చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ITAT, ముంబయి బెంచ్ విచారణ ట్రైబ్యునల్ 79 ఏళ్ల చరిత్రలోనే ఇది తొలిసారి క్యాంపు కార్యాలయాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ
Posted On:
24 APR 2020 7:19PM by PIB Hyderabad
ఆదాయపన్ను పునర్విచారణ ట్రైబ్యునల్ (ITAT)కి చెందిన డివిజన్ బెంచ్, జస్టిస్ P.P.భట్ అధ్యక్షతన సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర పిటిషన్‌ను విచారణ జరిపింది. ట్రైబ్యునల్ 79 ఏళ్ల చరిత్రలోనే ఇది తొలిసారి. ట్రైబ్యునల్ అధ్యక్షుడు జస్టిస్ భట్, ఉపాధ్యక్షుడు శ్రీ ప్రమోద్ కుమార్‌తో కూడిన ITAT ముంబయి బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ITATని మూసివేసిన కారణంగా, వారి క్యాంపు కార్యాలయాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు.
2010-11 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముంబయి ఆదాయపన్ను విభాగం తమకు ఇచ్చిన రూ.2.91 కోట్ల రూపాయల బకాయి వసూళ్ల నోటీసుపై స్టే కోరుతూ, అత్యవసర విచారణ చేపట్టాలంటూ సోలాపూర్‌కు చెందిన పాంధేస్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ట్రైబ్యునల్‌ను కోరింది. ఆ సంస్థ తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ముందుగా ITATని ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఆ సూచన మేరకు ITATలో అత్యవసర విచారణ కోరుతూ స్టే పిటిషన్ దాఖలు చేశారు.
పాంధేస్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ కోరినట్లు ఆదాయపన్ను విభాగం నోటీసుపై ITAT బెంచ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతోపాటు, ఆ సంస్థకు చెందిన బ్యాంకర్లు, రుణగ్రస్తులకు రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన అన్ని నోటీసులను నిలిపివేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అసెసింగ్ అధికారి/క్షేత్రస్థాయి అధికారికి స్టే ఆర్డర్ గురించి సమాచారం అందించాలని, రెవెన్యూ విభాగం తరపున విచారణకు హాజరైన అధికారిని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను 2020 జూన్ 8వ తేదీకి ట్రైబ్యునల్ వాయిదా వేసింది.
అనుకోని సందర్భాల్లో, రెవెన్యూ విభాగాలు లేదా కక్షిదారులు తమ పిటిషన్లపై అత్యవసర విచారణ కోరితే, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారణ చేపట్టడానికి 27 ప్రాంతాల్లోని బెంచ్‌లను ITAT సిద్ధంగా ఉంచింది.
(Release ID: 1617985)
Visitor Counter : 208