ప్రధాన మంత్రి కార్యాలయం
‘దేహ్ వీచ్ వా కరణీ’ అనే పేరు తో వచ్చిన డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
ప్రవర గ్రామీణ విద్యా సంఘానికి ‘లోక్ నేతే డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ గా కొత్త పేరు ను పెట్టారు
డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ప్రయత్నాలు, ఆయన తోడ్పాటులు రాబోయే తరాల వారికి ప్రేరణను అందిస్తాయి: ప‌్రధాన మంత్రి
Posted On:
13 OCT 2020 2:44PM by PIB Hyderabad
‘దేహ్ వీచ్ వా కరణీ’ అనే పేరు గల డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ గ్రంథాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఆయన ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ కి ‘లోక్ నేతే డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ’ అనే సరికొత్త పేరు ను కూడా పెట్టారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మహారాష్ట్ర లోని ప్రతి ప్రాంతంలో విఖే పాటిల్ గారి జీవితానికి సంబంధించిన కథలను కనుగొనేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. డాక్టర్ విఠల్ రావు విఖే పాటిల్ అడుగుజాడలను బాలా సాహెబ్ విఖే పాటిల్ అనుసరిస్తూ మహారాష్ట్ర అభివృద్ధికి తనను అంకితం చేసుకొన్నారని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామీణుల, పేదల, రైతుల జీవితాలను సరళతరం చేయడం, వారి కష్టనష్టాలను తగ్గించడం విఖే పాటిల్ జీవిత పరమోద్దేశాలు అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు.
విఖే పాటిల్ గారు ఎల్లవేళలా సమాజం అభ్యున్నతికి కృషి చేశారని, సమాజంలో సార్థక మార్పులను తీసుకురావడానికి, గ్రామాల, పేదల సమస్యలను పరిష్కరించడానికి రాజకీయాలను ఒక సాధనంగా మలచుకోవాలని సర్వ కాలాల్లో చెప్తూ వచ్చారని ప్రధాన మంత్రి అన్నారు. బాలా సాహెబ్ విఖే పాటిల్ అవలంభించిన ఈ వైఖరి ఆయన ను ఇతరుల కంటే భిన్నంగా నిలిపిందని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన ప్రయత్నాలు, ఆయన అందించిన తోడ్పాటు, పేదల, గ్రామాల అభివృద్ధితోను, వారి విద్య తోను, మహారాష్ట్రలోని సహకార సంఘాల సాఫల్యం తోను ముడిపడినందువల్ల బాలా సాహెబ్ విఖే పాటిల్ ఆత్మకథ మన అందరికీ చాలా ముఖ్యమైందని, అది రాబోయే తరాల వారికి ప్రేరణను అందిస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి చెప్పారు.
రైతుల, పేదల వేదనను, కష్టాలను డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ అర్థం చేసుకొన్నారని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. కాబట్టే రైతులందరినీ ఆయన ఒక చోటు కు చేర్చి, వారిని సహకార సంఘాల తో కలిపారని ఆయన చెప్పారు. అటల్ గారి ప్రభుత్వం లో ఆయన ఒక మంత్రిగా పని చేసి, మహారాష్ట్ర తో పాటు దేశం లో అనేక ప్రాంతాలలో సహకార సంఘాలను ప్రోత్సహించారని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో గ్రామీణ విద్య ను గురించి పెద్దగా చర్చించుకోని కాలం లో, డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా గ్రామాల లో యువతకు సాధికారిత ను కల్పించేందుకు కృషి చేశారని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సొసైటీ ద్వారా ఆయన గ్రామీణ యువత విద్యార్జన కోసం, నైపుణ్యాల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు.
గ్రామాల్లో సాగులో విద్య కు ఉన్న ప్రాముఖ్యాన్ని విఖే పాటిల్ గారు గ్రహించారని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం రైతులను నవపారిశ్రామికత్వం దిశగా ముందంజ వేసేందుకు, వారిని నవ పారిశ్రామికులుగా తీర్చిదిద్దడానికి అవకాశాలను కల్పించడం జరుగుతోందన్నారు.
స్వాతంత్య్రం అనంతర కాలం లో, దేశం లో తగినంత ఆహారం ఉత్పత్తి కాని కాలం లో, పంటల దిగుబడిని ఎలా పెంచాలనేది ప్రభుత్వానికి ప్రాథమ్యం కలిగిన అంశంగా మారిపోయిందని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, ఉత్పాదకతను పెంచే ఆలోచనలలో రైతు కు లాభదాయకత ను చేకూర్చే అంశం పై శ్రద్ధ తీసుకోవడం జరగలేదని ఆయన అన్నారు. దేశం ప్రస్తుతం రైతు ఆదాయాన్ని పెంచడం పై శ్రద్ధ తీసుకొంటోందని, ఈ దిశలో నిరంతర ప్రయత్నాలు చేస్తోందని, కనీస మద్ధతు ధర ను (ఎమ్ఎస్ పి) పెంచాలన్న నిర్ణయం, యూరియా కు వేప పూత ను పూయడం, ఉత్తమమైన పంట బీమా ను కల్పించడం వంటి చర్యలు ఈ ప్రయత్నాల్లో భాగం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘పిఎమ్- కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ వంటి కార్యక్రమాల అమలు తో రైతులు ప్రస్తుతం చిన్న చిన్న ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడనక్కరలేకుండా పోయిందన్నారు. పైపెచ్చు, శీతలీకరణ కేంద్రాలు, మెగా ఫూడ్ పార్కులు, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన వంటి సౌకర్యాలను పెంచడంపై ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి కృషి జరుగుతోంది అని ప్రధాన మంత్రి వివరించారు.
సేద్యం లో సాంప్రదాయక జ్ఞానాన్ని పదిలపరచే అంశానికి బాలా సాహెబ్ విఖే పాటిల్ గారు పెద్ద పీట వేసిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రాకృతిక స్థితిగతులకు అనుగుణంగా సాగు ను చేపట్టేవారని, ఆ తరహా జ్ఞానాన్ని మనం కాపాడుకొంటూ, దానికి తోడు వ్యవసాయం లో కొత్త పద్ధతులను, పాత పద్ధతులను మేళవించవలసిన అవసరం కూడా ఉందని చెప్పారు. ఈ సందర్భం లో చెరకు పంట ను గురించి ఆయన ఉదాహరణగా చెప్తూ, చెరకు సాగు లో సేద్యం తాలూకు కొత్త పద్ధతులను, పాత పద్ధతులను ఉపయోగించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం చెరకు నుంచి చక్కెర తో పాటు ఇథెనాల్ ను ఉత్పత్తి చేసేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు.
మహారాష్ట్ర లోని గ్రామాలలో సమస్యలను పరిష్కరించడం కోసం డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ అదే పనిగా పాటుపడుతూ వచ్చారని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామాలలోని సమస్యలలో తాగునీటి సమస్య, సేద్యపు నీటి సమస్య వంటివి ప్రముఖంగా ఉండేవన్నారు. మహారాష్ట్ర లో ఏళ్ళ తరబడి స్తంభించిన 26 పథకాలను ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ లో భాగంగా శరవేగంగా పూర్తి చేయడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. వీటిలో 9 పథకాలు ఇప్పటికే పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే, దాదాపు 5 లక్షల హెక్టార్ల భూమి సాగునీటి సౌకర్యానికి నోచుకొంటుందని ఆయన అన్నారు.
అదే విధంగా, మహారాష్ట్ర లో చిన్నవీ, పెద్దవీ కలిపి 90 సేద్యపు నీటి పథకాలకు సంబంధించిన పనులు 2018 జులై లో మొదలైనట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ పథకాలు రాబోయే రెండు మూడేళ్ళ లో పూర్తయిన తరువాత సుమారు 4 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మహారాష్ట్ర లో భూగర్భ నీటిమట్టం చాలా తక్కువగా ఉన్న 13 జిల్లాల లో అటల్ భూగర్భ జల పథకాన్ని అమలుచేయడం జరుగుతోందన్నారు.
‘జల్ జీవన్ మిషన్’ లో భాగం గా మహారాష్ట్ర లోని గ్రామాలలో ప్రతి ఒక్క కుటుంబానికి నల్లాల ద్వారా తాగునీటిని అందించే పనులు శీఘ్రంగా జరుగుతున్నాయని కూడా ప్రధాన మంత్రి తెలిపారు. కిందటి ఏడాది నల్లాల ద్వారా మహారాష్ట్ర లో 19 లక్షలకు పైగా కుటుంబాలకు తాగునీటిని అందించే సదుపాయాన్ని సమకూర్చడమైందన్నారు. వీటిలో 13 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఈ సౌకర్యాన్ని కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనే అందుకొన్నాయని ఆయన ప్రస్తావించారు.
ముద్ర యోజన గ్రామాలలో స్వతంత్రోపాధి కల్పన ను పెంచిందని ప్రధాన మంత్రి చెప్పారు. దేశంలో 7 కోట్లకు పైగా స్వయంసహాయ సమూహాలకు చెందిన మహిళలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఇవ్వడమైందని వివరించారు. రైతులు, మత్స్యకారులు బ్యాంకుల వద్ద నుంచి రుణాలను సులభంగా అందుకొనేందుకు వీలుగా వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను అందించడం జరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. ఇంతకుముందు కిసాన్ క్రెడిట్ కార్డు లభించకుండా ఉండిపోయిన దాదాపు రెండున్నర కోట్ల మంది చిన్న రైతు కుటుంబాలు ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని అందుకొన్నాయని ఆయన అన్నారు.
గ్రామాల లో నివసిస్తున్న వారిలో పేదలలో ఆత్మవిశ్వాసం పుంజుకొన్నప్పుడు అది స్వయంసమృద్ధి సాధన సంకల్పాన్ని బలోపేతం చేయగలదని ప్రధాన మంత్రి అన్నారు. బాలా సాహెబ్ విఖే పాటిల్ గారు కూడా గ్రామాల లో ఈ విధమైన స్వావలంబన భావన ను పెంపొందింపచేయాలని ఆకాంక్షించారు అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1663996)
Visitor Counter : 227
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam