ప్రధాన మంత్రి కార్యాలయం

జామ్‌నగర్, జైపూర్‌లలో ఫ్యూచర్-రెడీ భవిష్యత్ అవసరాలను తీర్చేలా రూపొందించిన ఆయుర్వేద సంస్థల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

Posted On: 13 NOV 2020 1:00PM by PIB Hyderabad

నమస్కారం!
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీమాన్ శ్రీపాద్ నాయక్ జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమాన్ అశోక్ గెహ్లోత్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ భాయ్ రూపాణీ జీ, రాజస్థాన్ గవర్నర్ శ్రీమాన్ కల్రాజ్ జీ, గుజరాత్ గవర్నర్ శ్రీమాన్ ఆచార్య దేవవ్రత్ జీ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయుర్వేదంతో అనుసంధానమైన అందరు ప్రముఖులు, సోదర, సోదరీమణులారా!
ఇవాళ ధన్ తేరస్, భగవాన్ ధన్వంతరి జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్వంతరి జీ ఆరోగ్యానికి దేవునిగా భావిస్తాం. ఆయుర్వేద రచన కూడా వారి ఆశీర్వాదం తోనే జరిగింది. ఈ పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భారతదేశంతోపాటు ప్రపంచం మొత్తానికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవాన్ ధన్వంతరికి సమస్త మానవాళి ప్రార్థన చేస్తున్నది.
మిత్రులారా,
ఈసారి ఆయుర్వేద దినోత్సవం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చాలా ప్రత్యేకమైనది. మన యువ మిత్రులకోసం కూడా ప్రత్యేకమైనది. ఇవాళ గుజరాత్ లోని జామ్ నగర్ లో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద’కు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’ హోదా దక్కింది. ఇదే విధంగా జైపూర్ లోని ‘రాష్ట్రీయ ఆయుర్వేద సంస్థాన్’ డీమ్డ్ యూనివర్సిటీ రూపంలో జాతికి అంకితమైంది. ఆయుర్వేదంలో ఉన్నతవిద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధితో అనుసంధానం చేసే ఈ గొప్ప సంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు యావద్భారతానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఆయుర్వేదం, భారతదేశానికి వారసత్వంగా సంక్రమించిన ఆయుర్వేదం ద్వారా మొత్తం ప్రపంచానికే మేలు జరుగుతోంది. మన సంప్రదాయ విజ్ఞానం నేడు ప్రపంచమంతా సమృద్ధమవుతుండటం ప్రతి భారతీయుడికీ గర్వకారణమే కదా. నేడు బ్రెజిల్ జాతీయ విధానాల్లో ఆయుర్వేదం భాగస్వామ్యమైంది. భారత్-అమెరికా సంబంధాలైనా, భారత్-జర్మనీ సంబంధాలైనా ఆయుష్, భారతీయ సంప్రదాయ చికిత్స విధానంతో ఈ బంధాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల డబ్ల్యూహెచ్‌వో, ఈ సంస్థ చీఫ్, నా మిత్రుడు.. ‘గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్’ స్థాపనకోసం భారతదేశాన్ని ఎంచుకున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ఇప్పుడు ఈ దిశగా ప్రపంచమంతటికోసం భారతదేశంలో పనులు మొదలవుతాయి. భారతదేశానికి ఈ గురుతర బాధ్యత అప్పగించినందుకు డబ్ల్యూహెచ్‌వోకు, మరీ ముఖ్యంగా ఈ సంస్థ చీఫ్, మిత్రుడు డాక్టర్ టైడ్రోస్ కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ రూపంలో ఆవిర్భవించిన భారతదేశం.. అదే విధంగా సంప్రదాయ చికిత్సా విధానంలో ప్రపంచ ఆరోగ్య సంక్షేమ కేంద్రంగా విలసిల్లుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఈ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ మందుల అభివృద్ధి, వాటితో అనుసంధానమైన పరిశోధనలకు కొత్త పునాదులు వేసేదిగా పేరు తెచ్చుకుంటుంది.
మిత్రులారా,
మారుతున్న ఈ పరిస్థితులతోపాటు ప్రతి అంశం ఏకీకృతమవుతోంది. ఆరోగ్యం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఆలోచన తోనే దేశంలోని వివిధ చికిత్సాపద్ధతుల ఏకీకృతం చేస్తూ.. అన్నింటికీ సమాన గౌరవాన్ని కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ ఆలోచన ద్వారానే.. ఆయుష్, ఆయుర్వేదాన్ని దేశ వైద్యవిధానంలో ప్రధానభాగంగా మార్చడం జరిగింది. అందుకే మన ఆరోగ్య విజ్ఞాన నిధిని ఒక అవకాశంగా మాత్రమే చూడకుండా.. దేశ ప్రజల ఆరోగ్యానికి ఆధారంగా మార్చుతున్నాం.
మిత్రులారా,
భారతదేశం వద్ద ఆరోగ్యానికి సంబంధించిన అతి విలువైన సంప్రదాయ జ్ఞానం ఉందనేది జగమెరిగిన సత్యం. దీంతోపాటు.. ఈ జ్ఞానం ఎక్కువగా పుస్తకాలు, శాస్త్రాల రూపంలో నిక్షిప్తమై ఉన్నదని.. మన అమ్మమ్మలు, నానమ్మల చిట్కాల్లోనే మిగిలిపోతున్నదనేది కూడా అంతే సత్యం. ఈ జ్ఞాననిధిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందుకోసం దేశంలోని ప్రాచీన చికిత్స జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని 21వ శతాబ్దపు ఆధునిక విజ్ఞానంతో జోడించడం, ఏకీకృతం చేయడం జరుగుతోంది. ఈ దిశగా సరికొత్త ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితమే ఇక్కడ అఖిల భారతీయ ఆయుర్వేత సంస్థను స్థాపించడం జరిగింది. లేహ్ లో సోవా-రిగ్పా సంబంధిత పరిశోధన, మిగిలిన అధ్యయనాలకోసం రాష్ట్రీయ సోవా-రిగ్పా సంస్థాన్ ను అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాజస్థాన్, గుజరాత్ ల్లోని ఈ సంస్థలను అప్ గ్రేడ్ చేయడం జరిగింది. అది కూడా సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ, విస్తారం చేయడంలో భాగంగానే చేయడం జరిగింది.
సోదర, సోదరీమణులారా,
మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన బాధ్యత పెరుగుతుందనేది వాస్తవం. ఇవాళ ఈ రెండు మహత్వపూర్ణమైన సంస్ధల పురోగతి జరుగుతోంది. ఈ సందర్భంగా నా నివేదన ఏంటంటే.. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఆయుర్వేద సంస్థలుగా పేరుతెచ్చుకున్న మీరు.. అంతర్జాతీయ వైద్య విధానాలకు, విజ్ఞాన పరిశోధనలకు అనుగుణంగా ఇక్కడి పాఠ్యప్రణాళికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆయుర్-భౌతికీ, ఆయుర్-రసాయన్ శాస్త్రాల వంటి విషయాలకు సంబంధించిన కొత్త అవకాశాలపై పనిచేయాలని ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖను, యూజీసీని కోరుతున్నాను. పరిశోధనలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే దిశగా.. సమగ్ర వైద్య విధానం, వైద్య విద్య అనంతర పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు అవకాశం పెరుగుతుంది. దేశంలోని ప్రైవేటు రంగం, స్టార్టప్ లను కూడా కోరుతున్నదొక్కటే.. మీరు అంతర్జాతీయంగా ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్ ను, ఈ రంగంలో జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయండి. ఈ రంగంలో మీ పురోగతిని, మీ భాగస్వామ్యాన్ని సునిశ్చితం చేసుకోండి. ఆయుర్వేద స్థానిక శక్తికోసం ప్రపంచవ్యాప్తంగా ప్రచారాస్త్రం కావాలి. మనం చేసే ఈ ప్రయత్నాల కారణంగా ఆయుష్ మాత్రమే కాదు.. ఆరోగ్యం విషయంలోనూ.. మన మొత్తం వ్యవస్థ ఓ భారీ మార్పుకు సాక్షీభూతంగా నిలవనుంది.
మిత్రులారా,
ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండు చరిత్రాత్మక చట్టాలను రూపొందించిన విషయం మీకు తెలుసు. మొదటిది నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్  మెడిసిన్, రెండోది.. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి. ఇంతే కాదు.. నూతన జాతీయ విద్యావిధానంలోనూ.. వైద్యవిద్యలో ఏకీకృత విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. అలోపతి విద్యలో.. ఆయుర్వేదానికి సంబంధించిన కనీస జ్ఞానం తప్పనిసరి.. ఆయుర్వేద విద్యలో అలోపతి విధానాల జ్ఞానం తప్పనిసరిగా ఉండాలనేదే ఈ ఏకీకృత విధానం ఉద్దేశం. ఆయుష్, భారతీయ సంప్రదాయ చికిత్స విధానంతో అనుసంధానమైన విద్య, పరిశోధనకు ఈ ఆలోచన మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారతం ముక్కలు ముక్కలుగా కాదు.. ఏకీకృత ఆలోచనతో ముందుకెళ్తోంది. ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లను కూడా ఇప్పుడు సంపూర్ణ సమగ్ర విధానంతోనే పరిష్కరించుకుంటోంది. నేడు దేశంలో చవకైన, ప్రభావవంతమైన చికిత్సతోపాటు ప్రివెంటివ్ హెల్త్‌కేర్ (నివారణ), ఆరోగ్య సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ‘స్వాస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార్ ప్రశమనంచ’ అని ఆచార్య చరకుడు చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఆరోగ్యంగానే ఉంచడం.. రోగిని రోగవిముక్తుడిని చేయాలని దానర్థం. ఆయుర్వేదం ఉద్దేశం కూడా ఇదే. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వ్యాధులను కలిగించే పరిస్థితులకు దూరంగా ఉంచే దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు.. పారిశుద్ధ్యం, స్వచ్ఛత, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, పొగలేని వంటిల్లు, పౌష్టికాహారం వంటివాటిపై పూర్తి దృష్టి సారించాం. మరోవైపు దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల ఆరోగ్య, వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. ఇందులో 12వేలకు పైగా ఆయుష్ వెల్ నెస్ సెంటర్లను పూర్తిగా ఆయుర్వేదానికి అంకితం చేశాం.
మిత్రులారా,
భారతదేశపు ఈ ఆరోగ్య సంక్షేమమే నేను ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కరోనా సమయంలోనూ.. ఆరోగ్యం, ఆరోగ్యసంక్షేమానికి సంబంధించిన భారతీయ సంప్రదాయ వైద్యం ఎంత ప్రభావవంతమైందో ప్రపంచానికి చూపించాం. కరోనాను ఎదుర్కునేందుకు ప్రభావవంతమైన రక్షణ వ్యవస్థ కనిపించని సమయంలో.. భారతదేశంలోని ప్రతి ఇంట్లో పసుపు, పాలు, కషాయం వంటి వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే పద్ధతులను ఆవలంబించారు. ఇంతటి జనాభా, ఎక్కువ జనసాంద్రత ఉన్న మన దేశంలో కరోనా ఇంకా అదుపులోనే ఉన్నదంటే.. అందులో మన సంప్రదాయ వైద్య విధానం పాత్ర అత్యంత కీలకం.
మిత్రులారా,
కరోనా కాలంలో ప్రపంచమంతా ఆయుర్వేదిక్ ఉత్పత్తుల డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆయుర్వేద ఉత్పత్తుల ఒకటిన్నరరెట్లు పెరిగింది. దాదాపు 45శాతం పెరిగిందని. ఇంతేకాదు మాసాలాలకు డిమాండ్ విషయంలోనూ ఈ పెంపు చాలా ఎక్కువగా ఉంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వస్తువుల ఎగుమతి ఒక్కసారిగా ఇలా పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై, భారతీయ మసాలాలపై పెరుగుతున్న విశ్వాసానికి ఒక ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం చాలా దేశాల్లో పసుపుతో తయారుచేసిన వస్తువులకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రపంచంలోని ప్రముఖ వైద్య జర్నల్స్ కూడా ఆయుర్వేదంపై భారీ ఆశలు పెట్టుకున్నాయి.
మిత్రులారా,
కరోనా సమయంలో మా దృష్టి కేవలం ఆయుర్వేద వినియోగానికే పరిమితం కాలేదు. ఈ విపత్కర సమయంలోనూ ఆయుష్ కు సబంధించిన పరిశోధనలను దేశంలో, ప్రపంచమంతా ప్రోత్సహించేదిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు దేశంలో ఓ వైపు కరోనా టీకాకు ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు కరోనాతో పోరాటానికి ఆయుర్వేద పరిశోధనలు అంతర్జాతీయ సమన్వయంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడే కేంద్రమంత్రి శ్రీపాద్ జీ.. వందకుపైగా ప్రాంతాల్లో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని అఖిల భారతీయ ఆయుర్వేద సంస్థాన్ కూడా.. 80వేల మంది ఢిల్లీ పోలీసులపై వ్యాధినిరోధకతకు సంబంధించిన పరిశోధనలు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రూప్ స్టడీ అవుతుంది. దీంట్లోనూ సానుకూల పరిణామాలు కనబడుతున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా కూడా పరీక్షలు ప్రారంభం అవుతాయి.
మిత్రులారా,
నేడు మనం ఆయుర్వేద మందులు, వనమూలికలతోపాటు వ్యాధినిరోధకత పెంచే పౌష్టికాహారంపైనా ప్రత్యేక దృష్టి సారించాం. తృణధాన్యాలను ఉత్పత్తి చేసేలా అన్నదాతలను ప్రోత్సహిస్తున్నాం. గంగానదీ తీరంలో, హిమాలయ క్షేత్రంలో సేంద్రియ ఉత్పాదనను పెంచాం. ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్యసంక్షేమంలో భారత్ వీలైనంత ఎక్కువ పాత్ర పోషించేలా, మన ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా.. మన రైతుల ఆదాయం పెరిగేలా మా ప్రయత్నాలు, కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ ప్రణాళికలను అమలుచేస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావం పెరిగిన తర్వాత అశ్వగంధ, గిలోయ్ (తిప్పతీగ), తులసి వంటి ఆయుర్వేద మూలికల ధర ఎందుకు పెరిగిందంటే.. వాటి డిమాండ్ పెరిగింది. ప్రజల విశ్వాసం పెరిగింది. ఈసారి అశ్వగంధ ధర గతంతో పోలిస్తే రెండింతలు పెరిగిందని నాకు చెప్పారు. దీని లబ్ధి ఈ మొక్కలను పెంచుతున్న రైతుల కుటుంబాలకు నేరుగా చేరుతుంది. నిజానికి చాలా మంచి మంచి వనమూలికలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇలాంటి దాదాపు 50 ఔషధ మొక్కలున్నాయి. వాటిని మనం కూరగాయలుగా, సలాడ్ రూపంలో తీసుకుంటున్నాం. ఇలాంటప్పుడు వ్యవసాయ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ లేదా మరిన్ని విభాగాల సంయుక్త ప్రయత్నాల ద్వారా ఈ క్షేత్రంలో భారీ మార్పులు తీసుకురావచ్చు.
మిత్రులారా,
ఆయుర్వేదంతో అనుసంధానమైన పర్యావరణ వ్యవస్థను వృద్ధి చేసేందుకు.. మన దేశంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ టూరిజానికి కూడా మంచి డిమాండ్ పెరుగుతుంది. గుజరాత్, రాజస్థాన్‌ల్లో ఇందుకోసం అనంతమైన అవకాశాలున్నాయి. ఈ దిశగా జైపూర్, జామ్‌నగర్ లోని ఈ రెండు సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తాయని నాకు విశ్వాసం ఉంది. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రేపు దీపావళి  సందర్భంగా నా తరఫున, మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధువులకు పండగ శుభాకాంక్షలు.

ధన్యవాదములు

 

*****


(Release ID: 1672978) Visitor Counter : 180