ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం

Posted On: 21 DEC 2020 10:01AM by PIB Hyderabad

ప్రియ మిత్రులారా,

ఆరో ఇండియా-జపాన్ సంవాద్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగిస్తుండటమనేది ఒక గౌరవం.

అయిదు సంవత్సరాల కిందట, మనం పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే తో ఈ సమావేశాల పరంపర ను ప్రారంభించాం.  అది మొదలు సంవాద్ న్యూ ఢిల్లీ నుంచి టోక్యో కు, యాంగూన్ నుంచి ఉలాన్ బాతర్ వరకు ప్రయాణించింది.  ఈ ప్రస్థానం లో, ఇది తన మౌలిక లక్ష్యాల కు పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ లక్ష్యాల లో సంభాషణలను, చర్చలను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యం, మానవతావాదం, అహింస, స్వాతంత్ర్యం, సహనం వంటి మన ఉమ్మడి విలువలను ప్రముఖంగా ప్రస్తావించడం తో పాటు మన పురాతన సంప్రదాయం అయిన ఆధ్యాత్మిక సంబంధిత, పాండిత్య సంబంధిత పర్యటనల ను ముందుకు తీసుకుపోవడం వంటివి భాగంగా ఉన్నాయి.  సంవాద్ కు నిరంతర మద్దతును ఇస్తున్నందుకుగాను జపాన్ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేయదలచుకొన్నాను.

మిత్రులారా,

ఈ వేదిక భగవాన్ బుద్ధుని ఆలోచనలను, ఆదర్శాలను పెంచడానికి, ప్రత్యేకించి వాటిని యువత లో వ్యాప్తి లోకి తీసుకురావడానికి గొప్పగా కృషి చేసింది.  చరిత్ర పరంగా చూస్తే, బుద్ధుని సందేశ జ్యోతి భారతదేశం నుంచి ప్రపంచం లోని అనేక ప్రాంతాలకు విస్తరించింది.  అయితే, ఈ జ్యోతి ఒక చోటే నిలచిపోలేదు.  అది చేరుకొన్న ప్రతి కొత్త చోటులోను బౌద్ధ భావజాలం శతాబ్దాలకు పైగా పెంపొందుతూ వచ్చింది.  ఈ కారణంగా, బౌద్ధ సాహిత్యం తాలూకు, బౌద్ధ తత్వశాస్త్రం తాలూకు మహనీయ భాండాగారాలను వేరు వేరు దేశాలలోని  అనేక మఠాలలో, అనేక భాషల లో ప్రస్తుతం గమనించవచ్చును.  

ఈ లేఖనాల రాశి అంతా యావత్తు మానవాళి కి ఒక ఖజానా గా ఉంది.  ఆ కోవ కు చెందిన సాంప్రదాయక బౌద్ధ సాహిత్యం తో, బౌద్ధ ధార్మిక గ్రంథాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ రోజు న నేను ప్రతిపాదించాలనుకొంటున్నాను.  అలాంటి ఒక సదుపాయాన్ని భారతదేశం లో ఏర్పాటు చేయడానికి, ఆ గ్రంథాలయానికి తగిన వనరులను అందించడానికి మేము సంతోషంగా ముందుకు వస్తాం.  ఈ పుస్తకాలయం విభిన్న దేశాల వద్ద నుంచి అలాంటి బౌద్ధ సాహిత్యం తాలూకు డిజిటల్ ప్రతులను అన్నిటిని సేకరిస్తుంది.  ఆ గ్రంథాలయం వాటి అనువాదాలను రూపొందించుకోవడం తో పాటు వాటిని బౌద్ధ భిక్షువులకు, బౌద్ధ పండితులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకొంటుంది.  ఆ గ్రంథాలయం ఒక్క సాహిత్య భాండాగారంగానే మిగిలిపోదు.

ఆ గ్రంథాలయం పరిశోధన కు, సంభాషణ కు ఒక వేదిక గా కూడా ఉంటుంది.  అంటే మనుషులకు, సమాజాలకు మధ్య, మనిషి కి,  ప్రకృతి కి మధ్య ఒక సిసలైన ‘సంవాదం’ గా ఉంటుందన్నమాట.  ఈ గ్రంథాలయం చేపట్టే పరిశోధనలలో ఒక అంశం గా- పేదరికం, జాతివాదం, ఉగ్రవాదం, పురుషులు, మహిళల మధ్య వివక్ష, జల వాయు పరివర్తన లతో పాటు అనేక ఇతర సవాళ్లు  సహా, అనేక సమకాలిక సవాళ్ల ను మన ఆధునిక ప్రపంచం పరిష్కరించుకోవడానికి బుద్ధుని సందేశం ఎలా మార్గదర్శనం చేయగలదు అనే అంశం కూడా- ఉంటుంది.

మిత్రులారా,

సుమారు గా మూడు వారాల క్రితం, నేను సారనాథ్ కు వెళ్లాను.  భగవాన్ బుద్ధుడు జ్ఞ‌ానసిద్ధి అనంతరం తన తొలి ఉపదేశాన్ని సారనాథ్ లో ఇచ్చారు.  ఈ జ్యోతి పుంజం సారనాథ్ నుంచి వెలువడి, దయ, సౌజన్యం.. వీటన్నిటిని మించి.. మానవ జాతి శ్రేయమైన మానవ కల్యాణం అనే విలువ ను అక్కున చేర్చుకొంటూ ప్రపంచాన్ని చుట్టివేసింది.  మరి అది నెమ్మదిగాను, ప్రశాంతంగాను ప్రపంచ చరిత్ర గతి ని మార్చివేసింది.  భగవాన్ బుద్ధుడు తన ధమ్మ ఆదర్శాన్ని గురించి సవివరంగా మాట్లాడింది సారనాథ్ లోనే.  ధమ్మ అనేది ఆయనకు ప్రార్థన కన్నా, మతాచారం కన్నా కూడా ఎంతో మిన్న గా ఉండింది.  మానవులు, వారికి తోటి మనుషులతో ఉన్న సంబంధం.. ఇవే ధమ్మ కు కేంద్ర స్థానం లో నిలచాయి.  ఆ విధంగా, ఇతరుల జీవితాలలో ఒక సకారాత్మకమైనటువంటి శక్తి గా ఉండటమనేది అత్యంత ప్రధానమైందిగా ఉంది.  సంవాద్ అనేది ఈ సకారాత్మకత స్ఫూర్తి ని, ఏకత్వ స్ఫూర్తిని, కరుణ అనే భావన ను మన భూ గ్రహం అంతటా వ్యాపింపచేసేదిగా- అది కూడాను మనకు ఎంతో అవసరమైనటువంటి కాలంలో- వ్యాపింపచేసేదిగా, ఉండాలి.  

మిత్రులారా,

ఇది ఒక కొత్త దశాబ్ది లోని ఒకటో సంవాద్.  ఇది మానవ చరిత్ర తాలూకు ఒక కీలకమైన ఘడియ లో జరుగుతోంది.  ఈ రోజు న మనం తీసుకొనే చర్యలు రాబోయే కాలాల ఆచరణ కు రూపు ను ఇస్తాయి. ఈ దశాబ్దం, ఆ తరువాతి కాలం పాండిత్యానికి, కలసికట్టుగా నూతన ఆవిష్కరణలు చేస్తుండటానికి పెద్ద పీట ను వేసే సమాజాలదే అవుతుంది.  అది రానున్న కాలం లో మానవ జాతి కి విలువ ను జోడించగల ప్రతిభావంతులైన యువ మస్తిష్కాలను పెంచి పోషించడానికి సంబంధించింది కానున్నది.  మరిన్ని వినూత్న ఆవిష్కరణలను పెంపు చేసేదే పాండిత్యం గా లెక్కకు రావాలి సుమా.  చివరకు, నూతన ఆవిష్కరణ అంటే అది మానవ సాధికారిత కు ఒక మూల స్తంభం గా ఉండేదే కదా.    

దాపరికమంటూ లేనటువంటి, ప్రజాస్వామికమైనటువంటి, పారదర్శకమైనటువంటి సమాజాలు నూతన విషయాలను ఆవిష్కరించడానికి చక్కగా సరిపోతాయి.  అందువల్ల, మనం వృద్ధి గా చూస్తున్నటువంటి రూపావళి ని మార్చివేయడానికి ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పటి కాలమే తగినటువంటిది.  ప్రపంచ వృద్ధి పై చర్చలు ఏ కొద్ది వర్గాల మధ్యో మాత్రమే జరగరాదు.  చర్చల లో పాలుపంచుకొనేందుకు మరిన్ని ఎక్కువ వర్గాలకు చోటు ఉండాలి.  చర్చాంశాల పట్టిక లో విస్తృత అంశాలకు అవకాశం ఉండాలి.  మానవులే ప్రధానంగా ఉండేటటువంటి ఒక దృష్టికోణాన్ని వృద్ధి వ్యూహాలు తప్పక అనుసరించాలి.  అలాగే, వృద్ధి వ్యూహాలు మన పరిసరాలకు సామరస్యభరితంగా కూడా ఉండి తీరాలి.  

మిత్రులారా,

యమక్ వగ్గో ధమ్మపద:

నహి వేరేన్ వేరాని, సమ్మంతీథ కుదాచం

అవేరేన్ చ సమ్మతి, ఎస్ ధమ్మో సనంతనో.. అని సరిగానే ప్రస్తావించారు.

విరోధం తో ఎన్నటికీ శాంతి సిద్దించదు.  గత కాలంలో, మానవ జాతి సహకారానికి బదులుగా ప్రతిఘటన మార్గాన్ని అవలంబించింది. సామ్రాజ్యవాదం నుంచి ప్రపంచ యుద్ధాలకు మళ్లింది.  ఆయుధాల పరుగుపందెం నుంచి అంతరిక్ష పరుగుపందేనికి పోయింది.  మనం సంభాషణలు జరిపాం, కానీ అవి ఇతరులను కిందకు లాగి పడదోసే లక్ష్యం తో సాగాయి.  ఇక, మనం కలసికట్టుగా అభివృద్ధి చెందుదాం రండి.  విరోధం నుంచి సాధికారిత వైపునకు మళ్లించే శక్తి భగవాన్ బుద్ధుని ప్రబోధాలకు ఉంది.  ఆయన బోధనలు మనలను పెద్ద మనసు కలిగిన వారు గా మార్చుతాయి.  ఆ ఉపదేశాలు, గతం నుంచి పాఠం నేర్చుకోండి, ఒక మంచి భవిష్యత్తు దిశ లో పాటుపడండి అని, మనకు చెప్తాయి.  మన భావి తరాల వారి కి మనం చేయగలిగిన ఉత్తమమైన సేవ ఇదే.      

మిత్రులారా,

సంవాద్ సారం ఏమిటి అంటే- అది కలసివుండటం.  సంవాద్ ను మన లోని సర్వోత్తమత్వాన్ని, సాన్నిహిత్యాన్ని వెలికితీయనిద్దాం.  మన ప్రాచీన విలువలను మననం చేసుకొని, రాబోయే కాలాల కోసం సన్నద్ధం కావలసిన సమయం ఇదే.  మనం మన విధానాలలో మానవీయత ను కీలక స్థానం లో నిలపాలి.  ప్రకృతి మన ఉనికి కి మూల స్తంభం, అలాంటి ప్రకృతి తో మనం సమరస భావన తో సహ జీవనం చేయాలి.  సంవాద్, మనతో మనం మాట్లాడుకొనే, మన తోటి మనుషులతో మాట్లాడుకొనే కార్యక్రమం; మరి మనం ప్రకృతి తో కూడా మాట్లాడే కార్యక్రమం కూడా.  కాబట్టి ఈ కార్యక్రమం ఈ బాట లో సాగేందుకు మనకు వెలుగు ను ప్రసరించగలదు.  ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు దీని నిర్వాహకులకు ఇవే నా ప్రశంసలు; వారు వారి సమాలోచనల్లో సాఫల్యాన్ని అందుకొంటారని నేను ఆకాంక్షిస్తున్నాను.      

మీకు ధన్యవాదాలు.



 

***


(Release ID: 1682342) Visitor Counter : 227