ప్రధాన మంత్రి కార్యాలయం

రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ 90 వ పుట్టినరోజు వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం



Posted On: 27 JUN 2020 11:58AM by PIB Hyderabad

గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్, గౌరవనీయులైన ఫాథర్స్ మరియు మార్ థోమా చర్చి యొక్క విశిష్ట సభ్యులారా !

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అత్యంత గౌరవనీయమైన డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ 90 వ పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాము. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మంచి ఆరోగ్యంతో, సుదీర్ఘ కాలం జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మన సమాజంకోసం, దేశ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ముఖ్యంగా పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత పట్ల ఎక్కువగా మక్కువ చూపించారు.

మిత్రులారా !

క్రీస్తు ప్రభువు ముఖ్య శిష్యుడైన సెయింట్ థామస్ యొక్క గొప్ప ఆదర్శాలతో మార్ థోమా చర్చి సన్నిహిత సంబంధం కలిగి ఉంది. భారతదేశం ఎల్లప్పుడూ అనేక వనరుల నుండి ఆధ్యాత్మిక ప్రభావాలకు లోనై ఉంటుంది. సెయింట్ థామస్ యొక్క రచనలు మరియు అతనిని అనుసరించి, భారతీయ క్రైస్తవ సమాజం ఎంతో ప్రభావితమైంది. సెయింట్ థామస్‌తో మేము వినయాన్ని పంచుకున్నాము. “వినయం అనేది ఒక ధర్మం, మంచి పనులలో అది ఎల్లప్పుడూ ఫలవంతమవుతుంది”, అని ఆయన సరిగ్గా చెప్పారు. ఈ వినయం యొక్క స్ఫూర్తితోనే మార్ తోమా చర్చి మన తోటి భారతీయుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేసింది. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో వారు అలా చేశారు. సెయింట్ థామస్ అపారమైన జ్ఞానంతో ఆశీర్వదించబడ్డాడు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మార్ థోమా చర్చి ఒక కీలక పాత్ర పోషించింది. జాతీయ సమైక్యత కోసం పనిచేయడంలో ఈ చర్చి ముందంజలో ఉంది.

ఈ చర్చి ఎమర్జెన్సీ సమయంలో పోరాడింది. మార్ థోమా చర్చి భారతీయ విలువలతో దృఢంగా పెనవేసుకున్నదన్న విషయం ఎంతో గర్వించదగినది. చర్చి యొక్క సహకారం జాతీయ స్థాయిలో కూడా గుర్తించబడింది. మార్ థోమా చర్చి యొక్క మాజీ మెట్రోపాలిటన్, ఫిలిపోస్ మార్ క్రిసోస్టోమ్ కు 2018 లో పద్మ భూషణ్ ప్రదానం చేశారు. ఆయన చాలా మందికి స్ఫూర్తినిచ్చారు.

మిత్రులారా !

ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచం బలంగా పోరాడుతోంది. కోవిడ్-19 అనేది కేవలం శారీరక అనారోగ్యం మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితాలకు ముప్పుగా పరిణమించింది. ఇది అనారోగ్యకరమైన జీవనశైలికి కూడా మన దృష్టిని తీసుకువెళ్తుంది. ఈ ప్రపంచవ్యాప్త మహమ్మారి ఇప్పుడు మొత్తం మానవాళికి వైద్యం చేయవలసిన అవసరాన్ని సూచిస్తోంది. మన గ్రహం లో మరింత సామరస్యాన్ని మరియు ఆనందాన్ని పొందటానికి సాధ్యమయ్యే ప్రతి పనిని చేద్దాం.

మిత్రులారా !

మన కరోనా యోధులచే ఆధారితమైన భారతదేశం, కోవిడ్-19 తో గట్టిగా పోరాడుతోందన్న విషయం మీకు తప్పక సంతోషాన్ని కలిగిస్తుంది. భారతదేశంలో వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, ఈ సంవత్సరం ప్రారంభంలో కొంతమంది ఊహించారు. కానీ, సకాలంలో లాక్ డౌన్ విధించడం వల్ల, ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల ఫలితంగానూ, ప్రజల సహకారం కారణంగానూ, భారతదేశం అనేక ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. భారతదేశ రికవరీ రేటు కూడా పెరుగుతోంది.

కోవిడ్ లేదా ఇతరత్రా ఏ కార్యంగా నైనా, ప్రాణనష్టం అనేది చాలా దురదృష్టకరం. అయితే, భారత దేశంలో కోవిడ్ కారణంగా మరణాల రేటు మిలియన్ల మందిలో కేవలం 12 మరణాలుగా ఉంది. సందర్భంలో చెప్పాలంటే, ఇదే మరణాల రేటు ఇటలీ లో మిలియన్ల మందికి 574 మరణాలుగా ఉంది. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల గణాంకాలు కూడా భారతదేశం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. 85 కోట్ల మందికి నివసిస్తున్న లక్షలాది గ్రామాలలో ఇంతవరకూ ఎవరూ కరోనా వైరస్ బారిన పడలేదు.

మిత్రులారా !

ప్రజలు నడిపించిన పోరాటం ఇప్పటివరకు మంచి ఫలితాలను ఇచ్చింది కదా అని, మన రక్షణను తగ్గించగలమా? లేదు, అలా ఎన్నటికీ తగ్గించ కూడదు. నిజానికి, ఇప్పుడు, మనం, మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడం, సామాజిక దూరం, రెండు గజాల దూరం (దో గజ్ కీ దూరీ), రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వంటి నిబంధనలను / జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.

ఇదే సమయంలో, 130 కోట్ల మంది భారతీయుల ఆర్థికాభివృద్ధి, శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. వాణిజ్యం, వ్యాపారం ముందుకు సాగాలి. వ్యవసాయం వృద్ధి చెందాలి. గత కొన్ని వారాలలో, భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కు సంబంధించిన స్వల్పకాలిక మరియు దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించింది. సముద్ర జలాల నుండి అంతరిక్షం వరకు, పొలాల నుండి కర్మాగారాల వరకు ప్రజలకు అనుకూలమైన మరియు దేశాభివృద్ధి కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

స్వావలంబన భారతదేశం కోసం "ఆత్మ నిర్భర్ భారత్" పిలుపు ప్రతి భారతీయునికి ఆర్థిక బలం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. ఒక నెల క్రితం, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ పథకం, మన మత్స్య పరిశ్రమ రంగాన్ని మార్చబోతోంది. ఈ పథకం, ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఈ రంగాన్ని మరింతగా పెంపొందించనుంది. ఎగుమతి ఆదాయాన్ని పెంచడం మరియు యాభై ఐదు లక్షల మందికి ఎక్కువ ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో పాటు విలువలను బలోపేతం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ పథకం ద్వారా కేరళలోని నా మత్స్య సోదర, సోదరీమణులు మరింతగా లాభపడతారనే నమ్మకం నాకు ఉంది.

మిత్రులారా !

అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఈ సంస్కరణలు అంతరిక్ష ఆస్తులు మరియు కార్యకలాపాల యొక్క అధిక వినియోగాన్ని నిర్ధారిస్తాయి. డేటా మరియు టెక్నాలజీ మరింతగా అందుబాటులోకి వస్తాయి, తద్వారా వినియోగం మెరుగవుతుంది. కేరళలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాలా మంది యువకులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై చాలా ఆసక్తి కనబరుస్తున్న విషయాన్ని నేను గమనించాను. ఈ సంస్కరణలతో వారు ప్రయోజనం పొందుతారు.

మిత్రులారా !

మన ప్రభుత్వం ఎల్లప్పుడూ సున్నితత్వంతో, భారతదేశాన్ని అభివృద్ధి దిశగా మార్చడానికి దీర్ఘకాలిక దృష్టితో మార్గనిర్దేశం చేస్తుంది. ఢిల్లీలోని సౌకర్యవంతమైన ప్రభుత్వ కార్యాలయాల నుండి కాక, క్షేత్ర స్థాయిలో ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాలతో మేము నిర్ణయాలు తీసుకున్నాము. ఈ స్ఫూర్తితోనే ప్రతి భారతీయుడు ఒక బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్నాడు. అదే విధంగా, 8 కోట్లకు పైగా కుటుంబాలకు పొగ లేని వంటశాలలు అందుబాటులోకి వచ్చాయి. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడానికి 1.5 కోట్లకు పైగా గృహాలు నిర్మించడం జరిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం "ఆయుష్మాన్ భారత్" ఇండియా లో అమలులో ఉంది. ఈ ప్రధమం కింద, ఇంతవరకు, కోటి మందికి పైగా ప్రజలు నాణ్యమైన చికిత్స పొందారు. పేద ప్రజల కోసం, వారు ఎక్కడ ఉన్నవారికి, అక్కడే సహాయపడటానికి మేము "ఒక దేశం - ఒక రేషన్ కార్డు" పథకాన్ని తీసుకువస్తున్నాము. మధ్యతరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడానికి మేము అనేక కార్యక్రమాలను తీసుకువచ్చాము. రైతుల కోసం, మేము ఎం.ఎస్.పి. ని పెంచి, వారికి సరైన ధర లభించేలా చూసుకున్నాము. ఈ రంగాన్ని మధ్య వర్తుల బారి నుండి రక్షించ గలిగాము.

మహిళల కోసం, వివిధ పథకాల ద్వారా వారి ఆరోగ్యం పై మేము తగిన శ్రద్ధ తీసుకుంటున్నాము. ప్రసూతి శలవుల పొడిగింపు వల్ల వారి జీవనోపాధి మార్గం రాజీపడకూడదు. భారత ప్రభుత్వం విశ్వాసం, లింగం, కులం, మతం లేదా భాష మధ్య వివక్ష చూపదు. ‘భారత రాజ్యాంగం’ స్ఫూర్తి తో, 130 కోట్ల మంది భారతీయులను శక్తివంతం చేయాలనే కోరిక తో మేము మార్గనిర్దేశం చేయబడ్డాము.

మిత్రులారా !

సమైక్యత గురించి పవిత్ర బైబిల్, విస్తృతంగా తెలియజేస్తుంది. ర్యాంకుల్లో చేరడానికి, మన దేశం యొక్క పురోగతి కోసం కలిసి పనిచేయడానికి ఇది సరైన సమయం. మన చర్యలు జాతీయ అభివృద్ధికి ఎలా దోహదపడతాయి? అనే దాని గురించి ఆలోచించండి. మేము స్థానికంగా ఉత్పత్తి చేస్తాము మరియు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాము, అని భారతదేశం ఈ రోజున ఎలుగెత్తి చాటుతోంది. ఇది చాలా మంది గృహాల్లో సౌభాగ్య జ్యోతిని వెలిగిస్తుంది. మన దేశాన్ని బలోపేతం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మార్ థోమా చర్చి, దాని విలువలకు అనుగుణంగా తప్పనిసరిగా ఈ సందర్భానికి తగినట్టు వ్యవహరించి, రాబోయే కాలంలో భారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.

గౌరవనీయులైన రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ గారికి మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

అందరికి కృతజ్ఞతలు.

మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

 

*****

 



(Release ID: 1634783) Visitor Counter : 272