ప్రధాన మంత్రి కార్యాలయం

‘ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి యొక్క ప్రసంగం

Posted On: 26 JUN 2020 4:12PM by PIB Hyderabad

మిత్రులారా, 

నమస్కారం.

మీ అందరి తో మాట్లాడే అవకాశం నాకు లభించింది.  మనం అందరం మన యొక్క వ్యక్తిగత జీవనం లో ఎన్నో మిట్ట పల్లాల ను చూశాము.  మన సామాజిక జీవనం లో కూడాను, మన గ్రామాల లో లేదా నగరాల లో, మనం వేరువేరు విధాల సవాళ్ల ను మనం ఎదుర్కొంటున్నాము.  మీరు చూడండి, నిన్నటి రోజు న పిడుగు పడింది.  బిహార్ లో మరియు ఉత్తర్ ప్రదేశ్ లో, చాలా మంది ప్రాణాల ను కోల్పోయారు.  కానీ ఎవ్వరూ అనుకోలేదు అంత పెద్ద సంకటం ప్రపంచవ్యాప్తం గా మానవాళి ని బాధిస్తుందని; అది ఎటువంటి సంకటమో, ప్రజలు వారు తలచుకొన్నప్పటికీ సాటి వారి కి పూర్తి స్థాయి లో సాయపడలేకపోతున్నారు.  ఈ కాలం లో, ఏ సమస్యా ఎదురవని వారు అంటూ ఏ ఒక్కరైనా ఉండబోరేమో.

అది బాలలు కావచ్చు, వయోధికులు కావచ్చు, మహిళ లు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక దేశం గాని లేదా ప్రపంచం గాని.. ప్రతి ఒక్కరు సమస్యల ను ఎదుర్కొన్నారు.  మరి, ఈ వ్యాధి బారి నుండి మనం భవిష్యత్తు లో ఎప్పటికి తప్పించుకోగలుగుతామన్నది మనకు ఇప్పటికీ తెలియదు.  అవును, మన అందరికీ ఒక నివారణ మార్గం గురించి తెలుసును, అందులో రెండు గజాల దూరం (‘దో గజ్ దూరీ’) లేదా సామాజికం గా ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న దూరాన్ని పాటించడం, ఇంకా నోటి ని ఒక గుడ్డ తోనో లేదా ఒక ఫేస్ కవర్ తోనో కప్పుకోవవడం వంటివి భాగం గా ఉన్నాయి.  కరోనావైరస్ కు టీకామందు ను అభివృద్ధిపరచనంత వరకు, మనం ఈ ఒక్క నివారణ మార్గం లోనే దీనితో పోరాడగలుగుతాము.

మిత్రులారా, 

ఈ రోజు న, ఎప్పుడయితే మీరంతా నాతో మాట్లాడుతున్నారో, మీ యొక్క వదనాల లోని సంతోషాన్ని, మీ కళ్ల లో వ్యక్తం అవుతున్న భావాల ను మరియు మీ యొక్క ప్రేమ ను మేమందరం దర్శించగలుగుతున్నాము.  ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రజాదరణ పాత్రమైనటువంటి మరియు శక్తిభరితుడైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ కార్యక్రమాని కి హాజరు అయ్యారు.  ప్రభుత్వం లోని మంత్రులు, పరిపాలన తో సంబంధం గల సీనియర్ ఆఫీసర్ లు, మరి యుపి లోని వేరువేరు జిల్లాల నుండి విచ్చేసిన మన మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు.

మీరందరు శ్రమ యొక్క శక్తి ని గ్రహించారు.  భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ శ్రమ యొక్క ఈ శక్తి ఆధారం గానే రూపుదిద్దుకొన్నది.  ఈ రోజు న,  ఇదే శక్తి ‘ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ కు ప్రేరణ గా నిలచింది.  అంటే, యోగి గారి యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ఇటు వాసి పరం గా మరి అటు రాశి పరం గా కూడా విస్తరించిందన్న మాటే.

యుపి ప్రభుత్వం అనేక నూతన పథకాల ను ప్రవేశపెట్టడమొక్కటే కాకుండా, లబ్ధిదారుల సంఖ్య ను కూడా పెంచింది.  అంతేకాదు, స్వయంసమృద్ధియుతమైన భారతదేశం అనే లక్ష్యాన్ని కూడా తన తో జతపరచుకొన్నది.  ‘ఆత్మనిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ నేను ఎప్పుడూ ప్రస్తావించే డబల్ ఇంజిను కు ఒక చాలా మంచి ఉదాహరణ గా నిలుస్తున్నది.  మరి నేను నమ్మకం తో ఉన్నాను, అది ఏమిటి అంటే- యోగి గారి యొక్క నాయకత్వం లో, యోగి గారు మరియు ఆయన యొక్క జట్టు హృద‌య‌పూర్వకం గా పనిచేస్తూ ఒక ఆపద ను ఒక అవకాశం గా మార్చివేశారు, ఈ పథకం నుండి దేశం లో ఇతర రాష్ట్రాలు కూడా చాలా నేర్చుకోగలుగుతాయి- అని.  దీని నుండి ప్రతి ఒక్కరు ప్రేరణ ను పొందగలుగుతారు.

అన్య రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాల తో ముందుకు వస్తాయి అని నేను ఆశపడుతున్నాను.  నేను యుపి కి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుని గా ఉన్నాను.  ఎప్పుడయితే, ఉత్తర్ ప్రదేశ్ ఇటువంటి మంచి పని ని చేస్తుందో, నాకు ఎనలేని సంతోషం వేస్తుంది, మరి నాకు సంతృప్తి గా కూడా ఉంటుంది; ఎందుకు అంటే - ఇక్కడి ప్రజల గురించిన బాధ్యత నాకు కూడా ఉంది మరి.

మిత్రులారా, 

ఎవరైతే, సంకట కాలాల్లో తెలివితేటల ను మరియు సాహసాన్ని ప్రదర్శిస్తారో, ఆ వ్యక్తి తప్పక సఫలత ను పొందుతారు.  ఇవాళ, ఎప్పుడయితే కరోనావైరస్ కారణం గా ప్రపంచం అంత పెద్ద ఒక సంకటం లో పడిపోయిందో, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చూపిన వివేకం మరియు ధైర్యం, ఇంకా ఈ స్థితి ని అది విజయవంతం గా సంబాళించిన పద్ధతి, నిజం గా శ్లాఘనీయమూ, ప్రశంసాయోగ్యమూ ను.  

దీనికి గాను, నేను ఉత్తర్ ప్రదేశ్ యొక్క 24 కోట్ల పౌరుల ను మెచ్చుకొంటాను.  వారికి నేను వందనం ఆచరిస్తాను!  మీరు చేసినటువంటి శ్రమ యావత్తు ప్రపంచానికి ఒక ఉదాహరణ ను ఇచ్చింది.  ఉత్తర్ ప్రదేశ్ యొక్క గణాంకాలు ప్రపంచం లోని మహా మహా నిపుణుల ను ఆశ్చర్యచకితుల ను చేస్తాయి.  అది యుపి యొక్క వైద్యులు కావచ్చు, అర్ధవైద్య సిబ్బంది కావచ్చు, పారిశుధ్య శ్రమికులు కావచ్చు, రక్షక భటులు కావచ్చు, ఆశా కార్యకర్త లు కావచ్చు, ఆంగన్ బాడీ కార్యకర్త లు కావచ్చు, బ్యాంకు సిబ్బంది కావచ్చు, మరి తపాలా కార్యాలయ సిబ్బంది కావచ్చు, రవాణా విభాగం లేదా నా శ్రమిక్ సహచరుడు కావచ్చు, మిత్రులారా, ప్రతి ఒక్కరు పూర్తి నిష్ఠ తో వారి యొక్క తోడ్పాటు ను అందించారు.

యోగి గారు మరియు ఆయన యొక్క యావత్తు జట్టు, అది ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక ప్రశంసనీయమైనటువంటి కార్యాన్ని చేశారు. మీరు అందరు కలసి అత్యంత కష్ట కాలం లో యుపి లో పరిస్థితి ని నిభాయించారు, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి కుటుంబం మరి ప్రతి ఒక్క పిల్లవాడు ఈ సంగతి ని మహా గర్వం తో రాబోయే అనేక సంవత్సరాల తరబడి జ్ఞాపకం పెట్టుకు తీరుతారు.

మిత్రులారా,

ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రయత్నాలు మరియు కార్యసిద్ధులు గొప్పవి అంటే అందుకు కారణం ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు, కానీ ఇది ప్రపంచం లోని అనేక దేశాల కంటే పెద్దదైనటువంటి రాష్ట్రం గా ఉంది మరి.  యుపి ప్రజలు స్వయం గా ఈ కార్యసాధన ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, కానీ మీరు ఒకసారి సంఖ్యల ను గనక తెలుసుకొన్నారు అంటే మీరు మరింత గా ఆశ్చర్యానికి లోనవుతారు!

మిత్రులారా,

యూరోప్ లోని నాలుగు పెద్ద దేశాలు.. ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంకా స్పెయిన్.. లకేసి మనం చూసినట్లయితే, ఆ దేశాలు 200-250 సంవత్సరాల పాటు ప్రపంచం లో అగ్రగామి శక్తులు గా ఉంటూ వచ్చాయి!  అవి ఇప్పటికీ ప్రపంచం లో ప్రబలం గానే ఉన్నాయి!  ఇవాళ మనం ఈ నాలుగు దేశాల మొత్తం జనాభా ను  జత కలిపితే, అది సుమారు 24 కోట్లు అవుతుంది!  ఒక్క ఉత్తర్ ప్రదేశ్ జనాభా యే 24 కోట్లు ఉంది.  అంటే, ఈ నాలుగు దేశాలు.. ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇంకా స్పెయిన్.. లలో నివసిస్తున్న ప్రజల సంఖ్య ఉత్తర్ ప్రదేశ్ లో నివసిస్తున్న జనాభా కు సమానం అన్నమాట!  కానీ కరోనావైరస్ ఈ నాలుగు దేశాల లో ఒక లక్ష ముప్ఫయ్ వేల మంది ప్రాణాల ను బలిగొన్నది.  అదే యుపి లో 600 మంది ప్రజలు మాత్రమే వారి యొక్క ప్రాణాల ను కోల్పోయారు!  ఏ ఒక్క వ్యక్తి మరణం అయినా అది దు:ఖాన్నే పంచుతుందని నేను నమ్ముతాను.

అయితే ఈ నాలుగు దేశాలు కలసికట్టు గా కృషి చేసినప్పటికీ, యుపి తో పోల్చి చూస్తే, ఆయా దేశాల లో వైరస్ కారణం గా సంభవించిన మరణాలు అనేక రెట్లు అధికం గా ఉన్నాయని మనం సైతం అంగీకరించి తీరాలి.  ఈ దేశాలు అధిక అభివృద్ధి కి నోచుకొన్న దేశాలు; వాటి కి మరింత ఎక్కువ వనరులు కూడా ఉన్నాయి, ఇంకా ఆ ప్రభుత్వాలు సకల ప్రయత్నాల ను చేశాయి కూడా.  కానీ ఇప్పటికీ అవి, యుపి తన పౌరుల ను కాపాడడం లో సాధించిన మాదిరి సాఫల్యాన్ని పొందలేకపోయాయి!

మిత్రులారా, 

మీలో చాలా మంది అమెరికా లోని పరిస్థితి ని గురించి కూడాను వినే ఉంటారు!  అమెరికా లో ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి మరియు వనరుల కు ఎటువంటి లోటు లేదు.  అయినప్పటికీ, ఇవాళ అమెరికా కరోనా వల్ల చాలా ఘోరం గా ప్రభావితం అయింది!  అమెరికా జనాభా దాదాపు గా 33 కోట్లు ఉందన్న సంగతి ని సైతం మీరు గుర్తు కు తెచ్చుకు తీరాలి;  అదే యుపి లో అయితే, 24 కోట్ల మంది ప్రజలు ఉన్నారు!  కానీ యుఎస్ లో, ఇంతవరకు ఒక లక్ష ఇరవై అయిదు వేల మంది ప్రజలు చనిపోయారు, కాగా యుపి లో సుమారు 600 మంది చనిపోయారు.

యోగి గారి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరి అయినటువంటి ఏర్పాట్ల నే గనక చేయకపోయినట్లయితే, యుఎస్ లో మాదిరి గానే యుపి లో పెద్ద ఆపద ఉత్పన్నం అయివుంటే, అప్పుడు యుపి 600 మంది కి బదులు గా 85,000 మంది ప్రజల ను పోగొట్టుకొని వుండేది!  అయితే, యుపి ప్రభుత్వం యొక్క కఠోర శ్రమ వల్ల, ఒక రకం గా, ఈ రాష్ట్రం కనీసం 85,000 మంది ప్రాణాల ను కాపాడగలిగింది!  ఇవాళ, మనం మన పౌరుల యొక్క ప్రాణాల ను కాపాడుకోగలిగిన పక్షం లో, అది నిజం గా మహా సంతృప్తిదాయకమైనటువంటి విషయమే అవుతుంది.  అది దేశం యొక్క విశ్వాసాన్ని పెంచుతున్నది!  లేకపోతే ఒక కాలం అంటూ ఉండింది.. ప్రయాగ్ రాజ్ - ఏదయితే అప్పట్లో అలహాబాద్ గా వ్యవహరింపబడేదో- అక్కడి ఎంపీ దేశ ప్రధాని గా ఉన్నారప్పుడు, మరి కుంభ్ సందర్భం లో ఒక గడబిడ జరిగి వందలు, వేల మంది చనిపోయిన కాలం అది.  ఆ కాలం లో, ప్రభుత్వం లో ఉన్న వారు వారి యొక్క కాలాన్నంతా, మరి వారి యొక్క ప్రయాసల నంతా కూడాను, మృతుల సంఖ్య ను దాచిపెట్టడం మీదే కేంద్రీకరించారు.  ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ప్రజానీకం సురక్షితం గా ఉన్నారని తెలుసుకోవడం నిజంగానే హాయి గా ఉంది.   

మిత్రులారా, 

మనం ఎల్లప్పటి కి మరియొక విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవలసివుంది.  ఇది అంతా కూడాను ఎప్పుడు జరిగింది అంటే, దేశం నలు మూలల నుండి 30-35 లక్షల కు పైగా ప్రవాసులు మరియు శ్రమిక మిత్రులు గడచిన కొద్ది వారాల వ్యవధి లో యుపి లోని వారి వారి గ్రామాల కు తిరిగివస్తున్న వేళ లో.  యుపి ప్రభుత్వం వందలాది శ్రమిక్ స్పెశల్  ట్రయిన్స్ ను నడుపుతూ చిక్కుబడిపోయినటువంటి తన ప్రజల ను వెనుక కు రప్పించింది.  వేరే రాష్ట్రాల నుండి తిరిగివచ్చే ఈ మిత్రులందరి నుండి సంక్రమణ వ్యాప్తి అయితేనో అనే నష్టభయం మరింత ఎక్కువగా ఉండింది.  కానీ, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సంవేదనశీలత తో స్థితి ని సంబాళించిన తీరు, రాష్ట్రాన్ని ఒక పెను సంక్షోభాన్నుండి బయటకు తీసుకు వచ్చేసింది.

మిత్రులారా, 

2017వ సంవత్సరాని కంటే ముందు, యుపి లో ప్రభుత్వం ఏ విధం గా అయితే నడపబడుతూ వచ్చిందో,  అప్పటి స్థితిగతుల లో, మనం ఇటువంటి ఫలితాల ను ఊహించనైనా ఊహించలేము.  మునుపటి ప్రభుత్వాలు ఆసుపత్రులు మరియు ఆసుపత్రి లోని పడక లు పరిమితమైన సంఖ్య లో ఉన్నాయన్న సాకు ను ఉదాహరించడం ద్వారా, ఈ సవాలు ను తప్పించుకొని వుండేవి; కానీ యోగి గారు అలాగ చేయలేదు.  యోగి గారు మరియు ఆయన ప్రభుత్వం పరిస్థితి యొక్క తీవ్రత ను అర్థం చేసుకొన్నాయి.  ప్రపంచం లోని పెద్ద దేశాల లో ఏం జరుగుతున్నదీ ఆయన అర్థం చేసుకొన్నారు.  అందుకని, ఆయన మరియు ఆయన ప్రభుత్వం ఒక యుద్ధస్థాయి న శ్రమించాయి.

అది క్వారన్టీన్ సెంటర్ లు కావచ్చు, లేదా ఐసలేశన్ సౌకర్యాలు కావచ్చు, వాటి నిర్మాణం పైనే సకల ప్రయాస లు కేంద్రీకరించబడినాయి.  తన తండ్రి గారు మరణించినప్పటికీ, యోగి గారు తన తండ్రి యొక్క అంత్యేష్ఠి లో పాల్గొనడానికి బదులు ఉత్తర్ ప్రదేశ్ ప్రజల ను కబళిస్తున్న కరోనావైరస్ విశ్వమారి నుండి వారి ని కాపాడడం కోసం మీకు అండ గా ఉండిపోయారు.  బయటి నుండి వస్తున్నటువంటి శ్రమికుల కోసం, దాదాపు గా 60,000 గ్రామ పర్యవేక్షక సంఘాల ను చాలా స్వల్ప అవధి లోనే ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సంఘాలు పల్లెల లో వ్యాధిసంక్రమణ నిరోధ వ్యవస్థ ను అభివృద్ధిపరచడం లో ఎంతగానో సాయపడ్డాయి.  యుపి లో కరోనా రోగుల యొక్క చికిత్స కోసమని ఆసుపత్రుల లో ఒక లక్ష పడకల ను కేవలం రెండున్నర నెలల కాలం లో ఏర్పాటు చేయడం జరిగింది.

మిత్రులారా, 

లాక్ డౌన్ కాలం లో, పేద  ప్రజానీకం ఎటువంటి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోకుండా పూచీపడడానికి యోగి ప్రభుత్వం చేసిన కృషి కూడా మునుపెన్నడు కని విని ఎరుగనిది.  ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన లో భాగం గా, యుపి పేదల కు మరియు సొంత ఊళ్ల కు తిరిగివచ్చిన ప్రవాసి శ్రమికుల కు చాలా స్వల్ప కాలం లోనే ఉచితంగా ఆహార పదార్థాల ను సమకూర్చింది.  దీని అర్థం- 15 కోట్ల మంది పేద ప్రజలు ఆహార సంక్షోభాని కి లోను కాకుండాను, మరి ఏ ఒక్కరు ఆకలి తో పడక మీద కు చేరకూడదనే తరహా లో అటువంటి ఏర్పాటుల ను చేయడం జరిగింది- అని. 

ఈ కాలం లో, యుపి లో పేద ప్రజల కు 42 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల ను పంపిణీ చేయడమైంది.  యుపి ప్రభుత్వం రేశన్ కార్డు లేని వారి కోసం ప్రభుత్వ రేశన్ దుకాణం యొక్క తలుపుల ను కూడా తెరచి ఉంచింది.  పైపెచ్చు, ఉత్తర్ ప్రదేశ్ లోని 3.25 కోట్ల మంది పేద మహిళ ల యొక్క జన్ ధన్ ఖాతాల లోకి రమారమి 5,000 కోట్ల రూపాయలను కూడా నేరు గా బదలాయించడం జరిగింది.  భారతదేశాని కి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పేదల కు బహుశ: ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద రీతి న సాయపడివుండదు.

మిత్రులారా, 

అది భారతదేశాన్ని శీఘ్ర గతి న స్వయంసమృద్ధి  పథం లో కి తీసుకుపోయే ప్రచార ఉద్యమం కావచ్చు, లేదా అది గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కావచ్చు, ఉత్తర్ ప్రదేశ్ ఈ పరామితుల పై సైతం శర వేగంగా పయనిస్తున్నది.   గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ లో భాగం గా, శ్రమికుల ఆదాయాన్ని పెంచడం కోసం గ్రామాల లో అనేక పథకాల ను మొదలుపెట్టడం జరుగుతోంది.  కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమని ఆ తరహా పనులు ఇరవైఅయిదింటి తో ఒక జాబితా ను తయారు చేసింది.  వాటి లో పక్కా ఇళ్ల నిర్మాణం, సాముదాయిక స్నానపు గదుల నిర్మాణం, పంచాయతీ భవనాలకు సంబంధించిన పని, బావులు మరియు చెరువు ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ఇంటర్ నెట్ లైన్ లు వగైరా భాగం గా ఉన్నాయి.

ఇవాళ, ఈ పని ని ముందుకు తీసుకుపోతూ, ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ తో సహా, ఉత్తర్ ప్రదేశ్ రమారమి 1.25 కోట్ల మంది కార్మికుల కు మరియు శ్రమికుల కు ఉపాధి ని కల్పించడం కోసం ప్రత్యక్షం గా ప్రయత్నించింది.  వీరిలో సుమారు 60 లక్షల మంది శ్రమికుల కు గ్రామాభివృద్ధి సంబంధిత పథకాల లో ఉద్యోగాల ను ఇస్తుండగా, ఇంచుమించు 40 లక్షల మంది కి చిన్న పరిశ్రమలు అంటే ఎమ్ఎస్ఎమ్ఇ లలో జీవనోపాధి ని కల్పించడం జరుగుతోంది.  దీనికి అదనం గా, స్వతంత్రోపాధి కి గాను వేలాది నవపారిశ్రామికుల కు ముద్ర యోజన లో భాగం గా సుమారు 10,000 కోట్ల రూపాయల రుణాన్ని కేటాయించడమైంది.  దీనికి తోడు, ఇవాళ, వేలాది చేతివృత్తుల వారికి ఆధునిక యంత్రాల ను మరియు పనిముట్టు ల పెట్టెల ను అందించడమైంది.  ఇది వారి కి పని ని పెంచడంతో పాటు వారి పని ని సౌకర్యవంతం గా మలచుతుంది కూడాను.  నేను లాభితుల ను మరి ఎవరైతే ఉపాధి ని పొందారో వారందరి ని మరొక్క సారి అభినందిస్తున్నాను.

మిత్రులారా, 

యుపి కి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుని గా, నేను యోగి గారి తో నిరంతరం సంప్రదిస్తూ వస్తున్నాను.  ఉద్యోగుల ను గుర్తించడానికి, 30 లక్షల మందికి పైగా శ్రమికుల నైపుణ్యాల ను గుర్తించడానికి, వారి ప్రావీణ్యాల తాలూకు మరి అలాగే, వారి అనుభవం తాలూకు సమాచారాన్ని సిద్ధం గా ఉంచడానికి, మరి వారి యొక్క ఉపాధి కై తగిన ఏర్పాటుల ను చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంత ముమ్మరం గా సన్నాహం చేసిందో ఇది చాటిచెప్తున్నది.  యుపి అనుసరిస్తున్న ‘ఒక జిల్లా-  ఒక ఉత్పత్తి’ పథకం ఇప్పటికే స్థానిక ఉత్పత్తుల ను ప్రోత్సహిస్తూ మరి వాటి కి ఒక పెద్ద విపణి ని అందిస్తున్నది.

ఇప్పుడు, ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ లో భాగం గా ఆ తరహా స్థానిక ఉత్పత్తుల ను దేశ వ్యాప్తం గా ప్రోత్సహించడం కోసం పరిశ్రమల యొక్క సమూహాల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది; మరి దీని నుండి ఉత్తర్ ప్రదేశ్ ఎంతగానో లాభపడుతుంది.  వస్త్రాలు, పట్టు, తోలు, రాగి వగైరా లకు సంబంధించిన పలు పరిశ్రమల యొక్క సమూహాల కు ఊతం అందనుంది.  ఈ ఉత్పత్తుల కు ఒక క్రొత్త విపణి లభించగలదు. 

మిత్రులారా, 

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రైతు లు ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ ద్వారా ఒక భారీ లాభాన్ని అందుకోగలుగుతారు.  రైతు ల కోసం మరియు చిన్న వ్యాపారాల కోసం ప్రధానమైనటువంటి సంస్కరణల కై డిమాండ్ లు 3 దశాబ్దాలు గా నిరంతరం ఉంటూ వచ్చాయి.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేసిన 3 చట్టాలు రైతుల కు వారి ఫలసాయాన్ని మండీల కు వెలుపల విక్రయించే హక్కు ను ధారదత్తం చేశాయి.  అంటే, రైతు తన ఉత్పత్తి ని తాను ఉత్తమమైన ధర లు పొందే చోటు లో విక్రయించుకోగలరన్నమాట.  రెండోది, ఒకవేళ రైతు కోరుకొంటే, ఇప్పుడు రైతు తాను విత్తుల ను చల్లే కాలం లోనే తన పంట కు ధర ను నిర్ణయించుకొనే వీలు కూడా ఉంది.

ప్రస్తుతం బంగాళాదుంప ను పెంచే రైతు చిప్స్ ను తయారు చేసే పరిశ్రమ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగలుగుతారు, మామిడి రైతు మామిడి రసాన్ని తయారు చేసే పరిశ్రమ తో, టోమేటో రైతు పచ్చడి ని తయారు చేసే పరిశ్రమ తో.. ఇలాగ ఆయా రైతు లు వారు ఫలానా పంటల కు విత్తులు చల్లే కాలం లోనే ఒప్పందాల ను కుదుర్చుకోగలుగుతారు.  ఇది వారి కి ధర లు పడిపోతాయేమో అనే ఆందోళన నుండి ఊరట ను ఇస్తుంది.

మిత్రులారా, 

అంతే కాకుండా, మన పశుగణ పాలకుల కోసం అనేక నూతన కార్యక్రమాల ను చేపట్టడం జరుగుతోంది.  రెండు రోజుల క్రితం, పశుగణాని కి మరియు పాడి రంగానికి అంటూ 15,000 కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాల నిధి ని ఏర్పాటు చేయడమైంది.  దీని తో, రమారమి 1 కోటి కి పైగా క్రొత్త రైతుల ను మరియు పశువుల పెంపకందారుల ను పాడి రంగం తో ముడి పెట్టడం మరియు పాడి రంగాని కి చెందిన నూతన సౌకర్యాల ను నెలకొల్పడం సాధ్యపడుతుంది.  రాబోయే కాలం లో, గ్రామాల లో దాదాపు గా 35 లక్షల క్రొత్త కొలువుల ను సృష్టించడం జరుగుతుంది.  నిన్నటి రోజు కంటే ఒక రోజు క్రితం, యుపి లో పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొన్నది.  కుశీనగర్ విమానాశ్రయాన్ని, ఏదయితే బౌద్ధ వలయం పరం గా ఒక ముఖ్యమైన విమానాశ్రయం గా ఉన్నదో, దాని ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించడమైంది.  ఇది పూర్వాంచల్ లో వాయు సంధానాన్ని పటిష్టపరుస్తుంది; ఇంకా దేశం లోపలి మరియు విదేశాల లోని కోట్లాది భక్తజనం, ఎవరయితే బుద్ధ భగవానుడి పట్ల నమ్మకం ఉంచుతున్నారో, వారు ఉత్తర్ ప్రదేశ్ కు ఇట్టే చేరుకోగలుగుతారు.  ఇది స్థానిక యువత కు అనేక ఉపాధి అవకాశాల ను, అలాగే స్వతంత్రోపాధి అవకాశాల ను కూడా కల్పించగలదు.  మరి మీకు కూడా తెలిసిన విషయం ఒకటి ఉంది, అది- పర్యటన రంగాని కి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, ఈ రంగం కనీస స్థాయి లో లభించే మూలధనంతోనే గరిష్ఠ సంఖ్యలో ప్రజల కు బ్రతుకుదెరువు ను సమకూర్చుతుంది- అన్నదే.

మిత్రులారా, 

ఉత్తర్ ప్రదేశ్ ఎల్లప్పుడూ కూడా భారతదేశం యొక్క వృద్ధి ప్రక్షేప పథం లో అత్యంత ప్రధానమైనటువంటి భాగం గా ఉంది.  ఇంకా, ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం, పేదల కు మరియు గ్రామాల కు సాధికారిత ను కల్పించే ఉద్యమాని కి ఉత్తర్ ప్రదేశ్ అందించిన తోడ్పాటు తో  దేశం స్థిరం గా వర్ధిల్లుతూ ఉంటున్నది.  గడచిన మూడున్నర సంవత్సరాల లో ప్రతి ప్రధాన పథకం విషయం లోనూ ఉత్తర్ ప్రదేశ్ ఎంతో వేగవంతమైన కృషి ని చూపింది.   మూడంటే మూడే సంవత్సరాల లో, పేదల కోసం యుపి లో 30 లక్షల కు పైగా పక్కా ఇళ్లు నిర్మితం అయ్యాయి.  కేవలం మూడు సంవత్సరాల కఠోర శ్రమ తో, యుపి ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన అలవాటు నుండి తనను తాను విముక్తపరచుకొన్నట్లు ప్రకటించుకొంది.  కేవలం మూడు సంవత్సరాల లో, యుపి 3 లక్షల మంది యువతీయువకుల కు ప్రభుత్వ ఉద్యోగాల ను, అదీనూ ఒక పారదర్శకమైనటువంటి రీతి లో, ఇచ్చింది.  కేవలం మూడు సంవత్సరాల ప్రయాసల తో, యుపి లో ప్రసూతి మరణాల రేటు లో 30 శాతం క్షీణత కనిపించింది.

మిత్రులారా, 

ఎన్ సెఫలైటిస్ మహమ్మారి తూర్పు పూర్వాంచల్ లో కొన్ని సంవత్సరాలు గా ఉపద్రవాన్ని కలుగజేస్తూవస్తోంది.  ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది శిశువు లు మరణించిన విషాదం వెంటాడింది.  ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రయాస ల ద్వారా, ఈ వ్యాధి సంక్రమించిన రోగుల సంఖ్య తగ్గింది; మరణాల రేటు కూడా 90 శాతాని కి తగ్గిపోయింది.  దీనికి అదనం గా, వైద్య కళాశాలల ను స్థాపించడం గాని లేదా ‘ఆయుష్మాన్ భారత్ అభియాన్’ లో భాగం గా ఇతర సదుపాయాల ను కల్పించడం పరం గా గాని.. వీటిలో కూడాను యుపి ఒక కొనియాడదగ్గ పని ని చేసింది. 

విద్యుత్తు, నీరు మరియు రహదారుల వంటి ప్రాథమిక సదుపాయాల లో ఇంతకు ముందు ఎరుగనంత మెరుగుదల చోటు చేసుకొంది.  క్రొత్త రహదారుల నిర్మాణం లో మరియు ఎక్స్ ప్రెస్ వేస్ యొక్క నిర్మాణం లో యుపి పురోగమిస్తోంది.  మరి అత్యంత ప్రాముఖ్యం అయిన విషయం, ఇవాళ, ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి నెలకొంది; చట్టం యొక్క పాలన అమలు అవుతోంది.  ఈ కారణం గానే ఉత్తర్ ప్రదేశ్ ను ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారు లు గమనిస్తూ ఉన్నారు.   దేశీయ పెట్టుబడి ని మరియు విదేశీ పెట్టుబడి ని ఆకర్షించడం కోసం ప్రభుత్వం తీసుకొంటున్న ఏ చర్యల ద్వారా అయినా సరే, యుపి బోలెడంత ప్రయోజనాన్ని పొందుతోంది.  మరి ఈనాటికి కూడాను, ఇతర రాష్ట్రాలు కరోనా తో పోరాడుతూ ఉండగా, యుపి తన వికాసం కోసం అంతటి ఒక భారీ పథకాన్ని మొదలుపెట్టింది.  ఒక రకం గా, యుపి సంక్షోభం సృష్టించిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొంటున్నది.  ఈ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాల కల్పన కు గాను మీ అందరికి మరొక్క మారు అనేకానేక అభినందన లు!!

గుర్తుపెట్టుకోండి, కరోనా తో మన సమరం ఇప్పటికీ సాగుతూనే ఉంది.  పని కోసం బయట కు వెళ్లండి, కానీ ఒక మనిషి కి మరో మనిషి కి నడుమ న రెండు గజాల ఎడం (‘దో గజ్ దూరీ’) పాటించండి, మీ యొక్క నోటి ని మరియు ముక్కు ను ఫేస్ మాస్క్ లతో కప్పి ఉంచండి, ఇంకా నిరంతరమూ పరిశుభ్రత కు  ప్రాముఖ్యం ఇస్తూ ఉండండి.  ఇటు ప్రాణం తోనూ, అటు జీవనోపాధి తోనూ చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం లో ఉత్తర్ ప్రదేశ్ గెలుస్తుంది, మరి భారతదేశం కూడా జయిస్తుంది.

అనేకానేక ధన్యవాదములు.


***



(Release ID: 1655006) Visitor Counter : 162