ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రారంభించిన ప్రధానమంత్రి -- స్వచ్ఛ భారత్ మిషన్ గురించిన అన్యోన్య అనుభవాన్నిచ్చే కేంద్రం
మహాత్మా గాంధీకి శాశ్వత నివాళిగా రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్నిఅంకితమిచ్చిన ప్రధానమంత్రి
స్వచ్ఛతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చినందుకు ప్రజలను ప్రశంసించిన ప్రధానమంత్రి, భవిష్యత్తులో అదే కొనసాగించాలని విజ్ఞప్తి
స్వచ్ఛత కోసం స్వతంత్ర దినోత్సవం వరకు కొనసాగే 'గందగీ ముక్త్ భారత్' (మురికి లేని భారత్) ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని
Posted On:
08 AUG 2020 5:50PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద గాంధీ స్మృతి మరియు దర్శన్ సమితి వద్ద ప్రధానమంత్రి శ్రీ శనివారం స్వచ్ఛ భారత్ మిషన్ గురించిన పరస్పర ప్రభావశీల అనుభవాన్నిచ్చే కేంద్రం రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రారంభించారు. మహాత్మునికి నివాళిగా ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని మొదట ప్రధానమంత్రి 2017 ఏప్రిల్ 10వ తేదీన మహాత్మాగాంధీ చంపారన్ సత్యాగ్రహం శతజయంతి ఉత్సవాల సందర్బంగా ప్రకటించారు. జల శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మరియు జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రతన్ లాల్ కటానా ఉత్సవానికి హాజరయ్యారు.
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం (ఆర్ ఎస్ కె) సందర్శన యాత్ర
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం డిజిటల్ మరియు ఆరుబయలు ఏర్పాట్లు, స్థాపనల మిశ్రమం. ఐదేళ్లలో పరివర్తన చెందిన భారతాన్ని కళ్ళకు కట్టి చూపుతుంది. 2014లో 50 కోట్లకు పైగా ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం నుంచి 2019లో బహిరంగ మల విసర్జన విముక్త దేశంగా మారడాన్ని చూపుతుంది. ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని ఆర్ ఎస్ కెలోని మూడు విలక్షణ విభాగాలను చూశారు. మొదటి హాలులో స్వచ్ఛ భారత్ ప్రయాణాన్ని గురించి స్థూలదృష్టిని ఇచ్చే అద్వితీయమైన దృశ్య శ్రవణ ప్రదర్శన చూశారు. ఆ తరువాత అయన రెండవ హాలులో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ఎవరికి వారు పరస్పరం తెలుసుకొని అనుభూతిని పొందగలిగే ఎల్ ఈ డి పట్టికలు, హోలోగ్రాం బాక్సులు, ఆటలు వంటివి మరెన్నో ప్రదర్శనలో ఉంచారు. కేంద్రం పక్కన ఉన్న పచ్చిక బయలులో స్వచ్ఛ భారత్ మిషన్ కు ప్రతీకగా మూడు ప్రతిమలు ఏర్పాటు చేశారు. ప్రజలచేత మామాత్ముడు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించడం మొదటిది. గ్రామీణ ఝార్ఖండ్ కు చెందిన రాణి మేస్త్రిలు రెండవది. తమకు తాము వానర సేనగా చెప్పుకునే బాల స్వచ్ఛగ్రహీలు మూడవది.
పాఠశాల విద్యార్థులతో ప్రతిస్పందన
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంలో అన్ని విభాగాలు చూసిన తరువాత ప్రధానమంత్రి కొద్దిసేపు ఆర్ ఎస్ కె స్మారక కేంద్రాన్ని సందర్శించారు. ఆ తరువాత ఆయన ఢిల్లీకి చెందిన 36 మంది విద్యార్థులతో సంభాషించారు. వారు భారతావనిలో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్బంగా భౌతిక దూరానికి సంబంధించిన నియమాలు పాటించారు. ఇళ్లలో, పాఠశాలలో తాము నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాలలో తమ అనుభవాలను విద్యార్థులు ప్రధానమంత్రితో పంచుకున్నారు. రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం గురించి తమ అభిప్రాయాలను ఆయనకు తెలియజేశారు. విద్యార్థులలో ఒకరు కేంద్రంలో మీకు బాగా నచ్చిందేమిటని ప్రధానిని అడిగారు. అందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కు స్ఫూర్తిగా నిలిచిన మహాత్మునికి అంకితం ఇచ్చిన భాగమని ప్రధాని బదులిచ్చారు.
జాతికి సందేశం
పిల్లలతో సంభాషణ తరువాత, ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ సాగిన తీరు గురించి మాట్లాడిన ప్రధాని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం మహాత్మునికి శాశ్వత నివాళిగా అంకితమిచ్చారు. స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా మార్చిన దేశ ప్రజలను ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. మన దైనందిన జీవితంలో స్వచ్ఛతకు ఉన్న ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు. ప్రత్యేకంగా ఇప్పుడు కరోనా వైరస్ పై జరుపుతున్న పోరులో స్వచ్ఛతకు ఎంతో ప్రాధాన్యం ఉందని అన్నారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి వారం రోజుల పాటు సాగే 'గందగీ ముక్త్ భారత్' (మురికి లేని భారత్) ప్రత్యేక ప్రచార సప్తాహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు వరకు సాగుతుంది. ఈ సందర్బంగా ప్రతి రోజు పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛతకు ప్రజా ఉద్యమాన్ని బలపరిచే విధంగా ప్రత్యేక స్వచ్ఛతా ప్రయత్నాలు జరుగుతాయి.
రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం సందర్సనకు ...
ఆగస్టు 9వ తేదీ నుంచి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం ప్రజల సందర్శనార్ధం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు తెరిచి ఉంటుంది. సందర్శకులు భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించాలి. ఏకకాలంలో ఎక్కువమంది కేంద్రంలో ఉండకుండా సందర్శకులను పరిమితం చేస్తారు. స్వల్పకాలంలో విద్యార్థుల సందర్శనలు అనుమతించరు భౌతిక సందర్శనలు సాధ్యం కానంత వరకు చాక్షుష సందర్శనలు అనుమతిస్తారు. అటువంటి మొట్టమొదటి చాక్షుష సందర్శనను ఆగస్టు 13న జల శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ తో నిర్వహిస్తారు. ఆర్ ఎస్ కె టికెట్ల బుకింగ్ మరియు ఈ కేంద్రాన్ని గురించిన మరింత సమాచారం కోసం rsk.ddws.gov.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
***
(Release ID: 1644511)
Visitor Counter : 252
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam