PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 27 AUG 2020 6:19PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9 లక్షలకుపైగా పరీక్షలు, మొత్తం పరీక్షించిన నమూనాలు దాదాపు 3.9 కోట్లు.
  • వ్యాధి నయమైనవారు 2.5 మిలియన్లపైగానే; ప్రస్తుత-కేసుల కోలుకున్న కేసుల మధ్య అంతరం 18 లక్షలు.
  • దేశంలో కోలుకునేవారి జాతీయ సగటు 76.24 శాతం.
  • నిర్ధారిత కేసులలో మరణాల సగటు 1.83 శాతం.
  • దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులు 21.93 శాతం మాత్రమే.
  • అత్యధిక మరణాల సగటుగల 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలపై కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి సమీక్ష.
  • ప్రపంచానికి... ప్రత్యేకించి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల నడుమ విశ్వసనీయ భాగస్వామిగా రుజువుచేసుకున్న భారత్‌: శ్రీ పీయూష్‌ గోయల్‌.

గత 24 గంటల్లో 9 లక్షలకుపైగా పరీక్షలు, మొత్తం పరీక్షించిన నమూనాలు దాదాపు 3.9 కోట్లు; 2.5 మిలియన్ల రోగులు కోలుకోవడంతో మరో మైలురాయి

కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా “పరీక్ష, అన్వేషణ, చికిత్స” త్రిముఖ వ్యూహంపై నిశిత దృష్టి ఫలితంగా దేశంలో నేటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య దాదాపు 3.9 కోట్లకు చేరింది. ఇందులో భాగంగా గడచిన 24 గంటల్లో 9,24,998 పరీక్షలు నిర్వహించారు. తద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 3,85,76,510గా నమోదైంది. మరింతమంది కోలుకుంటుండటంతోపాటు (స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారు) ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 2.5 మిలియన్లు దాటింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్దేశిత విధానాలను సమర్థంగా అమలు చేయడమే 25,33,771 మంది కోలుకోవడానికి నిదర్శనం. తదనుగుణంగా గత 24 గంటల్లో 56,013 మంది కోలుకోగా కోలుకునేవారి జాతీయ సగటు 76.24 శాతానికి చేరింది. భారత్‌లో ప్రస్తుత (చురుకైన వైద్య పర్యవేక్షణలోగల 7,25,991) కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య దాదాపు 18 లక్షలు (17,97,780) అధికంగా ఉంది. అత్యధిక సంఖ్యలో రోగులు కోలుకుంటుండటంతో నిర్ధారిత కేసులలో ప్రస్తుతం కేసులు 21.93 శాతానికి పరిమితమయ్యాయి. దీంతోపాటు మరణాల సగటు కూడా 1.83 శాతానికి పతనమైంది. మరోవైపు 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మరణాల శాతం జాతీయ సగటుకన్నా తక్కువగా నమోదవడం విశేషం. ఇక దేశంలో పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 993, ప్రైవేట్ రంగంలో 557 వంతున మొత్తం 1550 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649004

కోవిడ్‌ మరణాలు అధికంగాగల 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలపై కేబినెట్‌ కార్యదర్శి సమీక్ష; మరణాలను 1 శాతం దిగువన ఉంచాలని సూచన

కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్‌ నిర్వహణ-ప్రతిస్పందన వ్యూహంపై సమీక్ష-చర్చ కోసం ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమర్థ నియంత్రణ, పరిచయాల అన్వేషణ, నిఘాలపై దృష్టి సారించి మరణాల సగటును 1 శాతంకన్నా దిగువన ఉంచేందుకు కృషిచేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648979

ప్రపంచానికి... ప్రత్యేకించి తీవ్ర ఒత్తిడి పరిస్థితుల నడుమ విశ్వసనీయ భాగస్వామిగా రుజువుచేసుకున్న భారత్‌: శ్రీ పీయూష్‌గోయల్‌

భారత్‌-ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి సహకారం, భాగస్వామ్యం నిబద్ధతలు మార్గనిర్దేశం చేస్తాయని కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ ప్రకటించారు. ఆసియాన్-భారత వాణిజ్య మండలి వాస్తవిక సాదృశ సమావేశంలో శ్రీ గోయల్ ప్రసంగించారు. ప్రపంచానికి... ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ తననుతాను రుజువు చేసుకున్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తి తొలినాళ్లలో కోవిడ్-19 పోరుకు అవసరమైన సౌకర్యాల కోసం భారత్‌ ప్రపంచ దేశాల సాయం కోరిందని గుర్తుచేశారు. కానీ, ప్రతి దేశం తన సొంత అవసరాలపై దృష్టి సారించినందున ముందుకు రాలేదని శ్రీ గోయల్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఔషధ ఉత్పాదక సామర్థ్యంతో భారతదేశమే ఔషధ సరఫరాదారుగా ప్రపంచాన్ని ఆదుకున్నదని వివరించారు. ఆ మేరకు 150కిపైగా దేశాలకు, దాదాపు ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ... ముఖ్యంగా వెనుకబడిన దేశాలకు మందులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. తద్వారా విశ్వసనీయ భాగస్వామిగా, నిజమైన మిత్రదేశంగా నిరూపించుకున్నదని వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649008

ఎన్‌సీసీ శిక్షణ కోసం మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ ‘డైరెక్టరేట్‌ జనరల్‌ నేషనల్‌ కేడెట్‌ కోర్‌’ (DGNCC) మొబైల్‌ శిక్షణ యాప్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగాగల ఎన్‌సీసీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం కోసం ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ- కోవిడ్‌వల్ల భౌతిక శిక్షణ కార్యకలాపాలపై ఆంక్షల నేపథ్యంలో ఆ ఇబ్బందులు అధిగమించడంతోపాటు డిజిటల్‌ అభ్యాసానికి ఈ యాప్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మహమ్మారిపై పోరులో భాగంగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందువరుస కరోనా యోధులకు సహకరించిన లక్ష మందికిపైగా ఎన్‌సీసీ కార్యకర్తలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. కాగా, ఎన్‌సీసీ కార్యకర్తలకు శిక్షణ సరంజామా మొత్తాన్నీ (పాఠ్యప్రణాళిక, సంగ్రహణం, శిక్షణ వీడియోలతోపాటు తరచూ అడిగే ప్రశ్నలు) ఒకేవేదికపై అందించడమే డీజీపీఎన్‌సీసీ మొబైల్ శిక్షణ యాప్ లక్ష్యం. శిక్షకులను ప్రశ్నలు అడిగే అవకాశంతోపాటు పరస్పర సంభాషణకూ ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648938

సాయుధ దళాల ట్రిబ్యునల్ ప్రాంతీయ బెంచ్‌లలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా  విచారణలకు శ్రీకారం చుట్టిన ప్రధాన ధర్మాసనం

దేశంలోని సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT) 10 ప్రాంతీయ ధర్మాసనాలలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా విచారణలకు ప్రధాన ధర్మాసనం చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రాజేంద్ర మీనన్‌ నిన్న శ్రీకారం చుట్టారు. కాగా, 2020 జూన్ 8 నుంచి సాయుధ దళాల ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం మాత్రమే భౌతిక విచారణలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల్లో నివసించే (సర్వీసులోగల/రిటైరైన) సాయుధ దళాల వ్యక్తులు వివిధ భద్రత సంబంధ కారణాలవల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు, పరిమితులను పరిగణనలోకి తీసుకొని ప్రధాన ధర్మాసనం భౌతిక విచారణ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రాంతీయ ధర్మాసనాలలో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా విచారణ ప్రక్రియ ప్రారంభం కావడం వారికి కచ్చితంగా ఊరటనిస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648867

యువతలోని వ్యవస్థాపన సామర్థ్యాన్ని పెంచి పోషించాలి: ఉప రాష్ట్రపతి పిలుపు

సమీప భవిష్యత్తులో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేసే దిశగా దేశంలోని యువతలోగల వ్యవస్థాపన సామర్థ్యాన్ని పెంచి పోషించాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పౌరుడిలోగల ప్రత్యేక నైపుణ్యాలను మేల్కొలపడం ద్వారా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంట స్వయం సమృద్ధి సాధించాలని, మొత్తంమీద మానవాళికి మేలు కలిగేల చొరవ చూపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించడంపై ఒక వెబినార్‌లో ఆయన ప్రసంగించారు. భూదానోద్యమం ద్వారా సమాజంలో అంతరాలను తగ్గించేందుకు యత్నించిన కృషీవలుడుగా ఆచార్య వినోబా భావేను ప్రశంసించారు. తదనుగుణంగా సశక్త-స్వాభిమాన-స్వయం సమృద్ధ భారతం సృష్టికి కృషిచేద్దామని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648952

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: కేంద్రపాలిత ప్రాంతంలోని నెహ్రూ హాస్పిటల్ ఎక్స్‌టెన్షన్‌లోని స్వల్పలక్షణాలుగల-స్వస్థత పొందిన రోగులను ఇతర ప్రదేశాలకు తరలిస్తే, క్లిష్ట పరిస్థితిలోగల రోగులకు పడకలు అందుబాటులో ఉంటాయని పీజీఐఎంఈఆర్‌ డైరెక్టరుకు చండీగఢ్‌ పాలన యంత్రాంగాధిపతి సూచించారు. అలాగే కోవిడ్ వ్యాప్తితోపాటు ఇతర వర్షాకాల వ్యాధుల నిరోధానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు.
  • పంజాబ్: కోవిడ్ మహమ్మారితోపాటు దిగ్బంధ పరిస్థితులవల్ల రాష్ట్రానికి వాటిల్లిన ఆదాయనష్టం భర్తీ దిశగా తగిన పరిహారం ఇవ్వాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని మంత్రిమండలి కేంద్రం ప్రభుత్వాన్ని కోరింది.
  • కేరళ: రాష్ట్రంలో ఓణం పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో రద్దీ నివారణకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు జారీచేసింది. ఈ మేరకు ‘ఓణ విందు’ కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఓణ సమయంలో నిర్వహించే ప్రదర్శన-కొనుగోళ్ల వేడుకలపైనా నిషేధం విధించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో పుష్పాలంకరణ వద్దని, రాష్ట్రం వెలుపలినుంచి పువ్వులు కొనవద్దని కూడా ఈ ఉత్తర్వులో ప్రభుత్వం ప్రజలకు ప్రత్యేకంగా సూచించింది. కాగా, రాష్ట్రంలో ఈ మధ్యాహ్నందాకా 4 మరణాలు నమోదవగా మృతుల సంఖ్య 301కి చేరింది. ఇక నిన్న 2,476 కొత్త కేసులతో ఒకేరోజులో అత్యధిక కేసుల కొత్త రికార్డు నెలకొంది. కేరళలో ప్రస్తుతం 22,344 క్రియాశీల కేసులుండగా 1,89,781 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో 511 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో గురువారంనాటికి మొత్తం కేసులు 12,434కు, క్రియాశీల కేసులు 4,483కు, మృతుల సంఖ్య 190కి పెరిగాయి. 2,356 మంది ఏకాంత గృహవాస చికిత్సలో ఉండగా, 2,127 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక తమిళనాడులో ఇ-పాస్ నిబంధనల సడలింపువల్ల మదురై జిల్లాలో కేసుల సంఖ్య పెరగవచ్చునని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు; మరోవైపు ఆటోమేటిక్ ఆమోద వ్యవస్థ ద్వారా రోజుకు సగటున 9,000 దరఖాస్తులకు అనుమతి లభిస్తోంది. కాగా, రాష్ట్ర విద్యార్థులను నీట్‌ పరీక్షనుంచి మినహాయించడంపై పలు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి కె.ఎ.సెంగోట్టయ్యన్‌ పునరుద్ఘాటించారు.
  • కర్ణాటక: ఒకవైపు వైరస్‌తో పోరు కొనసాగుతున్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి పంపిన కోవిడ్‌ రోగుల చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించని కారణంగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించలేక పోతున్నామని ప్రైవేట్ ఆస్పత్రులు-నర్సింగ్‌ హొమ్‌ల సంఘం తెలిపింది. ఆరోగ్యేతర ముందువరుస కార్మికులకు ఉపశమన లబ్ధిని విస్తరించకపోవడంపై కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, రాష్ట్రంలోని 108 ప్రయోగశాలల్లో ఇప్పటిదాకా 25,80,621 పరీక్షలు నిర్వహించారు. కర్ణాటకలో నిన్న 8,580 కొత్త కేసులు నమోదవగా 7,249 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 70.47 శాతం కావడం విశేషం.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్ష ధరను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం ఇప్పటిదాకా ప్రభుత్వ ఆసుపత్రులు పంపిన నమూనాలకు ఇప్పటిదాకా రూ.2400 చెల్లిస్తుండగా ఇకపై రూ.1,600 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేటు ఆస్పత్రులు పంపే నమూనాలకు రూ.2900 వసూలు చేస్తుండగా ఇకమీదట రూ.1900 చెల్లిస్తే సరిపోతుంది. వైరస్ వ్యాప్తి తొలినాళ్లతో పోలిస్తే పరీక్ష కిట్ల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెరిగిన కారణంగా వాటి ధర తగ్గినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక రాష్ట్రంలో కరోనావైరస్ నిర్ధారణ శాతం జాతీయ సగటు 8.59 శాతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 11.19 శాతానికి పెరిగిందని తాజా ప్రభుత్వ సమాచారపత్రం తెలిపింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2795 కొత్త కేసులు 8 మరణాలు నమోదవగా 872మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 449 జీహెచ్‌ఎంసీనుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,14,483; క్రియాశీల కేసులు: 27,600; మరణాలు: 788; డిశ్చార్జి: 86,095గా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఆగస్టు నెలలోనే 50,000 కేసులుంటాయని అంచనా. వ్యవసాయ రంగంలో రాష్ట్రం చేపట్టిన అనేక కార్యక్రమాలను... ముఖ్యంగా ‘రైతుబంధు’, రైతు సమన్వయ కమిటీల వంటివాటిని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రశంసించింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో బుధవారం 143 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 987గా ఉంది. ఇక కోలుకునేవారి సగటు 72 శాతంగా నమోదైంది..
  • అసోం: రాష్ట్రంలో బుధవారం 2148 మంది కోలుకోగా, 2179 కొత్త కేసులు నమోదవడం గమనార్హం. దీంతో అసోంలో మొత్తం కేసులు 96771కి చేరగా, వీటిలో ప్రస్తుతం 19532 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 76962 మంది కోలుకోగా, 274 మంది మరణించారు.
  • మణిపూర్: రాష్ట్రంలో 141 కొత్త కేసులు నమోదవగా, 17 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1731 క్రియాశీల కేసులుండగా కోలుకునేవారి సగటు 68 శాతంగా ఉంది.
  • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ 500కుపైగా గ్రామ పాలనమండళ్లు, 70కి పైగా స్థానిక మండళ్ల ఎన్నికలకు పోలింగ్ పూర్తయింది. కాగా, మిజోరంలో కోవిడ్‌ రోగుల సంఖ్య 974కు చేరగా, ప్రస్తుతం క్రియాశీల కేసులు 499గా ఉన్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని కోహిమా పరిధిలో కొత్త కోవిడ్‌ కేసుల నమోదు కారణంగా మరో 7 ప్రదేశాలను మూసివేశారు. కాగా, రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖతోపాటు, పోలీసు శాఖకు చెరో 3 వెంటిలేటర్ల వంతున స్టేబ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారంనాడు విరాళంగా అందజేసింది. అంతకుముందు 500 పీపీఈ కిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది.
  • సిక్కిం: సిక్కింలో 56 మందికి కోవిడ్‌ నిర్ధారణ కాగా, చురుకైన కేసుల సంఖ్య 388కి చేరింది. ఇప్పటిదాకా 1151 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా 14,888 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.18 లక్షలకు చేరగా, ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 1.72 లక్షలుగా ఉంది. రాష్ట్ర రాజధాని ముంబైలో చాలారోజుల తర్వాత ఒకేరోజు 1,854 కేసులు నమోదయ్యాయి. కాగా, ముంబైలో విజయవంతమైన ‘ఛేజ్‌ ది వైరస్‌’ వ్యూహాన్ని ఇతర ప్రాంతాల్లకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరించనుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1197 కొత్త కేసులు నమోదవగా సూరత్ నుంచి గరిష్టంగా 168 కేసులున్నాయి. ఇక అహ్మదాబాద్ 144, వడోదర 90 కేసుల వంతున తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌లో కోలుకునేవారి సగటు 80.22 శాతం కాగా, ప్రస్తుతం 14,884 క్రియాశీల కేసులున్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలను సెప్టెంబర్ 7నుంచి తిరిగి తెరవనున్నారు. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అయితే, ఆలయాల వద్ద సామాజిక దూరం నిబంధనను పాటించాల్సి ఉంటుంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం 14,646 క్రియాశీల కేసులున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: అఖిలభారత పర్యాటక అనుమతిగల వాహనాలతోపాటు అంతర్రాష్ట్ర ప్రజా రవాణా వాహనాల రాకపోకలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇవాళ్టినుంచి తిరిగి ప్రారంభించింది. దీనికి అనుగుణంగా రవాణా శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను జారీచేసింది. దీని ప్రకారం నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే బస్సులు ఆగుతాయి. ప్రయాణానికి ఇ-పాస్ అవసరం లేకపోయినా, ప్రయాణికులలో ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అవసరమైతే పరిచయాల అన్వేషణ కోసం జిల్లా అధికారులకు సమర్పించవచ్చు.
  • గోవా: గోవాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 15 వేల స్థాయిని దాటింది. ఈ మేరకు జాతీయ స్థాయిన మొత్తం జనాభాలో 1 శాతం మహమ్మారి బారినపడిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేకపోగా, దిగ్బంధ విముక్తి తర్వాత కేవలం జూన్‌-ఆగస్టు మధ్య కాలంలో 15,027 కేసులు నమోదవడం గమనార్హం.

 

 

****



(Release ID: 1649075) Visitor Counter : 200