ఆర్థిక మంత్రిత్వ శాఖ

విదేశీ విరాళాల కింద అందే నిర్దిష్ట కోవిడ్-19 సహాయ సామగ్రి దిగుమతులపై ఐజీఎస్టీ నుంచి తాత్కాలిక మినహాయింపు


ఇప్పటికే కస్టమ్స్ సుంకం మినహాయించినందున
ఈ దిగుమతులకు కస్టమ్స్ సుంకం లేదా ఐజీఎస్టీ వర్తించవు

Posted On: 03 MAY 2021 3:02PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అనేక కోవిడ్-19 సంబంధిత సహాయ సామగ్రి దిగుమతులపై పరిమిత కాలానికిగాను ప్రాథమిక కస్టమ్స్ సుంకంసహా/లేదా ఆరోగ్య రుసుము విధింపును మినహాయిస్తూ ఉత్తర్వు ప్రకటన జారీచేసింది. ఈ సామగ్రి జాబితా కిందివిధంగా ఉంది:

వ.సం.

ఉత్తర్వు ప్రకటన

ఉద్దేశం

1.

తేదీ:20.04.21నాటి 27/2021-కస్టమ్స్ ప్రకటన; (తేదీ: 30.4.21నాటి నోటిఫికేషన్ నం.29/2021-కస్టమ్స్ కింద సవరించిన మేరకు)

31 అక్టోబరు 2021 వరకూ ‘‘రెమ్డెసివిర్ ఇంజెక్షన్/ఏపీఐ అండ్ బీటా సైక్లోడెక్స్ట్రిన్ (ఎస్బీఈబీసీడీ), ఇన్ఫ్లమేటరీ డయాగ్నాస్టిక్ (మార్కర్స్) కిట్స్.’’

2.

తేదీ: 24.04.21నాటి 28/2021 కస్టమ్స్ ప్రకటన

31 జూలై 2021 వరకూ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్; ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, క్రయోజెనిక్ రవాణా ట్యాంకులు, వగైరా ఆక్సిజన్ థెరపీ సంబంధిత పరికరాలతోపాటు కోవిడ్-19 టీకాలు

 

   భారతదేశం వెలుపలినుంచి విరాళాల కింద, ఉచితంగా పంపిణీ కోసం విదేశాల నుంచి అందే కోవిడ్-19 చికిత్స సంబంధిత సామగ్రి దిగుమతులపై (కస్టమ్స్ సుంకం ఇప్పటికే మినహాయించబడింది) ఐజీఎస్టీ మినహాయింపు కోరుతూ అనేక స్వచ్ఛంద/కార్పొరేట్ సంస్థలు, ఇతర అసోసియేషన్లు/సంస్థలనుంచి కేంద్ర ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. తదనుగుణంగా ఉచిత పంపిణీ కోసం దేశం వెలుపలి నుంచి ఉచితంగా అందే అటువంటి వస్తువుల దిగుమతిపై ‘ఐజీఎస్టీ’ని తాత్కాలికంగా మినహాయిస్తూ 2021 మే 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు నం.4/2021ని జారీచేసింది.

   ఈ మినహాయింపు 2021 జూన్ 30దాకా అమలులో ఉంటుంది. దీనికింద ఇప్పటికే దిగుమతి చేసుకుని, మినహాయింపు ఉత్తర్వు జారీ అయిన తేదీనాటికి- అంటే ‘నేటికీ’ అనుమతులు అందని వస్తువులకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది.

   ఈ మినహాయింపు కింది షరతులకు లోబడి ఉంటుంది:

  1. రాష్ట్రాల స్థాయిలో ఈ మినహాయింపు నిమిత్తం ఒక నోడల్ సంస్థను ప్రభుత్వం నియమించాలి. కేంద్ర వస్తుసేవల పన్ను చట్టం-2017 (సీజీఎస్టీ)లోని సెక్షన్ 2 (103) ప్రకారం శాసనసభగల కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రాష్ట్రంగా పరిగణించబడతాయి.
  2. రాష్ట్ర ప్రభుత్వం నియమించే నోడల్ సంస్థ సదరు కోవిడ్ సహాయ సామగ్రి ఉచిత పంపిణీ కోసం ఏదైనా సంస్థ లేదా సహాయ సంఘం లేదా చట్టబద్ధ కమిటీవంటి వాటికి అనుమతులు ఇవ్వవచ్చు.
  3. భారతదేశంలో ఎక్కడైనా ఉచిత పంపిణీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా అనుమతి పొందిన ఏదైనా సంస్థ/సహాయ సంఘం/చట్టబద్ధ కమిటీ సదరు వస్తువులను ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
  4. సదరు వస్తువుల దిగుమతికి కస్టమ్స్ శాఖ అనుమతి పొందే ముందుగానే ఉచిత కోవిడ్ సహాయం కింద ఉచిత పంపిణీకి ఉద్దేశించిన వస్తువులకు సంబంధించి నోడల్ సంస్థ ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాన్ని దిగుమతిదారు సమర్పించాల్సి ఉంటుంది.
  5. వస్తువుల దిగుమతి తర్వాత ఆ తేదీనుంచి ఆరు నెలలు లేదా తొమ్మిది నెలలకు  మించని పొడిగింపు వ్యవధిలోగా దిగుమతిదారు ఓడరేవులోని డిప్యూటీ లేదా అసిస్టెంట్ కమిషనరుకు సదరు దిగుమతి చేసుకున్న/ఉచితంగా పంపిణీ చేసిన వస్తువుల వివరాలతో కూడిన సాధారణ నివేదికను సమర్పించాలి. అయితే, ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్ సంస్థ ధ్రువీకరించి ఉండాలి.

   ఈ మినహాయింపులకు అనుగుణంగా ఉచిత పంపిణీ కోసం విదేశాల నుంచి ఉచితంగా అందుకున్న కోవిడ్ చికిత్స సంబంధిత సహాయ సామగ్రిని (2021 జూన్ 30దాకా) ‘ఐజీఎస్టీ’ చెల్లించకుండానే దిగుమతి చేసుకోవచ్చు.

   ఇక కస్టమ్స్ సుంకంపై ఇప్పటికే మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ఈ దిగుమతులపై ఎలాంటి కస్టమ్స్ సుంకం లేదా ఐజీఎస్టీ వర్తించవు.

 

***


(Release ID: 1715786) Visitor Counter : 239