ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వింధ్యాచ‌ల్ ప్రాంతం లో గ్రామీణ తాగునీటి స‌‌ర‌ఫ‌రా ప‌థ‌కాలకు ఈ నెల 22 న శంకుస్థాప‌న చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి‌

Posted On: 20 NOV 2020 2:12PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని వింధ్యాచ‌ల్ ప్రాంతం లో గల మీర్జాపుర్‌, సోన్‌భ‌ద్ర జిల్లాల‌ లో గ్రామీణ తాగునీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌కు నవంబర్ 22 న ఉద‌యం 11:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేయ‌నున్నారు.  ప్ర‌ధాన మంత్రి ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా గ్రామ నీటి, పారిశుధ్య సంఘం/ పానీ స‌మితి స‌భ్యుల‌తో మాట్లాడ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మం లో ఉత్త‌ర్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ కూడా పాల్గొంటారు.

ఈ ప్రాజెక్టులు  2,995 గ్రామాల‌లోని అన్ని గ్రామీణ కుటుంబాలకు  న‌ల్లా నీటి క‌నెక్ష‌న్‌ల‌ను అందించనున్నాయి.  ఈ పథకాలతో సుమారు గా 42 ల‌క్ష‌ల మంది జ‌నాభాకు ల‌బ్ధి చేకూరనుంది.  ఈ గ్రామాలు అన్నిటిలో గ్రామ నీటి, పారిశుధ్య సంఘాల‌ను/ పానీ స‌మితుల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఇవి ఈ ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌ల‌ను తీసుకొంటాయి.  ఈ ప‌థకాల మొత్తం అంచ‌నా వ్య‌యం 5,555.38 కోట్ల రూపాయ‌లుగా ఉంది.  ఈ ప‌థ‌కాల‌ను 24 నెల‌ల లోప‌ల పూర్తి చేయాల‌ని ప్ర‌ణాళిక వేసుకొన్నారు.
 
జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ను గురించి

ప్ర‌ధాన మంత్రి క్రింద‌టి సంవ‌త్స‌రం లో ఆగ‌స్టు 15 న ఎర్ర‌ కోట బురుజుల మీద నుంచి ప్ర‌సంగిస్తూ, దేశం లోని ప్ర‌తి గ్రామీణ గృహానికి 2024 క‌ల్లా సక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్ ల‌ను స‌మ‌కూర్చడం జ‌ల్‌ జీవ‌న్ మిష‌న్ ధ్యేయమని ప్ర‌క‌టించారు.  2019 ఆగ‌స్టు లో ఈ మిష‌న్ ను గురించి ప్ర‌క‌టించే నాటికి, 18.93 కోట్ల గ్రామీణ కుటుంబాల‌లో 3.23 కోట్ల కుటుంబాలు (17 శాతం) మాత్ర‌మే న‌ల్లా క‌నెక్ష‌న్లు కలిగివున్నాయి.  అంటే, 15.70 కోట్ల న‌ల్లా నీటి క‌నెక్ష‌న్ల‌ను రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల‌లో అందించవ‌ల‌సి ఉంటుందన్న మాట.  గ‌త 15 నెల‌ల కాలం లో, కొవిడ్-19 మ‌హ‌మ్మారి ఉన్న‌ప్ప‌టికీ కూడా, 2.63 కోట్ల కుటుంబాల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్ ల‌ను ఇవ్వ‌డ‌మైంది.  ఇప్పుడు దాదాపుగా 5.86 కోట్ల గ్రామీణ కుటుంబాలు(30.67 శాతం) న‌ల్లా నీటి క‌నెక్ష‌న్ ల సౌక‌ర్యాన్ని కలిగివున్నాయి.  


***



(Release ID: 1674371) Visitor Counter : 129