ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలకు సాయం దిశగా మరికొన్ని చర్యలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


కోవిడ్ మృతుల ఆశ్రితులకు ‘ఉద్యోగుల ప్రభుత్వ
బీమా సంస్థ’ (ఈఎస్ఐసీ) ద్వారా కుటుంబ పెన్షన్;

‘ఈడీఎల్ఐ’ పథకం కింద బీమా ప్రయోజనాల పెంపు... సరళీకరణ;
ఈ పథకాలతో ఆర్థిక బాధలనుంచి కుటుంబాలకు ఊరట: ప్రధానమంత్రి

Posted On: 29 MAY 2021 7:47PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా కోవిడ్-19తో మరణించినవారి పిల్లల సాధికారత కోసం ‘పీఎం కేర్స్’ కింద ప్రకటించిన చర్యలకు అదనంగా కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయా కుటుంబాలకు పెన్షన్ చెల్లింపుసహా బీమా పథకం కింద నష్టపరిహారాన్ని పెంచడమే కాకుండా ఈ ప్రక్రియను సరళీకరించింది. మహమ్మారివల్ల ఆర్జనపరులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం సంఘీభావం ప్రకటిస్తున్నదని ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థికంగా కష్టనష్టాలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఊరటనివ్వడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎస్ఐసీ) ద్వారా కుటుంబ పెన్షన్:

  • కోవిడ్ బారినపడి మరణించినవారి కుటుంబాలు చక్కని జీవన ప్రమాణాలతో, గౌరవప్రదంగా జీవించడానికి ప్రభుత్వం సాయపడుతుంది. ఈ మేరకు ఉద్యోగుల మృతికి వర్తించే ‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎస్ఐసీ) పెన్షన్ పథకం ప్రయోజనాన్ని ఈ కుటుంబాలకూ విస్తరింపజేసింది. తదనుగుణంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం మరణానికి ముందు పోషకులైన కార్మికులు ఆర్జించే రోజువారీ సగటు వేతనంలో 90 శాతానికి సమానమైన మొత్తాన్ని ఆశ్రిత కుటుంబంలోని వ్యక్తులకు పెన్షన్ రూపేణా చెల్లిస్తుంది. ఇలాంటి కుటుంబాలకు వెనుకటి తేదీనుంచి... అంటే- 24.03.2020 నుంచి 24.03.2022 మధ్య సంభవించే సంఘటనల్లో ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తుంది.

‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్ఓ)- ‘ఉద్యోగుల డిపాజిట్ సంధానిత బీమా పథకం’ (ఈడీఎల్ఐ) అమలు:

  • ‘ఈడీఎల్ఐ’ పథకం కింద  బీమా ప్రయోజనాల పెంపుసహా ఈ ప్రక్రియ సరళీకరించబడింది. ఇతరత్రా లబ్ధిదారులకు మాత్రమే కాకుండా ముఖ్యంగా కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకూ ఇది చేయూతనిస్తుంది.
  • గరిష్ఠ బీమా ప్రయోజన మొత్తం రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచబడింది.
  • కనీస బీమా లబ్ధిపై రూ.2.5 లక్షల పరిమితి నిబంధన పునరుద్ధరణతోపాటు వెనుకటి తేదీనుంచి... అంటే- 2020 ఫిబ్రవరి 15 నుంచి రాబోయే మూడేళ్లపాటు అమలులోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది.
  • కాంట్రాక్టు/తాత్కాలిక కార్మిక కుటుంబాలకు ప్రయోజనం దిశగా ఒకే సంస్థలో కొనసాగి ఉండాలన్న నిబంధన సరళీకరించబడింది. అంతేకాకుండా కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగులు అంతకుముందు 12 నెలల వ్యవధిలో సంస్థలు మారి ఉన్నప్పటికీ, వారి కుటుంబాలకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

   ఈ పథకాలన్నిటికీ సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ జారీ చేయనుంది.

 

***



(Release ID: 1722841) Visitor Counter : 384