కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
5జి టెక్నాలజీకి, కోవిడ్-19 విస్తరణకు ఎలాంటి సంబంధం లేదు
Posted On:
10 MAY 2021 8:16PM by PIB Hyderabad
5జి మొబైల్ టవర్ల టెస్టింగ్ కారణంగానే దేశంలో రెండో దశ కరోనా వైరస్ విజృంభించిందంటూ సామాన్య ప్రజలను తప్పుదారి పట్టించే కొన్ని సందేశాలు సోషల్ మీడియా వేదికలుగా ప్రచారంలోకి వస్తున్నట్టు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ నిర్వహణలోని టెలికాం శాఖ (డాట్) దృష్టికి వచ్చాయి. ఈ సందేశాల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా అబద్ధమని డాట్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలియచేస్తోంది. 5జి టెక్నాలజీకి, కోవిడ్-19 విస్తరణకు మధ్యన ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి తప్పుడు సమాచారం, వదంతులను నమ్మవద్దని ప్రజలందరికీ ఆ ప్రకటన తెలియచేసింది. 5జి టెక్నాలజీకి, కోవిడ్-19కి మధ్యన సంబంధం ఉన్నట్టు వస్తున్నవన్నీ వదంతులేనని, వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. మరో ముఖ్య విషయం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా 5జి నెట్ వర్క్ లు ప్రారంభం కాలేదని తెలిపింది. వీటిని బట్టి 5జి ట్రయల్స్ లేదా నెట్ వర్క్ లే కరోనా వైరస్ విజృంభణకు కారణమనే వార్తలు నిరాధారమైనవని వివరించింది.
మొబైల్ టవర్ల నుంచి వెలువడే నాన్ ఐయొనైజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలు అతి తక్కువ విద్యుత్తును మాత్రమే ప్రసరింపచేస్తాయని, మానవుల్లో జీవకణాలను నాశనం చేయగల సామర్థ్యం వాటికి ఉండదని వివరణ ఇచ్చింది. డాట్ నిర్దేశించిన రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ (బేస్ స్టేషన్ల నుంచి వెలువడే వ్యర్థవాయువులు) నిబంధనలు నాన్ అయొనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ఐసిఎన్ఐఆర్ పి) నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల కన్నా 10 రెట్లు కఠినమైనవని తెలియచేసింది.
డాట్ ఇప్పటికే తీసుకున్న చొరవలు
టిఎస్ పిలు ఈ నిర్దేశిత నిబంధనలకు కట్టుదిట్టంగా కట్టుబడేలా చూసేందుకు డాట్ వద్ద పటిష్ఠమైన వ్యవస్థ ఉంది. ఒక వేళ మొబైల్ టవర్ నుంచి వెలువడుతున్న రేడియో తరంగాలు భద్రతా ప్రమాణాలను దాటి ఉన్నట్టు ఎవరికైనా ఎలాంటి అనుమానం అయినా వస్తే ఇఎంఎఫ్ కొలవాలని/ టెస్టింగ్ చేయాలని తరంగ్ సంచార్ పోర్టల్ https://tarangsanchar.gov.in/emfportal ద్వారా అభ్యర్థించవచ్చు.
మొబైల్ టవర్ల నుంచి వెలువడే కాలుష్యానికి సంబంధించి ప్రజల్లో భయాలు పోగొట్టి చైతన్యవంతులను చేసేందుకు జాతీయ స్థాయి ప్రచారోద్యమం ద్వారా డాట్ పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్రోచర్లు, పాంప్లెట్లు ముద్రించి పంచుతోంది. పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తోంది. “తరంగ్ సంచార్” పోర్టల్ కూడా ప్రారంభించింది. మొబైల్ టవర్ల నుంచి వెలువడే ఇఎంఎఫ్ వ్యర్థాలకు సంబంధించిన శాస్ర్తీయమైన వాస్తవాలు ప్రజలకు తెలియచేసి అవగాహన పెంచడం కోసం డాట్ ఫీల్డ్ యూనిట్లు ప్రజా చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.
***
(Release ID: 1717604)
Visitor Counter : 277
Read this release in:
Malayalam
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Manipuri
,
English
,
Urdu
,
Assamese
,
Bengali
,
Odia