నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19.. జాతీయ దిగ్బంధం నేపథ్యంలో నౌకా రవాణా సజావుగా సాగేలా నౌకాయాన మంత్రిత్వశాఖ చురుకైన పాత్ర;

ప్రధాన రేవులలో నిరుడు ఏప్రిల్‌ నుంచి మార్చి 2020దాకా
ఓడల రాకపోకల నిర్వహణలో టన్నేజీపరంగా 0.82 శాతం వృద్ధి;
రేవులన్నిటా 46వేల మంది ప్రయాణిక/సిబ్బందికి థర్మల్‌ స్కానింగ్‌;
ప్రధాన రేవుల వినియోగదారులపై జరిమానా,
ఆలస్యరుసుము, సుంకాలు, ఫీజులు, అద్దెల రద్దు;
కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాన రేవుల వెంబడి ఆస్పత్రుల సంసిద్ధత
సిబ్బంది జీతాలు.. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి
‘పీఎం కేర్స్‌’ నిధికి రూ.59 కోట్లకుపైగా విరాళం;
సముద్ర యాత్రికులు, రవాణాదారులకు శానిటైజేషన్‌, భద్రత ధ్రువీకరణ
తదితరాలనుంచి ఉపశమనం కల్పించిన నౌకాయాన డైరెక్టర్‌ జనరల్‌

Posted On: 07 APR 2020 12:45PM by PIB Hyderabad

   కోవిడ్‌-19 అనూహ్య సంక్షోభం నేపథ్యంలో దేశంలోని ప్రధాన రేవుల కార్యకలాపాలు సవ్యంగా సాగిపోయేలా కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ చురుకైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు వివిధ కార్యకలాపాలు సాగిన తీరు ఇలా ఉంది:

ప్రధాన రేవులలో రాకపోకల, సరకుల నిర్వహణ: దేశంలోని ప్రధాన రేవులలో 2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చిదాకా నౌకల రాకపోకలు సరకుల నిర్వహణ టన్నేజీపరంగా 704.63 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే 0.82 శాతం వృద్ధి నమోదైంది.

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ చర్యలు

థర్మల్‌ స్కానింగ్‌: దేశంలోని అన్ని రేవులలోనూ 27/1/2020నుంచి 04/04/2020దాకా మొత్తం 46,202 మంది ప్రయాణికులకు థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహించగా, ఇందులో ప్రధాన రేవులవద్ద సిబ్బంది స్కానింగ్‌ చేసినవారి సంఖ్య 39,225గా ఉంది.

మినహాయింపులు: కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ PD-14300/4/2020-PD VIIతో 31 మార్చి 2020న జారీచేసిన ఉత్తర్వులలో ప్రధాన రేవులకు కొన్ని సూచనలు చేసింది: ఈ మేరకు ప్రధాన రేవులవద్ద జరిమానాలు, ఆలస్య రుసుములు, ఖర్చులు, ఫీజులు, అద్దెలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.

అనివార్య పరిస్థితులు: కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ PD-14300/4/2020-PD VIIతో 31 మార్చి 2020న జారీచేసిన ఉత్తర్వులలో ప్రధాన రేవులకు కొన్ని సూచనలు చేసింది: ఆ మేరకు ఏ రేవులోనైనా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా పూర్తి చేయాల్సిన గడువును పొడిగించే వీలు కల్పించింది. అలాగే పరిస్థితులనుబట్టి జరిమానాల విధింపును నిలిపివేసింది.

ఆస్పత్రుల సంసిద్ధత: ప్రధాన ఓడరేవులన్నిటికీ తగు పరిమాణంలో వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) సరఫరా చేయడంతోపాటు ఆయా రేవుల పరిధిలోగల పెద్ద ఆస్పత్రులను, సిబ్బందిని కోవిడ్‌-19 పీడితుల కోసం సంసిద్ధం చేసింది.

‘పీఎం కేర్స్‌’ నిధికి సీఎస్‌ఆర్‌ నిధుల బదిలీ: మంత్రిత్వశాఖ పరిధిలోని రేవులు, ప్రభుత్వరంగ సంస్థలు సంయుక్తంగా ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళాలు అందజేశాయి. ఈ మేరకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కింద కంపెనీలు రూ.52 కోట్లకుపైగా కేటాయించాయి. అలాగే రేవులు, కంపెనీల్లోని ఉద్యోగులు తమ జీతాల నుంచి రూ.7 కోట్లు అందజేశారు.

నౌకాయాన డైరెక్టర్‌ జనరల్‌ తీసుకున్న చర్యలు: నవ్య కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నియంత్రణ దిశగా నౌకాయాన డైరెక్టర్‌ జనరల్‌ మార్చి 16, 20 తేదీల్లో నం.2, 3, 4  ఉత్తర్వులు జారీచేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో తోడ్పాటునివ్వడంపై నౌకాయాన పరిశ్రమకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రకటించారు.

రద్దులు : జాతీయ దిగ్బంధంవల్ల ఎగుమతి/దిగుమతులకు అనివార్యంగా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తూ 22 మార్చి 2020 నుంచి 14 ఏప్రిల్‌ 2020 వరకూ కొన్ని జరిమానాలు, సుంకాలు, ఖర్చులు, ఫీజులు తదితరాల నుంచి మినహాయింపులు ప్రకటించారు.

నౌకాయాన సంస్థలు, రేవులకు ఆదేశాలు: దేశంలోని రేవులు, నౌకాయాన సంస్థలు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14వ తేదీవరకూ ఆలస్య రుసుములు, అదనపు ఖర్చులు విధించరాదని 29/03/2020న ఉత్తర్వు నం.07ద్వారా డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశించారు.

నౌకాయాన సంస్థలకు ఊరట: దేశంలోని అన్ని శిక్షణ సంస్థలనూ మూసివేసినందున ఓడలలో శిక్షణ పొందుతున్న నావికులు కాంట్రాక్టు పూర్తయిన తర్వాత వెనుదిరిగే అవకాశం లేని కారణంగా వారి ధ్రువీకరణ పత్రాలకు కాలంచెల్లే ప్రమాదం ఉంది. అందువల్ల సదరు ధ్రువపత్రాల చెల్లుబాటు వ్యవధిని 2020 అక్టోబరు 31దాకా డైరెక్టరేట్‌ జనరల్‌ పొడిగించింది. అలాగే భారత ఓడల భద్రత సర్టిఫికెట్ల గడువును కూడా పొడిగించింది.

*****



(Release ID: 1611936) Visitor Counter : 208