PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 07 AUG 2020 6:29PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 49,769 మందికి వ్యాధి న‌య‌ం; 68 శాతానికి చేరువైన కోలుకునేవారి సంఖ్య.
  • గత 2 వారాల్లో కోలుకునేవారి రోజువారీ సగటు 26,000 నుంచి 44,000కు చేరిక.
  • మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గుతూ ఇవాళ 2.05 శాతానికి ప‌త‌నం.
  • ప్రపంచంలో మహమ్మారి వేళ నావికుల ఎంపికకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించే తొలిదేశంగా భారత్‌.
  • భారత్‌ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం పోర్టల్‌ రూపొందించిన ఢిల్లీ విమానాశ్రయం; దీనిద్వారా తప్పనిసరి స్వీయ-ధ్రువీకరణను నింపి, దేశంలోకి వచ్చాక తప్పనిసరి నిర్బంధవైద్య పరిశీలన నుంచి మినహాయింపు కోరే వీలు కల్పించింది.

దేశంలో 68 శాతానికి చేరువ‌గా కోలుకునేవారి స‌గ‌టు; మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గుతూ నేడు 2.05 శాతానికి ప‌త‌నం

కోవిడ్‌-19 నియంత్రణలో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ స్థిరంగా పెరుగుతుండటం, అదే సమయంలో మరణాల సగటు నానాటికీ గణనీయంగా పతనమవుతూ ప్రపంచంలో అత్యల్ప మరణశాతం కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆ మేరకు కోలుకునేవారి సగటు 68 శాతానికి చేరువ కాగా, మరణాల సగటు ఇవాళ 2.05 శాతానికి పడిపోయింది. ఈ రెండూ సమాంతరంగా సాగుతూ ప్రస్తుత-కోలుకునే కేసుల సంఖ్యల మధ్య అంతరాన్ని (7.7 లక్షలకుపైగా) హెచ్చుస్థాయిలో ఉంచుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య

13,78,105కు చేరగా, గత 24 గంటల్లో 49,769 మందికి వ్యాధి నయమైంది. రోజురోజుకూ ఆస్పత్రి సదుపాయాలు మెరుగుపడటం, కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత చికిత్స విధివిధానాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో ప్రామాణిక సంరక్షణ చర్యలు చేపట్టడంతో కోలుకునేవారి సగటు మెరుగుపడుతూ వస్తోంది. ఇలా గడచిన 2 వారాల్లో సగటున కోలుకున్న కేసులు (7 రోజుల సరాసరి) 26,000 నుంచి 44,000కు పెరిగాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644044

గత 24 గంటల్లో 6,64,949 కోవిడ్ పరీక్షలతో సరికొత్త రికార్డు; వరుసగా 3వరోజు 6 లక్షలకుపైగా పరీక్షలు; ప్రతి 10 లక్షల జనాభాకు 16వేలు దాటిన పరీక్షలు

భారత్ వరుసగా మూడో రోజు 6 లక్షలకుపైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు ‘పరీక్ష, పసిగట్టడం, చికిత్సకు తరలించడం’ అనే త్రిముఖ వ్యూహంపై దృష్టితో రోజువారీ పరీక్షల సంఖ్యను 10 లక్షలకు పెంచే దీక్ష ఫలితంగా వేగంగా ముందడుగు పడుతోంది. ఆ మేరకు గత 24 గంటల్లో 6,64,949 పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,21,49,351కు చేరింది. తదనుగుణంగా ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు వేగంగా పెరిగి 16,050కి చేరింది. పరీక్షలు ముమ్మరంగా నిర్వహించడం ద్వారా రోగులను త్వరగా గుర్తించి, వారితో పరిచయాలను అన్వేషించి, ఏకాంత చికిత్సకు తరలించడం సాధ్యమవుతుంది. ఇక దేశంలో ప్రస్తుతం ప్రయోగశాలల సంఖ్య మొత్తం 1370కి చేరగా, ప్రభుత్వ రంగంలో 921, ప్రైవేట్ రంగంలో 449 అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643958

ఉన్నత విద్యాసదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉన్నత విద్యాసదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో 3-4 ఏళ్లపాటు విస్తృతంగా చర్చించి, లక్షలాది సలహాలతో మేధోమథనం చేసిన తర్వాత జాతీయ విద్యావిధానాన్ని ఆమోదించినట్లు ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానంపై నేడు దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన గోష్ఠులు, చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ విలువలు, లక్ష్యాలపై దృష్టి సారిస్తూ యువతను భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధం చేయడమే జాతీయ విద్యా విధానం లక్ష్యమన్నారు. ఇది 21వ శతాబ్దపు నవ భారతానికి పునాదులు వేస్తుందన్నారు. దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రగతి పయనంలో సమున్నత శిఖరాలకు చేర్చడం కోసం యువతకు విద్య, నైపుణ్యాలు అవసరమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644263

ఉన్నత విద్యాసదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644025

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన-1 సహా 2020 మార్చి నుంచి జూన్‌దాకా 139 లక్షల టన్నుల ఆహారధాన్యాలు తరలించిన ఎఫ్‌సీఐ

భారత ఆహార సంస్థ (FCI) దేశంలోని వివిధ ప్రాంతాలకు 2020 మార్చి నుంచి 2020 జూన్‌దాకా సుమారు 5,000 గూడ్సు రైళ్లద్వారా 139 లక్షల టన్నుల ఆహారధాన్యాలను తరలించింది. దీంతోపాటు 91,874 ట్రక్కులతో మరో 14.7 లక్షల టన్నుల మేర రోడ్డు మార్గాన రవాణా చేసింది. ఈ కృషిలో రైల్వే, నౌకాయాన మంత్రిత్వశాఖల సహకారంతోపాటు వాయుసేన తోడ్పాటు కూడా కీలకపాత్ర పోషించాయి. మరోవైపు లబ్ధిదారులకు ఆహారధాన్యాల పంపిణీ కోసం దేశవ్యాప్తంగా 5.4 లక్షల చౌక దుకాణాల నెట్‌వర్క్‌ ఉపయోగపడింది. అదే సమయంలో కోవిడ్ -19ను నియంత్రణ విధివిధానాల్లో భాగంగా ప్ర‌తి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం అన్నిరకాల ముందుజాగ్ర‌త్తలు తీసుకున్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643968

విద్యార్థులపై భారం త‌గ్గించినందుకు కొత్త విద్యావిధానంపై ఉప రాష్ట్రప‌తి ప్ర‌శంస‌

విద్యార్థులపై భారం తగ్గించినందుకు కొత్త విద్యావిధానాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రాజలక్ష్మి పార్థసారథి తొలి స్మారకోపన్యాసంలో భాగంగా నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయన ప్రసంగించారు. విద్యార్థులు బాల్యం నుంచే చదువుతోపాటు ఆటపాటలు, భౌతిక కార్యకలాపాలపై సమానంగా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు కూడా తరగతి గదులతో సమానంగా క్రీడా మైదానాల్లో సమయం గడపాలన్నారు. అలాగే పాఠ్య ప్రణాళికలో యోగాను సమగ్ర భాగం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానం విద్యార్థి సమగ్రాభివృద్ధి లక్ష్యంతో రూపొందించిన ఓ దార్శనిక పత్రమని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. పాఠ్యప్రణాళికలో తీసుకురానున్న మార్పులతో విద్యార్థులపై భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత వాస్తవిక సాదృశ తరగతులు తాత్కాలికం మాత్రమేనని, గురుముఖతా నేరుగా విద్యాభ్యాసం చేయడాన్ని అవి భర్తీ చేయజాలవని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643912

దేవ్‌లాలి (మహారాష్ట్ర)-దానాపూర్ (బీహార్) మధ్య తొలి ప్రత్యేక ‘కిసాన్ రైలు’ను జెండా ఊపి సాగనంపిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ పీయూష్ గోయల్

భారత రైల్వేశాఖ దేవ్‌లాలి-దానాపూర్ మార్గంలో ప్రవేశపెట్టిన తొలి “కిసాన్ రైలు”ను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌; రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఈ రైలును జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ- ఇది రైతులకు శుభదినం. కిసాన్ రైలును బడ్జెట్‌లో ప్రకటించారు. వ్యవసాయోత్పత్తుల ఉత్తమ పంపిణీ, రాబడి అవసరం. ప్రకృతి విపత్తులు, వైపరీత్యాలు తమకు ఎంతమాత్రం సవాలు విసరలేవని దేశంలోని రైతులు నిరూపించారు. ఈ కిసాన్ రైలు దేశంలోని ఒక మూలనుంచి మరొక మూలకు వ్యవసాయ ఉత్పత్తులను చేరుస్తుంది. ఈ రైలు రైతులకే కాకుండా వినియోగదారులకూ మేలు చేస్తుంది” అన్నారు. శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ- “భారత రైల్వేశాఖ రైతుల కోసం రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, స్ఫూర్తితోనే భారత రైల్వే కిసాన్ రైలును ప్రారంభించింది. ఈ రైలు రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో ఒక మైలురాయిగా ఉపయోగపడుతుంది” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644224

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం పోర్టల్‌ రూపొందించిన ఢిల్లీ విమానాశ్రయం

భారత్‌ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరి స్వీయ-ధ్రువీకరణను నింపి, దేశంలోకి వచ్చాక తప్పనిసరి నిర్బంధవైద్య పరిశీలన నుంచి మినహాయింపు కోరే వీలు కల్పించే దిశగా తొలిసారి ఒక పోర్టల్‌ను రూపొందించినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రకటించింది. ఈ సదుపాయం 2020 ఆగస్టు 8వ తేదీనుంచి ఈ ఈ సౌకర్యం అంతర్జాతీయ ప్రయానికులందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ప్రత్యక్షంగా కాగితాలు నింపే పరిస్థితి లేకుండా ఆన్‌లైన్‌ద్వారా కల్పిస్తున్న ఈ సదుపాయంతో ప్రయాణం మరింత సౌకర్యవంతం కాగలదు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644076

నావికుల ఎంపికకు ఆన్‌లైన్‌ ప‌రీక్ష విధానాన్ని ప్రారంభించిన శ్రీ మన్‌సుఖ్ మాండవీయ‌

కేంద్ర నౌకాయానశాఖ సహాయ (ఇన్‌చార్జి)మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ‌ ఇవాళ ఇక్కడ నావికుల ఎంపిక కోసం ఆన్‌లైన్‌ ప‌రీక్ష విధానాన్ని వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ప్రారంభించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో వివిధ సముద్ర శిక్షణ సంస్థలలో శిక్షణ పొందుతున్న వీరు ప్రస్తుత అనూహ్య కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు వారి ఇళ్లనుంచే ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఈ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచంలో తొలిసారిగా నావికుల ఎంపికు భారత్‌ ఇలా ఇంటినుంచే పరీక్ష రాసే సౌలభ్యం కల్పించిందని ఈ సందర్భంగా శ్రీ మాండవీయ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644120

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  •  చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని మూడు ప్రధాన వైద్య సంస్థలలో ప్రస్తుత సౌకర్యాల అధ్యయనానికి వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నగర పాలనాధిపతి అధికారులను ఆదేశించారు. అలాగే పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ చికిత్స పడకలను పెంచే పద్ధతులను సిఫారసు చేయాలని కోరారు. నగరంలోని వ్యాయామశాలలు, యోగా సంస్థలకు నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని, ఏదైనా ఉల్లంఘన చోటుచేసుకుంటే సదరు యూనిట్‌ను మూసివేయాలని ఆదేశించారు.
  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 అనంతరం పర్యాటక-ఆతిథ్య రంగాల్లో భవిష్యత్తుపై ఆసక్తిగల యువత కోసం పంజాబ్ పర్యాటకశాఖ ఉచిత శిక్షణ-నైపుణ్య అభివృద్ధి కల్పనకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక వ్యవహారాల మంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ మేరకు వెల్లడించారు. 'హునార్ సే రోజ్‌గార్‌ తక్' పథకం కింద 2000 మందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతోపాటు నియామకంలోనూ సహకరిస్తామని చెప్పారు. అలాగే మరో 1000 మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం కింద నైపుణ్య పరీక్ష-సర్టిఫికేషన్‌లో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు.
  • హర్యానా: కోవిడ్‌ మహమ్మారినుంచి కోలుకున్నవారు ముందుకొచ్చి ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు స్ఫూర్తినిస్తూ కరోనా వైరస్‌పై గట్టి పోరాటానికి ప్రేరణనివ్వాలని హర్యానా ముఖ్యమంత్రి కోరారు. అలాగే వ్యాధి బారినుంచి బయటపడినవారు ప్లాస్మాను దానంచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత లేదా అంతకుముందు పరీక్షలు చేయాల్సిన రోగుల కోసం ఉచిత రాకపోకల అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్ష కోసం ఇప్పటిదాకా 98,000 శాంపిల్స్ సేకరించారు. కాగా, పోర్టర్ల నియామక కార్యక్రమం సందర్భంగా 55 మందికి కోవిడ్‌ నిర్ధారణ కావడంతో ఇందులో పాల్గొన్న వారందరినీ కనీసం 14 రోజులు కఠిన గృహనిర్బంధంలో ఉంచాలని నామ్‌సాయ్ జిల్లా యంత్రాంగం నోటీసు జారీచేసింది.
  • మణిపూర్: రాష్ట్రంలోని కోవిడ్, కోవడేతర రోగులందరికీ వైద్యసేవలు అందించాలని చికిత్సలో ఆలస్యం చేయకుండా ఆరోగ్యసేవలు కొనసాగించాలని ప్రభుత్వ-ప్రైవేట్ ఆసుపత్రులను మణిపూర్ ప్రభుత్వం హెచ్చరించింది.
  • మిజోరం: రాష్ట్రంలో ఈ ఉదయం 9 గంటల వరకు 320 మందికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించారు. వీరిలో 18 మంది ట్రక్ డ్రైవర్లతోపాటు స్థానికుడొకరికి కోవిడ్‌ నిర్ధారణ అయింది.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 25 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా సిక్కింలో 399మంది కోలుకోగా, ప్రస్తుతం 446 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలోని కాసరగోడ్‌లో మరో కోవిడ్ మరణం నమోదైంది. ఇక రాష్ట్రంలో నిన్న 1,298 తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 30,000 దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 11,983మంది చికిత్స పొందుతుండగా 1,48,039 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 244 కొత్త కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 4,862కు చేరగా వీటిలో 1,873 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక మరణాలు 75కి పెరిగాయి. ఇక తమిళనాడులోని తిరునల్వేలిలో ఓ కార్యక్రమం కోసం ఆహ్వానం అందుకున్న వారిలో కొందరికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. అలాగే వైద్యులుసహా 10 మందికిపైగా సిబ్బంది కూడా ఈ వ్యాధి బారినపడ్డారు. రాష్ట్రంలో నిన్న 5684 కొత్త కేసులు, 110 మరణాలు  నమోదవగా 6272 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,79,144; క్రియాశీల కేసులు: 53,486; మరణాలు: 4571; చెన్నైలో చురుకైన కేసులు: 11,720గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్ర రాజధాని బెంగళూరుసహా ఇతర ప్రాంతాల్లోనూ కోలుకునేవారి శాతం మెరుగుపడిందని వైద్య విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ మేరకు జూలై 30న 39.36 శాతం నమోదవగా, బెంగళూరు నగరంలో 29.51గా ఉందని, ఆ తర్వాతి వారానికల్లా 50.72 శాతం, 50.34 శాతానికి పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో నిన్న 6805 కొత్త కేసులు, 93 మరణాలు నమోదవగా 5602 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,58,254; క్రియాశీల కేసులు: 75,068; మరణాలు: 2897; డిశ్చార్జి: 80,281గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని రాజమండ్రి సెంట్రల్ జైలులో 265మంది ఖైదీలకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలున్నారు. కాగా, కరోనా సోకిన ఖైదీలతో సంబంధంగల 24 మంది ఇప్పటికే ఏకాంత గృహవాసంలో చికిత్స పొందుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో 150 మంది కరోనా రోగుల ఆచూకీ తెలియడంలేదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ్టినుంచి ప్రసిద్ధ అరకు లోయలో అధికారులు పూర్తి దిగ్బంధం విధించారు. రాష్ట్రంలో 10,328 కొత్త కేసులు, 72 మరణాలు నమోదవగా 8516మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,96,789; క్రియాశీల కేసులు: 82,166; మరణాలు: 1753గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులపై భారం పెరుగుతోంది. కాగా, రాష్ట్రంలో కరనా రోగుల ప్రవేశ వ్యవస్థ నియంత్రణతోపాటు కేంద్రీకరించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)తోపాటు FICCI (తెలంగాణ), తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FTCCI) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. గత 24 గంటల్లో 2207 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా 1136 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 532 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 75,257; క్రియాశీల కేసులు: 21,417; మరణాలు: 601; డిశ్చార్జి: 53,239గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ముంబై, పుణె జిల్లాల తర్వాత థానె జిల్లా గురువారం లక్ష కోవిడ్‌ కేసుల స్థాయికి అధిగమించింది. ఈ మేరకు 1,00,875 కేసులతో మూడోస్థానంలోకి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 4.79 లక్షలు కాగా, వీటిలో 1.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా, ముంబైలో గురువారం 910 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1,20,150కి చేరాయి. అయితే, రాష్ట్రంలో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్యలో ముంబై నగరం వాటా బాగా తగ్గి 8 శాతానికి దిగివచ్చింది. కాగా, నిన్న మహారాష్ట్రలో 11,514 కేసులు నమోదవగా ఒది ఒకేరోజు నమోదైన అత్యధిక కేసులు కావడం గమనార్హం.
  • గుజరాత్: రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్‌లలో పౌరపాలనాధికారులు కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులలో అగ్ని నిరోధక ఏర్పాట్లపై తనిఖీ నిర్వహించారు. అహ్మదాబాద్‌లో గురువారం ఒక ప్రత్యేక ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించిన 8 మంది రోగులు మరణించిన నేపథ్యంలో ఈ తనిఖీ జరగడం గమనార్హం. కాగా, ఈ సంఘటన జరిగిన నవరంగపుర ప్రాంతంలోని శ్రేయ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లకు సంబంధించి ధ్రువీకరణ కూడా లేదని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ తెలిపారు. రాష్ట్రంలో 1,034 కొత్త కేసులు నమోదుకాగా, మొత్తం కేసులు 67,818కి  చేరాయి. వీటిలో 14,905 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను రెండు గంటలు సడలించింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని కరోనావైరస్ ప్రభావిత జిల్లాల్లో వారాంతపు దిగ్బంధాన్ని పాక్షికంగా రద్దుచేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతకుముందు రాత్రి 8.00 నుంచి తెల్లవారుజామున 5.00 గంటలవరకు కర్ఫ్యూ అమలైంది. రాష్ట్రంలో గురువారం 830 కొత్త కేసులు నమోదవగా 838మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,716గా ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని రాయ్‌పూర్, ఇతర పట్టణ ప్రాంతాల్లోగల దుకాణాలు, వాణిజ్య సంస్థలు శుక్రవారం తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి, రెండు వారాలపాటు విధించిన దిగ్బంధం గురువారం ముగిసిన నేపథ్యంలో ఇవాళ్టినుంచి కొన్ని పరిమితులతో వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
  • గోవా: కోవిడ్ 19 మంది రోగులకు రెమ్‌డెసివిర్ యాంటీ వైరల్ ఔషధంతో చికిత్స ప్రారంభించేందుకు గోవా సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సిప్లా నుంచి గోవా ఆరోగ్యశాఖ 1,008 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అందుకుంది. కాగా, గోవాలో మొత్తం 7,614 కోవిడ్ కేసులు నమోదవగా ప్రస్తుతం 2,095 యాక్టివ్‌ కేసులున్నాయి.

 

Image Image

***


(Release ID: 1644274) Visitor Counter : 171