ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
యోగా దినోత్సవం... విశ్వమానవ సౌభ్రాత్రం - సంఘీభావం ప్రకటించే రోజు; కుటుంబ బంధాన్ని బలోపేతం చేసేది యోగా; కోవిడ్-19పై పోరులో
యోగా ద్వారా మన వ్యాధి నిరోధక వ్యవస్థకు ఉత్తేజం: ప్రధానమంత్రి
Posted On:
21 JUN 2020 9:43AM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంఘీభావం ప్రకటించే రోజుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. ఇది విశ్వమానవ సౌభ్రాత్రం చాటే రోజని పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచ ఆరోగ్య అత్యయిక స్థితి ఏర్పడినందువల్ల ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా వారి కుటుంబ సభ్యులందరితో కలసి ఇళ్లలోనే యోగాభ్యాసం చేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ విధంగా యోగ మనందర్నీ ఏకం చేసిందని ఆయన చెప్పారు. “మై లైఫ్ - మై యోగా” పేరిట నిర్వహించిన వీడియో బ్లాగ్ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడాన్నిబట్టి యోగాకు బహుళ ప్రాచుర్యం లభిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. “మనమంతా ఈ రోజున భారీ జనసమీకరణకు దూరంగా మన కుటుంబాలతో ఇళ్లలోనే యోగాభ్యాసం చేయాలి. ఇందుకు అనుగుణంగానే ‘ఇంట్లో యోగా- కుటుంబంతో యోగా’ను ఈ ఏడాది ఇతివృత్తంగా నిర్ణయించాం. కుటుంబంలోని పిల్లలు, పెద్దలు, యువత సామూహికంగా చేసే యోగాభ్యాసం కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. భావోద్వేగ నిశ్చలతను కూడా యోగా ప్రోత్సహిస్తుంది” అని ప్రధానమంత్రి వివరించారు.
“యోగాభ్యాసంతో శరీర రోగనిరోధక వ్యవస్థకు ఉత్తేజం లభిస్తుంది. మీ దైనందిన జీవితంలో మీరంతా ప్రాణాయామాన్ని కూడా ఒక భాగం చేసుకోవడం తప్పనిసరి. ప్రాణాయామ యోగా లేదా శ్వాస సంబంధి కసరత్తు మన శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కోవిడ్-19 వైరస్ వల్ల శరీర శ్వాసకోశ వ్యవస్థపై అత్యంత ప్రతికూల ప్రభావం పడుతున్న నేటి పరిస్థితులలో ప్రాణాయామం ఎంతో సముచిత కసరత్తు అవుతుంది” అని ప్రధానమంత్రి ఉద్బోధించారు. సమైక్యతకు యోగా ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రధాని చెప్పారు. ఇందులో ఎలాంటి వివక్ష లేనందువల్ల మానవాళి మధ్య బంధాన్ని ఇది మరింత పటిష్ఠం చేస్తుందన్నారు. జాతి, రంగు, లింగం, విశ్వాసం, దేశం అనే సకల భేదాలకూ ఇది అతీతమని స్పష్టం చేశారు. యోగాను ఎవరైనా ఆచరించవచ్చునని చెప్పారు. మన ఆరోగ్యం, ఆశాభావాలను మనం చక్కగా తీర్చిదిద్దుకోగలిగితే ఆరోగ్య, ఆనంద మానవాళి విజయాన్ని ప్రపంచం చూడగలిగే రోజు సమీపంలోనే ఉంటుందన్నారు. ఈ స్వప్నాన్ని యోగా కచ్చితంగా సాకారం చేయగలదని ఆయన ప్రకటించారు. “చైతన్యంగల పౌరులమైన మనం ఒక కుటుంబంగా-సమాజంగా ఏకీభావంతో ముందడుగు వేద్దాం. ‘ఇంట్లో యోగా – కుటుంబంతో యోగా’ను మన దైనందిన జీవితాల్లో ఒక భాగం చేద్దాం. మనం తప్పక విజయం సాధిస్తాం. మనం తప్పక గెలిచి నిలుస్తాం” అని ప్రధానమంత్రి దృఢ సంకల్పం చాటారు.
********
(Release ID: 1633073)
Visitor Counter : 271
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam