PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 26 JUL 2020 6:31PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • ఒక్క‌రోజులో అత్యధికంగా 36,000 మంది కోలుకుని డిశ్చార్జి కావడంతో సరికొత్త రికార్డు నమోదు.
  • ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య 4 లక్షల స్థాయిని దాటిన వ్యత్యాసం.
  • దేశంలో 64 శాతానికి చేరువైన కోలుకునేవారి జాతీయ సగటు.
  • కరోనా ముప్పు తొలగనందున మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని.
  • ఒక్కరోజులో 4.4 లక్షలకుపైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ.
  • దేశంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 4,67,882.
  • అత్యంత సత్వర కోవిడ్‌-19 పరీక్ష నిర్వహణ సౌకర్యాలను రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి.

ఒక్క‌రోజులో 36,000 మంది కోలుకోగా సరికొత్త రికార్డు; ప్రస్తుత-కోలుకున్న కేసుల మధ్య 4 లక్షలు దాటిన వ్యత్యాసం; 64 శాతానికి చేరువగా కోలుకునేవారి జాతీయ సగటు

దేశంలో నిన్న ఒకేరోజు కోవిడ్‌-19 నుంచి అత్యధిక సంఖ్యలో రోగులు కోలుకున్నారు. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 36,145 కోలుకుని ఇళ్లకు వెళ్లడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 8,85,576కు చేరింది. అదేవిధంగా కోలుకునేవారి జాతీయ సగటు 64 శాతానికి చేరువగా ఇవాళ 63.92గా ఉంది. దీన్నిబట్టి వ్యాధి నయమయ్యేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ప్రస్తుత కేసులకన్నా (4,67,882) కోలుకునే కేసులు 1.89 రెట్లు అధికం కావడంతో రెండింటి మధ్య అంతరం 4 లక్షలు దాటి నేడు 4,17,694కు చేరింది. ఇక దేశంలో తొలిసారిగా రోగ నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా 4.40 లక్షల స్థాయిని అధిగమించి గత 24 గంటల్లో 4,42,263గా నమోదైంది. దీంతో ప్రతి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు పరీక్షల స‌గ‌టు 11,805కు పెరిగింది. త‌ద‌నుగుణంగా దేశ‌వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 1,62,91,331 న‌మూనాల‌ను ప‌రీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641385

అత్యంత సత్వర కోవిడ్‌-19 పరీక్ష సౌకర్యాలను జూలై 27న ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 27వ తేదీన మూడు చోట్ల ‘అత్యంత సత్వర కోవిడ్‌-19 నిర్ధారణ’ (High throughput) పరీక్ష సౌకర్యలను దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభిస్తారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యం పెరిగి, సత్వర రోగ నిర్ధారణ, చికిత్సలద్వారా ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ మేరకు సదరు అత్యాధునిక సదుపాయాలను వ్యూహాత్మకంగా నోయిడాలోని “ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రీసెర్చి; ముంబైలోని “ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చి ఇన్‌ రీప్రొడక్టివ్‌ హెల్త్‌; కోల్‌కతాలోని “ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌”ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిద్వారా రోజుకు 10,000 వంతున నమూనాలను పరీక్షించవచ్చు. దీనవల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం తొలగిపోవడంతోపాటు ప్రయోగశాలల సిబ్బంది వైద్య పరికరాలవల్ల వ్యాధిబారిన పడే ముప్పు తొలగిపోతుంది.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641410

మన్ కీ బాత్ రెండోవిడత 14వ సంచికలో భాగంగా 26.07.2020న ప్రధానమంత్రి ప్రసంగం

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం... ఇవాళ జూలై 26... ఇదొక ప్రత్యేకమైన రోజుఇది కార్గిల్ విజయ దినోత్సవం నిర్వహించుకునే రోజు. సరిగ్గా 21 సంవత్సరాల కిందట ఇదే రోజున కార్గిల్ యుద్ధంలో మన సైన్యం విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఇక

కొన్ని నెలలుగా దేశమంతా ఒక్కటై కరోనాపై పోరాడుతున్న తీరు నాలోని చాలా భయాలను పటాపంచలు చేసింది. నేడు ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కోలుకునేవారి శాతం చాలా మెరుగ్గా ఉంది. అలాగే కరోనా సంక్షోభం నేపథ్యంలో మరణాల శాతం కూడా చాలా తక్కువగా నమోదువుతోంది. ఒక్క ప్రాణాన్నయినా కోల్పోవడం మనకెంతో బాధాకరం.. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే భారత్‌ లక్షలాది ప్రాణాలను నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది. కానీ, మిత్రులారా... కరోనా ముప్పు తొలగిపోవడానికి మనమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. చాలా చోట్ల ఇది వేగంగా వ్యాపిస్తోంది. అందువల్ల మనం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విజృంభించిన తొలినాళ్ల తరహాలోనే ఇప్పటికీ ఈ వైరస్‌ ప్రాణాంతకమనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టే మనం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలి. ఆ మేరకు ఫేస్ మాస్క్ ధరించడం లేదా ముక్కు, నోరు కప్పేవిధంగా టవలు లేదా గావంచాను కప్పుకోడం రెండు గజాల దూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, ఎక్కడా ఉమ్మకుండా ఉండటం, పరిశుభ్రత-పారిశుద్ధ్యంపై పూర్తి జాగ్రత్త వహించడం వంటివే కరోనానుంచి మనను రక్షించే దివ్యాస్త్రాలు. మాస్కు అసౌకర్యం కలిగిస్తుంటే వెంటనే... ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటపుడు తొలగించాలనిపిస్తుంది. దీంతో ఎప్పుడైతే అది అవసరమో సరిగ్గా ఆ సమయంలోనే తొలగిస్తున్నాం. అలాంటి సందర్భం మీకు ఎదురైనప్పుడు గంటలకొద్దీ సమయం మాస్కులు, ఇతర రక్షణ సామగ్రి ధరించి రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు వంటి కరోనా యోధులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వారు మన ప్రాణరక్షణ కోసం ఎంతో శ్రద్ధగా పనిచేస్తూ కొన్నిసందర్భాల్లో ఏకధాటిగా 8 నుంచి 10 గంటలపాటు అదే స్థితిలో కర్తవ్యం నిర్వర్తించడాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి....”

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641316

క‌రోనా వైర‌స్ రోగుల‌పై చిన్న‌చూపు- కోవిడ్ మృతుల గౌరవప్రద అంత్యక్రియ‌ల‌కు ఆటంకం క‌ల్పించే సంఘ‌ట‌న‌ల‌పై ఉప రాష్ట్రప‌తి ఆవేద‌న

కోవిడ్-19 రోగుల‌ను చిన్న‌చూపు చూస్తున్న సంఘ‌ట‌న‌లతోపాటు వైర‌స్ బారిన‌ప‌డి మ‌ర‌ణించిన వారి గౌర‌వ‌ప్ర‌ద‌మైన అంత్య‌క్రియ‌లకు ఆటంకాలు సృష్టిస్తున్న‌‌ ఘ‌ట‌న‌లపై ఉప‌ రాష్ట్ర‌ప‌తి శ్రీ ఎం.వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంఘటనలు అవాంఛనీయమని, స్థానిక ప్ర‌జ‌లతోపాటు స‌మాజమంతా ఇలాంటివి పున‌రావృతం కాకుండా చూడాల‌ని కోరారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ద్వారా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. వివక్షపూరిత ధోర‌ణిపై పోరాటం నేటి తక్షణావసరం... ఇటువంటిదాన్ని మొగ్గ‌లోనే తుంచేయాలి. లేకపోతే ఇది న‌కిలీ వార్త‌లు, తప్పుదోవ పట్టించే స‌మాచారంకన్నా విష‌పూరిత‌ం కాగలదుఅని పేర్కొన్నారు. కోవిడ్-19 రోగుల‌ స్థితిని అవగాహనతో అర్థం చేసుకోవాలని, వారిప‌ట్ల కరుణ చూపాల‌ని అన్నారు. అలాగే కరోనా వైరస్‌కు ఏ ఒక్కరూ అతీతం కారు... క‌నిపించ‌ని ఈ మహమ్మారి ఎవ‌రికైనా సోక‌వ‌చ్చున‌న్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలిఅని స్పష్టం చేశారు. కోవిడ్-19 మృతుల అంత్య‌క్రియ‌ల‌కు స్థ‌లం నిరాకరించడం వంటి సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ- ఇలాంటివి ఎంత మాత్రం ఆమోద‌యోగ్య‌ం కావ‌ని, మృతుల కుటుంబాలకు అండ‌గా నిలిచే భార‌త స‌నాత‌న సంప్ర‌దాయాల‌కు పూర్తిగా విరుద్ధ‌మని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజారోగ్య అధికారులు, పత్రికా-ప్రసార మాధ్యమాలు ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మంద్వారా క‌రోనా వైర‌స్‌గురించి, దాని వ్యాప్తి ముప్పు సంబంధిత వాస్త‌వాల‌తో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని శ్రీ నాయుడు పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1641379

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ రాజధాని ప్రాంతంలో ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షల తర్వాత 35 మందికి వ్యాధి సోకినట్లు ప్రతిస్పందన బృందాలు నిర్ధారించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవేశించే ట్రక్ డ్రైవర్లు పాటించాల్సిన విధివిధానాలపై ఇటానగర్‌ రాజధాని ప్రాంతా డిప్యూటీ కమిషనర్ మార్గదర్శకాలను జారీచేశారు. ఈ మేరకు వ్యాధి సోకలేదని తేలిన ధ్రువీకరణగల (ఐదురోజులలోపు పొందినదై ఉండాలి) డ్రైవర్లు మాత్రమే రాష్ట్రంలోని అనుమతించబడతారు.
  • మణిపూర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరేన్ సింగ్ నేతృత్వంలోని కోవిడ్‌-19 రాష్ట్ర సంప్రదింపుల కమిటీ సమావేశం మణిపూర్‌లో దిగ్బంధాన్ని కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం “మణిపూర్ ఎపిడెమిక్ డిసీజెస్ (కోవిడ్ -19 మార్గదర్శకాల అమలు) రెగ్యులేషన్-2020”ని అమలు చేయనుంది. ఈ చట్టం కింద దిగ్బంధం నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.1,000 వంతున జరిమానా విధిస్తారు.
  • మిజోరం: రాష్ట్రంలో 10మంది కోలుకోగా, మొత్తం కేసులు 361కి చేరగా 168 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 193 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 50 కొత్త కేసులు నమోదవగా వీటిలో కొహిమా 28, మోన్‌ 13, దిమాపూర్ 9 వంతున ఉన్నాయి. ప్రస్తుతం నాగాలాండ్‌లో మొత్తం కేసులు 1339కాగా, 794 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా 541 మంది వ్యాధినుంచి కోలుకున్నారు.
  • సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరగడం వల్ల 2020 ఆగస్టు 1 వరకు దిగ్బంధం పొడిగిస్తూ సిక్కిం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
  • కేరళ: రాష్ట్రంలో మరో ఐదుగురు మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 64కు చేరింది. మరోవైపు చాలా జిల్లాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోళికోడ్‌ జిల్లాలో ఆదివారాల్ల సంపూర్ణ దిగ్బంధం విధిస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీచేసింది. పరిచయస్థులద్వారా కేసుల్లో పెరుగుదల దృష్ట్యా నియంత్రణ వ్యూహంలో భాగంగా రేపటినుంచి కొళ్లంలో వాహన రాకపోకలను పరిమితంగా మాత్రమే అనుమతిస్తారు. ఇక కేరళలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 1,103 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 838 స్థానిక సంక్రమణ కేసులు కాగా, రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 1,049 మంది వ్యాధినుంచి కోలుకోవడం విశేషం. ప్రస్తుతం 9,420 మంది చికిత్స పొందుతుండగా 54 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్-19 కేసుల సంఖ్య ఆగస్టు చివరికల్లా 6000కు పెరుగుతుందని, మరిన్ని పడకలు అవసరమని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. ఇక తమిళనాడులో ఈ నెల చివరి ఆదివారంతో  దిగ్బంధం ముగియడంతో ఆరోగ్యసిబ్బంది శుభ్రపరిచే పనులు కొనసాగించారు. దీంతో ఆరోగ్య సంరక్షణ సేవలుసహా అత్యవసర సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు పౌర సంస్థల సిబ్బంది ఇంటింటి సర్వేలతో ఫ్లూ వంటి వ్యాధి లక్షణాలున్నవారిని గుర్తిస్తున్నారు. ఇక వ్యాధినుంచి కోలుకున్నవారిలో చాలా కొద్దిమంది స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తున్నారు. చెన్నైలో ఇప్పటిదాకా 85,000 మంది కోలుకోగా వారిలో కేవలం 15మంది మాత్రమే ముందుకు రావడం గమనార్హం. రాష్ట్రంలో నిన్న 6,988 కొత్త కేసులు, 89 మరణాలు నమోదవగా, మొత్తం కేసులు 2,06,737కు పెరిగాయి. ఇక మరణాల సంఖ్య 3,409గా ఉంది.
  • కర్ణాటక: బెంగళూరులో కోవిడ్-19 కోసం 36 రైల్వే పోలీసులకు వ్యాధి నిర్ధారణ అయింది. నైరుతి రైల్వే జోన్‌ ఉద్యోగులలో మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 5కు పెరిగింది. కర్ణాటకలో కోవిడ్ సంక్షోభానికి వరదలు తోడయ్యాయి. దీంతో వరదబాధితులకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం అధికారులకు సవాలుగా మారింది. మరోవైపు కర్ణాటకలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ మేరకు నిన్న 5,072 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 90,942కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు: 55,388, మరణాలు 1796గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19పై పోరులో భాగంగా అవసరమైన ఆరోగ్య సేవలతో సంధానం కోసం 'కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్' అనే యాప్‌ను ఉపయోగించాలని పౌరులను కోరారు. కోవిడ్ ఆస్పత్రులు, నిర్బంధవైద్య కేంద్రాలు, పరీక్ష కేంద్రాలు, రోజువారీ మీడియా బులెటిన్‌ల సంబంధిత వివరాలను ఈ యాప్‌లో పొందవచ్చు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో అదనంగా 10వేల వెంటిలేటర్లను అమర్చనున్నారు; కాగా, ప్రస్తుతం 22,500 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల నడుమ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఆగస్టు 2వరకు దిగ్బంధం పాటించనున్నారు. రాష్ట్రం 2020-21 విద్యా సంవత్సర కేలెండర్‌ను విడుదల చేసింది. పాఠశాలల్లో జూలై 27నుంచి ప్రవేశాలు ప్రారంభమవుతాయి. కాగా, సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో నిన్న 7813 కొత్త కేసులు, 52 మరణాలు నమోదవగా మొత్తం కేసులు 88,671కి పెరిగాయి. వీటిలో 44,431 యాక్టివ్‌ కేసులుండగా మరణాల సంఖ్య 985కి చేరింది.
  • తెలంగాణ: ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణాన్ని వేగిరపరచాలని వైద్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో తమ సేవలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు(ఆర్‌ఎంపీ), ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ప్రోగ్రాం (పిఎమ్‌పి) వైద్యులు ఇవాళ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను కలుసుకుని వెల్లడించారు. తెలంగాణలో శనివారం 1593 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 998మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 641 ఒక్క జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 54,059; యాక్టివ్‌ కేసులు: 12,264; మరణాలు: 463; డిశ్చార్జి అయినవి: 41,332గా ఉన్నాయి.
  • పంజాబ్: కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల నుంచి ప్రవేశం, పునఃప్రవేశం, ట్యూషన్ ఫీజులు వసూలు చేయవని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు.
  • హర్యానా: జాతీయ క్రీడా రంగంలో హర్యానా రాష్ట్ర సామర్థ్యాన్ని, అది పోషిస్తున్న పాత్రను కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు కొనియాడారు. రాష్ట్రంలోని పంచకులలో ‘ఖేలో ఇండియా’లో భాగంగా 4వ విడత యూత్ గేమ్స్-2021' నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్-19 సంక్షోభంవల్ల 'ఖేలో ఇండియా యువజన క్రీడల-2020' ఈ ఏడాది నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి చెప్పారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌19 పరిస్థితిపై చర్చించేందుకు గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ చండీగఢ్‌లోని పీజిఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ జగత్ రామ్‌తో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ మహమ్మారి నియంత్రణ దిశగా ఆయన సలహాలు కోరారు. అంతేకాకుండా పిజీజిఐఎంఆర్ నుంచి ఒక బృందాన్ని తమ రాష్ట్రంలోని కోవిడ్‌ రక్షణ కేంద్రాల పరిశీలనకు పంపాల్సిందిగా కోరారు. ఈ బృందం రాష్ట్ర వైద్యులతో చర్చించి, పరిస్థితి మెరుగుపరచడంపై నివేదిక ఇచ్చేవిధంగా చూడాలని కోరారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,251 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య  3,66,368కి చేరింది. మహారాష్ట్రంలో ఇటీవల రోజుకు 9,000కుపైగా కేసులు నమోదవుతున్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో శనివారం అత్యధికంగా 1,081 కొత్త కేసులతో మొత్తం కేసులు 54,712కు చేరాయి. కాగా, సూరత్‌లో 11 మందిసహా రాష్ట్రంలో 22మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 2,305కు పెరిగింది. గుజరాత్‌లో నిన్న 782మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న కేసుల సంఖ్య 39,612కు పెరిగిందని వెల్లడించింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షపై ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు ప్రయోగశాలలు 24 గంటల్లో ఫలితాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే రోగ నిర్ధారణకు వచ్చినవారు ఆర్టీ-పీసీఆర్ యాప్‌లో ఆధార్ కార్డ్ నంబరును సమర్పించడం కూడా తప్పనిసరి చేసింది. కాగా, రాష్ట్రంలో రోజుకు 40,000 నమూనాల పరీక్ష సామర్థ్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

ImageImage

****


(Release ID: 1641441)