PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 NOV 2020 5:49PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా  పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

#Unite2FightCorona

#IndiaFightsCorona

  • దేశవ్యాప్తంగా గత 7 రోజులుగా 6 లక్షలకు దిగువన చురుకైన కేసుల సంఖ్య ప్రస్తుతం 5,27,962
  • దేశంలోని 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 20,000కన్నా తక్కువగా చురుకైన కేసులు
  • కోలుకునేవారి జాతీయ సగటు మరింత మెరుగుపడి 92.20 శాతానికి చేరిక
  • గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 55,331 కాగా, కొత్త కేసుల సంఖ్య 50,210
  • ఈ ఏడాది ఆఖరుకల్లా కోవిడ్‌ వ్యాప్తి వేగాన్ని గణనీయంగా తగ్గించే దిశగా ప్రధాని పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి డాక్టర్‌ హర్షవర్ధన్‌ సూచన
  • “మ్యూజియంలు, చిత్ర ప్రదర్శనశాలలు, ప్రదర్శనల పునఃప్రారంభంపై” ముందుజాగ్రత్త చర్యలు సూచిస్తూ  ప్రామాణిక నిర్వహణ విధానం జారీ

Image

చురుకైన కేసుల తగ్గుదలను స్థిరంగా కొనసాగిస్తున్న భారత్‌; 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20,000కన్నా తక్కువ; 10 రాష్ట్రాల పరిధిలోనే మొత్తం చురుకైన కేసులలో 78 శాతం

దేశవ్యాప్తంగా చికిత్సపొందే కోవిడ్‌ కేసుల తగ్గుదలను భారత్ స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ మేరకు గత 7 రోజులుగా ఈ కేసులు 6 లక్షలకన్నా తక్కువ స్థాయిలో ఉండగా, ప్రస్తుతం 5,27,962 వద్ద ఉన్నాయి. అంటే- మొత్తం నమోదిత కేసులలో ఇవి 6.31 శాతం మాత్రమే. జాతీయస్థాయిలో పరిశీలిస్తే 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000కన్నా తక్కువగా ఉన్నాయి. ఇక ప్రస్తుత చురుకైన కేసులలో 78 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనివే కావడం గమనార్హం. ఇందులోనూ మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే 51 శాతంకన్నా ఎక్కువ కేసులున్నాయి. ఒకవైపు చురుకైన కేసులు తగ్గుతుండగా మరోవైపు కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ సత్ఫలితాలిస్తోంది. ఆ మేరకు దేశంలో ఇప్పటిదాకా 77,11,809 మంది కోలుకోగా, కోలుకున్న-చురుకైన కేసుల మధ్య అంతరం దాదాపు 72 లక్షలకు (71,83,847) చేరువైంది. కోలుకునేవారి జాతీయ సగటు 92.20శాతానికి మెరుగుపడగా, గత 24 గంటల్లో 55,331 మంది వ్యాధినుంచి బయటపడి ఇళ్లకు చేరగా, కొత్త కేసుల సంఖ్య 50,210 మాత్రమే కావడం ఇందుకు నిదర్శనం. తాజాగా కోలుకున్న కేసులలో 82 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనివి కాగా- కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేరోజు గరిష్ఠంగా 8,000 వంతున నమోదవడం విశేషం. ఆ మేరకు మొత్తం కోలుకున్న కేసులలో ఇవి 45 శాతంకన్నా అధికంగా ఉన్నాయి. ఇక తాజా కేసులలో 79 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. కాగా, 8,000 కొత్త కేసులతో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 6,000 కేసులతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. గత 24 గంటల్లో 704 మరణాలు నమోదవగా వీటిలో దాదాపు 80 శాతం 10 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 42 శాతానికిపైగా (300) సంభవించాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670385   

“ఈ ఏడాది చివరకల్లా అంతం చేద్దాం”: 2020 ఆఖరుకల్లా కోవిడ్ వ్యాప్తి వేగాన్ని అంతంచేసే దిశగా ప్రధాని పిలుపునిచ్చిన ప్రజా ఉద్యమం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి డాక్టర్ హర్షవర్ధన్ సూచన

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యేంద్రకుమార్ జైన్, సీనియర్ అధికారులు, మేయర్లు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మాస్కు ధారణ, భౌతికదూరం పాటింపు, హస్త పరిశుభ్రత తదితర ఆరోగ్యకర పద్ధతుల గురించి పౌర సమాజంలోని చిట్టచివరి వ్యక్తివరకూ తెలియజేయడం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని సమర్థంగా అరికట్టడంలో ప్రభుత్వం అనుసరించిన విధానం విశేషంగా దోహదపడిందని డాక్టర్ హర్షవర్ధన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670366

కర్ణాటకలో కోవిడ్‌-19 సన్నద్ధత, మహమ్మారి అనుగుణ ప్రవర్తన పాటింపు చర్యలపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష

కర్ణాటకలో కోవిడ్-19 సన్నద్ధత, మహమ్మారి అనుగుణ ప్రవర్తన పాటింపు చర్యలపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న సమీక్షించారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కరోనాపై పోరులో భారత్‌ ముందంజపై ఈ సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. “కరోనా మహమ్మారిపై యుద్ధంతో మనం 10 నెలల ప్రయాణం పూర్తిచేయనున్నాం. కోవిడ్‌ పారామితులకు సంబంధించి మన దేశం నేడు గణనీయ మెరుగుదలను సాధించింది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. భారత్‌లో కోలుకునేవారి సగటు 92 శాతం దాటింది. మరణాల సగటు కూడా క్రమేణా పతనమవుతూ ఇప్పుడు అత్యల్పంగా 1.49 శాతం వద్ద ఉంది. మరోవైపు దేశంలో కోవిడ్‌ నిర్ధారణ కోసం 2000కుపైగా ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి” అని ఆయన వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670295

బీహార్ శాసనసభ ఎన్నికల పరిశీలనకు అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం-2020 (5-7 నవంబర్)ని అమలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం

బీహార్ శాసనసభ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో నవంబరు 5-7 తేదీలలో వీటి పరిశీలన కోసం విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థల సందర్శక కార్యక్రమాన్ని (IEVP) వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక ఓటర్లున్న ప్రాంతాల్లో ఒకటైన బీహార్‌లో 72 మిలియన్ల ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ఇక్కడ ఎన్నికల ప్రక్రియను, ఉత్తమాచరణ పద్ధతులను పరిశీలించి, అనుభవాలను పంచుకునే అవకాశం అంతర్జాతీయ ఎన్నికల నిర్వహణ సంస్థలకు లభిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ‘ఐఈవీపీ-2020’ని నిర్వహిస్తోంది. ఇందులో పాలుపంచుకోవడానికి 40కిపైగా దేశాలుసహా 3 అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670205

“మ్యూజియంలు, కళాప్రదర్శన శాలలు, ఎగ్జిబిషన్ల పునఃప్రారంభం”పై ముందు జాగ్రత్త చర్యలతో ప్రామాణిక నిర్వహణ విధానం జారీచేసిన సాంస్కృతిక శాఖ

దేశంలో నవంబర్ 10 నుంచి మ్యూజియంలు, కళా ప్రదర్శనశాలు, ఎగ్జిబిషన్ల పునఃప్రారంభానికి అనుమతించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలను నిర్దేశిస్తూ ప్రామాణిక నిర్వహణ విధానాన్ని జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జారీచేసిన దిగ్బంధ విముక్తి 5వ దశ మార్గదర్శకాలను, వివిధ సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమల భాగస్వాముల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆయా ప్రాంగణాల నిర్వాహకులు పాటించాల్సిన విధివిధానాలతోపాటు, సందర్శకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నిర్దేశిస్తూ సమగ్ర మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, నియంత్రణ మండళ్ల పరిధిలోని మ్యూజియంలు/ఆర్ట్ గ్యాలరీలు తిరిగి తెరవరాదని స్పష్టంచేసింది. వీటితోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్లుగా ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అదనపు చర్యలను ప్రతిపాదించవచ్చునని సూచించింది. ఈ మార్గదర్శకాలు తక్షణం అమలులోకి రాగా, తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అమలులో ఉంటాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670360

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌కు మరొకరు బలయ్యారు. దీంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరణాల సంఖ్య 43కు చేరింది. ప్రస్తుతం 1,645 క్రియాశీల కేసులుండగా కోలుకునేవారి సగటు 88.86 శాతంగా ఉంది.
  • అసోం: రాష్ట్రంలో 29,026 నమూనాలను పరీక్షించగా, 1.31 శాతం వ్యాధిపీడితులతో 380 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు 655మంది వ్యాధినుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అసోంలో మొత్తం కేసులు 2,07,741కాగా- కోలుకున్నవారి సగటు 95.64 శాతం, చురుకైన కేసులు 3.9 శాతంగా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 19,500 దాటిన నేపథ్యంలో సంబంధిత సమస్యల పరిష్కారానికి మణిపూర్ ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
  • మేఘాలయ: రాష్ట్రంలో 60 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుత క్రియాశీల కేసులు 959గా ఉన్నాయి. కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8752గా ఉంది.
  • మిజోరం: రాష్ట్రంలో 101 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2,893కు చేరింది. మిజోరంలోని పురుష జనాభాలో కోవిడ్‌ బారినపడిన వారు 77శాతంగా ఉంది. ఈ ఉదయం 78 ఏళ్ల మహిళ మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇది రెండో కోవిడ్‌ మరణం కావడం గమనార్హం.
  • నాగాలాండ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 9207కు చేరింది. మరో 2 మరణాలు నమోదవగా, చురుకైన కేసులు 1,143, కోలుకున్నవారి సంఖ్య 7,934గా ఉన్నాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో 29 కొత్త కేసులు నమోదవగా చురుకైన కేసుల సంఖ్య 240గా ఉంది. సిక్కింలో ఇప్పటిదాకా 3,657మంది కరోనా బారినుంచి కోలుకోగా, 73 మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,093గా ఉంది.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి నిరోధం దిశగా ప్రజలు స్వీయ దిగ్బంధం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ కోరారు. కేరళలో పౌర సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో గరిష్ఠ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలను హెచ్చరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని పిటిషనర్, స్వతంత్ర ఎమ్మెల్యే, పి.సి.జార్జ్ చెప్పారు. కాగా, కేరళలో వైరస్‌ నిరోధానికి తీసుకున్న చర్యలపై రాష్ట్ర మూలాలున్న, న్యూజిలాండ్ తొలి ప్రవాస భారతీయ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ మేరకు మలయాళ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీనిపై తదుపరి నిర్ణయానికి ముందు నవంబర్ 9న విద్యార్థుల తల్లిదండ్రులు-ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సంప్రదిస్తామని తెలిపింది. కాగా, తమిళనాడులోని బాణాసంచా తయారీదారుల జీవనోపాధికి భంగం కలగకుండా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిసామి ఒడిసా, రాజస్థాన్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చరాదన్న ఆదేశాలను ఉపసంహరించాలని అందులో విజ్ఞప్తి చేశారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులున్నా మునుపెన్నడూ లేనంతగా తొలిసారి వాస్తవిక మాధ్యమంద్వారా నిర్వహించబోయే “బెంగళూరు సాంకేతిక సదస్సు-2020”కి పరిశ్రమతోపాటు నిపుణులనుంచి అధిక స్పందన లభిస్తోంది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ఉప ముఖ్యమంత్రి, సమాచార సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్థ నారాయణ చెప్పారు. కాగా, రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ చెప్పారు.
  • ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి కఠిన చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో 9, 10 తరగతుల నిర్వహణపై మూడు వారాల తర్వాత సమీక్షిస్తామని నమోదయ్యే కేసుల సంఖ్యనుబట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని నొక్కి చెప్పారు. కోవిడ్ మహమ్మారివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేయనుంది. కాగా, దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్‌ పంపిణీతోపాటు వివరాలను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 2,477 కరోనావైరస్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి పెరిగింది. అయితే, మొత్తం కేసులలో నిర్ధారిత కేసుల శాతం 4నెలల తర్వాత 10 శాతంకన్నా దిగువకు పతనమైంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1539 కొత్త కేసులు, 5 మరణాలు నమోదవగా 978 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 285 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,45,682; క్రియాశీల కేసులు: 18,656; మరణాలు: 1362; డిశ్చార్జి: 2,25,664గా ఉంది. మరోవైపు కోలుకునేవారి సగటు 91.85 శాతంగా నమోదైంది. మహమ్మారి మలిదశ విజృంభణపై అంచనాల నేపథ్యంలో వ్యాధి విస్తృత వ్యాప్తికి కారకులయ్యేవారిపై దృష్టి సారించాలని జిల్లా వైద్య-ఆరోగ్య అధికారులను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యాధికారులు ఆదేశించారు. కాగా, గత 7 రోజులకుగాను 11జిల్లాల్లో కోవిడ్ కేసులు బాగా పెరిగాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 50 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు తెరవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద సినిమాల విడుదల ఆగినందున సినిమాహాళ్ల వ్యాపారావకాశాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో కోలుకునేవారి సగటు 90.68 శాతంగా నమోదవగా చురుకైన కేసుల సంఖ్య 1.12 లక్షలకు దిగివచ్చింది.
  • గుజరాత్: రాష్ట్రంలో బుధవారం 975 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,76,608కి పెరిగినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. అహ్మదాబాద్‌లో 3, సూరత్‌లో 2, వడోదరాలో 1 సహా ఆరు మరణాలతో రాష్ట్రంలో కోవిడ్-19 మృతుల సంఖ్య 3,740కి పెరిగింది. మరోవైపు ఇవాళ 1,022 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో కొత్త కేసుల సంఖ్యకన్నా కోలుకునేవారి సంఖ్య అధికంగా నమోదైంది. కాగా, గుజరాత్‌లో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,60,470కి పెరిగింది. దీంతో రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 90.86 శాతానికి పెరిగింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో బుధవారం 1,770 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 2.03 లక్షలకు చేరింది. కొత్త కేసులలో గరిష్ఠంగా 320 జైపూర్ నుంచి, 185 జోధ్‌పూర్‌ నుంచి, 179 బీకానేర్‌ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చురుకైన కేసుల సంఖ్య 16,323గా ఉంది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 30 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 700 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 884 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త కేసుల నమోదు సగటు 2.6 శాతానికి తగ్గింది.

FACT CHECK

 

********

 



(Release ID: 1670497) Visitor Counter : 144