రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎన్.సి.సి. శిక్షణ కోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించిన - రక్షణమంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్.

Posted On: 27 AUG 2020 12:11PM by PIB Hyderabad

డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (డి.జి.ఎన్.‌సి.సి) మొబైల్ శిక్షణా యాప్‌ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ఇక్కడ ప్రారంభించారు.  ఎన్.‌సి.సి. క్యాడెట్ ‌లకు దేశవ్యాప్తంగా ఆన్ ‌లైన్ శిక్షణ ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. 

కోవిడ్-19 విధించిన ఆంక్షల నేపథ్యంలో, ఎన్.సి.సి. క్యాడెట్ల శిక్షణ ఎక్కువగా ప్రభావితమైంది, ఎందుకంటే ఇది ఎక్కువగా ప్రత్యక్ష సంప్రదింపుల ఆధారిత శిక్షణ కావడం వల్ల.  సమీప భవిష్యత్తులో పాఠశాలలు / కళాశాలలు తెరిచే అవకాశం లేనందున, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించి ఎన్‌.సి.సి. క్యాడెట్లకు శిక్షణ ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించడం జరిగింది.  ఈ యాప్ ప్రారంభోత్సవ సందర్భంగా రక్షణ మంత్రి ఎన్‌.సి.సి. క్యాడెట్‌లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంభాషిస్తూ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.  వారికి విజయం చేకూరాలని ఆయన  ఆకాంక్షిస్తూ, జీవితంలోని అన్ని రంగాలలో రాణించాలని వారిని ప్రేరేపించారు. 

 ఎన్.సి.సి.  క్యాడెట్లనుద్దేశించి, రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, ప్రత్యక్ష భౌతిక పరస్పర చర్యలపై పరిమితులను అనుసరిస్తూ, కోవిడ్-19 వల్ల ఎదురౌతున్న ఇబ్బందులను అధిగమించి, డిజిటల్ శిక్షణ పొందడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు.  ఒకరు దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, అతడు లేదా ఆమె అన్ని అడ్డంకులను తొలగించుకుని విజయం సాధించగలుగుతారని, ఆయన పేర్కొన్నారు.  మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో వివిధ పనులను నిర్వర్తించడం ద్వారా ఫ్రంట్ లైన్ కరోనా యోధులకు మద్దతు ఇచ్చిన లక్ష మందికి పైగా ఎన్.‌సి.సి. క్యాడెట్ల సేవలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు.  ఐక్యత, క్రమశిక్షణ, దేశానికి సేవ వంటి విలువలను ఎన్.‌సి.సి. అందిస్తుందనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్, ప్రముఖ క్రీడాకారులు అంజలి భగవత్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వంటి ప్రముఖులు ఎన్.సి.సి. క్యాడెట్ల స్థాయి నుండి వచ్చి ఉన్నత పదవులనలంకరించారని ఆయన వివరించారు.   దీనికి తోడు, రక్షణమంత్రి కూడా స్వయంగా ఒక ఎన్.సి.సి. క్యాడెట్. 

ఎన్.‌సి.సి.క్యాడెట్లకు అవసరమైన మొత్తం శిక్షణా సామగ్రిని (పాఠ్యప్రణాళిక, సారాంశం, శిక్షణా వీడియోలతో పాటు తరచుగా అడిగే ప్రశ్నలు) ఒకే వేదిక ద్వారా అందించాలని, డి.జి.ఎన్.‌సి.సి. మొబైల్ శిక్షణా యాప్, లక్ష్యంగా పెట్టుకుంది.   ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం కల్పిస్తూ, పరస్పరం సంభాషించుకునే విధంగా ఈ  యాప్ ను రూపొందించడం జరిగింది.  ఈ ఎంపికను ఉపయోగించడం ద్వారా, ఒక క్యాడెట్ శిక్షణ సిలబస్‌కు సంబంధించిన ఏదైనా ప్రశ్నను పోస్ట్ చేయవచ్చు.  అర్హతగల బోధకుల బృందం దీనికి సమాధానం ఇస్తుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క డిజిటల్ ఇండియా భావనకు అనుగుణంగా ఈ యాప్ ఖచ్చితంగా ఎన్.సి.సి. శిక్షణలో యాంత్రీకరణకు సానుకూల దశ అవుతుంది.  మహమ్మారి సృష్టించిన ఈ పరీక్ష సమయాల్లో శిక్షణా సామగ్రిని సులభంగా పొందడంలోనూ, ఎన్.సి.సి. క్యాడెట్లకు సహాయం చేయడంలోనూ, ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. 

ఈ కార్యక్రమంలో - రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్; ఎన్.సి.సి. డైరెక్టర్ జనరల్ లెఫ్టనెంట్ జనరల్ రాజీవ్ చోప్రాతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ పౌర, సైనిక అధికారులు పాల్గొన్నారు. 

 

*****


(Release ID: 1648938) Visitor Counter : 296