ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

96% దాటిన కోలుకున్న కోవిడ్ బాధితులు, అంతర్జాతీయంగా అరుదైన సాధన

చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 2.57 లక్షల లోపే

చికిత్సలో ఉన్నవారికంటే కోలుకున్నవారు 96 లక్షలు అధికం

బ్రిటిష్ వైరస్ బాధితులు 25 మంది

Posted On: 31 DEC 2020 10:54AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరో మైలురాయి దాటింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 96 దాటి 96.04% గా నమోదైంది. ఇది ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ సాధనలలో ఒకటి. కోలుకుంటున్నవారు గణనీయంగా పెరుగుతూ ఉండటంతో కోలుకున్నవారి శాతం పెరిగింది.

ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి బైటపడిన వారి సంఖ్య 98 లక్షల 60 వేల 280 కి చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య. చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య అంతరం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 96,02,624 కు చేరింది.

చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గటం భారత్ సాధించిన మరో ఘనత.  ప్రస్తుతం వారి సంఖ్య 2.57 లక్షలకు తగ్గింది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి శాతం  2.51% మాత్రమే. ప్రతిరోజూ కోవిడ్ బాధితులు పెద్ద సంఖ్యలో కోలుకుంటూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలొ మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటలలో  21,822 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలొ కోలుకున్నవారు 26,139 మంది.  దీనివలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా  4,616 తగ్గింది.

కొత్తగా కోలుకున్నవారిలో 77.99% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే కాగా కేరళలో అత్యధికంగా గత 24 గంటలలో 5,707 మంది కోలుకున్నారు, ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 4,913 మంది, చత్తీస్ గఢ్ లో 1,588 మంది కోలుకున్నారు.

కొత్తగా పాజిటివ్ గా తేలిన కేసుల్లో 79.87% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారుగా తేలారు. కేరళలో అత్యధికంగా 6,268 కేసులు రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న మహారాష్ట్రలో 3,537 కొత్త కేసులు వచ్చాయి..

గడిచిన 24 గంటలలో 299 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. వారిలో  80.60% మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 90 మంది చనిపోగా కేరళలోనూ, పశ్చిమ బెంగాల్ లోను 28 మంది వంతున చనిపోయారు.

పది ప్రభుత్వ ప్రయోగశాలల కన్సార్షియం ( ఇన్సాకాగ్) జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు జరిపిన మీదట ఇప్పటిదాకా బ్రిటిష్ వైరస్ 25 మందికి సోకినట్టు నిర్థారించింది. పూణెలోని ఎన్ ఐ వి లో నాలుగు కేసులు, ఢిల్లీ ఐజిఐబి లో ఒక కేసు నిర్థారణ జరిగాయి. ఈ మొత్తం 25 మందిని ఆస్పత్రులలో ఐసొలేషన్ లో ఉంచారు.  

 

***



(Release ID: 1684997) Visitor Counter : 196