ప్రధాన మంత్రి కార్యాలయం

అంతర్జాతీయ పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆన్ లైన్ లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం

Posted On: 05 NOV 2020 8:02PM by PIB Hyderabad

నమస్తే.  పండుగల కాలంలో మీకు ఇవే శుభాకాంక్షలు.

మీకు స్వాగతం పలుకడానికి నేను సంతోషపడుతున్నాను.  మాతో మీ భాగస్వామ్యాన్ని పెంపొందింపచేసుకోవాలనే మీ తహతహ ను చూసి నాకు ఆనందంగా ఉంది.  మన పరస్పర దృష్టికోణాలను గురించి మనకు ఉన్నటువంటి మెరుగైన అవగాహన, మీ ప్రణాళికలతో మా దార్శనికత మేలైన సమన్వయానికి దారి తీస్తుందని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఈ సంవత్సరంలో, ప్రపంచ మహమ్మారి తో భారతదేశం ధైర్యంగా పోరాడగా, భారతదేశ ప్రజల స్వభావాన్ని ప్రపంచం గమనించింది.  భారతదేశ వాస్తవిక బలాన్ని కూడా ప్రపంచం తెలుసుకుంది.  ఆ పోరు భారతీయులు ఏ విశిష్ఠ గుణాలకు పేరు గాంచారో, వాటిని చాటిచెప్పడంలో సఫలం అయింది.  ఆ విశిష్ఠ గుణాణాలే బాధ్యత ను గురించిన స్పృహను కలిగివుండటమూ,  కరుణ తాలూకు స్ఫూర్తిని కలిగివుండటమూ. దేశ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండటమూ, నూతన ఆవిష్కరణ కు సంబంధించిన ఉత్సాహాన్ని కలిగివుండటమూను.  మహమ్మారి తో  పోరాడటం లో కావచ్చు, లేదా ఆర్థిక స్థిరత్వానికి పూచీపడటం కావచ్చు.. భారతదేశం అసాధారణమైన ప్రతిఘాతుకత్వాన్ని ప్రదర్శించింది.  ఈ ప్రతిఘాతుకత్వానికి మా వ్యవస్థలు, మా ప్రజల సమర్థన, మా విధానాల స్థిరత్వం చోదకంగా పనిచేశాయి.  మేము సుమారు 800 మిలియన్ మందికి ఆహార ధాన్యాలను, 420 మిలియన్ మందికి డబ్బును, దాదాపు 80 మిలియన్  కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాసు ను అందించగలిగామంటే ఆ కార్యాలు మా వ్యవస్థల బలం కారణంగానే సాధ్యపడ్డాయి.  వైరస్ తో భారతదేశం అంతటి బలమైన పోరాటాన్ని  చేయగలిగింది అంటే అది సురక్షిత దూరాన్ని పాటిస్తున్న, మాస్కులను ధరిస్తున్న  ప్రజల మద్దతు తోనే సాధ్యపడింది.  ప్రపంచంలో అత్యంత ఇష్టపడే పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా భారతదేశం అవతరించింది అంటే అది మా విధానాలలోని స్థిరత్వం వల్లే సాధ్యపడింది.

మిత్రులారా,

పాత పద్ధతులకు తావు లేనటువంటి ఒక ‘న్యూ ఇండియా’ ను మేము నిర్మిస్తున్నాము.  ప్రస్తుతం, భారతదేశం మార్పు చెందుతోంది అది కూడాను మెరుగైన స్థితి లోకి పరివర్తన చెందుతోంది.  ఆర్థిక బాధ్యతరాహిత్యం నుంచి ఆర్థిక వివేకానికి, అధిక ద్రవ్యోల్బణం నుంచి తక్కువ ద్రవ్యోల్బణానికి,  ఆలోచన లేకుండా రుణాలు మంజూరు చేసి అవి వసూలు కాని రుణాలుగా మారడం నుంచి గుణాధారిత రుణాల మంజూరు కు,  మౌలిక సదుపాయాల లోటు నుంచి ఇతోధిక మౌలిక సదుపాయాల కల్పన కు,  పట్టణ ప్రాంతాలలో సమతుల్యం లోపించిన వృద్ధి చోటు చేసుకోవడం నుంచి సమతుల్య వృద్ధి కి, భౌతిక మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కు భారతదేశం మారుతోంది.

మిత్రులారా,

ఆత్మ నిర్భర్ (స్వయంసమృద్ధియుతం)గా మారాలన్న భారతదేశం తపన కేవలం ఓ దార్శనికతే కాదు, అది ఒక చక్కటి ప్రణాళిక తో కూడినటువంటి  ఆర్థిక వ్యూహం.  మా వ్యాపారాల సామర్థ్యాలను, మా కార్మికుల నైపుణ్యాలను ఉపయోగించుకొంటూ భారతదేశాన్ని ప్రపంచ తయారీ కి ప్రధాన కేంద్రం గా తీర్చిదిద్దాలని లక్ష్యం గా పెట్టుకొన్నటువంటి ఒక వ్యూహం; సాంకేతిక పరిజ్ఞానంలో మా బలాన్ని ఉపయోగించుకొంటూ భారతదేశాన్ని ప్రపంచంలో ఆవిష్కరణలకు ఒక కేంద్రం గా తీర్చిదిద్దాలని లక్ష్యం గా పెట్టుకొన్నటువంటి ఒక వ్యూహం; మా అపారమైన మానవ వనరులను, వారి ప్రతిభావ్యుత్పత్తులను ఉపయోగించుకొంటూ ప్రపంచ అభివృద్ధి కి తోడ్పాటును అందించాలని లక్ష్యం గా పెట్టుకున్నటువంటి వ్యూహమూను.

మిత్రులారా,

ప్రస్తుతం, పెట్టుబడిదారు సంస్థలు పర్యావరణం పరంగా, సమాజం పరంగా, పాలన పరంగా అధిక సామర్ధ్యాన్ని కలిగివున్న కంపెనీల వైపుగా మొగ్గుతున్నాయి.  భారతదేశంలో ఇప్పటికే ఈ విషయాలలో అధిక విలువను కలిగివున్న వ్యవస్థలు, కంపెనీలు నెలకొని ఉన్నాయి.  ఇఎస్ జి పై కూడా అంతే సమానమైన శ్రద్ధ వహించే మార్గాన్నే అనుసరించాలన్నది భారతదేశం విశ్వాసం.  

మిత్రులారా,

భారతదేశం మీకు ప్రజాస్వామ్యానుకూలతను, జనాభాపరమైన అనుకూలతను, డిమాండ్‌ పరంగా అనుకూలత తో పాటు వైవిధ్యం పరమైన అనుకూలతను కూడా అందిస్తోంది.  మా వైవిధ్యం ఎంతటిదంటే, మీరు ఒకే విపణి లో అనేక మార్కెట్ లను అందుకోగలుగుతారు. ఈ మార్కెట్ లు అనేక అవకాశాలతోను, అనేక ప్రాధాన్యక్రమాలతోను లభ్యమవుతాయి.  అవి అనేక కాలాలలో, అనేక స్థాయిలలో అభివృద్ధి చెంది ఉన్నాయి.  ఈ వైవిధ్యం స్వేచ్ఛాయుతమైన ఆలోచనలతో, ఆంక్షలకు తావు లేనటువంటి మార్కెట్ లతో నిండి ఉంది. అంతేకాదు, ఈ మార్కెట్ లు ప్రజాస్వామ్యయుతమైన, సమ్మిళితమైన, చట్ట పాలన కు పెద్దపీట వేసే వ్యవస్థలో కొలువుదీరి ఉన్నాయి.

మిత్రులారా,

ఆర్థిక రంగం లో ఉత్తమ పాత్రధారులలో కొందరిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నానన్న సంగతి నాకు తెలుసు.  వారు ఆవిష్కరణ, వృద్ధి తాలూకు కొత్త రంగాలను స్థిరమైన వ్యాపార ప్రతిపాదనలు గా మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు.  అదే కాలంలో, మీ ట్రస్ట్ లోని నిధులను శ్రేష్ఠమైనటువంటి, సురక్షితమైనటువంటి దీర్ఘకాలిక ప్రతిఫలాలు అందే చోట పెట్టాలన్న అవసరం మీకు ఉందని కూడా నేను ఎరుగుదును.

అందువల్ల మిత్రులారా, ఈ సమస్యలకు దీర్ఘకాలికమైన, మన్నికైన పరిష్కారాలను కనుగొనాలన్నదే మా విధానం అని నేను స్పష్టంచేయదలచాను.  అటువంటి విధానం మీ అవసరాలతో చక్కగా కలగలసిపోగలదు.  కొన్ని ఉదాహరణల సాయం తో, మీకు వివరం గా నన్ను చెప్పనివ్వండి.

మిత్రులారా,

మా తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మేము అనేక కార్యక్రమాలను చేపట్టాము.  మేము జిఎస్ టి రూపం లో ‘ఒక దేశం, ఒకే పన్ను వ్యవస్థ’ ను ప్రవేశపెట్టాము. కార్పొరేట్ పన్ను రేటులు అతి తక్కువగా ఉన్నటువంటి దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. అలాగే, నూతన తయారీ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకం కూడా ఇక్కడ లభిస్తోంది.  ఆదాయపు పన్ను ను మదింపు చేయడానికి, అప్పీల్ చేయడానికి ఆన్ లైన్ విధానాన్ని (ఫేల్ లెస్ రెఝీమ్) అమలుపరచాము.  ఇటు శ్రామికుల సంక్షేమాన్ని, అటు యాజ‌మాన్య సంస్థ‌ల‌కు వ్యాపార నిర్వ‌హ‌ణ‌ లో సౌల‌భ్యాన్ని..  ఈ రెంటినీ దృష్టి లో పెట్టుకొని కొత్త కార్మిక చ‌ట్టాల‌ను రూపొందించ‌డం జ‌రిగింది.  కొన్ని ప్ర‌త్యేక రంగాలలో ఉత్ప‌త్తి తో ముడిపెట్టిన ప్రోత్స‌హ‌క ప‌థ‌కాల‌ను తీసుకు రావ‌డ‌మైంది.  పెట్టుబ‌డిదారు సంస్థ‌ల‌కు చేదోడుగా నిల‌వ‌డానికి ఒక సాధికారిత సంస్థాగ‌త ఏర్పాటు ను చేయ‌డ‌మైంది.  

మిత్రులారా,

జాతీయ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వ్య‌వ‌స్థ‌ లో భాగంగా 1.5 ట్రిలియ‌న్ డాల‌ర్ ల‌ను పెట్టుబ‌డి పెట్టేందుకు ఒక పెద్ద ప్ర‌ణాళిక‌ను మేము సిద్ధం చేశాము.  మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండేటటువంటి బ‌హుళ విధ సంధాన ప్ర‌ధాన‌మైన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కు ఉద్దేశించిన ఒక బృహ‌త్ ప్ర‌ణాళిక‌ ను కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రుగుతోంది.  దేశం అంత‌టా హైవేస్, రైల్ వేస్, మెట్రోస్, జ‌ల మార్గాలు, విమానాశ్రయాల తో కూడిన ఒక భారీ మౌలిక స‌దుపాయాల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశం చేప‌ట్టింది. నవ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చు తో అందుబాటులోకి వ‌చ్చే ల‌క్ష‌లాది గృహాల‌ను మేము నిర్మిస్తున్నాము.  ఒక్క పెద్ద న‌గ‌రాల‌ లోనే కాక చిన్న న‌గ‌రాల‌లో, ప‌ట్ట‌ణాల‌లో కూడా పెట్టుబ‌డులు త‌ర‌లి రావాలని మేము ఆశిస్తున్నాము.  దీనికి గుజ‌రాత్ లో గిఫ్ట్ సిటీ ఒక చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.  ఆ కోవ‌కు చెందిన న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డానికి ఉద్య‌మ త‌ర‌హా ప‌థ‌కాల‌ను మేము అమ‌లు చేస్తున్నాము.

మిత్రులారా,

త‌యారీ తాలూకు పునాదిని ప‌టిష్ట‌ప‌ర‌చ‌డానికి, ప్ర‌పంచ శ్రేణి మౌలిక స‌దుపాయాల‌ను నిర్మించ‌డానికి ఉద్దేశించిన మా వ్యూహం మాదిరిగానే ఆర్థిక రంగం కోసం మేము అనుస‌రిస్తున్న వ్యూహం సైతం సంపూర్ణ ప్రాతిప‌దిక‌ తో కూడుకొని ఉంది.  మేము వేసిన పెద్ద అడుగుల‌లో బ్యాంకింగ్ రంగం లో స‌మ‌గ్ర‌మైన సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్ట‌డం అనేది ఒక అడుగుగా ఉంది.  ఇంట‌ర్ నేష‌న‌ల్ ఫినాన్శల్ స‌ర్వీసెస్ సెంట‌ర్ కు ఏకీకృత ప్రాధికార సంస్థ ఏర్పాటు, అత్యంత ఉదార‌మైన ఎఫ్‌డిఐ విధానం, విదేశీ మూల‌ధ‌నం కోసం ఒక అనుకూల ప‌న్ను వ్య‌వ‌స్థ‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్ర‌స్ట్‌, రియ‌ల్ ఎస్టేస్ ఇన్వెస్ట్‌మెంట్ ట్ర‌స్ట్ వంటి పెట్టుబ‌డి వాహ‌కాలకు అనువైన విధానాలు, ఇన్‌సోల్వన్సి ఎండ్ బ్యాంక్ రప్టసి కోడ్ ను ఆచ‌ర‌ణ‌ లోకి తీసుకు రావ‌డం, ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌న బ‌దిలీ ద్వారా ఆర్థిక స‌హాయం రూపేణా సాధికారిత క‌ల్ప‌న‌, రూ-పే కార్డులు, బిహెచ్ఐఎమ్‌-యుపిఐ వంటి ఫిన్-టెక్ ఆధారిత చెల్లింపు వ్య‌వ‌స్థలు మేము వేసిన పెద్ద అడుగుల‌లో మ‌రికొన్ని.

మిత్రులారా,

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాలు అనేవి ప్ర‌భుత్వ విధానాల‌కు, సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్ర స్థానంలో నిల‌బ‌డుతూ వ‌స్తున్నాయి.  ప్ర‌పంచం లో యూనికార్న్ సంస్థ‌లు, అంకుర సంస్థ‌లు అతి పెద్ద సంఖ్య‌ లో ఉన్న దేశాల‌లో భార‌త్ ఒక‌టిగా ఉంది.  మేము ఇప్ప‌టికీ ఎంతో వేగంగా వృద్ధి ని సాధిస్తున్నాము.  2019 వ సంవ‌త్స‌రం లో వృద్ధి రేటును గ‌మ‌నిస్తే, ప్ర‌తి రోజూ స‌గ‌టున 2 లేదా 3 అంకుర సంస్థ‌లు ఏర్పాటవుతున్న‌ట్లు అర్థం అవుతుంది.

మిత్రులారా,

ప్రైవేటు వాణిజ్య సంస్థ‌లు వ‌ర్ధిల్ల‌డానికి మా ప్ర‌భుత్వం వివిధ చ‌ర్య‌ల‌ను చేపట్టింది.  వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, ఆస్తుల‌ను న‌గ‌దుగా మార్చ‌డం అనే ప్ర‌క్రియ‌లు ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌నంత స్థాయిలో చోటుచేసుకొన్నాయి.  ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ లో మా వాటాను 51 శాతాని క‌ంటే త‌క్కువ‌కు తీసుకువచ్చే చరిత్రాత్మ‌క నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం జ‌రిగింది. బొగ్గు, అంత‌రిక్షం, అణు శ‌క్తి, రైల్వేస్, పౌర విమాన‌యానం, ర‌క్ష‌ణ వంటి కొత్త రంగాల‌లో ప్రైవేటు భాగ‌స్వామ్యం కోసం విధాన నిర్ణ‌యాల‌ను తీసుకోవ‌డ‌ం జరిగింది.  ప్ర‌భుత్వ రంగం ఉనికి ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించడానికి నూత‌న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల విధానాన్ని అమ‌లు చేయ‌డ‌మైంది.  

మిత్రులారా,

ప్ర‌స్తుతం భార‌త‌దేశం లో త‌యారీ, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, సాంకేతిక విజ్ఞానం, వ్య‌వ‌సాయం, ఆర్థిక రంగం.. ఇలా ప్ర‌తి ఒక్క రంగం మెరుగ‌వుతోంది; విద్య‌, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలు కూడా మెరుగుప‌డుతున్నాయి.  వ్య‌వ‌సాయ రంగంలో మేము ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన సంస్క‌ర‌ణ‌లు భార‌త‌దేశ రైతాంగంతో చేయి క‌ల‌ప‌డానికి కొత్త అవ‌కాశాల‌ను అందిస్తున్నాయి.  సాంకేతిక విజ్ఞానం, ఆధునిక ప్రోసెసింగ్ సాల్యూష‌న్స్ అండ‌దండ‌ల‌ తో భార‌త‌దేశం త్వ‌ర‌లో ఒక వ్యావ‌సాయిక ఎగుమ‌తుల ప్ర‌ధాన కేంద్రంగా ఎద‌గ‌నుంది.  ఇక్క‌డ విదేశీ విశ్వ‌విద్యాల‌యాల కేంప‌స్ ల ఏర్పాటు కు జాతీయ విద్య విధానం అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది.  నేశ‌న‌ల్ డిజిట‌ల్ హెల్త్ మిష‌న్ ఫిన్‌-టెక్ సంస్థ‌ల‌కు బాట‌ ను ప‌రచనుంది.  

మిత్రులారా,

మా భ‌విష్య‌త్తు ప‌ట్ల ప్ర‌పంచ పెట్టుబ‌డిదారు సంస్థ‌ల స‌ముదాయం విశ్వాసాన్ని చాటుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  ఎఫ్‌డిఐ ప్ర‌వాహాలు కింద‌టి సంవ‌త్స‌రంతో పోలిస్తే గ‌త 5 నెల‌ల కాలంలో 13 శాతం పెరిగాయి.  ఈ రౌండ్ టేబుల్ స‌మావేశం లో మీరు ఉత్సాహంగా పాలుపంచుకోవ‌డం ఈ విశ్వాసాన్ని మ‌రింత‌గా పెంచుతోంది.

మిత్రులారా,

మీరు న‌మ్మ‌కంతో కూడిన ప్ర‌తిఫ‌లాలు చేజిక్కించుకోవాల‌ని అనుకుంటే గ‌నుక భార‌త‌దేశం మీరు ఎంచుకోవ‌ల‌సిన దేశంగా ఉంది.  మీరు ఒక ప్ర‌జాస్వామ్య దేశం లో గిరాకీని ద‌క్కించుకోవాల‌ని కోరుకొంటే గ‌నుక భార‌త‌దేశం మీరు ఎంచుకోవ‌ల‌సిన దేశంగా ఉంది.  మీరు మ‌న్నిక‌తో కూడుకొన్న స్థిర‌త్వాన్ని కోరుకొంటున్నట్లు అయితే గ‌నుక భార‌త‌దేశం మీరు ఎంచుకోవ‌ల‌సిన దేశంగా ఉంది.  మీరు ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఉండే వృద్ధి ని కోరుకొంటే గ‌నుక భార‌త‌దేశం మీరు ఎంచుకోవ‌ల‌సిన దేశంగా ఉంది.

మిత్రులారా,

ప్ర‌పంచ ఆర్థిక పున‌రుజ్జీవ‌న‌నానికి ఉత్ప్రేర‌కంగా నిలచే సత్తా భార‌త‌దేశ వృద్ధి కి ఉంది.  భార‌త‌దేశం సాధించే ఏ ఘ‌న‌త అయినా ప్ర‌పంచం లో అభివృద్ధి, సంక్షేమాల‌పై దాని తాలూకు ప్ర‌భావం అనేక రెట్లు గా ఉంటుంది.  ఒక బ‌ల‌మైన‌, హుషారైన భార‌త‌దేశం ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ నిల‌దొక్కుకోవ‌డానికి తోడ్ప‌డ‌గ‌లుగుతుంది.  భార‌త‌దేశాన్ని  ప్ర‌పంచ వృద్ధి పున‌రుత్థానానికి చోద‌క శ‌క్తి గా తీర్చిదిద్ద‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌ల‌సి వ‌చ్చినా వాటిని మేము చేస్తాము.  రాబోయే కాలం లో ప్ర‌గ‌తి ని సాధించ‌డానికి ఒక ఉత్తేజ‌భ‌రిత‌మైన కాలమంటూ మీ ముందు ఉంది.  దానిలో పాలుపంచుకోవ‌ల‌సిందిగా మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.




 

***



(Release ID: 1670551) Visitor Counter : 171