ప్రధాన మంత్రి కార్యాలయం

ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 17 JUN 2020 3:58PM by PIB Hyderabad

మీ అందరికీ శుభాకాంక్షలు
లాక్ డౌన్ ఎత్తివేత తొలి దశ  (అన్ లాక్-1) అనంతరం మన తొలి సమావేశం ఇది. నిన్న నేను అన్ లాక్-1 అనుభవాల గురించి 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో సవివరంగా చర్చించాను. వాస్తవానికి కొన్ని పెద్ద రాష్ర్టాలు, నగరాల్లో కరోనా వైరస్ విస్తరణ అధికంగా ఉంది. కొన్ని నగరాల్లో క్రిక్కిరిసిపోయిన జనాభా, చిన్న ఇళ్లు, వీధుల్లో భౌతిక దూరం పాటించలేని స్థితి, వేలాది మంది ఒకేసారి తిరుగుతూ ఉండడం కరోనాపై పోరాటాన్ని మరింత సవాలుగామార్చాయి.
అయినప్పటికీ ప్రతీ ఒక్క పౌరుని క్రమశిక్షణ, యంత్రాంగం సంసిద్ధత, కరోనా పోరాటయోధుల క్రమశిక్షణ కారణంగా పరిస్థితి అదుపు తప్పిపోకుండా మనం చూసుకోగలిగాం. సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం, చికిత్స చేయడం వంటి చర్యల వల్ల కరోనా వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ మందికి మాత్రమే ఐసియు, వెంటిలేటర్ల అవసరం ఏర్పడడం పెద్ద ఊరట.

సరైన సమయంలో తీసుకున్న సరైన చర్యల వల్ల మనందరం అతి పెద్ద ప్రమాదాన్ని దీటుగా ఎదుర్కొనగలిగాం. లాక్ డౌన్ సమయంలో  ప్రజలు ప్రదర్శించిన క్రమశిక్షణ కారణంగా అదుపు లేకుండా వైరస్ విజృంభణను నిలువరించగలిగాం. చికిత్స, ఆరోగ్య మౌలికవసతులు, సుశిక్షితులైన మానవ వనరులపరంగా ఈ రోజున మనం ఎంతో సుస్థిరంగా ఉన్నాం.

మీ అందరికీ తెలుసు కేవలం మూడు నెలల క్రితం పిపిఇలు, డయాగ్నస్టిక్ కిట్ల గురించి భారతదేశంలోనే కాదు, పలు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. మన దేశంలో కూడా స్టాక్ పరిమితంగానే ఉండేది. దిగుమతులపైనే మనం పూర్తిగా ఆధారపడవలసి వచ్చింది. కాని ఈ రోజున కోటికి పైగా పిపిఇ కిట్లు, అంతే సంఖ్యలో ఎన్ 95 మాస్క్ లు భిన్న రాష్ర్టాలకు అందించడం జరిగింది. డయాగ్నస్టిక్ కిట్ల స్టాక్ కూడా తగినంత సంఖ్యలో ఉంది. వాటి ఉత్పత్తి సామర్థ్యాలు కూడా విశేషంగా పెంచడం జరిగింది. ఈ రోజున పిఎం కేర్స్ ఫండ్ నిధులతో వెంటిలేటర్ల సరఫరా కూడా ప్రారంభించాం.

ఈ రోజున మరింత ఎక్కువ మంది రోగులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా 900 కరోనా వైరస్ టెస్టింగ్ లాబ్ లు, లక్షల సంఖ్యలో కోవిడ్ ప్రత్యేక పడకలు, వేల సంఖ్యలో క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాలు, తగినంతగా ఆక్సిజెన్ సరఫరాలు అందుబాటులో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో లక్షల సంఖ్యలో మానవ వనరులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతే కాదు, ఈ రోజున దేశంలోని ప్రతీ ఒక్క పౌరునిలోనూ గతంతో పోల్చితే వైరస్ గురించిన అవగాహన పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రోజువారీ స్థానిక యంత్రాంగాలు చేసిన కృషి కారణంగానే ఇది సాధ్యమయింది.

మిత్రులారా,
కరోనా మహమ్మారిపై మనం సాధించిన ఈ విజయాలతో లభించిన భరోసాతో పాటుగా అంతే వేగంగా మనం ఆరోగ్య మౌలిక వసతులు, సమాచార వ్యవస్థల విస్తరణకు, ప్రజల భాగస్వామ్యం, భావోద్వేగపూరితమైన మద్దతు సాధించడంపై దృష్టి పెట్టాలి.

మిత్రులారా,
కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న కారణంగా ఆరోగ్య మౌలిక వసతులు విస్తరించడ, ప్రతీ ఒక్క ప్రాణాన్ని కాపాడడం మన ప్రథమ ప్రాథమ్యం కావాలి. ప్రతీ ఒక్క కరోనా వైరస్ రోగికి సరైన చికిత్స అందించగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. వీలైనంత వరకు వైరస్ సోకిన వారందరినీ గుర్తించి ఐసొలేట్ చేసేందుకు పరీక్షల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి. ప్రస్తుత పరీక్షా సదుపాయాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటు వాటిని మరింతగా విస్తరించడం అవసరం.

మిత్రులారా,
గత రెండు మూడు నెలల కాలంలో దేశంలో పెద్ద సంఖ్యలో క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు జరిగింది. ఎక్కడా కొరత లేని విధంగా ఆ వసతులు విస్తరించేందుకు అదే వేగం మనం కొనసాగించాలి. కరోనా మహమ్మారి కారణంగా టెలీ మెడిసిన్ ప్రాధాన్యం కూడా బాగా పెరిగింది. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు కావచ్చు లేదా ఐసొలేషన్ లో ఉన్న వారు కావచ్చు లేదా వ్యాధితో బాధపడుతున్న వారు కావచ్చు ప్రతీ ఒక్కరికీ ఈ టెలీ మెడిసిన్ ప్రయోజనం అందించే విధంగా మనం ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.

మిత్రులారా,
ఏ మహమ్మారిపై పోరాటంలో అయినా సరైన సమయంలో సరైన సమాచారం అందించడం చాలా అవసరం అన్నది మీ అందిరికీ తెలుసు. అందుకే మన హెల్ప్ లైన్లన్నీ నిస్సహాయమైనవిగా కాకుండా సహాయపూర్వకంగా ఉండేలా చూడాలి. ఆస్పత్రుల్లో మన వైద్య, పారా మెడికల్ సిబ్బంది కరోనా వైరస్ పై పోరాడుతున్న తీరులోనే సకాలంలో సరైన సమాచారం అందించగలిగే విధంగా టెలీ మెడిసిన్ ద్వారా రోగులకు మార్గదర్శకం చేయగల సీనియర్  వైద్యుల బృందాలను మనం ఏర్పాటు చేయాలి. అంతే కాదు ప్రజల కోసం హెల్ప్ లైన్లను సమర్థవంతంగా నడపగల యువ వలంటీర్ల సంఖ్యను కూడా పెంచాలి.
ఆరోగ్య సేతు యాప్ ను అధికంగా డౌన్ లోడ్ చేసుకున్న రాష్ర్టాలు సానుకూల ఫలితాలు సాధించాయి. మరింత మంది ప్రజలకు ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంచేందుకు, ఎక్కువ మంది ప్రజలు దాన్ని డౌన్ లోడ్ చేసుకునేలా చేసేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. దేశంలో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్న అంశం కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. సీజన్ తో పాటుగా వచ్చే ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనడం కూడా చాలా ప్రధానం. లేదంటే అదో పెను సవాలుగా మారుతుంది.

మిత్రులారా,
కరోనాలో భావోద్వేగపూరితమైన కోణం కూడా ఉంది. వైరస్ కారణంగా విస్తరించిన భయం నుంచి ప్రజలను వెలుపలికి తెచ్చే మార్గాలు కూడా మనం అన్వేషించాలి. కరోనా వైరస్ ను ఓడించిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్నదని, వేగంగా ఆ సంఖ్య పెరుగుతున్నదని మనం భరోసా ఇవ్వాలి. అప్పుడే ఎవరికైనా కరోనా వైరస్  సోకినా వారు భీతావహులు కాకుండా ఉంటారు.
నిత్యావసర సేవలు అందించడం, వైద్యులు, ఆరోగ్య రక్షణ సిబ్బంది వంటి కరోనా పోరాట యోధులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడం కూడా మన ప్రాధాన్యం కావాలి. ప్రతీ ఒక్క దశలోనూ వారి సంక్షేమాన్ని చూస్తూ ఉండడం మనందరి, జాతి యావత్తు బాధ్యత.

మిత్రులారా,
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా మనం పౌర సమాజాన్ని, సమాజంలోని ప్రతీ ఒక్క విభాగాన్ని నిరంతరం స్ఫూర్తిమంతం చేస్తూ ఉండాలి. ఈ పోరాటంలో వారంతో అతి కీలక పాత్ర పోషించారు. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించేలా, భౌతిక దూరం, శానిటైజేషన్ పాటించేలా తరచుగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలి. ఏ ఒక్కరూ ఈ అంశాల్లో నిర్లక్ష్యం వహించేందుకు మనం అనుమతించకూడదు.

మిత్రులారా,
కరోనా మహమ్మారిపై పోరాటంలో పలు రాష్ర్టాలు స్వార్థరహితంగా సేవ చేస్తున్నాయి. ఆయా రాష్ర్టాలు ఆచరించిన సత్ప్రమాణాలను పరస్పరం పంచుకోవడం ప్రధానం. ప్రతీ ఒక్క రాష్ట్రం కూడా తమ అనుభవాలు, సూచనలు ఎలాంటి దాపరికం లేకుండా ఆవిష్కరిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. రానున్న రోజుల్లో ఉత్తమమైన వ్యూహం రూపొందించుకోవడానికి అది మనకు సహాయకారిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చర్చ కొనసాగించాలని నేను హోం మంత్రికి అభ్యర్థిస్తున్నాను.

***
 



(Release ID: 1632232) Visitor Counter : 210