ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొత్త కేసులకంటే కొత్తగా కోలుకున్నవారు35 రోజులుగా అధికం

ఐదు వారాలుగా చికిత్సలో ఉన్నవారు తగ్గుదల బాటలో

Posted On: 07 NOV 2020 11:42AM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరుగుతున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా నమోదవుతున్న ధోరణి ఇప్పటికి నెలకుపైగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటలలో50,356 కొత్త కేసులు నమోదు కాగా, 53,920 మంది కొలుకున్నారు. గడిచిన ఐదువారాలుగా ఇదే ధోరణి కనబడుతోంది. దీనివల్లనే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 5.16 లక్షలమంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు.

 

గడిచిన ఐదువారాలుగా సగటు కొత్త పాజిటివ్ కేసులు తగ్గుదల బాటలో సాగుతూనే ఉన్నాయి. సగటు కొత్త కేసులు అక్టోబర్ మొదటి వారంలో 73,000 ఉండగా ఇప్పుడది 46,000 కు తగ్గింది. 

మరోవైపు చికిత్సపొందుతూ ఉన్న బాధితుల సంఖ్య కూడా అదే ధోరణి ప్రదర్శిస్తూ తగ్గుదల బాటలో సాగుతోంది. ప్రస్తుతం చికిత్సపొందుతున్నవారి సంఖ్య 5,16,632 . ఇది మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 6.11% మాత్రమే. ఇప్పటివరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 78,19,886 కాగా జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 92.41% కి చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య అంతరం బాగా పెరుగుతూ ప్రస్తుతం 73,03,254 కి చేరింది.

కొత్తగా కోలుకున్నవారిలో 79% కేసులు కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. వారిలో మహారాష్ట్రలోనే ఒక్కరోజే 11,060 మంది కోలుకున్నవారున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 15,62,342 కు చేరింది. జాతీయ సగటుతో పోల్చుకున్నప్పుడు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువశాతం మంది కొలుకుంటున్నట్టు నమోదు చేసుకున్నాయి.

 

కొత్తగా పాజిటివ్ గా తేలినవారిలో 77% మంది 10 రాష్జ్ట్రాలకు చెందినవారు కాగా, ఢిల్లీ ఇప్పుడు మహారాష్ట, కేరళ రాష్ట్రాలను మించిపోయి 7178 కేసులు గత 24 గంటలలోనే నమోదు చేసింది. కేరళలో 7,002 కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో 6870 మందికి నిన్న పాజిటివ్ గా నిర్థారణ అయింది.  

 

గడిచిన 24 గంటలలో 577 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 83% మంది పది రాష్ట్రాలకు చెందినవారే. 27.9% కొత్త మరణాలు మహారాష్ట్రలో (161 మంది) నమోదయ్యాయి. ఢిల్లీలో 64, పశ్చిమబెంగాల్ లో 55 మంది చనిపోయారు. 

***

 

(Release ID: 1670950) Visitor Counter : 264