రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వాహన పత్రాల చెల్లుబాటును 2021 మార్చి 31 వరకు పొడిగించిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ

ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన

Posted On: 27 DEC 2020 2:55PM by PIB Hyderabad

కోవిడ్-19 వ్యాప్తిని నివారించాలన్న లక్ష్యంతో వాహనాలకు సంబంధించిన డిఎల్ లు, ఆర్ సిలు, పర్మిట్లు వంటి పత్రాల చెల్లుబాటును 2021 మార్చి 31వ తేదీవరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబందించిన ఆదేశాలను ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోడ్డురవాణా,రహదారుల మంత్రిత్వశాఖ పంపింది.

మోటారు వాహనాల చట్టం, 1988 మరియు కేంద్ర వాహనాల నిబంధనలు1989ల కింద పత్రాల చెల్లుబాటును పొడిగిస్తూ మంత్రిత్వశాఖ 30 మార్చి, 2020, 9 జూన్, 2020 మరియు 24 వ ఆగస్టు 2020 తేదీలలో లేఖలు రాసింది. వాహనాల ఫిట్ నెస్, పర్మిట్లు (అన్ని రకాలు), లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత పత్రం (లు) యొక్క చెల్లుబాటు 31 డిసెంబర్ 2020 వరకు చెల్లుబాటు అయ్యేలా పరిగణించాలని సూచించడం జరిగింది.

అయితే, కోవిడ్-19 ను దృష్టిలో ఉంచుకుని గడువును 2021 మార్చి 31వరకు పొడిగించాలని నిర్ణయించారు." కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించవలసి ఉన్నందున పైన తెలిపిన అన్ని పత్రాల చెల్లుబాటు తేదీని 2021 మార్చి 31వరకు పొడిగించడం జరిగింది. 2020 ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి గడువు ముగిసిన లేదా 2021 మార్చి 31 నాటికి గడువు ముగిసే అన్ని పత్రాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి " అని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అన్ని పత్రాల గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు ఉంటుందని అధికారులు గుర్తించాలి. దీనివల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణాకు సంబంధించిన సేవలను పొందడానికి ప్రజలకు కలుగుతుంది" అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన సమాచారంలో పేర్కొన్నారు.

కొవిడ్ వల్ల ఏర్పడిన క్లిష్ట సమయంలో పనిచేస్తున్న పౌరులు, రవాణాదారులు మరియు అనేక ఇతర సంస్థలు వేధింపులకు గురికాకుండా లేదా ఇబ్బందులను ఎదుర్కోకుండా చూడడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ కోరింది.

***(Release ID: 1684032) Visitor Counter : 191