హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరుకోసం మే 3దాకా జాతీయ దిగ్బంధాన్ని పొడిగించే నిర్ణయం ప్రజల ప్రాణరక్షణకే కావచ్చు: శ్రీ అమిత్‌ షా

ప్రధాని నాయకత్వంలో భారత ప్రజానీకం కోవిడ్‌-19పై చేస్తున్న
పోరాటం ప్రపంచానికే ఆదర్శప్రాయం: దేశీయాంగ శాఖ మంత్రి;
కోవిడ్‌-19పై పోరులో కేంద్ర-రాష్ట్రాల సమన్వయం ప్రశంసార్హం: శ్రీ అమిత్‌ షా
కోవిడ్‌-19పై పోరులో ముందు వరుసలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు
భద్రత సిబ్బందికి శిరసాభివందనం: దేశీయాంగ శాఖ మంత్రి;
ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల నిల్వలకు కొరత లేదు..
దేశంలోని ఏ పౌరుడూ చింతించాల్సిన అవసరం లేదు: శ్రీ అమిత్‌ షా

Posted On: 14 APR 2020 3:10PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై పోరు దిశగా జాతీయ దిగ్బంధాన్ని మే 3వ తేదీదాకా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ప్రకటించారు. ప్రజల ప్రాణరక్షణకే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. అనేక దేశాలు కోవిడ్‌-19 వ్యాప్తితో తల్లడిల్లుతున్న తరుణంలో ప్రధాని నాయకత్వాన భారత ప్రజానీకం ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొంటున్న తీరు ప్రపంచానికే ఆదర్శప్రాయమని శ్రీ షా కొనియాడారు. ఇటువంటి సంక్షోభాల పరిష్కారంలో, ప్రజల అవసరాలను తీర్చడంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సంపూర్ణ సమన్వయానికి చాలా ప్రాముఖ్యం ఉందని పేర్కొన్నారు. ఆ మేరకు అన్ని ప్రభుత్వాలూ కలసికట్టుగా కృషిచేస్తుండటం ప్రశంసార్హమని వ్యాఖ్యానించారు. కోవిడ్‌-19పై పోరాటంలో ముందు వరుసన నిలిచి, ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, భద్రత సిబ్బంది తదితరులకు శిరసాభివందనం చేస్తున్నానని శ్రీ షా అన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేదాకా కావాల్సిన పరిమాణంలో ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల నిల్వలున్నందున ఏ ఒక్కరూ చింతించాల్సిన అవసరం లేదని దేశీయాంగ శాఖ మంత్రిగా తాను హామీ ఇస్తున్నట్లు శ్రీ షా ప్రకటించారు.

*****


(Release ID: 1614355) Visitor Counter : 152