PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 13 APR 2020 7:06PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచి కొత్తగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసులు 796 కాగా- మొత్తం కేసుల సంఖ్య 9,152కు చేరింది. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 857  మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. ఇక నేటివరకూ మరణాల సంఖ్య 308గా నమోదైంది. కోవిడ్‌-19పై జిల్లా యంత్రాంగం స్థాయిలో సకాల ప్రతిస్పందనకు వీలుగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. కాగా, దేశంలోని 25 జిల్లాల్లలో కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలివ్వడం మొదలైంది. ఈ మేరకు లోగడ కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లో గడచిన 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టమైంది. అయినప్పటికీ భవిష్యత్తులో కొత్త కేసులు రాకుండా ఈ జిల్లాల్లో నిరంతర  నిఘా కొనసాగుతోంది.

మరిన్ని వివరాలకు :

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు... అంటే- 2020 ఏప్రిల్‌ 14వ తేదీన ఉదయం 10 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

మరిన్ని వివరాలకు :

రాష్ట్రాల్లో, రాష్ట్రాలమధ్య రవాణాసహా ట్రక్కులు-కార్మికుల రాకపోకలు, గోదాములు/ శీతల గిడ్డంగుల కార్యకలాపాలు సజావుగా సాగేలా దిగ్బంధం మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని దేశీయాంగ శాఖ ఆదేశాలు

దిగ్బంధం మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. అదే సమయంలో రాష్ట్రాల్లో, రాష్ట్రాల మధ్య వస్తురవాణాసహా ట్రక్కులు-కార్మికుల రాకపోకలు, శీతల గిడ్డంగులు/గోదాముల కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలను అరకొరగా అమలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చింది.

మరిన్ని వివరాలకు :

భారత-వియత్నాం ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాం ప్రధాని గౌరవనీయులైన వెన్‌ షువాన్‌ ఫుప్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభం, ఈ సవాలును ఎదుర్కొనడంలో తమతమ దేశాల్లో చేపట్టిన చర్యల గురించి దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు.

మరిన్ని వివరాలకు :

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ కింద సకాలంలో నగదు బదిలీకి ఇతోధికంగా తోడ్పడిన ఉత్తేజపూర్వక డిజిటల్‌ చెల్లింపు మౌలిక వసతులు

జన్‌ధన్‌ ఖాతాలతోపాటు మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ సంధానం (జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌.. జామ్‌)తోగల ఇతర బ్యాంకు ఖాతాలకు ఒక మౌలిక డిజిటల్‌ సంధాన మార్గం ఏర్పరచబడింది. ప్రత్యక్ష లబ్ధి బదిలీసహా సామాజిక భద్రత పెన్షన్‌ పథకాలు, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన తదితరాలకు ఈ డిజిటల్‌ చెల్లింపు మౌలిక వసతులు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2020 మార్చి 20 నాటికి దాదాపు 126 కరెంటు/సేవింగ్స్‌ ఖాతాలు నడుస్తుండగా వీటిలో 38 కోట్లు పీఎంజేడీవై కింద తెరిచినవి కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు :

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ: ఇప్పటిదాకా సాధించిన ప్రగతి

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ కింద ఇప్పటిదాకా 32 కోట్ల మందికిపైగా ప్రజలు రూ.29,352 కోట్ల ఆర్థిక సహాయం అందుకున్నారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కింద 5.29 కోట్లమంది లబ్ధిదారులకు ఉచిత రేషన్‌, ఆహారధాన్యాలు అందాయి. మొత్తం 97.8 లక్షల ఉజ్వల వంటగ్యాస్‌ సిలిండర్లు సరఫరా అయ్యాయి. ఉద్యోగుల భవిష్యనిధి చందాదారులు 2.1 లక్షల మంది ఆన్‌లైన్‌ విత్‌డ్రాయల్‌, తిరిగి చెల్లించాల్సిన అవసరంలేని రూ.510 కోట్ల మేర అడ్వాన్స్‌ మొత్తాలను అందుకున్నారు. పీఎం-కిసాన్‌ పథకం తొలివాయిదా కింద 7.47 కోట్లమంది రైతులకు రూ.14,946 కోట్ల నగదు బదిలీ చేయబడింది. దీంతోపాటు 19.86 కోట్ల మంది జన్‌ధన్‌ ఖాతాదారులకు రూ.9,930 కోట్లు బదిలీ అయ్యాయి. అంతేగాక సుమారు 2.82 కోట్లమంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.1400 కోట్లు పంపిణీ అయ్యాయి. భవన నిర్మాణ కార్మికులు 2.17 కోట్ల మంది రూ.3,071 కోట్ల మేర ఆర్థిక మద్దతు పొందారు.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో ప్రయాణ ఆంక్షలవల్ల భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు 2020 ఏప్రిల్‌ 30దాకా దౌత్య సేవలు

కోవిడ్‌-19 వ్యాప్తి, ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధం నేపథ్యంలో ప్రయాణ ఆంక్షల విధింపువల్ల భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు 01.02.2020 (అర్ధరాత్రి) నుంచి 30.04.2020 (అర్ధరాత్రి) మధ్య వీసా, ఈ-వీసా లేదా బస గడువు ముగిసిన/ముగిసే పక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే కారుణ్య కారణాలపై 30.04.2020 (అర్ధరాత్రి)దాకా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు :

ఇరాన్‌ నుంచి ముంబైలోని ఘట్కోపర్‌ నావికాదళ శిబిరానికి తరలించగా, క్వారంటైన్‌ గడువు ముగిశాక ఇళ్లకు వెళ్లిన 44 మంది

ముంబైలోగల నావికాదళ సామగ్రి నిర్వహణ సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఇరాన్‌ నుంచి తరలించిన 44 మంది (24 మంది మహిళలుసహా)కి క్వారంటైన్‌ గడువు సంపూర్ణం కావడంతో ఇళ్లకు వెళ్లారు.

మరిన్ని వివరాలకు :

వైద్య రవాణా సేవలలో భాగంగా ఒక్కరోజులో 108 టన్నుల అత్యవసర సరఫరాలను చేరవేసిన లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

కోవిడ్‌-19పై పోరాటం దిశగా అత్యవసర వైద్య రవాణా సేవల్లో భాగంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ 214కుపైగా లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలను నడిపించింది.

మరిన్ని వివరాలకు :

దిగ్బంధ సమయంలో విద్యా సంవత్సరాన్ని కొనసాగించాలని విశ్వవిద్యాలయాలను కోరిన ఉప రాష్ట్రపతి

దిగ్బంధం సమయంలో బోధన కొనసాగింపునకు వీలుగా సాంకేతిక పరిజ్ఞాన శక్తిసామర్థ్యాలను తగువిధంగా వినియోగించుకోవాలని ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలకు సూచించారు. ఈ మేరకు పలువురు ఉప కులపతులతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌తో ఆయన ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో చర్చించారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా కొంతకాలం పట్టవచ్చునని పేర్కొంటూ, కోవిడ్‌-19వల్ల ఏర్పడిన ఈ విచ్ఛిన్న స్థితిని ఎదుర్కొనడానికి వారు రూపొందించుకున్న ప్రణాళికల గురించి వాకబు చేశారు.

మరిన్ని వివరాలకు :

మౌలిక వసతులు రంగానికి రైల్వేశాఖ సహాయ సహకారాలు కొనసాగింపు; కోవిడ్‌-19 దిగ్బంధ సమయంలో సరఫరా క్రమానికి ఊపు

ఏప్రిల్‌ 1 నుంచి 11వ తేదీవరకూ 11 రోజుల వ్యవధిలో రైల్వేశాఖ 1,92,165 వ్యాగన్ల బొగ్గును, 13,276 వ్యాగన్ల పెట్రోలియం ఉత్పత్తులను (ఒక వ్యాగన్‌కు 58-60 టన్నులు) దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై పోరాట సహాయ నిధికి ఏడాదిపాటు మూలవేతనంలో 30 శాతాన్ని విరాళంగా ప్రకటించిన భారత ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్లు

మరిన్ని వివరాలకు :

స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌) కింద సత్వర సంక్షోభ నిర్వహణ ప్రణాళికను రూపొందించిన సూరత్‌

కోవిడ్‌-19పై పోరులో భాగంగా సూరత్‌  పురపాలక సంస్థ ‘3 టి’ వ్యూహం- ట్రాక్‌ (అన్వేషణ), టెస్ట్‌ (పరీక్ష) అండ్‌ ట్రీట్‌ (చికిత్స) రూపొందించింది. ఈ మేరకు వ్యక్తుల మధ్య వ్యాధి ప్రత్యక్ష సంక్రమణకు వీల్లేకుండా సమాచారం సిద్ధమవుతుంది. తదనుగుణంగా (ఏజెంట్‌-హోస్ట్‌-ఎన్విరాన్‌మెంట్‌ అంశాలతో నిమిత్తం లేకుండా) అనుమానిత కేసులను సకాలంలో గుర్తించడం, పరీక్షించడం, నిర్ధారిత కేసులలో గరిష్ఠ సంరక్షణ చర్యలు తీసుకోవడం ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయి.

మరిన్ని వివరాలకు :

బ్యాంకు బిజినెస్‌ కరెస్పాండెంట్లుగా ‘ఎస్‌హెచ్‌జి’ మహిళలు; కోవిడ్ -19 దిగ్బంధం నడుమ పీఎంజేడీవై ఖాతాలకు తొలివిడత రూ.500 సహాయం పంపిణీలో కీలకపాత్ర

దిగ్బంధం నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో మొత్తం 8,800 మంది ‘బీసీ సఖీ’, 21,600 మంది ‘బ్యాంకు సఖి’లలో 50 శాతానికిపైగా స్వచ్ఛందంగా ఇంటింటికీ వెళ్లి సేవలందిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు శాఖలవద్ద రద్దీ నివారణలో తమవంతుగా బ్యాంకు మేనేజర్లకు సహకరిస్తున్నారు. అదే సమయంలలో సామాజిక దూరం పాటింపుపై గ్రామీణ సమాజాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 దిగ్బంధం వేళ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు, దుర్బలవర్గాలకు స్వయంసహాయ బృందాలు నడిపే సామాజిక వంటశాల ద్వారా ఆహారం సరఫరా

దేశంలో అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు స్వయం సహాయ సంభాలు వినూత్న చర్యలతో అద్భుతంగా ప్రతిస్పందించాయి. ఈ మేరకు ఆరోగ్య కార్యకర్తలకు తోడ్పాటుసహా పిల్లలు, యువతులు, ప్రసూతి ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాల్లోనూ అన్నివిధాలా మద్దతిస్తున్నారు.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19పై పోరులో భాగంగా అసోంలో హస్త పరిశుభ్రత ద్రవాలు, మాస్కులు వంటి ఉత్పత్తులు తయారుచేస్తున్న గ్రామీణ మహిళలు

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా అసోంలో గ్రామీణ మహిళలు హస్త పరిశుభ్రత ద్రవాలు, మాస్కులు, రోగకారక నాశకాలు వంటివాటిని ఇళ్లవద్దనే తయారు చేస్తున్నారు. వీటిని తమ కుటుంబసభ్యులకు, పరిసర గ్రామాలవారికి, పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జోర్హట్‌లోని సీఎస్‌ఐఆర్‌-నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోగల గ్రామీణ మహిళా సాంకేతిక పార్కుతోపాటు కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖలోని విత్తన విభాగం సంయుక్తంగా ఈ మహిళను ప్రోత్సహిస్తున్నాయి.

మరిన్ని వివరాలకు :

కరోనా ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా సామాజిక దూరం నిబంధనసహా దిగ్బంధం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి భారత ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.

కరోనా మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో భారత ముస్లింలు ఏప్రిల్‌ 24నుంచి ప్రారంభమయ్యే అవకాశంగల పవిత్ర రంజాన్‌ మాసంలో సామాజిక దూరంసహా దిగ్బంధం మార్గదర్శకాలను కఠినంగా, నిజాయితీగా పాటించాలని శ్రీ ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇళ్లలోనే ప్రార్థనలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు :

‘భారత్‌ పఢే ఆన్‌లైన్‌’ ప్రచార కార్యక్రమం కింద మూడు రోజుల్లో 3,700 సలహాలు

దేశంలో ఆన్‌లైన్‌ విద్యా పర్యావరణాన్ని మెరుగుపరచేందుకు ప్రజానీకం నుంచి సలహాలు-సూచనలను ఆహ్వానిస్తూ ‘భారత్‌ పఢే ఆన్‌లైన్‌’ పేరిట హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ ఏప్రిల్‌ 10న వారం రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సామాజిక మాధ్యమ వినియోగదారులలో ప్రాచుర్యం పెరుగుతోంది. తదనుగుణంగా హెచ్‌ఆర్‌డి శాఖకు కేవలం 3 రోజుల్లోనే ట్విట్టర్‌, ఈ-మెయిల్‌ ద్వారా 3,700 సలహాలు అందాయి.

మరిన్ని వివరాలకు :

కోవిడ్‌-19 నేపథ్యంలో డీవోపీటీ, డీఏఆర్‌పీజీ, డీవోపీపీడబ్ల్యూ చేసిన కృషిపై సమీక్షించిన డాక్టర్‌ జితేంద్రసింగ్‌

ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో వివిధ విభాగాల సంసిద్ధతను మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ సమీక్షించారు. అంతేకాకుండా ఈ సమయంలో విధులకు ఎలాంటి ఆటంకం కలగరాదని అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు. కాగా, కోవిడ్‌-19కు సంబంధించి 2020 ఏప్రిల్‌ 12నాటికి ప్రభుత్వం సగటున 1.57 రోజుల వ్యవధితో 7,000 ఫిర్యాదులను పరిష్కరించింది.

మరిన్ని వివరాలకు :  

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో కోవిడ్‌-19పై సీఆర్పీఎఫ్‌ 138వ బెటాలియన్‌ సిబ్బంది ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • అసోం: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన అసోంవాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 96-1547-1547 నంబరుతో కోవిడ్‌ సహాయకేంద్రాన్ని ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత విశ్వశర్మ ట్విట్టర్‌ద్వారా తెలిపారు.
  • మణిపూర్‌: రాష్ట్ర ప్రజలు డాక్టర్‌ సిఫారసు లేకుండా మందుల దుకాణాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు కొనరాదని ఆరోగ్యసేవల డైరెక్టరేట్‌ సూచించింది.
  • మేఘాలయ: రాష్ట్రంలోని నైరుతి ఖాసీ పర్వత జిల్లా పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
  • మిజోరం: రాష్ట్రంలోని చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలుసహా కీలక అధికారులతో ముఖ్యమంత్రి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్‌-19పై తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా సమీక్షించారు.  
  • నాగాలాండ్‌: రాష్ట్రంలో తొలి కోవిడ్‌-19 రోగి కోల్‌కతా నుంచి దిమాపూర్‌కు ఎయిరిండియా విమానం 709లో (సీటు నం.5బి) వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతని సహ ప్రయాణికుల కోసం అన్వేషణ సాగుతోందని తెలిపింది.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇప్పటిదాకా అనుమానిత కేసులు 70వరకూ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్నారు. సిక్కిం ఇక గ్రీన్‌జోన్‌ జాబితాలో చేరగలదని ఆశాభావం వెలిబుచ్చారు.
  • త్రిపుర: రాష్ట్రంలోని అత్యవసర వస్తు తయారీ సంస్థలు దిగ్బంధ సమయంలో పనిచేయవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది.
  • కేరళ: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాతే దిగ్బంధం ఆంక్షలు తొలగించడంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా- ముంబై, పుణెలలోగల కేరళకు చెందిన నలుగురు నర్సులకు వ్యాధి నిర్ధారణ అయింది. మరోవైపు రేపు విషు పర్వదినం నేపథ్యంలో వీధులలో దిగ్బంధం అమలుకు పోలీసులు కఠిన కసరత్తు చేస్తున్నారు. కాగా, నిన్న 2 కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో 36 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 375, ప్రపంచ సగటుతో పోలిస్తే మరణాల శాతం (0.53) ఎంతో మెరుగ్గా ఉంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో సామూహిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణుల బృందం సిఫారసు చేసింది. కోవిడ్‌ రోగులకు కోయంబత్తూరు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స చేసిన ఇద్దరు పీజీ డాక్టర్లకు వ్యాధి లక్షణాలు కనిపించడంతో వారిని ఏకాంత గదులకు పంపారు. కాగా, ప్రైవేటు ప్రయోగశాలల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష వ్యయాన్ని భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నిన్న 106 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,075కు చేరింది. మరోవైపు కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 50కాగా, మృతుల సంఖ్య 11గా నమోదైంది. రాష్ట్ర రాజధాని చెన్నై నగరం 181, కోయంబత్తూరు 97 కేసులలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 15 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో బెళగావి 3, బీదర్‌ 2, మాండ్య 3, ధార్వాడ్‌ 4 వంతున... బాగల్‌కోట్‌, బెంగళూరు రూరల్‌-అర్బన్‌లలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 247 కాగా, మృతుల సంఖ్య 6గా నమోదైంది. మరో 59 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళంలో సంచార వాక్‌-ఇన్‌ శాంపిల్‌ కియోస్క్‌ను ఏర్పాటు చేసింది. దీనిగుండా నడిచినప్పుడు పరీక్షతోపాటు నమూనాను కూడా సేకరించవచ్చు. అలాగే కోవిడ్‌ సహాయం అందించేందుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని 14410 టోల్‌ఫ్రీ నంబరుతో ప్రభుత్వం ప్రారంభించింది. కాగా, పీసీఆర్‌ సాంకేతికతతో నమూనాల పరీక్షను ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇవాళ 12 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 432కు చేరింది. పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 12 కాగా, మరణాలు 7గా ఉన్నాయి. రాష్ట్రంలో గుంటూరు 90, కర్నూలు 84 కేసులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో ఇవాళ 1 పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 532కు చేరింది. కాగా, హైదరాబాద్‌లోని తబ్లిఘీ జమాత్‌ కార్యాలయంలో కొందరు విదేశీయులకు ఆశ్రయమిచ్చిన స్థానిక నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దిగ్బంధాన్ని ఏప్రిల్‌ 30దాకా పొడిగించిన నేపథ్యంలో అన్ని ఉమ్మడి ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.
  • మహారాష్ట్ర: ముంబైలోని ధారవిసహా వివిధ మురికివాడల్లో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో నగరపాలక సంస్థ అధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు వర్లికోలివాడ, గోవాండి కొత్త వ్యాధివ్యాప్తి ప్రాంతాలుగా తేలాయి. జనసమ్మర్దం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో సామాజిక దూరం నిబంధన అమలు కష్టసాధ్యంగా ఉంది. దీంతో ఈ మురికివాడల్లో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం పెనుసవాలు కాగలదని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు.
  • గుజరాత్‌: రాష్ట్రంలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 538కి చేరింది. కొత్త కేసులలో అహ్మదాబాద్‌లో 13, సూరత్‌లో 5, బనస్కాంతలో 2సహా ఆనంద్‌, వడోదరలలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో సోమవారం 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 815కు చేరింది. కొత్త కేసులలో ఏకంగా 10 ఒక్క భరత్‌పూర్‌లోనే నమోదయ్యాయి. మరోవైపు అన్ని విశ్వవిద్యాలయాల స్థాయి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. అలాగే ఏప్రిల్‌ 16 నుంచి మే 30వ తేదీవరకూ వేసవి సెలవులు ప్రకటించింది.

 

# కోవిడ్‌-19  లో వాస్తవ తనిఖీ

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

 

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

*****



(Release ID: 1614173) Visitor Counter : 186