ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియాన్ ఇండియా 17వ శిఖ‌రాగ్ర స‌మావేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాని

Posted On: 12 NOV 2020 10:34PM by PIB Hyderabad

ఆసియాన్ ఇండియా 17వ శిఖ‌రాగ్ర స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని శ్రీ న‌రే్ంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఆసియాన్ ప్ర‌స్తుత ఛైర్మన్ వియత్నాం ప్ర‌ధాని శ్రీ గుయెన్ గ్జువాన్ ఫుక్ ఆహ్వానం మేర‌కు ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని శ్రీ మోదీ పాల్గొన్నారు.విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఆసియాన్ కు చెందిన స‌భ్య దేశాల‌న్నీ పాల్గొన్నాయి. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ..భార‌త‌దేశం అనుస‌రిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాల‌సీకి ఆసియాన్ కేంద్ర బిందువనే విష‌యాన్ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. భార‌త‌దేశ ఇండో ప‌సిఫిక్ దార్శ‌నిక‌త‌కు ఐక‌మ‌త్యంతో కూడిన‌, బాధ్య‌తాయుత‌మైన‌, సౌభాగ్య‌వంత‌మైన ఆసియాన్ కీల‌క‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. అది ఈ ప్రాంతంలోని అంద‌రి భ‌ద్ర‌త‌కు, వృద్ధికి దోహ‌దం చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా సాగ‌ర్ (ఎస్ ఏ జి ఏ ఆర్ ) ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. భార‌త‌దేశ ఇండో ప‌సిఫిక్ స‌ముద్రాల కార్య‌క్ర‌మం, ఆసియాన్ ఇండో ప‌సిఫిక్ దృక్ప‌థం... ఈ రెండింటి క‌ల‌యిక బలోపేత ఆవ‌శ్య‌క‌త‌ను  ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. త‌ద్వారా స్వేచ్ఛాయుత‌, పార‌ద‌ర్శ‌క‌, అంద‌రినీ క‌లుపుకుపోయే విధాన ఆధారిత ఇండోప‌సిఫిక్ ప్రాంతం సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. భార‌త‌దేశం అమ‌లు చేస్తున్న ఇండో ప‌సిఫిక్ స‌ముద్రాల కార్య‌క్ర‌మం ( ఐపిఓఐ)కు సంబంధించిన ప‌లు అంశాల్లో స‌హ‌కారం అందించాల‌ని ఆసియాన్ దేశాల‌కు ప్ర‌ధాని ఆహ్వానం ప‌లికారు. 
కోవిడ్ -19కు సంబంధించి భార‌త‌దేశం అమ‌లు చేసిన విధానాల‌ను ప్ర‌ధాని ప్రత్యేకంగా ప్ర‌స్తావించారు. అంత‌ర్జాతీయంగా భార‌త‌దేశం చేసిన విస్తృత ప‌రిధిలోని సాయం గురించి పేర్కొన్నారు. మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో ఆసియాన్ దేశాలు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను స్వాగ‌తించారు. కోవిడ్ -19 ఆసియాన్ రెస్పాన్స్ ఫండ్ కు 1 మిలియ‌న్ యూఎస్ డాల‌ర్ల విరాళాన్ని అందించారు. 
ఆసియాన్ దేశాల‌కు భార‌త‌దేశానికి మ‌ధ్య‌న భౌతికంగాను, డిజిట‌ల్ గాను వుండాల్సిన అత్య‌ధిక క‌నెక్టివిటీ ప్రాధాన్య‌త గురించి ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో మాట్లాడారు. ఆసియాన్ క‌నెక్టివిటీ కోసం భార‌త‌దేశం త‌ర‌ఫున 1 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్ల రుణ మ‌ద్ద‌తు వుంటుంద‌ని అన్నారు. ఇక వాణిజ్య‌, పెట్టుబ‌డుల విష‌యం తీసుకుంటే కోవిడ్ -19 నేప‌థ్యంలో ఆర్ధికంగా పుంజుకోవ‌డానికిగాను స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల విస్త‌ర‌ణ‌‌, వాటి దృఢ‌త్వ ప్రాధాన్యత గురించి ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. 
ఆసియాన్ దేశాల ప్రాంతంలో శాంతి సుస్థిర‌త‌ల‌కోసం భార‌త‌దేశం చేస్తున్న కృషిని ఆసియాన్ నేత‌లు ప్ర‌శంసించారు. ఆసియాన్ దేశాలకు భార‌త‌దేశం అందిస్తున్న మ‌ద్ద‌తును స్వాగ‌తించారు. 2021-2025 సంవత్స‌రాల‌కుగాను రూపొందించిన నూత‌న ఆసియాన్ ఇండియా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక స్వీక‌ర‌ణ‌కు ఆసియాన్ నేత‌లు స్వాగతం ప‌లికారు. 
ఈ చ‌ర్చ‌ల్లో ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ద‌క్షిణ చైనా స‌ముద్రం, ఉగ్ర‌వాదంతోపాటు అన్ని దేశాల‌కు ఉమ్మ‌డి ప్రాధాన్య‌త‌క‌లిగిన అంశాల‌ను ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. ఆసియాన్ ప్రాంతంలో నియ‌మాల ఆధారిత వాతావ‌ర‌ణాన్ని ప్రోత్సాహించాల్సిన అంశానికి గ‌ల ప్రాధాన్య‌త‌ను అన్ని దేశాలు గుర్తించాయి. దీంతోపాటు అంత‌ర్జాతీయ చ‌ట్టాలు ముఖ్యంగా యుఎన్ సిఎల్ ఓ ఎస్ ప్ర‌కారం న‌డుచుకోవాల్సిన అంశానికి క‌ట్టుబ‌డి వుండాల‌ని నిర్ణ‌యించారు. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో శాంతిని, స్థిర‌త్వాన్ని, భ‌ద్ర‌త‌ను కాపాడుకుంటూ వాటిని ప్రోత్సాహించే అంశానికి గ‌ల ప్రాధాన్య‌త‌ను నేత‌లు స్ప‌ష్టం చేశారు. అంతే కాదు ద‌క్షిణ చైనా స‌ముద్రంలో నౌకాయాన స్వేచ్ఛ‌ను,జ‌లాల‌పైన విమాన‌యాన స్వేచ్ఛ వుండేలా చూసుకోవాల్సి వుంద‌ని అన్నారు.  

 

****
 



(Release ID: 1672507) Visitor Counter : 250