మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

హజ్ 2020 యాత్రకోసం ఇండియా నుంచి ముస్లింలు సౌదీ అరేబియాకు వెళ్లరు


కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది (1441 హిజ్రీ/ క్రీ. శ. 2020) ఇండియా నుంచి హజ్ యాత్రికులను పంపవద్దని
సౌదీ అరేబియా సూచించింది

హజ్ యాత్రకు వెళ్లదలచినవారు తమ దరఖాస్తుతో పాటు చెల్లించిన సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియ మొదలైందని ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు

దరఖాస్తుదారులు చెల్లించిన దరఖాస్తు రుసుమును నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారని మంత్రి వెల్లడించారు

మగ తోడు లేకుండా హజ్ యాత్రకు వెళ్ళడానికి 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, వారిని హజ్ 2020 దరఖాస్తు ఆధారంగా హజ్ 2021 యాత్రకు అనుమతిస్తామని ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు

"వారితో పాటు, మగతోడు లేకుండా హజ్ యాత్ర జరిపేందుకు కొత్తగా దరఖాస్తు చేసే వారిని కూడా వచ్చే సంవత్సరం హజ్ యాత్రకు అనుమతీస్తాం"- ముక్తార్ అబ్బాస్ నక్వీ

Posted On: 23 JUN 2020 1:28PM by PIB Hyderabad

       

          కరోనా మహమ్మారి వల్ల పొంచిఉన్న ముప్పు దృష్ట్యా అరేబియా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ ఏడాది (1441 హిజ్రీ/ క్రీ. శ. 2020) ఇండియా నుంచి ముస్లింలు ఎవరినీ హజ్ యాత్రకు పంపకూడదని నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముక్తార్ అబ్బాస్ నక్వీ మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో తెలిపారు.

 

          సౌదీ అరేబియా ప్రభుత్వ హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ మహమ్మద్ సాలెహ్ బిన్ తాహెర్ బిన్తెన్ నుంచి సోమవారం నుంచి తనకు ఫోన్ వచ్చిందని, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఇండియా నుంచి హజ్ యాత్రకు ఎవరినీ పంపవద్దని సూచించారని ఆయన తెలిపారు. కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాయని , సౌదీ అరేబియాపై కూడా దాని ప్రభావం పడిందని, దీని గురించి తామిద్దరం సుదీర్ఘంగా చర్చించామని మంత్రి తెలిపారు.

 

          ఈ ఏడాది హజ్ యాత్ర కోసం 2 లక్షల 13 వేల దరఖాస్తులు అందాయని శ్రీ నక్వీ తెలిపారు. దరఖాస్తు సొమ్ము తిరిగి ఇచ్చే పని మొదలైందని, దరఖాస్తు దారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తారని అన్నారు.

 

          మగ తోడు లేకుండా హజ్ యాత్రకు వెళ్ళడానికి 2300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని, వారిని హజ్ 2020 దరఖాస్తు ఆధారంగా హజ్ 2021 యాత్రకు అనుమతిస్తామని ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. వారితో పాటు, మగతోడు లేకుండా హజ్ యాత్ర జరిపేందుకు కొత్తగా దరఖాస్తు చేసే వారిని కూడా వచ్చే సంవత్సరం హజ్ యాత్రకు అనుమతీస్తామని మంత్రి వెల్లడించారు.

 

          ఇండియా నుంచి 2019లో 2 లక్షల మంది హజ్ యాత్రకు వెళ్లారని, ఆ యాత్రికులలో సగం మంది మహిళలని అన్నారు. మగ తోడు లేకుండా హజ్ యాత్ర జరిపేందుకు 2018లో ప్రభుత్వ అనుమతి ఇచ్చిన తరువాత 3040 మంది మహిళలు హజ్ యాత్రకు వెళ్లి వచ్చారు.

 

          ఈ ఏడాది చాలా తక్కువ సంఖ్యలో హజ్ యాత్రికులను అనుమతిస్తామని, ఇదివరకే సౌదీ అరేబియాకు వచ్చి చేరిన వారు ఏ జాతీయులైన వారిని యాత్రలో పాల్గొనేందుకు అనుమతిస్తామని, సురక్షితంగా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని నియమాల ప్రకారం యాత్రను నిర్వహిస్తారని సోమవారం రాత్రి సౌదీ అరేబియా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

 

*****



(Release ID: 1633728) Visitor Counter : 191