ఆర్థిక మంత్రిత్వ శాఖ

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రసంగిస్తూ ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

కోవిడ్-19 ప్రభావం నుంచి దేశాన్ని బయట పడవేయడంలో జాతీయ మౌలికసదుపాయాల పైపులైన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది: ప్రధానమంత్రి

ప్రపంచం కోసం (మేక్ ఫర్ వరల్డ్) భారత్ లో తయారీ ('మేక్ ఇన్ ఇండియా') అనేది మన మంత్రం కావాలని ప్రధాని అన్నారు

Posted On: 15 AUG 2020 3:36PM by PIB Hyderabad

భారతావని 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట పైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  జెండా ఎగురవేసిన తరువాత ఎర్ర కోట బురుజులపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ వివిధ అంశాలను ప్రస్తావించారు.   కోవిడ్ -19 మహమ్మారిపై జరిపిన పోరాటంలో  జాతిజనులు కలసికట్టుగా నిర్వహించిన పాత్ర,  ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం,  మధ్యతరగతిపై దృష్టిని కేంద్రీకరించి ఆర్ధిక వ్యవస్థ పునరుద్ధరణకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను గురించి ప్రధాని మాట్లాడారు.  

ఆత్మ నిర్భర్ భారత్  ప్రాముఖ్యతను గురించి పునరుద్ఘాటిస్తూ  సహచర భారతీయులకు అవసరాల్లో పూర్తి మద్దతును అందిస్తామని అయన హామీ ఇచ్చారు.  ఒకవైపు కరోనా మహమ్మారి కలకలం సృష్టించి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సమయంలో 130 కోట్లకు పైగా భారతీయులు స్వావలంభన సాధించేందుకు నిర్ణయించుకున్నారని  అన్నారు.   "స్వయం సమృద్ధి సాధించడం ఆజ్ఞాబద్ధమైనది.   ఇండియా ఆ కలను సాకారం చేసుకోగలదని నేను నమ్ముతున్నాను.   నా తోటి భారతీయుల సామర్ధ్యం, సాహసం మరియు దక్షత పైన నాకు ఎంతో నమ్మకం ఉంది.  మనం ఏదైనా చేయాలని అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు మనం విశ్రమించబోము"  అని ఆయన అన్నారు.    


74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ మౌలిక సదుపాయాల కల్పన రంగాన్నీ భారీ ఎత్తున ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.  దేశంలో వివిధరంగాల సత్వర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని,  ఇందుకోసం జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (ఎన్ ఐ పి)  ప్రాజెక్టు  సహాయం తీసుకుంటామని,  ఈ ప్రాజెక్టులో రూ. 110 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు.  ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన 7,000కు పైగా  ప్రాజెక్టులను గుర్తించినట్లు ప్రధానమంత్రి తెలిపారు కోవిడ్-19  ప్రభావం నుంచి దేశాన్ని బయట పడవేయడంలో జాతీయ మౌలికసదుపాయాల పైపులైన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.   మౌలిక సదుపాయాల కల్పనకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలలో ఎన్ ఐ పి విప్లవాత్మక మార్పులు తేగలదని అన్నారు.   దానివల్ల అసంఖ్యాకంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.  మన రైతులు, యువత,  పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందుతారని అన్నారు.  

        ఇప్పుడు మనం  మేక్ ఇన్ ఇండియాతో పాటు  మేక్ ఫర్ వరల్డ్  కూడా అనే మంత్రంతో ముందుకెళ్లాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  

      ఇండియాలో ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలను మొత్తం ప్రపంచం గమనిస్తోంది ప్రధానమంత్రి అన్నారు.  దాని ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డి ఐ)  రాకడ బాగా పెరిగిందని,  కోవిడ్ మహమ్మారి కలకలం మొదలైన తరువాత ఇండియాకు  విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల రాకడ  ఒక్కసారిగా 18% పెరిగిందని ఆయన వెల్లడించారు.  

దేశంలో పేదల జనధన్  ఖాతాల లోకి  నేరుగా లక్షల కోట్ల రూపాయలు బదిలీ అవుతాయని ఎవరైనా అనుకున్నారా ?  రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టంలో భారీ మార్పులు వస్తాయని ఎవరైనా ఊహించారా?  
ఒక దేశం - ఒక రేషన్ కార్డు,  ఒక దేశం - ఒకే పన్ను,  దివాలా మరియు అప్పు చెల్లించలేని స్థితి  మరియు  బ్యాంకుల విలీనం నేడు  దేశంలో వాస్తవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

ఏడు కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని,   రేషన్ కార్డులు ఉన్నవారు, లేని వారు కలిపి మొత్తం 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారం సమకూర్చడం జరిగిందని,  దాదాపు 90వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల లోకి నేరుగా బదిలీ చేయడం జరిగిందాని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు వారి గ్రామాలలోనే ఉపాధి కల్పించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.  

గృహ రుణాల కిస్తులపై రాయితీ లభించడం కూడా ఇదే మొదటిసారి.  గృహ రుణాలపై నెలవారీ (ఈ ఎం ఐ) కిస్తులు  చెల్లించే వారికి  రుణాలు చెల్లింపు కాలంలో రూ. 6 లక్షల వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు.    నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేయడానికి పోయిన సంవత్సరంలోనే రూ. 25వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని తెలిపారు.  

దేశంలో వివిధ బ్యాంకుల్లో ప్రారంభించిన 40 కోట్ల జనధన్ ఖాతాలలో దాదాపు 22 కోట్ల ఖాతాలు మహిళలవి మాత్రమే అన్నారు.  కరోనా సమయంలో  ఏప్రిల్- మే-జూన్  మూడు నెలల్లో  దాదాపు 30వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళల ఖాతాలకు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు.   కరోనా సమయంలో మనం డిజిటల్ ఇండియా ఉద్యమ పాత్ర ఏమిటో  చూశాం.  పోయిన నెలలో ఒక్క భీం యుపిఐ నుంచే రూ. 3 లక్షల కోట్ల మేర లావాదేవీలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.   

***



(Release ID: 1646151) Visitor Counter : 197