివిధంగా 7 పతకాలను తొలిసారి సాధించారు.

   దేశానికి ఒలింపిక్స్‌ కుస్తీ పోటీల రజత పతకం సాధించిన రెండో మల్లయోధుడుగా రవి దహియా రికార్డులకెక్కారు. అలాగే దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ తర్వాత భారత్‌కు ఒలింపిక్స్‌ కాంస్యం సాధించిన రెండో బాక్సర్‌గా, మొత్తంమీద పతక విజేతలలో మూడో బాక్సర్‌గా లవ్లీనా బోర్గ్‌హైన్‌ రికార్డు సృష్టించారు. ఈ క్రీడల్లో విశేషంగా రాణించిన మరికొందరు మహిళా క్రీడాకారులలో భవానీదేవి, నేత్రా కుమరన్‌, అదితి అశోక్‌ కూడా ఉన్నారు. ఒలింపిక్‌ క్రీడల్లో కత్తిసాము క్రీడను ప్రవేశపెట్టాక ఆ పోటీలకు అర్హత సాధించిన తొలి భారత మహిళా ఫెన్సర్‌గా భవానీ, అలాగే భారత్‌నుంచి సెయిలింగ్‌ క్రీడకు అర్హత సాధించిన సెయిలర్‌గా నేత్రా కుమరన్‌ చరిత్ర సృష్టించారు. ఇక అదితి అశోక్‌ గోల్ఫ్‌ క్రీడలో 4వ స్థానంలో నిలిచి, ఒలింపిక్స్‌ గోల్ఫ్‌లో అత్యున్నత స్థానం సాధించిన భారత గోల్ఫర్‌గా చరిత్రకెక్కారు.

 

***


(Release ID: 1744242) Visitor Counter : 413