ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ కట్టడికి కర్ణాటక వ్యూహంపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
కరోనాపై పోరులో ప్రవర్తనా నియమావళి కీలకమని, టీకా వచ్చేవరకూ
నియమావళిని పాటించడం అవసరమని కేంద్ర ఆరోగ్యమంత్రి సూచన
Posted On:
04 NOV 2020 7:55PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు కర్ణాటక వ్యూహం, వైరస్ కట్టడికి తగిన ప్రవర్తనా నియమావళిని పాటించేలా చర్యలు తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. కర్ణాటక ఆరోగ్య, వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, తదితర సీనియర్ అధికారులతో ఈ సమీక్ష జరిపారు. ఢిల్లీలో జరిగిన ఈ సమీక్షను 2020 నవంబరు 4న వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిలో భారత్ సాధించిన ప్రగతి పట్ల డాక్టర్ హర్షవర్ధన్ ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. “కరోనా వైరస్ మహమ్మారితో పోరాటంలో మనం త్వరలో 10నెలలు పూర్తి చేసుకోబోతున్నాం. దేశంలో కోవిడ్ ఇపుడు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాధి నియంత్రణలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. క్రియాశీలక (యాక్టివ్) కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. కరోనాతో అస్వస్థులై తిరిగి కోలుకున్న వారి సంఖ్య 92శాతం దాటింది. మరణాల రేటు కూడా 1.49శాతం వద్ద స్థిరంగా నిలిచింది. రెండు వేలకు పైగా లేబరేటరీలతో దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం కూడా పెరిగింది” అని ఆయన అన్నారు.
కోవిడ్ వైరస్ కట్టడికోసం ‘జన ఆందోళన్’ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు కోవిడ్ ను నియంత్రించే ప్రవర్తనా నియమావళిని ప్రజలంతా పాటించాలని, కరోనాకు టీకా వచ్చేంతవరకూ ఇది జరగాలని కేంద్ర మంత్రి సూచించారు. “రాబోయే పండుగ రోజుల్లో, శీతాకాలంలో వైరస్ ముప్పు పెరిగే సూచనలున్నాయి. అందువల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగే ప్రవర్తనా నియమావళిని పాటించడం ఇపుడు మరింత మఖ్యం. మౌలికమైన ముందు జాగ్రత్త చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకున్నా దేశం యావత్తూ బాధపడవలసి ఉంటుంది.” ఆని హర్షవర్ధన్ అన్నారు.
కోవిడ్ నియంత్రణకు కర్ణాటక రాష్ట్రం చేపట్టిన చర్యలను, దేశంలో పరిస్థితులకు పోల్చుతూ, కోవిడ్ యాక్టివ్ కేసుల నియంత్రణకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. “మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. అయితే, కరోనానుంచి కోలుకున్నవారు (రికవరీ రేటు) 93శాతం. దేశవ్యాప్త సగటు రికవరీరేటుకంటే ఇది ఎక్కువ. మరణాలు (1.35శాతం) కూడా జాతీయ సగటు కంటే తక్కువే.” అని కేంద్రమంత్రి అన్నారు
అయితే, బెంగుళూరు నగరం, మైసూరు, బళ్లారి, దక్షిణ కన్నడ, హసన్, బెళగవి ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి ఆశించిన రీతిలో కట్టడికాకపోవడం ఆందోళనకరమని హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ కేసుల, మరణాల్లో పెరుగుదల నమోదవుతున్న ఆయా జిల్లా అధికారులతో కేంద్రమంత్రి మాట్లాడారు. కోవిడ్ పై అవగాహన కోసం అధునాతన పద్ధతిలో చైతన్య కార్యకలాపాలను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం సంతృప్తికరమన్నారు. వీటిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
కోవిడ్ నియంత్రణకు తాము తీసుకున్న చర్యలను కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కేంద్ర ఆరోగ్య మంత్రికి వివరించారు. ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు నమోదయ్యే జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లతో కేంద్రమంత్రి మాట్లాడారు. కర్ణాటకలో కరోనా పరీక్షల నిర్వణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. గత జూన్ నెలలో, 10వేల వరకూ జరిగే రోజువారీ పరీక్షలు ఇపుడు 80వేలకు పెరిగాయి. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకూ 80లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. 80శాతం పరీక్షలను ఆర్.టి.పి.సి.ఆర్. పద్ధతిలోనే నిర్వహించామని రాష్ట్ర అధికారులు తెలిపారు. అక్టోబరు 25, నవంబరు 1, మధ్య కాలంలో యాక్టివ్ కేసుల సంఖ్యను 37శాతం తగ్గించగలిగారు. కేసులను సత్వరం కనుగొని, తగిన చికిత్సను అందించేందుకు వీలుగా ర్యాండమ్ పూల్ పరీక్షలు, టార్గెటెడ్ టెస్టింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. నగర ప్రాంతాల్లో వైరస్ కట్టడికి ప్రత్యేక వ్యూహం పాటిస్తున్నారు. కోవిడ్ కట్టడిపై అవగాహనకోసం అధునాతన పద్ధతిలో కార్యకలాపాలకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు.
ఈ సమీక్షలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ, కర్ణాటకలో కొత్త కేసులు, తాజాగా మరణాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా కట్టడి పరిస్థితిని జూలై ముందుస్థాయికి తీసుకురావడానికి మరెన్నో చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. పాజిటివ్ కేసులను 5శాతంకంటే తక్కువస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. జాతీయ సగటుకంటే ఎక్కువగా మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో,.. అన్ని భాగస్వామ్య వర్గాలనూ కలుపుకుని వైరస్ కట్టడికి మరింత గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటకలో కోవిడ్-19 వైరస్ పరిస్థితిపై జాతీయ వ్యాధినియంత్రణ కేంద్రం (ఎన్.సి.డి.సి.) డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. సింగ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైరస్ కట్టడికి మరింత నిఘాతో పనిచేయాలని, కోవిడ్ నియంత్రణ నియమావళిని కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.
ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆరతి ఆహుజా, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.హెచ్.ఎస్.) సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వార్, ఇతర సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇతర అధికారులు వర్చువల్ పద్ధతిలో ఈ సమీక్షలో పాలుపంచుకున్నారు.
****
(Release ID: 1670295)
Visitor Counter : 149