ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సి.సి.ఈ.ఏ)

ఇథనాల్ కలిపిన పెట్రోలు కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా ఇథనాల్ సేకరణకు యంత్రాంగాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.

2020-21 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి ప్రభుత్వ రంగ ఓ.ఎమ్.సి. లకు సరఫరా కోసం ఇథనాల్ ధర సవరణ

Posted On: 29 OCT 2020 3:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ,  రాబోయే 2020-21 చక్కెర సీజన్ కోసం, 2020-21 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈ.ఎస్.వై) 2020 డిసెంబర్ 1వ తేదీ నుండి 2021 నవంబర్ 30వ తేదీ వరకు, ఇథనాల్ కలిపిన పెట్రోలు (ఈ.బి.పి) కార్యక్రమం కింద వివిధ చెరకు ఆధారిత ముడి పదార్థాల నుండి తీసిన అధిక ఇథనాల్ ధరను నిర్ణయించడంతో సహా, ఈ క్రింది అంశాలను ఆమోదించింది: 

(i)        సి-అధిక మొలాసిస్ నుండి తీసిన ఇథనాల్ ధరను  లీటరుకు రూ. 43.75 నుండి లీటరుకు రూ. 45.69 కు పెంచాలి,

(ii)       బి-అధిక మొలాసిస్ నుండి తీసిన ఇథనాల్ ధరను లీటరుకు రూ. 54.27 నుండి లీటరుకు రూ. 57.61 కు పెంచాలి,

(iii)      చెరకు రసం / చక్కెర / చక్కెర సిరప్ నుండి తీసిన ఇథనాల్ ధరను లీటరుకు రూ. 59.48 నుండి లీటరుకు రూ. 62.65 కు పెంచాలి,

(iv)      అదనంగా, జీ.ఎస్.టి. మరియు రవాణా ఛార్జీలు కూడా చెల్లించవలసిఉంటుంది. వాస్తవిక రవాణా ఛార్జీలను నిర్ణయించాలని ఓ.ఎం.సి. లకు సూచించబడింది, తద్వారా ఇథనాల్ యొక్క సుదూర రవాణా నిరోధించబడదు,

(v)       రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలకు న్యాయమైన అవకాశాన్ని కల్పించడానికీ, అదేవిధంగా ఇథనాల్ యొక్క అనవసర (గజిబిజి) రవాణాను తగ్గించడానికి,  రవాణా ఖర్చులు, లభ్యత మొదలైన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓ.ఎం.సి. లు) వివిధ వనరుల నుండి ఇథనాల్ యొక్క ప్రాధాన్యత కోసం ప్రమాణాలను నిర్ణయిస్తాయి.  ఈ ప్రాధాన్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉత్పత్తి కోసం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దులకు పరిమితం చేస్తుంది.  అవసరమైనప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఇథనాల్ దిగుమతి చేసుకోవటానికి, ఇదే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

అన్ని డిస్టిలరీలు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందగలవు.  వీటిలో ఎక్కువ సంస్థలకు, ఈ.బి.పి. కార్యక్రమం ద్వారా ఇథనాల్ సరఫరా చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చెరకు రైతుల  కష్టాలను తగ్గించడానికి దోహదపడే ఈ ప్రక్రియలో ఇథనాల్ సరఫరాదారులకు మద్దత్తు ధర చెరకు రైతుల బకాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇథనాల్ కలిపిన పెట్రోలు (ఈ.బి.పి) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇథనాల్ ‌తో కలిపిన పెట్రోల్ ‌ను ఓ.ఎం.సి. లు 10 శాతం వరకు విక్రయిస్తున్నాయి.  ప్రత్యామ్నాయ మరియు పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి 2019 ఏప్రిల్, 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చే విధంగా, అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్ ద్వీపాలు మినహా ఈ కార్యక్రమం మొత్తం భారతదేశానికి విస్తరించబడింది.  ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కూడా ఈ చర్య దోహదపడుతుంది. 

2014 నుండి ప్రభుత్వం ఇథనాల్ ధరను ప్రకటిస్తోంది.  2018 లో మొదటిసారిగా, ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా ఇథనాల్ యొక్క ధరలలో తేడాను ప్రభుత్వం ప్రకటించింది.  ఈ నిర్ణయాలు ఇథనాల్ సరఫరాను గణనీయంగా మెరుగుపరిచాయి.  తద్వారా 2013-14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈ.ఎస్.వై) లో  38 కోట్ల లీటర్లుగా ఉన్న ప్రభుత్వ రంగ ఓ.ఎం.సి. ల ఇథనాల్ సేకరణ, 2019-20 ఈ.ఎస్.వై. లో 195 కోట్ల లీటర్ల కంటే ఎక్కువకు చేరుకుంది.   

వాటాదారులకు దీర్ఘకాలిక దృక్పథాన్ని అందించే ఉద్దేశ్యంతో, ఎం.ఓ.పి. మరియు ఎన్.జి. “ఈ.బి.పి. కార్యక్రమం కింద దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇథనాల్ సేకరణ విధానాన్ని” ప్రచురించింది.  దీనికి అనుగుణంగా, ఇథనాల్ సరఫరాదారులను ఒకసారి నమోదు చేసే ప్రక్రియను, ఓ.ఎం.సి. లు ఇప్పటికే, పూర్తి చేశాయి.  ఇథనాల్ సరఫరాదారులకు 400 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరే విధంగా, ఓ.ఎం.సి. లు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 5 శాతం నుండి 1 శాతానికి తగ్గించాయి. సరఫరా చేయని పరిమాణాలపై సరఫరాదారులకు గతంలో 5 శాతంగా విధించే జరిమానాను కూడా ఓ.ఎం.సి. లు ఇప్పుడు ఒక శాతానికి తగ్గించాయి.   సులభతర వ్యాపారానికీ, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికీ, ఈ చర్యలు దోహదపడతాయి.   

చక్కెర ఉత్పత్తి యొక్క స్థిరమైన మిగులు చక్కెర ధరను తగ్గిస్తుంది.  ఫలితంగా, చక్కెర పరిశ్రమ వర్గాలకు,  రైతులకు చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉండటంతో,  చెరకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు పెరిగాయి.  ఈ నేపథ్యంలో, చెరకు రైతుల బకాయిలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.  

దేశంలో చక్కెర ఉత్పత్తిని పరిమితం చేసి, దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో, ఇథనాల్ ఉత్పత్తి కోసం బి హెవీ మొలాసిస్, చెరకు రసం, చక్కెర మరియు చక్కెర సిరప్ ల మళ్లింపును అనుమతించడంతో సహా, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.   చెరకు యొక్క సరసమైన, మద్దతు ధర (ఎఫ్.ఆర్.పి) మరియు చక్కెర ఎక్స్-మిల్లు ధరలో మార్పులు చోటుచేసుకున్న కారణంగా,  వివిధ చెరకు ఆధారిత ముడి పదార్థాల నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్ యొక్క ఎక్స్-మిల్లు ధరను కూడా సవరించవలసిన అవసరం ఉంది.

*****


(Release ID: 1668708) Visitor Counter : 333