హోం మంత్రిత్వ శాఖ

ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ లో తుఫాను వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో రక్షణ మరియు సహాయ కార్యక్రమాలను సమీక్షించిన ఎన్.సి.ఎం.సి.

Posted On: 21 MAY 2020 12:24PM by PIB Hyderabad

ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను, అంఫాన్ తుఫాను తర్వాత రాష్ట్రాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు / ఏజెన్సీలతో సమీక్షించేందుకు జరిగిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్.సి.ఎం.సి) సమావేశానికి కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు.

పశ్చిమ బెంగాల్ లో సుమారు 5 లక్షల మందిని, ఒడిశాలో 2 లక్షల మందిని తరలించేందుకు ఐ.ఎం.డి మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్. విస్తరణ ద్వారా సమయానుసారంగా మరియు ఖచ్చితమైన సూచనలు చేశారని ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు. దీని వల్ల భారీ జననష్టం తప్పిపోయిందని తెలిపారు. 1999లో ఈ తరహా తుఫాను ఒడిశాను తాకి పెద్ద ఎత్తున వినాశనం జరిగిన సంగతి తెలిసిందే.

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యంగా కోల్ కతాలో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి ఎన్.డి.ఆర్.ఎఫ్. అదనపు బృందాలను తరలిస్తోంది. పశ్చిమబెంగాల్ కు ఆహార ధాన్యాలు ముఖ్యంగా బియ్యం తగినంతగా సరఫరా చేసేందుకు ఎఫ్.సి.ఐ. పని చోసేతోంది. తద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు తక్షణ సహకారం లభిస్తుంది.

 విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు టెలి కమ్యూనికేషన్ విభాగాలు సైతం రెండు రాష్ట్రాల్లో సేవలను త్వరగా పునరుద్ధరించేందుకు సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం మౌలిక సదుపాయాల విషయంలో రైల్వే భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ కార్యకలాపాలను త్వరగా పునరుద్ధరించే పనిలో ఉంది.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయం, విద్యుత్ మరియు టెలి కమ్యూనికేషన్ సౌకర్యాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు పశ్చిమబెంగాల్ తెలిపింది. నష్టాలు ప్రధానంగా వ్యవసాయ రంగానికి పరిమితమైనట్లు ఒడిశా సమాచారం అందించింది.

రక్షణ మరియు పునరుద్ధరణ ప్రయత్నాలను సమీక్షించిన కేబినెట్ కార్యదర్శి, కేంద్ర మంత్రిత్వ శాఖలు/ ఏజెన్సీలు ఒడిశా మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని, అదే విధంగా అవసరమైన అన్ని సహాయాలను త్వరగా అందించాలని ఆదేశించారు. నష్టాలను ముందస్తుగా అంచనా వేయడానికి మరియు నివేదికను సమర్పించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బృందాలను పంపుతోంది.

పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రధాన కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్.సి.ఎం.సి. సమావేశంలో పాల్గొన్నారు. హోం వ్యవహారాలు, రక్షణ, షిప్పింగ్, సివిల్ ఏవియేషన్, రైల్వే, పెట్రోలియం మరియు సహజవాయువు, విద్యుత్, టెలి కమ్యూనికేషన్స్, స్టీల్, తాగునీరు మరియు పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఐ.ఎం.డి, ఎన్.డి.ఎం.ఏ, మరియు ఎన్.డి.ఆర్.ఎఫ్. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1625801) Visitor Counter : 181