ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా గ్లోబల్ వీక్ -2020 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
09 JUL 2020 3:10PM by PIB Hyderabad
వివిధ రంగాలకు చెందిన విశిష్ఠ అతిథులకు, నమస్తే,
భారతదేశ శుభాభినందనలు. ఇండియా ఇన్‌కార్పొరేషన్ గ్రూప్ ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఇండియా ఇన్ కార్పొరేషన్ చేసిన అద్బుత కృషిలో భాగమే ప్రస్తుత ఈవెంట్. మీ ఈవెంట్లు భారత్‌లోని అవకాశాలను అంతర్జాతీయ సమాజం ముందుంచడానికి ఉపయోగపడ్డాయి. మీరు ఇండియా, యుకె ల మధ్య సంబంధాలను మరింత బలపడేట్టు చేయడానికి సహాయపడ్డారు. ఈ ఏడాది ఈవెంట్ దీని విస్తృతిని పెంచుకుని ఇతర భాగస్తులకు కూడా చేరడడం నాకు ఆనందం కలిగిస్తోంది.
ఇందుకు మరోసారి కృతజ్ఞతలు. వచ్చే ఏడాది, మీరు సెంటర్ కోర్టులో ఉండి వింబుల్డన్‌ను ఆస్వాదించే అవకాశం కూడా లభిస్తుందని ఆశిస్తాను.
మిత్రులారా,
ప్రస్తుత సమయంలో , తిరిగి కోలుకోవడం గురించి మాట్లాడుకోవడం సహజం. అలాగే అంతర్జాతీయంగా తిరిగి కోలుకోవడాన్ని ఇండియాను, ముడిపెట్టడం కూడా సహజమే. అంతర్జాతీయంగా తిరిగి కోలుకునే కథనంలో భారత దేశం కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసం ఉంది.
ఇందులో మొదటిది భారతీయ ప్రతిభ. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రతిభకుగల శక్తి పాత్రను మీరు చూశారు.ఇందులో భారతీయ ప్రొఫెషనల్సు, డాక్టర్లు, నర్సులు, బ్యాంకర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, కష్టపడి పనిచేసే మన శ్రామికులు ఉన్నారు. మనం భారతీయ టెక్నాలజీ పరిశ్రమ, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. వారు దశాబ్దాలుగా మార్గనిర్దేశకులుగా ఉన్నారు.భారతదేశం , ప్రతిభకు ఒక పవర్ హౌస్‌గా ఉంది. ఇది తన వంతు పాత్రను పోషించడానికి, నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. ఉభయమార్గాలలో పరస్పర సహకారం ఎంతో ప్రయొజనకరమైనదిగా చెప్పుకోవచ్చు.
మిత్రులారా,
ఇక రెండవ అంశం, సంస్కరణకు, తిరిగి కోలుకోవడానికి భారతదేశానికి గల సామర్ధ్యం. భారతీయులు సహజంగానే సంస్కర్తలు! భారతదేశం తనకు ఎదురైన ప్రతి సవాలును, అది సామాజికమైనదైనా లేక ఆర్థిక పరమైన దైనా అధిగమిస్తూ వచ్చిన విషయాన్ని చరిత్ర రుజువుచేసింది. ఇండియా దీనిని సంస్కరణ, పునరుజ్జీవన స్ఫూర్తితోనే చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగుతున్నది.
మిత్రులారా,
ఒకవైపు ఇండియా, అంతర్జాతీయ మహమ్మారిపై గట్టి పోరాటం చేస్తున్నది. ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టిపెడుతూనే, మనం దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంపైనా దృష్టిపెడుతున్నాం. ఇండియా తిరిగి కోలుకోవడం గురించి మాట్లాడడమంటే, తగిన రక్షణతో కూడిన కోలుకోవడం, కరుణతో కోలుకోవడం, అటు పర్యావరణ పరంగా ,ఇటు ఆర్థిక పరంగా సుస్థిరంగా ఉండేలా కోలుకోవడం.
మనం భారతదేశంలో ప్రతి ఒక్కరం ప్రకృతి మాతను ఆరాధించే సంస్కృతికి చెందిన వాళ్ళం. ఇండియాలో భూమిని మాతృమూర్తిగా, మనమంతా భూమాత బిడ్డలుగా భావిస్తాం.
మిత్రులారా,
గడచిన ఆరు సంవత్సరాలలో, ఇండియా పలు రంగాలలో గొప్ప ప్రగతిని సాధించింది. అందరికీ ఆర్థికసేవలు అందుబాటులోకి వచ్చాయి, రికార్డు స్థాయిలో గృహ , మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగింది, సరళతర వాణిజ్యం, జిఎస్‌టి తో సహా కీలక పన్ను సంస్కరణలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం -ఆయుష్మాన్ భారత్ ను ప్రారంభించడం వంటివి ఇందులో కొన్ని. ఈప్రయోజనాలు తదుపరి దశ అభివృద్ధి చర్యలకు పునాదిని ఏర్పరచాయి.
మిత్రులారా,
అసాధ్యమనుకున్న దానిని సుసాద్యం చేసే స్ఫూర్తి భారతీయులలో ఉంది. ఈ విషయంలో వింత ఏమీ లేదు. ఇండియాలో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సంబంధించిన సంకేతాలు కనబడుతున్నాయి. ప్రస్తుత మహమ్మారి సమయంలో మన పౌరులకు మనం సహాయాన్ని అందించాం. అలాగే లోతైన నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం. మనం ఆర్థిక వ్యవస్థను మరింత ఉత్పాదకతతో కూడిన, పెట్టుబడులకు అనుకూలమైన , పోటీతత్వం కలిగినదిగా తీర్చిదిద్దుతున్నాం.
మన సహాయ ప్యాకేజ్ ఎంతో మేలైనది. ఇది ఎక్కువమంది పేదలకు ఎంతో సాయం అందించేందుకు నిర్దేశించినది. ఇందుకు సాంకేతికతకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రతి పైసా లబ్దిదారులకు నేరుగా చేరింది. పేదలకు అందించిన సహాయంలో ఉచిత వంటగ్యాస్, బ్యాంకు ఖాతాలలో నగదు జమ, లక్షలాది మంది ప్రజలకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్‌లాక్ ప్రకటించిన వెంటనే లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పించేలా, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాపనుల కార్యక్రమాన్నిమేము ప్రారంభించాం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజితం చేయడమే కాక, గ్రామీణ ప్రాంతాలలో మేలైన మౌలికసదుపాయాలను కల్పించడానికి దోహదపడనుంది.
మిత్రులారా,
ప్రపంచంలోని అత్యంత ఓపెన్ ఎకానమీలలో భారతదేశం ఒకటిగా ఉంటూ వస్తున్నది.మనం అన్ని అంతర్జాతీయ కంపెనీలు భారతదేశానికి వచ్చి తమ ఉనికిని తెలియజేసేందుకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాం. ఇవాళ భారతదేశం అందిస్తున్నటువంటి అవకాశాలను కేవలం కొద్ది దేశాలు మాత్రమే ఆఫర్ చేస్తాయి. భారతదేశంలోని వివిధ సన్‌రైజ్ సెక్టార్లలో ఎన్నో అవకాశాలున్నాయి. వ్యవసాయ రంగంలో మనం చేపట్టిన సంస్కరణలు, నిల్వ, లాజిస్టిక్‌లలో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. మన రైతుల కఠోర శ్రమకు సంబంధించిన రంగంలో నేరుగా పెల్టుబడి పెట్టేందుకు తరలి రావలసిందిగా కోరుతూ ఇన్వెస్టర్లకు మనం తలుపులు తెరుస్తున్నాం.
మిత్రులారా,
మనం ఎంఎస్ఎంఇ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చాం. అభివృద్దిచెందుతున్న ఎం.ఎస్.ఎం. ఇ రంగం పెద్ద పరిశ్రమలకు చేదోడుగా ఉండగలదు. రక్షణ రంగంలో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఎఫ్.డిఐ నిబంధనలు సడలించడంతో , ప్రపంచంలోని భారీ సైనిక వ్యవస్థలలో ఒకటైన భారత్ ఇక్కడికి వచ్చి,తన కోసం ఉత్పత్తులు చేయాల్సిందిగా కోరుతోంది. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే దీని అర్థం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రజల ప్రయోజనం కోసం మరింతగా వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి తీసుకురావడం. ఇండియాలోని టెక్నాలజీ, స్టార్టప్ రంగం ఎంతో అద్భుతంగా ఉంది. డిజిటల్ పరంగా సాధికారత కలిగిన లక్షలాదిమంది గల మార్కెట్ , ఆకాంక్షలతో కూడిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీరికోసం మీరు ఎలాంటి ఉత్పత్తులు తయారు చేయవచ్చో ఊహించుకోండి.
మిత్రులారా,
భారతదేశపు ఫార్మా పరిశ్రమ కేవలం భారతదేశానికే కాక, మొత్తం ప్రపంచానికే ఒక గొప్ప ఆస్తిగా ప్రస్తుత మహమ్మారి మరోసారి రుజువుచేసింది. ఇది మందుల వ్యయాన్ని, ప్రత్యేకించి వర్దమాన దేశాల మందుల వ్యయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ బాలలకు సంబంధించి మూడింట రెండువంతుల వాక్సిన్ అవసరాలను తీర్చడానికి ఇండియాలో తయారయ్యే వాక్సిన్‌లే కారణం. ఇవాళ్టికికూడా మన కంపెనీలు కోవిడ్ -19 వాక్సిన్ అభివృద్ది, ఉత్పత్తి కి సంబంధించి సాగుతున్న అంతర్జాతీయ కృషిలో చురుకుగా పాల్గొంటున్నాయి. కోవిడ్ -19 కు వాక్సిన్ కనుగొన్నట్టయితే , దాని అభివృద్ధి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచడంలో ఇండియా పాత్ర కీలకంగా ఉంటుందని నేను తప్పకుండా చెప్పగలను.
మిత్రులారా,
130 కోట్ల మంది భారతీయులు, ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునిచ్చారు. అంటే స్వావలంబిత భారత్, ఆత్మనిర్భర భారత్ దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని అంతర్జాతీయ సరఫరా చెయిన్‌తో మిళితం చేస్తుంది. ఆత్మనిర్భర భారత్ అంటే, మనకు మనం పరిమితం కావడం కానీ, ప్రపంచానికి తలుపులు మూయడం కానీ కాదు. ఇది స్వీయ సమృద్ది, స్వీయ ఉత్పాదకతకు సంబందించినది. మనం సమర్ధత, సమానత్వం, క్లిష్టపరిస్థితులను సైతం ఎదుర్కొని తిరిగి కోలుకొనడాన్ని ప్రోత్సహించే విధానాలను అనుసరిస్తాం.
మిత్రులారా,
ఈ వేదిక, పండిట్ రవిశంకర్ 100వ జయంతి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నదని తెలిసి సంతోషిస్తున్నాను.ఆయన భారతీయ సంప్రదాయ సంగీత సౌందర్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళారు. ఇతరులను పలకరించే రూపాలలో ఒకటిగా నమస్తే అనేది ఎలా ప్రపంచవ్యాప్తమైందో మీరు చూశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగ, ఆయుర్వేద, సంప్రదాయ వైద్యాలకు ఎంతో ఆదరణ పెరగడం చూశాం. భారతదేశంపు సార్వజనిక ,శాంతియుత విలువలు మన బలం.
మిత్రులారా,
ప్రపంచం బాగుకోసం , సుసంపన్నతకోసం చేయగలిగినంత చేసేందుకు బారత్ సంసిద్ధంగా ఉంది. సంస్కరణలు చేపడుతూ , పనితీరు మెరుగుపరుచుకుంటూ, పరివర్తన చెందుతున్న దేశం ఇండియా. నూతన ఆర్థిక అవకాశాలను కల్పిస్తున్న దేశం ఇండియా. మానవీయత కేంద్రంగా, అన్ని వర్గాలనూ కలుపుకునే అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్న దేశం భారత దేశం.
ఇండియా మీ అందరి కోసం ఎదురుచూస్తున్నది.
నమస్తే
ధన్యవాదాలు
****
(Release ID: 1637649)
Visitor Counter : 297
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam