PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 25 NOV 2020 5:37PM by PIB Hyderabad

 

Coat of arms of India PNG images free download

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 11,59,032 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలతో నేటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 13.5 కోట్లకు చేరిక.
  • మొత్తం కేసులలో ఇప్పటిదాకా కోలుకున్నవి 93.72  శాతానికి చేరిక
  • గత 24 గంటల్లో కోలుకున్న కేసులు 37,816 కాగా, కొత్త కేసులు 44,376 మాత్రమే
  • పర్యవేక్షణ, నియంత్రణ, జాగ్రత్తలకు సంబంధించి మార్గదర్శకాలు జారీచేసిన హోం మంత్రిత్వశాఖ. ఇది 2020 డిసెంబర్ 1 నుంచి 31.12.2020 వరకు అమలులో ఉంటుంది. కోవిడ్‌-19 వ్యాప్తిపై పోరులో సాధించిన గణనీయ ప్రయోజనాలను సమీకృతం చేయడమే ఈ మార్గదర్శకాల లక్ష్యం.

Image

భారత్‌లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు విశేషంగా పెరుగుదల; మొత్తం పరీక్షల సంఖ్య దాదాపు 13.5 కోట్లకు చేరువ; పరీక్షలు పెరిగినా నిర్ధారిత కేసుల శాతం తగ్గుదల

భారత్‌లో కోవిడ్ పరీక్షల మౌలిక వసతులు 2020 జనవరి నుంచి పెద్ద ఎత్తున పెరుగుతూ రావడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా భారీగా పెరిగింది, ఆ మేరకు గత 24 గంటల్లో 11,59,032 పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 13.5 కోట్లకు (13,48,41,307) చేరువ అవుతోంది. దీంతో నిర్ధారిత కేసుల మొత్తం సగటు భారీగా తగ్గుతూ నేడు 6.84 శాతానికి దిగిరాగా, రోజువారీ సగటు కేవలం 3.83 శాతానికి పరిమితమైంది. దేశంలో ఇవాళ ప్రభుత్వ రంగంలో 1,167, ప్రైవేట్‌ రంగంలో 971 వంతున మొత్తం 2,138 పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి పది లక్షల జనాభాకు ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన రోజువారీ కనీస పరీక్షల స్థాయిని భారత్‌ ఏనాడో దాటి, ఐదురెట్లు అధికంగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం చురుకైన కేసుల భారం (4,44,746) బాగా తగ్గి మొత్తం కేసులలో 4.82 శాతానికి పరిమితమై ఇది స్థిరంగా 5 శాతానికి దిగువన కొనసాగుతోంది. కోవిడ్ నుంచి కోలుకునేవారి జాతీయ సగటు 93శాతం వద్ద స్థిరంగా ఉంటూ ప్రస్తుతం 93.72 శాతానికి పెరిగింది. ఆ మేరకు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,816 మంది కోలుకోగా, ఇప్పటివరకు వ్యాధినుంచి బయటపడిన వారి సంఖ్య 86,42,771కి చేరింది. దీంతో కోలుకున్న, చికిత్సలో ఉన్నవారి మధ్య తేడా క్రమంగా పెరుగుతూ నేడు 81,98,025కు పెరిగింది. ఇక తాజాగా కోలుకున్నవారిలో 77.53 శాతం 10రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు కాగా, కేరళలో అత్యధికంగా 5,149 మంది, ఢిల్లీలో 4,943మంది, మహారాష్ట్రలో 4,086మంది వంతున నమోదయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో 44,376 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 76.51 శాతం కేసులున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా  6,224, మహారాష్ట్రలో 5439 మంది, కేరళలో 5420 వంతున అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటలలో 481 మంది మరణించగా వీరిలో 74.22 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవే. కాగా, ఢిల్లీలో అత్యధికంగా 109మంది, పశ్చిమ బెంగాల్‌లో 49 మంది, ఉత్తరప్రదేశ్ లో 33 మంది వంతున ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675590

 

కోవిడ్‌పై నిఘా/నియంత్రణ/ముందుజాగ్రత్తల దిశగా కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

కోవిడ్‌పై పోరులో భాగంగా నిఘా/నియంత్రణ/ముందుజాగ్రత్తలకు సంబంధించి దేశీయాంగ మంత్రిత్వశాఖ ఇవాళ మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా 2020 డిసెంబరు 1 నుంచి అమలు కానున్న ఈ మార్గదర్శకాలు 31.12.2020దాకా కొనసాగుతాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా సాధించిన గణనీయ విజయాలను సమీకృతం చేయడం ప్రధానంగా ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. దేశంలో చురుకైన కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. అయితే, కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు ప్రస్తుత పండుగలు, శీతాకాలం నేపథ్యంలో మహమ్మారిపై పూర్తి నియంత్రణ సాధించే దిశగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675690

కోవిడ్‌-19పై ముఖ్యమంత్రులతో సమావేశం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675726

ప్రధానమంత్రి చేతుల మీదుగా నవంబరు 26న ‘రీ-ఇన్వెస్ట్‌ 2020’ ప్రారంభం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 నవంబరు 26న సాయంత్రం 5:30గంటలకు వర్చువల్ మార్గంలో 3వ ‘గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్ అండ్ ఎక్స్‌పో’ (రీ-ఇన్వెస్ట్ 2020)ను ప్రారంభిస్తారు. నవ్య/పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నిర్వహించే ఈ శిఖరాగ్ర సదస్సు 2020 నవంబరు 26 నుంచి 28దాకా సాగనుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675502

భారత-మయన్మార్‌ల మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ 7వ సమావేశం

భారత-మయన్మార్‌ దేశాల మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ 7వ సమావేశం నిన్న వర్చువల్‌ మార్గంద్వారా నిర్వహించబడింది. రెండు దేశాల వాణిజ్యశాఖ మంత్రులు శ్రీ పీయూష్‌ గోయల్‌, గౌరవనీయ డాక్టర్ దాన్‌మియంట్‌ ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, బ్యాంకింగ్, అనుసంధానం, సామర్థ్య వికాసం, సరిహద్దు మౌలిక వసతుల మెరుగుదల తదితర పలు ద్వైపాక్షిక అంశాలను ఉభయపక్షాలూ సమీక్షించాయి. భారత-మయన్మార్ల మధ్య బలమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాల గురించి శ్రీ పీయూష్ గోయల్ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675441

భారత పారిశ్రామిక రంగం నాణ్యత-ఉత్పాదకతల మెరుగుపై దృష్టి సారించాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపు

భారత పరిశ్రమల రంగం నాణ్యత-ఉత్పాదకతల మెరుగుదలపై దృష్టి సారించాలని కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. వివిధ పారిశ్రామిక సంఘాల కార్యవర్గ సభ్యులతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు అంశాలపై మేధోమథనం కోసం వచ్చే నెలలో కొన్ని రోజులు కేటాయించాలని ఈ సందర్భంగా వారిని కోరారు.  ఈ ప్రక్రియను రంగాలవారీగా లేదా ప్రాంతీయ స్థాయిలో నిర్వహించవచ్చునని  తద్వారా భాగస్వాముల మధ్య పరిజ్ఞానం ఆదానప్రదానానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన పారిశ్రామిక సంస్థల రెండో త్రైమాసిక ఫలితాల్లో లాభదాయకత పెరుగుదల విస్పష్టంగా కనిపించిందని శ్రీ గోయల్ చెప్పారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగంనుంచి మరింత మద్దతును ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చడంలో నాణ్యత-ఉత్పాదకతలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ గోయల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675501

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అస్సాం: రాష్ట్రంలో నిన్న 157 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,11,839కి చేరగా, ఇప్పటిదాకా 2,07,646 మంది కోలుకున్నారు. అస్సాంలో ప్రస్తుతం చురుకైన కేసులు 3214 కాగా, మొత్తం మృతుల సంఖ్య 976గా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు డిసెంబర్ 17 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని కేరళ విద్యాశాఖ ఆదేశించింది. కాగా- 10, 12 తరగతుల ఉపాధ్యాయులు 50 శాతం హాజరు కావాలని సూచించింది. మరోవైపు జనవరి 10 నుంచి 10, 12 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చేవిధంగా సన్నాహాలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రితోపాటు ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి పాల్గొన్న సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. కాగా, నాణ్యత లోపం నేపథ్యంలో 30,000 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కోవిడ్-19 పరీక్ష కిట్లను కేరళ ప్రభుత్వం వెనక్కు పంపింది. రాష్ట్రంలో నిన్న 5,420 కొత్త కేసులు నమోదవగా 5,149మంది కోలుకున్నారు. ప్రస్తుతం మరణాల సంఖ్య 2095కాగా, కేసుల నిర్ధారణ సగటు 9.04 శాతంగా ఉంది.
  • తమిళనాడు: రాష్ట్రంలోని కరైకల్‌లో ఏర్పాటు చేసిన తుఫాను సహాయ శిబిరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇక్కడున్నవారు కరోనావైరస్‌ బారినపడినట్లు నిర్ధారణ అయితే, వారిని కోవిడ్ సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. కాగా, నివర్ తుఫాను నేపథ్యంలో తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించినవారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వ వైద్య బృందాలు శిబిరాలను నిర్వహించి, మాస్కులు పంపిణీ చేస్తున్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో కరోనా వైరస్‌ రెండోదఫా వ్యాప్తిని ఎదుర్కొనే దిశగా సంసిద్ధతపై చర్చించడం కోసం రాష్ట్ర కోవిడ్-19 సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) మంగళవారం సమావేశమైంది. కర్ణాటకలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు పంపించాలని ఈ సందర్భంగా విద్యాశాఖకు సిఫారసు చేసింది. రాష్ట్రంలోని కోవిడ్‌ మృతులలో 71 శాతం పురుషులేనని గణాంకాలు  పేర్కొంటున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ రూ.1,000 కోట్లతో ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు; ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న/చిల్లర వర్తకులకు రూ.10,000దాకా వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తారు. దీనికింద రుణం పొందడం కోసం ఇప్పటికే 10 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్ టీకా నిల్వ/పంపిణీ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక 75 శాతం ప్రేక్షక సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతి లభిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని శ్రీ బాలాజీ వైద్యకళాశాల-ఆస్పత్రి, పరిశోధన సంస్థలో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు, అత్యాధునిక పరికరాలను గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 993 కొత్త కేసులు, 4 మరణాలు నమోదవగా 1150 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,66,042; క్రియాశీల కేసులు: 10,886; మరణాలు: 1441కాగా; తెలంగాణలో ఇప్పటిదాకా 95.36 శాతం సగటుతో 2,53,715మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కోలుకునే సగటు 93.7 శాతం కావడం ఈ సందర్భంగా గమనార్హం.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్‌-19 టీకా పంపిణీ కోసం విధివిధానాల ఖరారును పర్యవేక్షించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేసింది. టీకా లభ్యత సంబంధిత అంశాలతోపాటు దాని ప్రభావంపైనా ఈ బృందం  చర్చిస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ‘మై ఫ్యామిలీ మై రెస్పాన్స్‌బిలిటీప్రచార కార్యక్రమం ఫలితంగా రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య 24,000 స్థాయినుంచి నేడు 5,000 స్థాయికి పతనమైందని ముఖ్యమంత్రి చెప్పారు. కేసుల సత్వర అన్వేషణలో భాగంగా రాష్ట్రంలో నిత్యం 80,000 పరీక్షలు నిర్వహిస్తున్నారు.
  • గుజరాత్: రాష్ట్రంలో 1510 కొత్త కేసులు నమోదవగా, అదే వ్యవధిలో 1276మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా 73.76 లక్షలకుపైగా నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం గుజరాత్‌లో 14,044 క్రియాశీల కేసులుండగా, ఇప్పటిదాకా నమోదైన మృతుల సంఖ్య 3889గా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 25వేలు దాటింది. ఇప్పటిదాకా రాజస్థాన్లో మొత్తం 2.5లక్షలకుపైగా కేసులు నమోదవగా, కోలుకున్నవారి సంఖ్య 2.2 లక్షలు దాటింది. ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 2200గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ మేరకు ప్రస్తుతం 12,979గా ఉంది. మధ్యప్రదేశ్లో కేసుల నిర్ధారణ సగటు 5.5 శాతంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం రోగులలో 59 శాతం ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు. ఇండోర్, భోపాల్, గ్వాలియర్, రత్లం, విదిషా, శివపురి జిల్లాల్లో వారంనుంచీ కేసులు అధికంగా నమోదువుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి నియంత్రణపై మరింత శ్రద్ధ చూపాలని ఆయా జిల్లాలో నియమించిన సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని రాయ్‌పూర్, జగదల్‌పూర్ విమానాశ్రయాల్లో వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్ష నిర్వహణ కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం సవరించిన సూచనలను జారీచేసింది. ఈ మేరకు రాయ్‌పూర్ పురపాలక సంస్థ సూచించిన కేంద్రాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా 14 రోజులపాటు చెల్లింపు నిర్బంధ చికిత్సలో ఉండటం తప్పనిసరి.
  • గోవా: రాష్ట్రంలో నిన్న 167 కొత్త కేసుల నమోదుతోపాటు 85 మంది కోలుకున్నారు. కాగా, రాష్ట్రంలో చురుకైన కేసుల సంఖ్య  కొన్ని రోజులుగా స్థిరంగా తగ్గుతున్నప్పటికీ ఇవాళ 1,221కి పెరిగింది. నిన్న 2004 నమూనాలను పరీక్షించగా 167 మందికి (8.33 శాతం) వ్యాధి నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 96.96 శాతంగా ఉంది.

FACT CHECK

 

Image

 

Image

*******

 

 



(Release ID: 1675865) Visitor Counter : 124