ప్రధాన మంత్రి కార్యాలయం

స్మార్ట్ ఇండియా హాకథాన్-2020 ముగింపు సందర్భంగా ప్రధాని ప్రసంగం

21వ శతాబ్దపు యువత ఆకాంక్షలకు ప్రతిరూపం జాతీయ విద్యావిధానం-2020: ప్రధాని

పరివర్తనాత్మక సంస్కరణలే లక్ష్యం; ఉద్యోగం అడిగేవాళ్ళకంటే ఇచ్చేవాళ్లను సృష్టించటం మీదనే దృష్టి: ప్రధాని

Posted On: 01 AUG 2020 8:21PM by PIB Hyderabad

స్మార్ట్ ఇండియా హాకథాన్-2020 ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొనవారినుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.


స్మార్ట్ ఇండియా హాకథాన్
స్మార్ట్ ఇండియా హాకథాన్ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం ఎదుర్కుంటున్న అనేక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనే దిశగా విద్యార్థులు కృషి చేస్తున్నారని ప్రధాని అన్నారు. సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటంతో బాటుగా డేటా, డిజిటైజేషన్, హైటెక్ భవిష్యత్తు లాంటి అంశాలమీద భారత ఆకాంక్షలను కూడా అది వెల్లడిస్తుందన్నారు. వేగంగా పరుగులిడుతున్న 21వ శతాబ్దంలో సమర్థమైన పాత్ర పోషించేందుకు భారత్ కూడా వేగంగా మారాల్సిన అవసరాన్ని ఒప్పుకుంటూ, అందుకు తగిన వాతావ్వరణాన్ని కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా నవకల్పనలకు, పరిశోధనకు, అభివృద్ధికి, వ్యాపారనాయకత్వానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. మొత్తంగా భారత విద్యావిధానాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్ది, ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించటమే లక్ష్యమన్నారు.
జాతీయ విద్యా విధానం
జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ, 21వ శతాబ్దపు యువత ఆలోచనలు, అవసరాలు, ఆశలు,  ఆకాంక్షలకు అనుగుణంగా దాన్ని రూపుదిద్దామన్నారు.  ఇది కేవలం విధానపత్రం కాదని, 130 కోట్లకి పైబడ్డ భారతీయుల  ఆకాంక్షలకు ప్రతిబింబమని అభివర్ణించారు. " ఈరోజుకూ పిల్లలు తమకు ఆసక్తి లేని అంశం మీద తమ శక్తిని అంచనావేస్తున్నారన్న ఆవేదనతో ఉన్నారు. తల్లిదండ్రుల, బంధుమిత్రుల వత్తిడి కారణంగా ఇతరులు ఎంచుకున్న అంశాలే ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా బాగా చదువుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాళ్ళు చదువుకున్నదేదీ వాళ్ళకు పనికిరావటం లేదు. " అన్నారు. ఈ విధమైన ధోరణికి సమూలంగా మార్చి వేసి భారత విద్యావిధానంలో ఒక క్రమబద్ధమైన సంస్కరణ తీసుకురావటానికే కొత్త జాతీయ విద్యావిధానం ప్రయత్నిస్తోందన్నారు. ఈ మార్పు వలన విద్య పట్ల అభిప్రాయం, విద్యాంశాలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు.  అభ్యసనం, పరిశోధన, నవకల్పనల ఆవిష్కరణ మీద జాతీయ విద్యావిధానం దృష్టిసారిస్తుందని, దానివలన పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం విద్యార్థి సహజసిద్ధమైన ఆసక్తులమీద ఆధారపడి ప్రయోజనాత్మకంగా వ్యవహరిస్తాయని అన్నారు.
విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ఈ హాకథాన్ మీరు పరిష్కరించటానికి చేసిన తొలిప్రయత్నమూ కాదు, తుది ప్రయత్నమూ కాదు" అన్నారు. యువత "అభ్యసించటం, ప్రశ్నించటం, పరిష్కరించటం" అనే మూడు పనులు కొనసాగించాలన్నారు. చదువుకుంటే ప్రశ్నించే తెలివి వస్తుందని, భారత జాతీయ విద్యావిధానం ఈ స్ఫూర్తినే ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. స్కూలు బాగ్  బరువు మోయటం మీదనుంచి ధ్యాస మరలుతున్నదని, జీవితానికి సాయపడే అభ్యసనం అనే వరం కారణంగా బట్టీ పట్టటానికి బదులు తీవ్రంగా ఆలోచించటానికే మొగ్గు చూపుతుందన్నారు.
పరస్పరాధారిత అంశాలకు ప్రాధాన్యం 
కొత్త విద్యావిధానంలో అత్యంత ఆసక్తికరమైన లక్షణం పరస్పరాధారిత అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించటమేనన్నారు. ఈ భావనకు అత్యంత ప్రజాదరణ లభిస్తోందన్నారు. అందరికీ ఒకే సైజు పనికిరాదన్న ప్రాథమిక సూత్రం ఆధారంగా ఇది రూపుదిద్దుకున్నదన్నారు. విద్యార్థి తాను ఏం చదవాలని సమాజం అనుకుంటున్నదనే దానికంటే తాను చదవాలనుకున్న దానిమీద దృష్టిపెట్టేలా చేయటమే ఈ తరహా విధానంప్రత్యేకతగా అభివర్ణించారు. 
విద్యావకాశాల అందుబాటు


బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఉటంకిస్తూ, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని,  అందుకే ఈ విద్యావిధానం కూడా "అందుబాటులో ఉండేలా విద్య " అనే ఆయన ఆలోచనకే అంకితమన్నారు. జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్య మొదలుకొని అందరికీ అందుబాటులో ఉండటం మీదనే దృష్టి పెట్టిందన్నారు. తొలి చదువులనుంచి ఉన్నత విద్యకు వచ్చేసరికి కనీసం 50 శాతం మంది ఉండేలా చూడటమే 2035 నాటికి సాధించాల్సిన లక్ష్యమన్నారు. ఉద్యోగాలు కోరుకునేవాళ్లకంటే ఇచ్చేవాళ్లను తయారుచేయటానికే ఈ విద్యావిధానం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఆవిధంగా మన ఆలోచనా విధానంలోను, మన వైఖరిలోను మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. 

 


స్థానిక భాషమీద ప్రత్యేక దృష్టి 


భారతీయ భాషల పురోగతికి, మరింత అభివృద్ధికి ఈ కొత్త జాతీయ విద్యావిధానం సహాయపడుతుందని ప్రధాని అన్నారు. విద్యార్థులు తమ తొలినాళ్లలో సొంత భాషలో నేర్చుకోవటం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారన్నారు.  కొత్త విద్యావిధానం సుసంపన్నమైన భారతీయ భాషలను ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు. 


విశ్వ సమైక్యతకు ప్రాధాన్యం 


స్థానిక సమగ్రత మీద దృష్టిపెట్టినప్పటికీ ఈ విధానం ప్రపంచ సమగ్రతకు కూదా అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. పేరుమోసిన అంతర్జాతీయ సంస్థలు భారతదేశంలో తమ కాంపస్ లు ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివలన భారత యువతకు అంతర్జాతీయ స్థాయి అనుభవం, అవకాశాలు పొందే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్దారు. అదే సమయంలో అంతర్జాతీయ పోటీకి కూడా సిద్ధం కాగలరన్నారు.  భారత్ లో అంతర్జాతీయ స్థాయి సంస్థల నిర్మాణానికి ఇది దోహదం చేస్తుందని, అంతర్జాతీయ విద్యకు భారత్ ఒక హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


 

***



(Release ID: 1643042) Visitor Counter : 237